నవంబర్‌ 13‌న పాకిస్తాన్‌ ‌పార్లమెంట్‌ ఒక కీలక రాజ్యాంగ సవరణను ఆమోదించింది. పాక్‌ ‌న్యాయశాఖ మంత్రి అజాం నజీం తరార్‌  27‌వ రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో దీన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అంతకు ముందు నవంబర్‌ 8‌న ఈ బిల్లుకు ఫెడరల్‌ ‌మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేరోజు న్యాయశాఖ మంత్రి ఈ బిల్లును సెనెట్‌లో ప్రవేశపెట్టారు. తర్వాత ఈ బిల్లును ఉమ్మడిగా పరిశీలించేందుకు సెనెట్‌-‌నేషనల్‌ అసెంబ్లీ స్టాండింగ్‌ ‌కమిటీలకు పంపారు. 26వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదన సమయంలో పక్కన పెట్టిన కొన్ని నిబంధనలను తిరిగి ప్రతిపాదించడమేంటంటూ ఈ కమిటీ సమావేశాన్ని జామాతే  ఉలేమా-ఇ-ఇస్లామ్‌ (‌ఫజల్‌) ‌పార్టీ నేతలు బహిష్కరించారు. తర్వాత దీనిపై సెనెట్‌లో చర్చించి తదనంతరం నేషనల్‌ అసెంబ్లీకి పంపగా నవంబర్‌ 12‌న దీనికి ఆమోదం తెలిపింది. ఎట్టకేలకు సెనెట్‌ ‌నవంబర్‌ 13‌న ఆమోదం తెలుపగా ప్రెసిడెంట్‌ అసీఫ్‌ అలీ జర్దారీ దీనిపై అదేరోజు సంతకం చేశారు. తనను తాను ఎందుకూ కొరగాని బలహీన స్థాయికి దిగజార్చుకున్న ఇటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రపంచంలో మరే ఇతర దేశంలో కానరాదు. ఇంతటి దౌర్భాగ్య స్థితి దాపురించడం పాకిస్తాన్‌కే చెల్లింది!

ముఖ్యంగా న్యాయవ్యవస్థలో నియామకాలు, రక్షణరంగ కమాండ్‌ ‌వ్యవస్థ నిర్మాణ క్రమానికి సంబంధించిన రాజ్యాంగ అధికరణల్లో కీలక మార్పులను చేపట్టిన బిల్లు కావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. దీని ప్రకారం ‘‘ఫెడరల్‌ ‌రాజ్యాంగ కోర్టు’’ కొత్తగా ఏర్పాటవుతుంది. ఇప్పటి వరకు న్యాయమూర్తుల బదిలీలకు అనుసరిస్తున్న విధానా లను దాదాపు పూర్తిగా మార్చివేశారు. సైనిక దళాల నియంత్రణకు సంబంధించి 243వ అధికరణాన్ని సవరించారు. అంతేకాదు ప్రావెన్స్‌ల విత్త, పరి పాలనా స్వేచ్ఛకు సంబంధించిన అంశాలను కూడా సమీక్షించారు. ఈ బిల్లును ప్రవేశ పెడుతూ జాతీయ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు, పరిపాలనా క్రమాన్ని మరింత ఆధునికీకరించేందుకు ఈ సవరణలు అవసరమని అధికారంలోని సంకీర్ణ ప్రభుత్వం సమర్థించుకుంది. అయితే ప్రావెన్స్‌ల స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రానికి ఇది భంగం కలిగించేదిగా ఉన్నదంటూ విపక్షాలు, న్యాయ నిపుణులు తీవ్రంగా విమర్శించారు. ఇక వాణిజ్య వర్గాలైతే దేశంలో విస్తృత చర్చ జరపకుండా రాజ్యాం గంలో ఈవిధంగా సమూల మార్పులు తీసుకొని రావడం అత్యంత ప్రమాదకరమని, మార్కెట్లు అస్థిరం కావడమే కాకుండా, మదుపర్ల విశ్వాసం దెబ్బ తింటుందని, ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉన్న పరిస్థితుల్లో మరింత అస్థిరతకు దారితీస్తుంటూ హెచ్చరించారు.

