ఆదివాసీ యోధుడు బిర్సాముండా వారి సంక్షేమానికి విశేషంగా కృషి చేశారని, నేడు వారికి అందుతున్న ఫలాలన్నీ ఆయన పోరాట ఫలితాలని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సహా పలువురు ప్రముఖులు కొనియాడారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ఆయన స్ఫూర్తితోనే దేశంలోని గిరిజన తెగల సంస్కృతీ, సంప్రదాయాలను పరిరక్షణకు, వారి సంక్షేమానికి అవిరళ కృషిచేస్తోందన్నారు.
ఆదివాసీ యోధుడు భగవాన్ బిర్సాముండా ఉద్యమ స్ఫూర్తితో ఆదివాసీల అభ్యున్నతికి ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఒడిశా ముఖ్య మంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. వనవాసి కళ్యాణ ఆశ్రమం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో జన జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమంలో భాగంగా భగవాన్ బిర్సాముండా 150 వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలనంతో వేడుకలను ప్రారంభించారు. ఆ ప్రాంత గిరిజన దేవత మోదుకొండమ్మకు నమస్కా రాలు, ప్రజలందరికీ తెలుగులో శుభాకాంక్షలు తెలిపి ప్రసంగం ప్రారంభించారు.
భగవాన్ బిర్సా ముండా 25 ఏళ్ల కాలం మాత్రమే జీవించినా ఆదివాసీలకు గుర్తింపు, వారి సంస్కృతికి గౌరవం తెచ్చారని మోహన్ చరణ్ మాఝీ అన్నారు. ఆయన వారసత్వానికి ప్రధాని నరేంద్రమోదీ జాతీయ గౌరవం ఇచ్చారని, ఆదివాసీ గౌరవ దినోత్సవం ఆయన పేరునే జరుపుకుంటున్నా మన్నారు. బిర్సాముండా 150 ఏళ్ల జయంతి సందర్భంగా తపాలా బిళ్ల, నాణెం విడుదల చేశారన్నారు. గిరిజన సంప్రదాయాలు, వారి హక్కుల పరిరక్షణ కోసం బిర్సాముండా బ్రిటిష్‌వారితో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడని కొనియాడారు. బిర్సాముండా గిరినుల ఆశాకిరణం. యువత ఆయనను ప్రేరణగా తీసుకుని ముందుకు వెళ్లాలి. ఆయన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా గిరిజన తెగలను వెలుగులోకి తెచ్చి వారి సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుతూ, వారి సంక్షేమానికి మోదీ ప్రభుత్వం ఆవిరళ కృషిచేస్తోందన్నారు.
గత ప్రభుత్వాలు గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని కాని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వారికి మేలు, ఉపాధి, గౌరవాలు దక్యాయన్నారు. ఆదివాసీ బిడ్డ దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతిగా ఉన్నారని, ఒడిసా, ఛత్తీస్‌ఘడ్‌లో గిరిజనులను ముఖ్యమంత్రులను చేసినందుకు బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘అల్లూరి సీతారామరాజు ఆంధప్రదేశ్ ఆత్మగౌరవానికి సూచిక. మన్యం వీరుడిగా ఆదివాసీ గుండెల్లో చెరగని ముద్ర వేశారు. వారిలో చైతన్యం తెచ్చి అగ్ని రగిలించారు. వారిని ఏకం చేసి రంపలో ఉద్యమించి బ్రిటిషర్లతో పోరాడారు’ అని ప్రశంసించారు.
