అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన రోజు గత ఏడాది నవంబర్ 6వ తేదీ.. సరిగ్గా ఏడాది తిరిగేసరికి స్థానిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని రాష్ట్రాల గవర్నర్ పదవులకు, నగరాల మేయర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఘోరంగా పరాజయం పొందారు. డెమోక్రాట్లకు ఘన విజయం లభించింది. ఏడాది కాలంలోనే ట్రంప్ పాలన పట్ల అమెరికన్లలో విముఖత ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది. అమెరికాను అన్నింటా అగ్రగామిగా తీర్చిదిద్దాలనే తపన ఆయనలో ఉండటం తప్పేమీ కాదు. కానీ ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) పేరుతో వలసదారులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారిపోయాయి.
బయటి నుంచి వచ్చిన వారు అమెరికన్ల ఉద్యోగావకాశాలను కొల్లగొడుతున్నారని ట్రంప్ మద్దతుదారుల వాదన. వలసదారులను బలవంతంగా పంపించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు వివాదాలకు దారి తీశాయి. ఫెడరల్ ప్రభుత్వ షట్‌డౌన్, ఆర్థిక సమస్యలు, ప్రపంచ దేశాలపై సుంకాల మోత, ఉద్యోగుల తొలగింపును ఆ దేశ ప్రజలు హర్షించలేకపోతున్నారు. ట్రంప్ విధానాలపై అసంతృప్తి కారణంగా ఓటర్లు డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపారు. న్యూజెర్సీ, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్ ఎన్నికలు, న్యూయార్క్ సిటీ మేయర్ రేసు సహా ముఖ్యమైన పోటీలలో డెమోక్రాట్లు మొత్తం స్వీప్ చేశారు. దీని ప్రభావం 2026 అమెరికా మధ్యంతర ఎన్నికల్లో, 2028 దేశ అధ్యక్ష ఎన్నికల్లోనూ ప్రతిబింబించే అవకాశం ఉంది. అమెరికాలోని ప్రతి 10 మందిలో ఆరుగురు ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది. కేవలం ముగ్గురిలో ఒకరు మాత్రమే సంతృప్తిగా ఉన్నామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో సగం కంటే ఎక్కువ మంది ఓటర్లు ట్రంప్‌కు హెచ్చరిక పంపారంటూ అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి.
భారత సంతతి విజయం
అనేక మంది భారతీయులు తమ డాలర్ డ్రీమ్స్‌ను సాకారం చేసుకునేందుకు అమెరికాకు వచ్చారు. అమెరికా జనాభాలో భారత సంతతి వారు రెండు శాతం వరకూ ఉన్నారు. కానీ ప్రభుత్వ పన్నుల ఆదాయంలో వారి వాటా దాదాపు 6 శాతం. సగటు కుటుంబ ఆదాయం జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు. ‘ఫార్చ్యూన్ 500’ జాబితాలోని 16 కంపెనీలకు భారత సంతతి సీఈవోలే సారథ్యం వహిస్తున్నారు. వారి నాయకత్వంలోని ఈ కంపెనీల వార్షిక ఆదాయం లక్ష కోట్ల డాలర్లకు పైనే ఉంటుంది. వ్యాపారులుగా, వైద్యులుగా, శాస్త్రవేత్తలుగా, ఇంజినీర్లుగా, సాంకేతిక వృత్తి నిపుణులుగా భారత సంతివారు ఇతర వలసదారుకన్నా భిన్నంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. భారతీయులు సాధారణంగా అమెరికన్ రాజకీయాలకు దూరంగా ఉంటారు. అయితే సాంప్రదాయంగా డెమోక్రాట్ పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే గత ఎన్నికల్లో వారు రిపబ్లికన్లను బలపరిచారు. అలాంటి వారిని ట్రంప్ పార్టీ గోబ్యాక్ అంటోంది. దీంతో భారత సంతతి ప్రజలు మళ్లీ డెమోక్రాట్లవైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి వచ్చింది. అమెరికా నుంచి ఏ వలసదారులను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారో వారే ట్రంప్ పార్టీకి ఓటమిని రుచి చూపించారు. ఎన్నికల్లో గెలిచిన వారిలో ముగ్గురు భారత సంతతికి చెందిన వారు కావడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌ను సవాలుచేసి మరీ 34 ఏళ్ల భారత సంతతి యువకుడు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికయ్యారు. అటు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా భారత్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ గజాలా హష్మీ విజయం సాధించారు. మరోవైపు సిన్సినాటి మేయర్‌గా భారత సంతతికి చెందిన ఆఫ్తాబ్ పురేవాల్ రెండోసారి ఎన్నికయ్యారు. వీరంతా డెమోక్రాట్ అభ్యర్థులే కావడం విశేషం..