కీలక రాజ్యాంగ సవరణ

ఇస్లామిక్‌ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌పాకిస్తాన్‌ ‌రాజ్యాంగాన్ని (1973) గతంలో చాలాసార్లు సవరించారు. ముఖ్యంగా సమాఖ్య, ప్రావెన్షియల్‌ ‌ప్రభుత్వాల మధ్య అధికార సమతుల్యత, సంస్థాగత పాత్రలను పునర్‌ ‌నిర్వచించడం, రాజకీయ భద్రతాపరమైన వాస్తవికతలకు తగిన విధంగా స్పందించాలన్న నెపంతో ఈ సవరణలు ఎప్పటికప్పుడు చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే అక్టోబర్‌, 2024‌లో పాక్‌ ‌పార్లమెంట్‌ 26‌వ రాజ్యాంగ సవరణను ఆమోదిం చింది. ప్రస్తుతం పార్లమెంట్‌లో మెజారిటీ సాధించిన షహబాజ్‌ ‌షరీఫ్‌ ‌ప్రభుత్వం కొత్తగా 27వ రాజ్యాంగ సవరణను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. పార్లమెంట్‌ ఆమోదం పొందిన ఈ సవరణ చట్టం ప్రకారం, సుప్రీంకోర్టు ఇక ముందు రాజ్యాంగ సంబంధ కేసులను విచారించడానికి వీల్లేదు. కొత్తగా ఏర్పాటు చేసే పాకిస్తాన్‌ ‌సమాఖ్య రాజ్యాంగ కోర్టు (ఎఫ్‌సీసీ)ఈ కేసులను విచారిస్తుంది. ముఖ్యంగా ప్రావెన్షియల్‌ ‌ప్రభుత్వాల మధ్య, ఫెడరల్‌- ‌ప్రావెన్షియల్‌ ‌ప్రభుత్వాల మధ్య ఏర్పడే రాజ్యాంగపరమైన వివాదాలను పరిష్కరించే బాధ్యతను ఈ కొత్త కోర్టుకు దఖలు పరచారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు, పర్యవేక్షణ విషయంలో జ్యుడిషియల్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ‌పాకిస్తాన్‌కు పాత్ర ఉంటుంది తప్ప, స్వతంత్రంగా వ్యవహరించలేదు. అంటే న్యాయ వ్యవస్థ విచక్షణాధికారాల్లో ఈ సవరణ కోత విధిస్తోంది. అసెంబ్లీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా చిన్న ప్రావెన్స్‌ల్లోని ప్రావెన్షియల్‌ ‌మంత్రి వర్గాల్లో మంత్రుల కనీస సంఖ్యను 11% నుంచి 13%కు పెంచారు. రాజ్యాంగంలోని 243వ అధికరణాన్ని సవరించడం ద్వారా సైనిక దళాలపై ఇప్పటివరకు ఫెడరల్‌ ‌ప్రభుత్వానికున్న అధికారాల్లో మార్పులు తెచ్చారు. అంతేకాదు సైనిక నాయకత్వ కమాండ్‌ ‌నిర్మాణంలో కూడా మార్పులు చేశారు. దీని ప్రకారం ఇప్పటివరకు ఉన్న ఛైర్మన్‌ ‌జాయింట్‌ ‌చీఫ్స్ ఆఫ్‌ ‌స్టాఫ్‌ ‌కమిటీ (సీజేసీఎస్‌సీ) పోస్టు నవంబర్‌ 27 ‌నుంచి రద్దవుతుంది. అప్పటినుంచి సైనిక దళాల ప్రధానాధికారి (చీఫ్‌ ఆఫ్‌ ‌ది ఆర్మీ స్టాఫ్‌) ‌చీఫ్‌ ఆఫ్‌ ‌ది డిఫెన్స్ ‌ఫోర్సెస్‌గా వ్యవహరిస్తారు. ఆర్మీ ఫీల్డ్ ‌మార్షల్‌, ‌మార్షల్‌ ఆఫ్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ‌లేదా అడ్మిరల్‌ ఆఫ్‌ ‌ది ఫ్లీట్‌ ‌స్థాయి అధికార్లకు జీవితకాలం అదే స్థాయి ప్రయోజనాలు కల్పించారు. ఫెడరల్‌ ‌ప్రభుత్వ ఆదాయాన్ని ప్రావెన్స్‌లకు నేషనల్‌ ‌ఫైనాన్స్ ‌కమిషన్‌ ‌ద్వారా పంపిణీ చేసే విధానాన్ని సమీక్షించారు. ఈ సవరణలను ప్రధాన విపక్షమైన పాకిస్తాన్‌ ‌తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (‌పీటీఐ) తీవ్రంగా వ్యతిరేకిం చింది. ఇది రాజ్యాంగ మూలాలనే దెబ్బతీసేదిగా ఉన్నదని, కేవలం రాజ్యాంగంపై పన్నిన కుట్రగా అభివర్ణించింది. సెనెటర్‌ ‌సయ్యద్‌ అలీ జాఫర్‌, ‌సెక్రటరీ జనరల్‌ ‌సల్మాన్‌ అ‌క్రమ్‌ ‌రాజా, ఖైబర్‌ ‌ఫక్తూన్‌క్త్వా ప్రభుత్వం, విపక్ష కూటమి తెహ్రీక్‌- ఇ-‌తహఫజ్‌ అయీన్‌ ‌పాకిస్తాన్‌ (‌టీటీఏపీ), ఫక్తూన్‌ ‌క్త్వా మిల్లీ అవామీ పార్టీ, బెలూచిస్తాన్‌ ‌నేషనల్‌ ‌పార్టీ- మెంగాల్‌ (‌బీఎన్‌పీ-ఎం)లు ఈ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపు నిచ్చాయి. ఈ సవరణను వ్యతిరేకిస్తూ ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మన్సూర్‌ అలీ షా, అతహార్‌ ‌మినల్లాలు తమ రాజీనామాలు సమర్పించారు. ఇంటర్నేషనల్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ‌జూరిస్టస్ ఇది చట్టంపై జరిపిన దాడిగా వర్ణించడం తదనంతర పరిణామం.