ఆంధప్రదేశ్‌లో ఎన్నో గిరిజన తెగలు ఉన్నాయని, జటాపు తెగ వ్యవసాయం చేస్తూ ప్రకృతిని ప్రేమిస్తూ గడుపుతారు. కొండదొర తెగవారు పోరాటమే కాకుండా అటవీ జీవితం గడుపుతూ సమాజానికి ఎన్నో ఉత్పతులు ఇస్తున్నారు. సవర తెగ వారు గిరిజన భాషను, చిత్ర లేఖత్వాన్ని పరిరక్షిస్తున్నారు. గరభ తెగవారు ప్రత్యేకమైన వేషధారణ, ఆహార్యం, సాహసాలు కలిగి ఉన్నారు. వాల్మీకి తెగ ఈ ప్రాంతాల్లో ప్రాధాన్యత కలిగి ఉన్నారని గుర్తుచేశారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, రోడ్డు, రవాణా వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు గిరిజనుల జీవనోపాధి మరింతగా పెంపొందించేందుకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. పీఎం ధర్తీ అబా ట్రైబల్ విలేజ్ ఎక్స్‌లెన్స్ మిషన్ ద్వారా రూ.80 వేల కోట్ల ఖర్చుతో 63 వేల ఆదివాసీ గ్రామాల్లో 5 కోట్ల ప్రజల జీవన ప్రమా ణాలు మెరుగుకు చర్యలు తీసుకుంటున్నారని మోహన్ చరణ్ మాఝీ చెప్పారు. 28 లక్షల పీజీటీ•లకు విద్య వైద్య సేవలు ఇస్తున్నామని. 6,700 గ్రామాల్లో 90 వేల ఇళ్లకు మంచి నీరు అందిస్తున్నామన్నారు. కొత్తగా వెయ్యి అంగన్‌వాడీ కేంద్రాను ప్రారంభించారని చెప్పారు. ఆంధప్రదేశ్‌లో సవర, కొండ సవర గరభ, తెగలు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నా యన్నారు. 119 మాత్రమే ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూళ్లను 497కు పెంచామన్నారు. తద్వారా 1.38 లక్షల గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. గిరిజనులకు ఉపకారవేతనాల నిధులను 300 శాతం పెంచామని వివరించారు. సికిల్‌సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ ద్వారా గిరిజనుల ఆరోగ్య రక్షణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేం దుకు రూ.16 వేల 650 కోట్ల రుణాలు అందించామని, దేశంలో మూడు వేల వన్‌ధన్ వికాస కేంద్రాల ద్వారా లక్షా 23 వేల మంది గిరిజనులకు అటవీ ఉత్పత్తుల విలువ పెంపు కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. 24 లక్షల గిరిజన కుటుంబాలకు అటవీ హక్కు పత్రాలను అందించి వారి సాగు భుములకు హక్కులు కల్పించామని, దేశంలో 10 చోట్ల గిరిజన మ్యూజియా లను ఏర్పాటుచేస్తున్నామని, అందులో ఒకటి లంబసింగిలో నిర్మాణంలో ఉందన్నారు. గిరిజనుల అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ధరలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాలైన అరకు, కొరాపుట్ కాఫీకి ప్రపంచ ఖ్యాతి లభించిందని, దానిని మరింత ప్రమోట్ చేస్తున్నామని తెలిపారు. అరకు కాఫీ రుచి చూశానని, కోరాపుట్ కాఫీ కూడా అదే రుచిలో ఉంటుందని, పార్లమెంట్‌లో ఈ అరకు కోరాపుట్ కాఫీ స్టాల్ పెట్టారని చెప్పారు. మోదీ మార్గంలో ఒక దేశం ఒక భవిష్యత్ నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. జార్ఖండ్ నుంచి ఆంధప్రదేశ్ వరకు గల తూర్పు కనుమల్లోని గిరిజనులు దేశానికి హృదయం వంటివారు.