న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ
ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక రాజధానిగా పేరొందిన న్యూయార్క్ మహానగర మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జోహ్రాన్ క్వామీ మమ్దానీ ఘన విజయం సాధించారు. ఆయన రాజకీయ దిగ్గజం న్యూయార్క్ మాజీ గవర్నర్ అయిన ఆండ్రూ కువోమోను ఓడించారు. రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసిన కర్టిస్ స్లీవాకు భగం పాటు తప్పలేదు. జోహ్రాన్ మమ్దానీ గత వందేళ్లలో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా చరిత్ర సృష్టించారు. అంతేగాక ఈ పదవికి తొలి దక్షిణాసియావాసిగా, ముస్లిమ్‌గా రికార్డు నెలకొల్పారు.
మమ్దాని 1991లో ఉగాండా రాజధాని కంపాలాలో జన్మించారు. గుజరాతీ ముస్లిం ప్రొఫెసర్ మహమూద్ మమ్దాని, బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్ ఆయన తల్లిదండ్రులు. మమ్దానికి ఐదేళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం ఉగాండా నుంచి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌కు వలస వెళ్లింది. ఆయన ఏడేళ్ల వయసున్నప్పుడు కుటుంబంతో కలిసి అమెరికాకు చేరుకుంది. జొహ్రాన్ 2014లో బౌడిన్ కాలేజీ నుంచి ఆఫ్రికన్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ స్వీకరించారు. అనంతరం హౌజింగ్ కౌన్సిలర్‌గా పనిచేశారు. న్యూయార్క్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. డెమోక్రటిక్ పార్టీ ప్రచారకర్తగా సేవలందించారు. 2020లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు న్యూయార్క్ నగరానికి మేయర్ అయ్యారు. మమ్దానీ విజయానికి ఉచిత బస్సు, తక్కువ ధరకు గృహనిర్మాణం వంటి ఆకర్షణీయ హామీలు దోహదం చేశాయని చెబుతున్నారు
మలక్‌పేట మహిళ గజాలా
భారత్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ 61 ఏళ్ల డెమోక్రాట్ గజాలా ఫిర్దౌస్ హాష్మి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా విజయం సాధించారు. గవర్నర్ తర్వాత అత్యున్నత పదవి ఇది. ఈ పదవికి ఎన్నికైన తొలి దక్షిణాసియా అమెరికన్‌గా, తొలి భారతీయ ముస్లింగా ఆమె చరిత్ర సృష్టించారు. వర్జీనియా సెనేటర్‌గా ఇప్పటికే ఆమె సేవలందిస్తున్నారు. గజాలా హాష్మి 1964లో హైదరాబాద్‌లో జన్మించారు. బాల్యంలో మలక్‌పేటలోని తాతగారింట పెరిగారు. అయితే వీరి పూర్వికుల మూలాలు ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్నాయి. గజాలాకి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు, వారి కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. గజాలా హాష్మి ప్రస్తుతం వర్జీనియా స్టేట్ రిచ్‌మండ్ దక్షిణ జిల్లాకు సెనెటర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో తొలిసారిగా ఈ స్థానంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఆమె ఓడించారు. దీంతో వర్జీనియా రాజకీయాల్లో ఫేమస్ అయ్యారు. దక్షిణాసియా ప్రజలలో గజాలాకు మంచి పేరుంది. వలసదారులకు దన్నుగా నిలుస్తారనే ఖ్యాతిని ఆమె గడించారు. గజాలాకు తన జన్మస్థలమైన హైదరాబాద్ అంటే మక్కువ. పదేళ్ల క్రితం చార్మినార్, చౌమొహల్లా ప్యాలేస్, సాలార్‌జంగ్ మ్యూజియం వంటి చారిత్రక స్థలాలన్నీ సందర్శించారు.