అసీమ్‌ ‌మునీర్‌ అసలు స్వరూపం

ఈ సవరణలో అత్యంత కీలకంగా పేర్కొనదగిన అంశం ఫీల్డ్ ‌మార్షల్‌ అసీమ్‌ ‌మునీర్‌కు జీవితకాలం, విచారణ, అరెస్ట్‌లనుంచి పూర్తి రక్షణ కల్పించడం. ఇప్పటికే పరోక్ష సైనిక పాలన కొనసాగుతున్న తరుణంలో, ఈ సవరణ ప్రత్యక్ష నియంతృత్వానికి దారితీస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనరల్‌ ‌జియా ఉల్‌ ‌హక్‌, ‌పర్వేజ్‌ ‌ముషారఫ్‌లు దేశాధ్యక్షులుగా పాలించడాన్ని ‘‘సివిల్‌-‌మిలిటరీ హైబ్రిడ్‌’’ ‌పాలనగా సమర్థకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు దేశం ఈ ‘‘హైబ్రిడ్‌’’ ‌వ్యవస్థను కూడా దాటి ‘‘హైబ్రిడ్‌ అనంతర దశ’’ కు చేరుకున్నదని చెప్పాలి. ఎందుకంటే ప్రజలచేత ఎన్నిక కాకుండానే మునీర్‌ అన్ని రకాల అధికారాలను, రక్షణలను పొందుతున్నారు మరి! ప్రస్తుత సవరణతో సైన్యంతో పాటు నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లు అసీమ్‌ ‌మునీర్‌ ఆధీనంలోకి వస్తాయి. ఇందుకోసం చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌ఫోర్సెస్‌ (‌సీడీఎస్‌) ‌పోస్టును ఏర్పాటు చేస్తారు. ఈ విధులను కూడా ఆర్మీ చీఫే నిర్వర్తిస్తారు! ఫీల్డ్ ‌మార్షల్‌గా మునీర్‌ ‌తన జీవితకాలం యూనిఫాంను ధరించవచ్చు. రిటైరైన తర్వాత ప్రధాని సలహా మేరకు, దేశాధ్యక్షుడు మునీర్‌కు కొన్ని ‘‘బాధ్యతలు-విధులు’’ అప్పగించవచ్చు! సైన్యంలోని కీలక పోస్టులనుంచి పదవీ విరమణ చేసివారిని కూడా అరెస్ట్, ‌విచారణల నుంచి రక్షణ కల్పించడంపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. రాజ్యాంగంలోని 248వ అధికరణం ప్రకారం దేశాధ్యక్షుడు, గవర్నర్లు తమ పదవుల్లో కొనసాగుతున్నప్పుడు ఏవిధమైన నేరపూరిత విచారణలను జరపడానికి వీల్లేదు! అంటే వారు పదవినుంచి తొలగిన తర్వాత ఈ విచారణ చేపట్ట వచ్చు. ఇప్పుడు సైనికాధికార్లకు ఇటువంటి విచారణల నుంచి జీవితాంతం రక్షణ కల్పించడమనే అపభ్రంశపు నిర్ణయం కేవలం పాకిస్తాన్‌కే చెల్లింది. ప్రస్తుతం జాయింట్‌ ‌చీఫ్స్ ఆఫ్‌ ‌స్టాఫ్‌ ‌కమిటీ (సీజేసీఎస్‌సీ)గా ఉన్న జనరల్‌ ‌షాహి• షంషార్‌ ‌నవంబర్‌ 27‌న పదవి విరమణ చేసారు. ఈయన ఫోర్‌ ‌స్టార్‌ ‌జనరల్‌. ఈయన తర్వాత ప్రస్తుత రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ పోస్టు రద్దవుతుంది. కొత్తగా దీని స్థానంలో ఏర్పాటు చేసిన సీడీఎస్‌ ‌పోస్టులో ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ ‌మునీర్‌ ‌కొనసాగుతారు.