రాష్ట్ర వైద్య శాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, కాలుష్యానికి దూరంగా ఉంటూ ప్రకృతిని ఆరాధిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షించే వారే గిరిపుత్రులని పేర్కొన్నారు. వారు బిర్సా ముండా ఆశయాలను పుణికి పుచ్చుకున్నారన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఎందరో అసువులు బాసారన్నారు. కానీ కేవలం ఒక్క కుటుంబం మాత్రమే బయటకు తెచ్చుకున్నారు. దేశం కోసం పోరాటం చేసిన వారికి గౌరవం తెచ్చే ప్రయత్నం కేంద్రం చేస్తోందని, గిరిజన సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. గిరిజనుల ఆరోగ్యం కోసం ప్రాధాన్యత ఇచ్చామని, గత ప్రభుత్వాలు గిరిజనులకు కనీసం భూమి కూడా ఇవ్వలేకపోయాయని విమర్శించారు. గత ప్రభుత్వాలు బోధనాసుపత్రులను గత ప్రభుత్వం నిర్మించలేదని, కాని నేడు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పాడేరు గిరిజన కళాశాలను నిర్మితమైందని, త్వరలో పార్వతీ పురంలోనూ నిర్మించనుందని చెప్పారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కూటమిదన్నారు. ఎన్‌ఆర్‌జిఈఎస్ నిధులు ఇవ్వడం ద్వారా కేంద్రం సహకరిస్తోందన్నారు. పార్వతీపురం సాలూరు నియోజక వర్గాల్లో 21 గ్రామాల్లో సమస్యలున్నాయి. ఒడిసా రాష్ట్రం పరిష్కరించాలని కోరారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్ మాధవ్ మాట్లాడుతూ, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పాడేరు రావడం ఆనందంగా ఉందని పేర్కొంటూ, స్వాతంత్య్రం సాధనలో అసువులు బాసిన వారిని స్మరించుకున్నారు. గిరిజనుల అస్తిత్వం కోసం బిర్సా ముండా విశేషంగా కృషి చేసారు. 1/70 చట్టం, పిసా చట్టం, పారెస్ట్ రైట్స్ చట్టం, లాండ్ అక్విజిషన్ చట్టం వంటివి ఆయన పోరాట ఫలితాలని అన్నారు. జన్‌మన్ పథకం ద్వారా 43 తెగలకు లబ్దిచేకూరుతుండగా, అవి ఏపీలో 4 తెగలున్నాయి. వీరికి 4 వేల ఇళ్లు, విద్య, ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి. విదేశీయులు మనపైన దాడులు చేస్తున్నారు. పాకిస్ధాన్, బంగ్లాదేశ్‌లలో గిరిజనులు ఉన్నారు. అక్కడ మతతత్వం కారణంగా అక్కడి గిరిజనులు హక్కులు కోల్పోయారు. వారు ఇబ్బంది పడుతున్నారు. మోదీ కశ్మీర్‌లో 370 అధికరణం తీసేయడం ద్వారా అక్కడి గిరిజనులకు హక్కులు కల్పించారు. మతమౌఢ్యం ద్వారా, మనల్ని మతం మార్చడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను దూరం చేసే శక్తులన గిరిజనులు అడ్డుకోవాలి. ఆంధ్ర వనవాసి కళ్యాణ్ సహకారంతో ప్రతి గ్రామంలో జనజాతీయ గౌరవ దివస్ నిర్వహిద్దాం. ప్రతి తాండాలో గౌరవ దివస్‌ను చేసుకుందామని చెప్పారు.
అంతకు ముందు చరణ్ మాఝీ, ఇతర నేతలు చింతలవీధి గ్రామంలో బిర్సాముండా విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభా ప్రాంగణం వద్ద ప్రదర్శించిన జీసీసీ, వందన్ వికాస్ స్టాల్స్ ను సందర్శించారు. గిరిజనులతో కలసి గిరిజన నృత్యం వేశారు.
కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పొంగి రాజారావు, మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, వనవాసి కల్యాణ్ ఆశ్రమం అధ్యక్షులు మఠం సన్యాసినాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు, సర్పంచ్ శాంతకుమారి, ఎస్టీ కమిషన్ చైర్మన్ సోలాబుజ్జి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్