డిసెంబర్ 19 గోవా విమోచన దినం
భారతదేశ స్వాతంత్య్ర పోరాటమనేసరికి మన ఆలోచనలు, అభిప్రాయాలు 1947లో బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడడంతోనే ఆగిపోతుంటాయి. అయితే, మరో అమానుష వలసవాద శక్తి భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలను తన ఉక్కు పాదాల కింద అణచివేసిందనే విషయాన్ని చరిత్ర విస్మరించలేదు.
భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా పోర్చుగల్ ఈ దేశంలోని గోవా, డయ్యూ, డామన్ ప్రాంతాలను తన గుప్పిట్లో బంధించే ప్రయత్నాన్ని కొనసాగించింది. పోర్చుగీస్ వారు బ్రిటిష్ పాలకుల కంటే కిరాతకులు. తమకు ఎక్కడ ఎటువంటి ప్రతిఘటన ఎదురైనా, తమను ఎవరు విమర్శించినా వాటిని తీవ్రంగా పరగణించి, అత్యంత దారుణంగా, అమానుషంగా అణచి వేసేవారు. తమ చర్యలు, కార్యకలాపాలకు అంతర్జా తీయంగా విమర్శలు ఎదురవుతున్నా పోర్చుగీస్ పాలకులు పట్టించుకునేవారు కాదు. ఆ చీకటి రాజ్యంలో కూడా కొందరు సాహసోపేత దేశభక్తులు ఈ అణచివేతలను, దమననీతిని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇటువంటి దేశభక్తుల వరుసలో గోవాకు చెందిన విశ్వనాథ్ నారాయణ్ లావాండే ముందుండేవారు. ఆయనలోని జాతీయవాద విలువలు, ఆదర్శాలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్), జనసంఘ్ వంటి జాతీయవాద సంస్థల మద్దతు పుష్కలంగా లభించింది. లావాండేతో పాటు ఆర్.ఎస్.ఎస్, జనసంఘ్ సంస్థల నాయకులు ఎంతో నిర్ణయాత్మంగా వ్యవహరించి, తిరుగులేని పోరాట స్ఫూర్తితో పోర్చుగల్ పాలకులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. సుమారు 1961 వరకు కొనసాగిన భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి లావాండేతో సహా వందలాది మంది దేశభక్తుల బలిదానాలు ఒక ప్రబల సాక్ష్యంగా నిలిచాయి. 1955లో గోవా రాజధాని పనాజీలోని సచివాలయంలో మొట్టమొదటగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తి ఒక స్వయంసేవకుడు. ఆయన గోవా విముక్తి పొందిన తర్వాత కూడా, అంటే 1961 తర్వాత కూడా పోర్చుగల్ జైలులో మగ్గారు.
జాతీయవాదుల పోరాటం
1955లో గోవా, డయ్యూ, డామన్‌ల విముక్తి కోసం ప్రదర్శనలు, ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన అఖిల పక్ష జాతీయ పోరాటసమితికి నాయకత్వం వహించిన ఆర్.ఎస్.ఎస్ ఈ క్రమంలో ఎంతోమంది తమ కార్యకర్తలను పోగొట్టుకొంది. పోర్చుగల్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు జరిపిన సత్యాగ్రహులు అనేక మంది పోలీస్ కాల్పులకు ప్రాణాలు కోల్పోగా,మరి కొందరు వికలాంగులయ్యారు. ఇంకొందరు పోర్చుగీస్ జైళ్లలో మగ్గిపోయారు. ఆ పాలకుల దారుణాలకు బలయిన వారిలో ఆర్.ఎస్.ఎస్, జనసంఘ్ సీనియర్ నాయకుడు జగన్నాథరావు జోషీ కూడా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన రాజభావ్ మహంకాల్ గోవా సరిహద్దులో శాంతియుతంగా సత్యాగ్రహాన్ని నిర్వహిస్తుండగా పోర్చుగీస్ పోలీసులు కాల్పులు జరపడంతో ఒక తూటా ఆయన కంటిలోంచి దూసుకుపోయింది. అయినప్పటికీ, ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ, సాటి సత్యాగ్రహులను ఉత్తేజపరుస్తుండడం చూసి పోలీసులు ఆయన మీద తూటాల వర్షం కురిపించారు. జలియన్‌వాలాబాగ్ కన్నా అన్యాయంగా జరిగిన ఆ కాల్పుల్లో రక్తపుటేరులు పారాయి.
