తెలంగాణ రాజధాని హైదరాబాద్ బృహత్ నగరంగా మారనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, పక్రియలు, అధికారిక నిర్ణయాలు, ఆర్డినెన్సులు కూడా పూర్తయ్యాయి. దీంతో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఇప్పటిదాకా కొనసాగుతున్న హైదరాబాద్ పట్టణ పరిపాలన బృహత్ నగరంగా పరిణామం చెందనుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం పక్రియను కేవలం వారం రోజుల్లోనే పూర్తి చేసింది. వాస్తవానికి ఈ పక్రియ అంతా పూర్తి కావడానికి కనీసం ఆరు నెలలు పడుతుందని రాజకీయ వర్గాలే కాకుండా, అధికార వర్గాలు కూడా అంచనా వేశాయి. కానీ, ఈ పరిణామం అందరిలోనూ ఆశ్చర్యాన్ని నింపింది. ముఖ్యంగా నగర శివారులో ఇప్పుడున్న మున్సిపాలిటీల అధికారులు గుక్క తిప్పుకునేలోపే జీహెచ్‌ఎంసీలో మొత్తం 27 మున్సిపాలిటీలను విలీనం చేసే పక్రియను పూర్తి చేసేసింది.
ఈ విలీన పక్రియ కోసం ప్రభుత్వం చట్టపరంగా కీలక మార్పులు చేసింది. ఇందుకోసం మంత్రివర్గంలో డ్రాఫ్ట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం తీసుకోగా, వాటికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో వరుసగా మూడు ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం జారీ చేసింది. తొలుత జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలు చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత తెలంగాణ మున్సి పాలిటీల చట్టం-2019 పరిధిలో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను ఆ చట్టం నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చింది. వెనువెంటనే ఈ 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని ‘సిటీ’ నిర్వచనం కిందకు మారుస్తూ మరో ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పరిధిలో ఉన్న ఈ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ప్రాంతాలన్నీ ఇకపై ఏకీకృత పాలన కిందకు రానున్నాయి.
హైదరాబాద్ ఆనుకొని ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం అయ్యాయి. ఈ నెల 2వ తేదీ నుంచే ఇవన్నీ జీహెచ్‌ఎంసీలో విలీనమైనట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో, హైదరాబాద్ మహానగర సరిహద్దులు ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించాయి. జీహెచ్‌ఎంసీ విస్తరణను నవంబర్ 25వ తేదీన మంత్రివర్గం ఆమోదించింది. డిసెంబర్ 1వ తేదీన జీహెచ్‌ఎంసీ చట్టం, తెలంగాణ పురపాలక చట్టాల సవరణకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పుర పాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు వెనువెంటనే నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ విలీనంతో ఏర్పడిన విస్తృత ప్రాంతాన్ని ‘సిటీ ఆఫ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్’ (టీసీయూఆర్)గా పేర్కొంటూ రామకృష్ణారావు జీవో విడుదల చేశారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చట్టం-1955కు సవరణలు చేసింది. డిసెంబర్ 2వ తేదీ నుంచే 27 పట్టణ స్థానిక సంస్థలు జీహెచ్‌ఎంసీలో విలీనమైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం డిసెంబరు 2 నుంచి ఈ మొత్తం ప్రాంతం అధికారికంగా ‘సిటీ ఆఫ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్’గా పిలుస్తారు. ఈ మేరకు అసాధారణ గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రచురించాల్సిందిగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ శాఖ, లా డిపార్ట్‌మెంట్, ఆయా జిల్లాల కలెక్టర్లకు ఈ ఉత్తర్వుల ప్రతులను పంపించారు.
విలీనమైన మున్సిపాలిటీల జాబితా
- పెద్ద అంబర్‌పేట్, 2. జల్‌పల్లి, 3. శంషాబాద్, 4. తుర్కయంజాల్, 5. మణికొండ, 6. నార్సింగి, 7. ఆదిభట్ల, 8. మేడ్చల్, 9. నాగారం, 10. దమ్మాయిగూడ, 11. పోచారం, 12. ఘట్‌కేసర్, 13. గుండ్ల పోచంపల్లి, 14. తూంకుంట, 15. తుక్కుగూడ, 16. కొంపల్లి, 17. దుండిగల్, 18. బొల్లారం, 19. తెల్లాపూర్, 20. అమీన్‌పూర్, 21. బడంగ్‌పేట్, 22. బండ్లగూడ జాగీర్, 23. మీర్‌పేట, 24. బోడుప్పల్, 25. నిజాంపేట్, 26. ఫిర్జాదిగూడ, 27. జవహర్‌నగర్.