పంజాబ్ మూలాల ఆఫ్తాబ్
భారత సంతతికి చెందిన 43 ఏళ్ల ఆఫ్తాబ్ పురేవాల్ ఒహియో స్టేట్ సిన్సినాటి నగర మేయర్‌గా రెండోసారి ఎన్నికయ్యారు. ఆఫ్తాబ్ పురేవాల్ తండ్రి భారత్‌లోని పంజాబ్ వాస్తవ్యులు. తల్లి టిబెటన్ బౌద్ధురాలు. వీరు అమెరికాలోని ఒహియోకు వలస వెళ్లారు. అక్కడే ఆఫ్తాబ్ జన్మించారు. బాల్యం నుంచే రాజకీయాలు అంటే ఆఫ్తాబ్‌కు ఆసక్తి. 8వ తరగతిలో ఉండగా స్కూలులో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో బిగ్, బ్రౌన్ అండ్ బ్యూటిఫుల్ నినాదంతో ఆయన గెలిచారు. సిన్సినాటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి లా పట్టా పొందారు. అనంతరం 2008లో వాషింగ్టన్ డీసికి వెళ్లి, అక్కడొక లా ఫర్మ్‌లో పనిచేశారు. నాలుగేళ్ల తర్వాత, అమెరికా న్యాయ శాఖలో ప్రత్యేక అసిస్టెంట్ యూఎస్ అటార్నీగా అవకాశం లభించింది.
ఒహియోలోని హామిల్టన్ కౌంటీలో విధులు నిర్వర్తించారు. సిన్సినాటి మేయర్ పదవి ఆఫ్తాబ్ పురేవాల్‌కు అంత ఈజీగా లభించలేదు. ఈ పదవి కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సవతి సోదరుడు కోరీ బౌమాన్ పోటీ చేశారు. ఈయనకు కూడా ట్రంప్ బలమైన ఆశీర్వాదం ఉంది. అయినప్పటికీ ఆఫ్తాబ్ గెలుపును ఆపలేకపోయారు. జొహ్రాన్ మమ్దాని, గజాలా ఫిర్దౌస్ హాష్మి, ఆఫ్తాబ్ పురేవాల్ గురించి ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది
వివాదాల్లో మమ్దానీ
జోహ్రాన్ మమ్దానీ అనే భారతీయ మూలాల వ్యక్తి న్యూయార్క్ గవర్నర్‌గా గెలిచాడని మన దేశంలోని మీడియా ఆయన గురించి కాస్త అతిగానే పొగిడేస్తూ ఆకాశానికి ఎత్తేస్తోంది. కానీ సగటు భారతీయుడికి ఈయన గెలుపు అంత ఆనందం కలిగించే విషయం కాదనే చెప్పక తప్పదు. తనకు తాను సోషలిస్టుగా చెప్పుకునే జొహ్రాన్ మమ్దానీ ముస్లిం పక్షపాతిగానే కనిపిస్తారు. భారతదేశం, హిందూమతం, ప్రధాని మోదీ మీద విద్వేషాన్ని బాహటంగానే చాటుకున్నారు.
2015లో మమ్దానీ ‘ఎక్స్’లో అల్‌ఖైదా ఉగ్రవాదికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు, 2020లో న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ కూడలి దగ్గర జిహాదీ, ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఏర్పాటు చేసిన హిందూ వ్యతిరేక ర్యాలీలో మమ్దానీ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో శ్రీరాముడిని, హిందువులనుద్దేశిస్తూ మమ్దానీ అసభ్య పదజాలాన్ని వాడారు.గుజరాత్‌లో జరిగిన ఘర్షణలపై మమ్దానీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అక్కడ ముస్లింలను అంతం చేసేందుకు కుట్ర జరిగిందని, చాలామందిని హత్య చేశారని, ఇందుకు నాటి సీఎం మోదీయే కారణమని మమ్దానీ ఆరోపించారు.