వాస్కోడిగామా కాలికట్‌లో అడుగుపెట్టిన తర్వాత 12 ఏళ్లకు, అంటే 1510లో పోర్చుగీస్ పాలకులు గోవాను ఆక్రమించుకున్నారు. బ్రిటిష్ పాలకులైతే రాజకీయ చర్చలకు, ఒత్తిళ్లకు లొంగేవారు. పోర్చుగీస్ పాలకుల్లో మాత్రం అటువంటి దౌత్యపరమైన అంశాలకు అవకాశం ఉండేది కాదు. ఎటువంటి కనికరం లేకుండా దారుణంగా చంపడం, బలవంతంగా మత మార్పిళ్లకు పాల్పడడం, అమానుషంగా అణచివేయడం చేసేవారు. 1947లో బ్రిటిష్ వారు భార• దేశాన్ని వదిలివెళ్లిన తర్వాత కూడా పోర్చుగీస్ పాలకులు నాటో దేశాల మద్దతుతో గోవా, డయ్యూ, డామన్ ప్రాంతాలను తమ గుప్పిట్లో ఉంచుకున్నారు. అప్పట్లో జవాహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం పోర్చుగీస్ పాలకుల పట్ల పూర్తిగా మెతక వైఖరిని అవలంబించింది. వారితో చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించు కోవాలని ప్రయత్నించిందే తప్ప ఏనాడూ పోరాట స్ఫూర్తితో వ్యవహరించిన పాపాన పోలేదు. సైనిక బలాన్ని ఉపయోగించాలన్న ఉద్దేశం కూడా ఉండేది కాదు. నెహ్రూ ప్రభుత్వం తమ పట్ల అనుసరిస్తున్న మెతక ధోరణిని పోర్చుగీస్ ప్రభుత్వం సరైన అవకాశంగా మార్చుకుని, గోవా ప్రజలను మరింతగా అణచివేయడం ప్రారంభించింది.
అగ్రనాయకులే స్ఫూర్తి
వాస్తవానికి, లావాండే 1942 నుంచే గోవాను పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి కలిగించే ప్రయత్నాలు ప్రారంభించారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆయన ఈ నిరసనలను, సత్యాగ్రహాలను తీవ్రతరం చేశారు. నెహ్రూ ప్రభుత్వం గోవా విషయంలో అనుసరిస్తున్న ధోరణి ఏ మాత్రం నచ్చని లావాండే సొంతగా ఆజాద్ గోమంతక్ దళ్ అనే విప్లవాత్మక పార్టీని ప్రారంభించారు. నారాయణ్ హరినాయక్, దత్తాత్రేయ దేశ్ పాండే, ప్రభాకర్ సినారీ వంటి దేశభక్తుల అండదండలలో ఈ పార్టీ పోర్చుగీస్ పాలకుల మీద ప్రత్యక్ష చర్యలకు దిగింది. లావాండే పార్టీని ప్రారంభించిన సమయంలోనే ఆర్.ఎస్.ఎస్, భారతీయ జనసంఘ్‌లు గోవా ప్రజలను కూడగట్టడం ప్రారంభమైంది. అక్కడి ప్రజలకు మద్దతుగా దేశవ్యాప్తంగా కూడా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టింది. పోర్చుగీస్ పాలకుల నిరంకుశత్వాన్ని బహిర్గతం చేయడానికి ఇవి దేశవ్యాప్తంగా వేలాదిమంది మద్దతుదారులను కూడగట్టుకుని గోవా సరిహద్దులో మోహరించాయి. జగన్నాథరావు జోషీ, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటి దేశభక్తులు, జాతీయవాదుల నాయకత్వంలో సుమారు 5 వేల మంది కార్యకర్తలు గోవా సరిహద్దులో సత్యాగ్రహాలు నిర్వహించారు. ‘‘పోర్చుగీస్ క్విట్ ఇండియా’’ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. అప్పుడు పోర్చుగీస్ పోలీసులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 51 మంది స్వయంసేవకులు అమరులైనారు.