ఈ విలీనంతో సదరు మున్సిపల్ కార్యాలయాలు ఇక జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాలుగా రూపాంతరం చెందుతాయి. అక్కడి మున్సిపల్ కమిషనర్లు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వారి కార్యాలయాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చాయి. ఆ మున్సిపాలిటీలు సర్కిళ్లుగా మారి దగ్గర్లోని సంబంధిత జోన్ల పరిధిలోకి వచ్చేశాయి.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ విస్తరణపై నోటిఫికేషన్ వెలువడిన వెంటనే జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కూడా విలీన పక్రియకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 27 పట్టణ స్థానిక సంస్థల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఆయా స్థానిక సంస్థల పర్యవేక్షణ బాధ్యతలను సమీపంలో ఉన్న జోనల్ కమిషనర్లకు అప్పగించారు. అంతే కాకుండా 27 స్థానిక సంస్థల అకౌంట్లను తక్షణమే నిలుపుదల చేస్తూ ఆయా నిధులను జీహెచ్‌ఎంసీ అకౌంట్‌కు బదలాయించాలని ఆదేశించారు. అలాగే 9 ప్రొఫార్మాలు సిద్ధం చేశారు. ఉద్యోగులు, స్థిర, చరాస్తులు, పెట్టుబడులు, పన్నులు, జరుగుతున్న పనులు, వాటి చెల్లింపులు, గడిచిన మూడేళ్లలో భవనాలు, లేఔట్లకు ఇచ్చిన అనుమతుల వివరాలను ఆయా ప్రొఫార్మాల్లో పూర్తి చేసి సమర్పించాలని కర్ణన్ ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాల ప్రకారం పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ రికార్డులను సర్కిల్ 3లోని డిప్యూటీ కమిషనర్ స్వాధీనం చేసుకోనుండగా, ఆ బాధ్యతలను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పర్యవేక్షించనున్నారు. జల్‌పల్లి మున్సిపల్ రికార్డులను సర్కిల్ 8లోని డిప్యూటీ కమిషనర్ స్వాధీనం చేసుకోనుండగా, చార్మినార్ జోనల్ కమిషనర్ పర్యవేక్షిస్తారు. అలాగే శంషాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన రికార్డులను సర్కిల్ 11లోని డిప్యూటీ కమిషనర్ స్వాధీనం చేసు కోనుండగా, చార్మినార్ జోనల్ కమిషనర్‌కు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ రికార్డుల పర్యవేక్షణ బాధ్యతలను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్లకు అప్పగించారు. ఆదిభట్ల మున్సిపాలిటీ, బడంగ్‌పేట కార్పొరేషన్ రికార్డుల పర్యవేక్షణ బాధ్యతలను చార్మినార్ జోనల్ కమిషనర్‌కు అప్పగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
తుక్కుగూడ, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్ మున్సిపాలిటీలతో పాటు మీర్‌పేట, పీర్జాదిగూడ కార్పొరేషన్ల రికార్డుల పర్యవేక్షణ బాధ్యతలను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌కు అప్పగిస్తు న్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, కొంపల్లి, దుండిగల్, బొల్లారం మున్సిపాలిటీలతో పాటు నిజాంపేట కార్పొరేషన్ రికార్డుల బాధ్యతలను కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌కు అప్పగించారు. నాగారం, తూంకుంట మున్సిపాలి టీలతో పాటు బోడుప్పల్ కార్పొరేషన్ల పర్యవేక్షణ బాధ్యతలను సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌కు అప్పగిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కంటోన్మెంట్ మినహా 1,942 చ.కి.మీ.ల విస్తీర్ణం
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధి దాదాపు 650 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఓఆర్‌ఆర్ పరిధిలో మొత్తం 1,982.9 చదరపు కిలోమీటర్ల మేర ఉండగా, ఇందులో 40.17 చదరపు కిలో మీటర్లు కంటోన్మెంట్ పరిధిలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండటంతో ఇక్కడ ప్రత్యేకంగా బోర్డు ఉంది. ఈ పరిధి మినహా మిగతా మొత్తం టీసీయూఆర్ పరిధిలోకి రానున్నది. ఇక విలీనం తర్వాత గ్రేటర్ పరిధి 1,942.73 చదరపు కిలోమీటర్లుగా మారింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 98,74,600 మంది ఓటర్లు ఉండగా మొత్తం జనాభా 1,45,15,662గా ఉంది. అలాగే విలీనం కానున్న స్థానిక సంస్థలలో మొత్తం 12,72,094 మంది ఓటర్లు ఉండగా, మొత్తం జనాభా 20,16,978 మంది ఉన్నారు. విలీనం తరువాత సిటీ ఆఫ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ మొత్తం జనాభా 1.65 కోట్లకు చేరింది.
వైఎస్ బాటలో రేవంత్.. 300కు పెరిగిన వార్డులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన విధానంలో తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది. నగర శివారులోని 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన ప్రభుత్వం వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ జీవో జారీ చేసింది. అయితే 2026లో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక రాజకీయ వ్యూహానికి తెరలేపినట్లు కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనుసరించిన పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
దశాబ్దాలుగా హైదరాబాద్ నగర పాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగానే ఉంది. 2002లో జరిగిన అప్పటి ఎంసీహెచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమైంది. అయితే, 2007లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌లో చుట్టుపక్కల ఉన్న 12 మున్సిపాలిటీ లను విలీనం చేసి ఏకంగా 150 వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ని ఏర్పాటు చేశారు. ఈ విస్తరణతో అప్పటి వరకు బలంగా ఉన్న టీడీపీ, ఎంఐఎంలు బలహీన పడ్డాయి. ఈ వ్యూహం ఫలితంగా 2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 సీట్లు గెలుచుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇది జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే కాంగ్రెస్‌కు అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
ఆ తర్వాత జరిగిన రెండు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. 2016, 2020 ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుని పార్టీ బలహీనపడింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు వైఎస్సార్ 2007 ఫార్ములాను మళ్లీ అమలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 150 వార్డులను ఏకంగా 300 వార్డులకు పెంచారు. నగర పరిధిలో ప్రస్తుతం బలంగా ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీ కంచుకోటలను బద్దలు కొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ విస్తరణతో జీహెచ్‌ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించనుంది. ఇది ప్రస్తుత అతిపెద్ద కార్పొరేషన్ లైన ఢిల్లీ 250 వార్డులు, ముంబై-227 వార్డులు కంటే కూడా విస్తీర్ణం, వార్డుల సంఖ్యలో పెద్దదిగా మారుతుంది. ఈ విస్తరణ ద్వారా రాబోయే 2026 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన పట్టును పెంచుకోవడమే కాకుండా కొత్తగా విలీనం అయ్యే ప్రాంతాల మద్దతుతో మేయర్ పీఠాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068