ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు రాజధాని నుంచి జిల్లా కేంద్రానికి, అక్కడి నుంచి మండలాలకు, చివరిగా గ్రామాలకు నిధులు చేరడంలో జాప్యాన్ని సహజంగా చూస్తుంటాం. ఆ ఆలస్యాన్ని తగ్గించి, పాలనను ప్రజల ముంగిటకు తెచ్చే లక్ష్యంతో ఆంధప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన నూతన సంస్కరణే ‘డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీస్’ (డీడీఓ) వ్యవస్థ. రెవెన్యూ డివిజన్ల స్థాయిలో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ పాలనలో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 77 డివిజినల్ డెవలప్‌మెంట్ కార్యాలయాలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యాలయాల్లో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి డీడీఓ, డీఎల్‌పీఓ, ఏపీడీ, డ్వామా ఇతర అధికారులు సేవలందిస్తారు. డివిజినల్ డెవలప్‌మెంట్ కార్యాలయాల ఏర్పాటుతో ప్రతి పంచాయతీ స్వయం ప్రతిపత్తి కలిగి స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తుంది.
అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను సమీకృతం చేస్తూ క్షేత్ర స్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ కోణంలోనే ‘డివిజనల్ డెవలప్ మెంట్ ఆఫీస్’ (డీడీఓ) వ్యవస్థను తీసుకొచ్చింది.
జిల్లాలో పరిపాలనకు కలెక్టర్, శాంతి భద్రతలకు ఎస్పీ ఉన్నట్లే… రెవెన్యూ డివిజన్ (కొన్ని మండలాల సముదాయం) స్థాయిలో పరిపాలనకు ఆర్డీవో, పోలీసులకు డీఎస్పీ ఉంటారు. కానీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి డివిజన్ స్థాయిలో ఇంతకాలం బలమైన వ్యవస్థ లేదు. ‘డివిజనల్ పంచాయతీ ఆఫీసర్’ (డీపీఓ) ఉన్నప్పటికీ, వారికి పరిమిత అధికారాలు, అరకొర వసతులు ఉండేవి. ఇప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దుతూ, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా పూర్తి స్థాయి అధికారాలతో, మౌలిక వసతులతో డీడీఓ ఏర్పాటు చేస్తున్నారు. ఇది జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల మధ్య వారధిగా పనిచేస్తుంది. జిల్లా స్థాయి అధికారి పని భారాన్ని తగ్గించి, క్షేత్రస్థాయి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ఈ కార్యాలయాల ప్రధాన ఉద్దేశం.
విధులు, బాధ్యతలు లక్ష్యాలు
ఈ కార్యాలయాలు కేవలం పర్యవేక్షణకే పరిమితం కాకుండా, క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శుల పనితీరును డివిజన్ స్థాయిలోనే నిరంతరం సమీక్షించడం. 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు గ్రామాల్లో సక్రమంగా వినియోగమవుతున్నాయా? లేదా? అనే తనిఖీ, నిధుల మళ్లింపును అరికట్టడం, గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాల వంటి సమస్యలపై వచ్చే ఫిర్యాదుల కోసం ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లనవసరం లేకుండా, డివిజన్ స్థాయిలోనే పరిష్కారం చూపడం. చిన్న, మధ్య తరహా అభివృద్ధి పనులకు సంబంధించిన పరిపాలనా పరమైన, సాంకేతిక అనుమతులను జిల్లా స్థాయి వరకు పంపకుండా డివిజన్ స్థాయిలోనే మంజూరు చేయడం. దీనివల్ల పనుల్లో జాప్యం తగ్గుతుంది.
పంచాయతీల స్వయం ప్రతిపత్తి సాధ్యమేనా?
ఈ కార్యాలయాల ఏర్పాటు వల్ల పంచాయతీల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందా? లేక బలపడు తుందా? అనే సందేహం రావడం సహజం. అయితే, ఇది పంచాయతీలను నియంత్రించడానికి కాకుండా, వాటిని ‘సాధికారత’ వైపు నడిపించడానికి ఉద్దేశించి నదిగా భావించవచ్చు. ఇంతకుముందు ప్రతి చిన్న అనుమతికి జిల్లా కేంద్రంలోని డీపీఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు డివిజన్ స్థాయిలోనే ఆమోదం లభిస్తుంది కాబట్టి, సర్పంచులు స్వతంత్రంగా, వేగంగా పనులు చేపట్టగలరు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కార్యదర్శులకు పరిపాలనా పరమైన మెళకువలు, నిబంధనలపై డీడీఓ కార్యాలయం ఒక మార్గదర్శిలా పనిచేస్తుంది. ప్రజాధనం వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీలపై ఉంటుంది. డీడీఓ కార్యాలయాలు ఆ జవాబుదారీతనాన్ని గుర్తుచేస్తాయి. కాబట్టి, ఇది పంచాయతీల విధుల్లో జోక్యం చేసుకోవడం కంటే, వాటిని బలోపేతం చేసే వ్యవస్థగా చూడాలి.