విషాదకరమైన విషయమేమిటంటే, గోవా విముక్తి కోసం ఒకపక్క ఆజాద్ గోమంతక్ దళ్, మరోపక్క ఆర్.ఎస్.ఎస్, భారతీయ జనసంఘ్‌లు ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాటాలు జరుపుతున్నా, నెహ్రూ ప్రభుత్వంలో మాత్రం ఉలుకూపలుకూ లేకపోవడం గోవా ప్రజానీకానికి తీవ్ర ఆందోళన, ఆవేదన కలిగించింది. ప్రభుత్వం పోర్చుగీస్ ప్రభుత్వానికి, నాటో దేశాలకు భయపడి, పిరికితనంతో వ్యవహరిస్తోందని, తమకు తీరని ద్రోహం చేస్తోందని గోవా ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ప్రభుత్వం సత్వరం పోర్చుగీస్ పాలకుల మీద సైనిక చర్యలకు ఉపక్రమించాలని, రక్తం చిందించనిదే పోర్చుగీస్ పాలకులు గోవాకు విముక్తినిచ్చే అవకాశం లేదని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఢిల్లీలో గర్జించారు. దేనికీ స్పందించని నెహ్రూ ప్రభుత్వం పోర్చుగీస్ పాలకులతో చర్చలు, సంప్రదింపుల కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. పైగా, విముక్తి పోరాటాల్లో వీర మరణాలు చోటు చేసుకుంటున్నా ఏమాత్రం స్పందించ లేదు.
ముప్పేట దాడులు
ఆర్.ఎస్.ఎస్, జనసంఘ్‌లతో పాటు, ఆజాద్ గోమంతక్ దళ్ ఎన్నో త్యాగాలు చేసిన అనంతరం పోర్చుగీస్ పాలకులు ఎట్టకేలకు 1954లో డయ్యూ, డామన్‌లకు మాత్రం విముక్తి కల్పించారు. ఉద్యమకారులు దాద్రా, నాగర్ హవేలీలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అయితే, పోర్చుగీస్ పాలకులు గోవా విషయంలో మాత్రం ఎటువంటి చర్యా తీసుకోలేదు. నెహ్రూ ప్రభుత్వం ఈ విషయంలో పట్టుబట్ట లేదు కూడా. ఆజాద్ గోమంతక్ దళ్, ఆర్.ఎస్.ఎస్, జనసంఘ్ అటు పోర్చుగీస్ పాలకుల మీదే కాక, ఇటు నెహ్రూ ప్రభుత్వంపై కూడా పోరాటాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోర్చుగల్‌కు నాటో మద్దతు ఇచ్చినప్పటికీ దాని ఆటలు తమ ముందు సాగవని ఉద్యమకారులు నిరూపించారు. అంతర్జాతీయ దేశాలతోనూ, పోర్చుగల్ ప్రభుత్వంతోనూ తాము నెరపుతున్న దౌత్యం విఫలమైందని నెహ్రూ ప్రభుత్వం గుర్తించింది కానీ, తమ ప్రయత్నాలను మాత్రం అదే దిశలో కొనసాగిస్తూ వచ్చింది. పాకిస్థాన్ ఈ పరిస్థితిని తనకు అనుకూ లంగా మార్చుకుని, లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. గోవా సమస్య, కశ్మీర్ సమస్య ఒకటేనన్న అభి ప్రాయాన్ని అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తం చేసింది కానీ, దాని ప్రయత్నం పురిట్లోనే సంధి కొట్టుకుపోయిన చందంగా మారింది.