ఇటీవల అమెరికాలో జరిగిన ఇజ్రాయెలీ వ్యతిరేక, పాలస్తీనా అనుకూల ర్యాలీల్లో కూడా జోహ్రాన్ మమ్దానీ క్రియాశీలకంగా పాల్గొన్నారు. పాలస్తీనియన్ల హక్కులను పరిరక్షించాలని తరచూ మమ్దానీ ప్రసంగాలిస్తుంటారు. హమాస్‌పై దాడులను తీవ్రంగా తప్పుబట్టారు. నెతన్యాహూ న్యూయార్క్‌కు వస్తే ఖైదు చేసి బందీఖానాలో పడేస్తా అంటూ మమ్దానీ గతంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికాలోని యూదు సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. మమ్దానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులా, భారత ప్రధాని మోదీ కూడా యుద్ధ నేరస్తుడేనంటూ తన వాచాలతను ప్రదర్శించారు.
‘‘ఉగాండాలో ఉన్న మా కుటుంబాన్ని మేం భారతీయులనే కారణంతో వెలివేశారు. ముస్లింలు అనే కారణంగా భారత్‌లో మా తోటి ముస్లింలను పీడిస్తున్నారు’’అని గతంలో మరో పోస్ట్ పెట్టారు మమ్దానీ. బాబ్రీ మసీదు విధ్వంసానికి పూర్వపు ఫొటోను షేర్‌చేసి దానికి ఒక క్యాప్షన్ ఇచ్చారు. ‘‘ఇది 400 ఏళ్లపాటు నిలిచిన మసీదు. కానీ దీనిని బీజేపీ ప్రేరేపిత మతమూక 1992లో కూల్చేసింది. దీనికి గుర్తుగా టైమ్స్ స్క్వేర్ కూడలిలో హిందువులు పండగ చేసుకున్నారు’’అని మరో పోస్ట్ పెట్టారు
మమ్దానీ ఇప్పటి వరకూ భారతీయ హిందూ వేడుకల్లో పాల్గొనలేదు. కానీ పాకిస్తాన్ డేలో మాత్రం పాల్గొన్నారు.మమ్దానీ తీరుపై బీజేపీతోపాటు కాంగ్రెస్ నేతలూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మమ్దనీ పాకిస్తానీలాగా కనిపిస్తున్నాడు. భారత మూలాలు ఎక్కడ కనిపించడం లేదు. అతని భారత మూలాల్లో జరిగిందేదో జరిగింది. ఓ యాంటీ ఇండియన్ కాబోతున్నాడు’ అని నటి, ఎంపీ కంగనా రనౌత్ గతంలో వ్యాఖ్యానించారు. మమ్దానీ ఒక్కసారి నోరు తెరిచాడంటే తమకింక పనిలేదని పాకిస్తాన్ ప్రచార బృందాలు కూడా సెలవు పెట్టి ఇంటికి వెళ్లిపోతాయి. ఆ స్థాయిలో భారత్‌పై విద్వేషం చిమ్ముతాడు. మనకు వేరే శత్రువు అక్కర్లేదు’’అని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు.
కమ్యూనిస్టు ఉన్మాది
మమ్దానీ 100 శాతం కమ్యూనిస్ట్ ఉన్మాది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. డెమోక్రాట్లకు ఇంతకన్నా మంచి అభ్యర్థి దొరకలేదా అని ఎద్దేవా చేశారు. న్యూయార్క్‌లో జరిగింది నిజానికి భయానక ఘటన అని అభివర్ణించారు. అలా జరగకూడదని తాను కోరుకున్నానని.. కానీ, జరిగిపోయిందని చెప్పారు. అతడి పేరు ఎదైనా కావొచ్చు, అతడు ఎవరైతే నాకేంటి? అని హేళన చేశారు. అమెరికా ప్రజలు కమ్యూనిజం కావాలో లేక కామన్‌సెన్స్ కావాలో తేల్చుకొనే సమయం వచ్చిందని అన్నారు.
క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్