పాలనా వికేంద్రీకరణతో మేలు
నిజమైన వికేంద్రీకరణ అంటే అధికారాలను క్రింది స్థాయికి బదిలీ చేయడం. డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసుల ఏర్పాటు వికేంద్రీకరణ స్ఫూర్తికి అద్దం పడుతుంది. గ్రామాల్లో విద్య, వైద్యం, అంగన్‌వాడీ, వ్యవసాయం వంటి వివిధ శాఖల కార్యకలాపాలను డివిజన్ స్థాయిలో సమన్వయం చేయడానికి ఈ కార్యాలయం వేదికగా మారుతుంది. అధికారం ఒకే చోట (జిల్లా కేంద్రంలో) కేంద్రీకృతమై ఉంటే అవినీతికి ఆస్కారం ఎక్కువ. వికేంద్రీకరణ వల్ల పారదర్శకత పెరుగుతుంది. అధికారులు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటారు. తాగునీటి పైపులైను పగిలిపోయినా, అంటువ్యాధులు ప్రబలినా జిల్లా యంత్రాంగం కదిలేలోపు డివిజన్ అధికారి తక్షణమే స్పందించ గలరు. దీనివల్ల ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయి.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా వ్యవస్థలు వివిధ రూపాల్లో ఉన్నాయి. బ్రిటిష్ కాలం నుండి రెవెన్యూ శాఖలో ‘సబ్-కలెక్టర్’ లేదా ‘ఆర్డీవో’ వ్యవస్థ బలంగా ఉంది. పరిపాలనను ప్రజలకు చేరువ చేయడంలో ఇది విజయవం తమైంది. ఇప్పుడు అదే నమూనాను పంచాయతీరాజ్ శాఖలోనూ అమలు చేస్తున్నారు. కేరళలో వికేంద్రీకరణ చాలా బలంగా ఉంటుంది. అక్కడ బ్లాక్ పంచాయతీలు, జిల్లా పంచాయతీల మధ్య సమన్వయం కోసం పటిష్టమైన యంత్రాంగం ఉంది. కర్ణాటకలో తాలూకా పంచాయతీలు బలంగా ఉంటాయి. అక్కడ కూడా మధ్యంతర వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయి.
ఆంధప్రదేశ్‌లో ఇప్పటికే ‘డివిజనల్ పంచాయతీ ఆఫీసర్’ పోస్టులు ఉన్నప్పటికీ, వాటికి కార్యాలయాలు, సిబ్బంది, వాహన సౌకర్యం, అధికారాలు నామమాత్రంగా ఉండేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, ‘కార్యాచరణ కేంద్రాలు’గా మారుస్తోంది.
22 ఏళ్ల తర్వాత పదోన్నతులు
గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలలో పని చేస్తున్న వారికి పదోన్నతులకు సంబంధించి అనేక సమస్యలు ఉండేవి. గ్రూప్-1 ద్వారా ఎంపీడీఓలుగా నియమితులైన వారికి కూడా 22 ఏళ్ల వరకు పదోన్నతులు లేవు. సీనియార్టీ సమస్యల కారణంగా పదోన్నతులు లేకుండా ఇబ్బందులు పడేవారు. వీటిని పరిష్కరించి సుమారు 10 వేల మందికి పైగా పదోన్నతులు కల్పించారు. జిల్లా పరిషత్ విభాగాన్ని, జిల్లా పంచాయతీ విభాగాన్ని ఏకీకృతం చేశారు. అలాగే డీపీఓ స్థాయి అధికారిని డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించారు.
పంచాయతీ సెక్రెటరీ పేరు మార్పు
గ్రామ స్థాయిలో 7,244 క్లస్టర్‌లను రద్దు చేసి 13,350 గ్రామ పంచాయ తీలను స్వయం పాలన సంస్థలుగా మార్చి, ప్రతి పంచాయతీకి సెక్రెటరీని నియమించారు. 10 వేలు జనాభా దాటిన గ్రామ పంచాయతీలకు ఒక గెజిటెడ్ ఆఫీసర్‌ను పంచాయతీ అ••భివృద్ధి అధికారిగా నియమించారు. ప్రస్తుతం ఉన్న 5 గ్రేడ్ల పంచాయతీ సెక్రెటరీలను మూడు గ్రేడ్‌లుగా చేస్తూ పంచాయతీ సెక్రెటరీ పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చారు. పంచాయతీరాజ్ సంస్థలను పటిష్టం చేయడానికి ఒక ప్రత్యేక ఐటీ వింగ్‌ను ఏర్పాటు చేశారు.
డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసుల ఏర్పాటు అనేది కేవలం ఒక కొత్త భవనం లేదా కొత్త అధికారి నియామకం మాత్రమే కాదు. ఇది గ్రామ స్వరాజ్య స్థాపనలో ఒక కీలక మలుపు. జిల్లా కలెక్టరేట్‌లోని ఫైళ్లు గ్రామాలకు కదిలి రావడానికి పట్టే సమయాన్ని ఇది సగానికి తగ్గిస్తుంది. సర్పంచులు తమ సమస్యల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించే అవస్థను తప్పిస్తుంది. ఈ వ్యవస్థ విజయవంతం కావాలంటే, ఈ కార్యాలయాలకు సరిపడా సిబ్బందిని కేటాయిం చడం, రాజకీయ జోక్యం లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసేలా చూడటం అత్యంత అవసరం. ఇది సక్రమంగా అమలైతే, గాంధీజీ కలలు కన్నట్లుగా.. అధికారం ఢిల్లీ లేదా అమరావతిలో కాకుండా, నిజంగా గ్రామీణ ప్రజల చెంతనే ఉంటుంది.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్