మొత్తం మీద సాయుధ పోరాటాలు, జాతీయవాద ధోరణులు, ప్రజల సత్యాగ్రహాలన్నీ కలిసి రెండు ప్రాంతాలకు విముక్తి కల్పించాయి. ఇదే ధోరణిలో తమ పోరాటాలు కొనసాగించడానికి ఆజాద్ గోమంతక్ దళ్, ఆర్.ఎస్.ఎస్, జనసంఘ్‌లు నిర్ణయించుకున్నాయి. వీటన్నిటినీ గమనించిన నెహ్రూ ప్రభుత్వం క్రమంగా తమ తామరాకు మీద నీటి బొట్టు వైఖరిని వదిలేయడం ప్రారంభించింది. కొద్ది కాలం గడిచేసరికి ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. నవంబర్, 1961లో పోర్చుగీసు పోలీసులు కొందరు మత్స్యకారుల మీద కాల్పులు జరపడంతో అటు ఉద్యమకారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఓపిక, సహనం నశించిపోయాయి. అనేక రకాలుగా ఒత్తిళ్లు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అదే ఏడాది డిసెంబర్‌లో ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో సైనిక బలగాలను రంగంలోకి దించింది. భారతీయ సైనిక బలగాలకు, పోర్చుగీసు సైనికులకు మధ్య సుమారు 36 గంటల పాటు జరిగిన పోరాటంలో పోర్చుగీసు సైనికులు గోవా నుంచి పరారయ్యారు. డిసెంబర్ 19, 1961న గోవాలోని పాంజిమ్ నగరంలో ఆజాద్ గోమంతక్ దళ్, ఆర్.ఎస్.ఎస్, జనసంఘ్ నాయకులు కలిసి మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు.
ఇది సైనిక విజయమని ఆ తర్వాత నెహ్రూ ప్రభుత్వం ప్రకటించింది కానీ, ఇది అంతకన్నా ఎక్కువగా ఆర్.ఎస్.ఎస్, జనసంఘ్, ఆజాద్ గోమంతక్ దళ్ ల అవిశ్రాంత పోరాటాలకు లభించిన ప్రతిఫలమని స్థానిక ప్రజలకే కాక, దేశ ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఎట్టకేలకు గోవా, డయ్యూ, డామన్‌లకు పూర్తిగా స్వేచ్ఛ లభించింది. 1987లో గోవాకు రాష్ట్ర ప్రతిపత్తి లభించింది కానీ, గోవా విముక్తి పోరాటం రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసింది.
స్వేచ్ఛా స్వాతంత్య్రాలనేవి దౌత్యపరమైన కానుకలేమీ కాదని, పోరాటాలు, త్యాగాలు, ఉద్యమాలు, సత్యాగ్రహాల ద్వారా మాత్రమే వాటిని సాధించుకోగలమని గోవా విముక్తి పోరాటం ద్వారా అర్థమవుతోంది. పోర్చుగల్ పట్ల అనుసరించాల్సిన విదేశీ విధానం విషయంలో నెహ్రూ ప్రభుత్వం మొదటి నుంచి డోలాయమాన స్థితిలోనే ఉంటూ వచ్చింది. కానీ, ఆర్.ఎస్.ఎస్, జనసంఘ్‌లు మాత్రం రాష్ట్ర ప్రజలను సంఘటితపరచడంతోపాటు, దేశవ్యాప్తంగా ప్రజలను కూడగట్టి, పోర్చుగీస్ సైనికులు, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాయి. 1955 నుంచి ప్రారంభమైన పోరాటాలను, 1961లో లభించిన విముక్తిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు, భారతదేశం ఏనాటికీ విదేశీ ఆధిపత్యాన్ని సహించదనే విషయం రూఢి అయింది.
జి.రాజశుక
సీనియర్ జర్నలిస్ట్