సీజేసీఎస్‌సీ త్రివిధ దళాలను సమన్వయం చేస్తే, సీడీఎస్‌గా మునీర్‌ ఆధీనంలో నేరుగా ఈ మూడు విభాగాలు పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది మే నెలలో ఆపరేషన్‌ ‌సింధూర్‌లో భారత్‌ ‌చేతిలో ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్న తర్వాత, ఫైవ్‌ ‌స్టార్‌ ‌స్థాయి ఫీల్డ్ ‌మార్షల్‌గా అసీమ్‌ ‌మునీర్‌ ‌ప్రమోషన్‌ ‌పొందారు. ఒక ‘‘ఫెయిల్డ్ ‌మార్షల్‌’’‌గా ఆ పోస్టు స్థాయిని దిగజార్చిన ఘనత కూడా మునీర్‌దే! 1960లో ఫీల్డ్ ‌మార్షల్‌గా అయూబ్‌ఖాన్‌ ఒక్కరే ఇప్పటి వరకు ఫైవ్‌ ‌స్టార్‌ ‌స్థాయిని పొందారు. ఇప్పుడు అసీమ్‌ ‌మునీర్‌ ‌రెండోవారు. 27వ రాజ్యాంగ సవరణకు ముందు ఫీల్డ్ ‌మార్షల్‌ ‌పోస్టు కేవలం ఒక గౌరవ ప్రదమైన స్థాయిగా పరిగణించేవారు. ఈ స్థాయిలో ఏ విధమైన ప్రత్యేక ప్రయోజనాలు ఉండేవి కావు. కానీ ప్రస్తుత రాజ్యాంగ సవరణ ద్వారా దీన్నొక రాజ్యాంగ పదవిగా పరిగణిస్తారు. అంతేకాదు ఫీల్డ్ ‌మార్షల్‌ ‌పదవినుంచి తొలగించాలంటే పార్లమెంట్‌లో 2/3వ వంతు మెజారిటీ అవసరం. అదే ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి సాధారణ మెజారిటీ సరి పోతుంది. తన స్వార్థం కోసం సివిలియన్‌ ‌ప్రభుత్వాన్ని మునీర్‌ ‌తన కట్టు బానిసగా ఏవిధంగా ఉపయో గించుకున్నారో దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఈ విధంగా ఒక ఆర్మీ జనరల్‌కు ప్రయోజనాలు కల్పించడమంటే ‘‘నిర్లక్ష్యాన్ని రాజ్యాంగ హక్కుగా పరిగణించడమే’’. ఇంతటి ప్రయోజనాలు ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏ నాయకుడికీ కలిగించ లేదు. ఇప్పటి వరకు నేవీ, ఎయిర్‌ఫోర్స్ ‌దళాల్లో ఎవరూ ఫైవ్‌స్టార్‌ ‌ర్యాంకు ఆఫీసర్లు లేకపోవడం గమనార్హం. అంతేకాదు ప్రస్తుత సవరణ, కమాండర్‌ ఆఫ్‌ ‌నేషనల్‌ ‌స్ట్రాటాజిక్‌ ‌కమాండ్‌ (ఎన్‌ఎస్‌సీ) పోస్టును కూడా సృష్టించింది. దేశ న్యూక్లియర్‌ ‌కమాండ్‌ ఈయన నియంత్రణలోనే ఉంటుంది. ఈ కమాండర్‌ను ఆర్మీ చీఫ్‌/‌సీడీఎస్‌లను సంప్రదించిన తర్వాత ప్రధాని నియమిస్తారు. అంటే రాబోయే కాలంలో అసీమ్‌ ‌మునీర్‌ ‌సూచించిన వ్యక్తే ఈ పోస్టులో నియమితు డవుతారు. ఆయన కేవలం సీడీఎస్‌గా ఉన్న అసీమ్‌ ‌మునీర్‌కే జవాబుదారీగా ఉంటారు తప్ప ప్రధానికి కాదు! గతంలో జియా ఉల్‌ ‌హక్‌, ‌పర్వేజ్‌ ‌ముషారఫ్‌లు దేశాధ్యక్షులుగా సర్వాధికారాలు చలాయించారు. ఆర్మీ చీఫ్‌లుగా కూడా పరోక్షంగా దేశాన్ని నియంత్రించారు. సైనిక పాలన ప్రకటించడం ద్వారా వారు కొంతమేర అప్రతిష్టను మూటకట్టుకున్నారనే చెప్పాలి. కానీ మునీర్‌ ఎటువంటి మార్షల్‌ ‌లా ప్రకటించకుండానే, పౌర ప్రభుత్వం చేతనే తనకు కావలసిన సర్వాధికారాలను పొందారు. ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారం పౌర ప్రభుత్వాన్ని ఒక తోలు బొమ్మగా మార్చిన అసీం మునీర్‌ ‌పాక్‌ ‌చరిత్రలో ఒక ‘‘అసమర్థ, నక్కజిత్తుల, స్వార్థపర’’ సైనిక జనరల్‌గా మిగిలిపోనున్నారు. నిజం చెప్పాలంటే పాక్‌లో పౌర ప్రభుత్వం ఇంత దారుణ మైన బలహీన స్థితికి గతంలో ఎప్పుడూ చేరుకోలేదు. అసలు సైన్యంలో సంస్కరణలు చేపట్టాల్సిన తరుణంలో ఈవిధంగా గంపగుత్తగా అధికారాలను అప్పగించడమేంటనేది విమర్శకుల ప్రశ్న. ప్రజా స్వామ్యం కోసం గట్టిగా పోరాడు తాయనుకునే పశ్చిమ దేశాలు కూడా పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని నిలువెత్తు గొయ్యి తీసి పూడ్చేస్తున్న చర్యలను చూసి నోరెత్తకపోవడం విచిత్రం. అన్నింటికీ మించి అవి పాక్‌ ‌సైన్యానికి తమ ఆమోదం తెలుపుతుండటం మరో వైపరీత్యం.

నామమాత్రంగా సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించడం 26వ రాజ్యాంగ సవరణ దగ్గరి నుంచే మొదలైంది. గత ఏడాది అక్టోబర్‌లో అమల్లోకి వచ్చిన ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం సుప్రీంకోర్టు ‘సుమోటో’గా ఏ కేసునూ విచారించడానికి వీల్లేదు. 2008లో సుప్రీంకోర్టు పర్వెజ్‌ ‌ముషార్రఫ్‌ను పదవి నుంచి తొలగించింది కేవలం ఈ అధికారంతోనే! ఆ విధంగా అప్పట్లో పాక్‌లో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుత రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయవ్యవస్థ నియామకాలు పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ చేతిలోకి వెళ్లిపోయాయి. అంటే ఇకనుంచి న్యాయవ్యవస్థలో నియామకాలు సైన్యం నిర్దేశం ప్రకారం, ప్రభుత్వ పాలకులు జరుపుతారన్నమాట. ఈవిధంగా పాలన, సైన్యం, న్యాయవ్యవస్థలపై సైన్యానికి (అసీమ్‌ ‌మునీర్‌కు) పూర్తి ఆధిపత్యం వచ్చినట్టే. ఈ సవరణ పుణ్యమాని సుప్రీంకోర్టు గతంలో తన ఉనికికి ఒక ‘ఛాయా’ మాత్రంగా మిగిలి పోనున్నది. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యాహ్యా అఫ్రిదీ మాత్రం పదవీ విరమణ వరకు చీఫ్‌ ‌జస్టిస్‌గానే కొనసాగనుండటం గుడ్డిలో మెల్ల! ఆయన తర్వాత సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు ప్రధాన న్యాయమూర్తుల్లో సీనియర్‌ ‌సుప్రీంకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా నియమితులవుతారు. ఈ రాజ్యాంగ సవరణకు ముందు సుప్రీంకోర్టు రాజ్యాంగ వివాదాల కేసులను విచారించేది. ఇప్పుడు కేవలం అప్పిలేట్‌ ‌కోర్టుగానే వ్యవహరించనుంది. ఇకనుంచి సుప్రీంకోర్డ్ ఆఫ్‌ ‌పాకిస్తాన్‌కు బదులు కేవలం సుప్రీంకోర్టు అని మాత్రమే వ్యవహరిస్తారు. సివిల్‌ ‌కేసులు కుప్పలు తెప్పలుగా పేరుకు పోవడం వల్లనే ఎఫ్‌సీసీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు సవరణ సమర్థకులు చెబుతున్నా, నిజానికి అంతటి స్థాయిలో కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో లేని అంశాన్ని విమర్శకులు గుర్తుచేస్తు న్నారు. ఒకవేళ అటువంటి కేసులకు సత్వర పరిష్కారం లభించాలంటే, వాటికి సంబంధించిన సంస్కరణలు అమల్లోకి తేవడమే ఉత్తమమని వీరు వాదిస్తున్నారు.

ఫెడరల్‌ ‌కాన్‌స్టిట్యూషనల్‌ ‌కోర్ట్

‌కొత్తగా ఏర్పాటు కానున్న ఫెడరల్‌ ‌కాన్‌స్టిట్యూ షనల్‌ ‌కోర్ట్ (ఎఫ్‌సీసీ)కి ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు, ప్రస్తుత సుప్రీంకోర్టుకు సమానంగా న్యాయ మూర్తులుంటారు. పాకిస్తాన్‌లోని నాలుగు ప్రావెన్స్‌ల నుంచి నలుగురు న్యాయమూర్తులు నియమితులవు తారు. ఈ కోర్టుకు కూడా ప్రత్యేక భవనాలు, సిబ్బంది ఉంటారు. ఈ కోర్టు ప్రభుత్వాల మధ్య ఏర్పడే రాజ్యాంగ పరమైన వివాదాలపై విచారణ జరుపు తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 ఏళ్లకే పదవీ విరమణ చేస్తే, ఎఫ్‌సీసీ జడ్జ్‌ల పదవీ విరమణ వయస్సు 68 సంవత్సరాలు! అయితే ఎఫ్‌సీసీ ప్రధాన న్యాయ మూర్తి పదవీకాలం మూడేళ్లుగా నిర్ణయిం చారు. జ్యుడిషియల్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ‌పాకిస్తాన్‌ (‌జేసీపీ) సిఫారసు మేరకు దేశాధ్యక్షుడు న్యాయమూర్తులను బదిలీ చేస్తారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకాలపై సిఫారసు చేసే అధికారం ఈ సంస్థకే ఉంటుంది. గత ఏడాది అమల్లోకి వచ్చిన 26వ రాజ్యాంగ సవరణ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు దేశాధ్యక్షుడి ఆమోదంతోనే జరగాల్సి ఉంటుంది. పాక్‌ ‌సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రెండు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సూచనతో పాటు బదిలీ విషయంలో సదరు న్యాయమూర్తి సమ్మతి కూడా అవసరం. తాజా రాజ్యాంగ సవరణ ప్రకారం కేవలం జేసీపీ సిఫారసు మేరకు దేశాధ్యక్షుడు బదిలీ చేయవచ్చు. ఇందుకు న్యాయమూర్తుల సలహాలు, సమ్మతి అవసరంలేదు. ఒకవేళ సదరు న్యాయమూర్తి తన బదిలీని వ్యతిరేకిస్తే అందుకు సరైన కారణాలు చూపుతూ జేసీపీని ఆశ్రయించాలి. ఆయన చూపే కారణాలు సరైనవి కాదని జేసీపీ భావిస్తే, ఆ జడ్జికి పదవీ విరమణ తప్ప గత్యంతరం ఉండదు. దీనివల్ల రాజకీయ నాయకులు జడ్జీల బదిలీల్లో కక్షసాధింపు చర్యలకు పాల్పడే అవకాశముంది. రాజకీయ నాయకులు సైన్యం చేతిలో పావులు కనుక, సైన్యమే తనకు అనుకూలంగా బదిలీలు చేయిస్తుందనుకోవాలి! ఈవిధంగా సైన్యం ఛత్రం కింద, కార్యనిర్వాహక శాఖ… న్యాయవ్యవస్థ నుంచి తనను తాను కాపాడు కోవడమే కాకుండా, జవాబుదారీతనం నుంచి తేలిగ్గా తప్పించుకోగలుగుతుంది. ఆవిధంగా కార్య నిర్వాహక శాఖ ఆధీనంలోకి వెళ్లిన న్యాయవ్యవస్థలో నిష్పాక్షిక న్యాయం జరుగుతుందని భావించడం వృథా!

జమలాపురపు విఠల్‌రావు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE