ఇది బిహార్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంచలనం. రీపోలింగ్‌ లేకపోవడం విశేషం. హింస లేదు. రాహుల్‌గాంధీ ఓట్‌చోరీ ఎంతటి డొల్ల ప్రచారమో ఓటర్లు తిరుగులేకుండా నిరూపించారు. కాంగ్రెస్‌ మీద రాష్ట్రీయ జనతాదళ్‌కు, ఆర్‌జేడీ మీద కాంగ్రెస్‌కు నమ్మకమే లేదు. కలసి ఎన్నికలలో పోరాడడం కంటే, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా పంచుకోవాలన్నదే ఆ పార్టీల నాయకుల ధ్యేయంగా కనిపించింది. లాలూప్రసాద్‌ యాదవ్‌ కులరాజ్యం, ఆటవిక వ్యవస్థ పట్ల బిహార్‌ ప్రజానీకం నిజంగానే భయభ్రాంతులకు గురైంది. ఫలితమే మొత్తం విపక్షాలకు 35 స్థానాలు మాత్రమే ఇచ్చి, నోరు నొక్కి ఉంచింది.  అత్తెసరు మార్కులతో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అత్యధిక భాగం ఎగ్జిట్‌ పోల్స్‌ ఢంకా బజాయించి చెప్పాయి కానీ, సామంత రాజు అవుతుందనుకున్న ఎన్‌డీఏ ఏకంగా చక్రవర్తి అయి బిహార్‌ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మొత్తం 243 స్థానాల బిహార్‌ శాసనసభలో 202 స్థానాలు ఎన్‌డీఏకి రావడం నిజంగా ఒక రికార్డే.

ఎన్‌డీఏలో ప్రధాన పక్షమైన బీజేపీకి 89 స్థానాలు, నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని జనతాదళ్‌ (యు)కు 86 స్థానాలు రావడం మరో విశేషం. ఇక, అయిదవసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్ట బోతున్న నితీశ్‌ కుమార్‌ కూడా సుదీర్ఘ కాలం ముఖ్య మంత్రిగా ఎన్నికవుతున్న వ్యక్తిగా చరిత్రకెక్కుతున్నారు. నిజానికి, ఎన్‌డీఏకి సైతం ఈ భారీ విజయం సంభ్ర మాశ్చర్యాలు కలిగించే విషయం. అన్నిటికన్నా మించి కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకత్వంలోని మహాగఠ్‌ బంధన్‌ ఘోరాతిఘోరంగా పరాజయం పాలు కావడం ఆ కూటమి నాయకులను ఇప్పటికీ దిగ్భ్రాంతి పరుస్తోంది.

ప్రధాన భాగస్వామ్య పక్షమైన జనతాదళ్‌ (యు)ని మించి బీజేపీ ఇక్కడ సీట్లు సంపాదించి అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం ఏ పార్టీకీ మింగు డుపడని విషయమే అయినప్పటికీ, నితీశ్‌ కుమార్‌కే మళ్లీ పెద్ద పీట వేయక తప్పనిసరి అవుతోంది. బిహార్‌కు సంబంధించినంత వరకూ నితీశ్‌ కుమారే ఎన్‌డీఏ కూటమిలో తిరుగులేని నాయకుడని ఆయన పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, వృద్ధాప్యం, అనారోగ్యం, కొద్దిపాటి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా నితీశ్‌పై ఓటర్లకు సందేహాలు పెరుగుతున్నాయని, అదే సమయంలో బీజేపీ మీదా, నరేంద్ర మోదీ నాయకత్వం మీదా ప్రజల్లో సందేహాలన్నీ నివృత్తి అవుతూ, నమ్మకం పెరుగుతోందనడానికి కూడా ఈ మారుతున్న సంఖ్యాబలం, సమీకరణాలు నిదర్శనం. బిహార్‌ ఫలితాలు కేంద్రం మీద కూడా ప్రభావం చూపిస్తాయి. వచ్చే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల శాసనసభలకు జరగబోతున్న ఎన్నికల మీద కూడా వీటి ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది.

సమష్టి కృషికి విజయం

బిహార్‌లో పాలనా దక్షతను కనబరచి సుశాసన్‌ బాబుగా పేరు తెచ్చుకున్న నితీశ్‌కుమార్‌ను ముఖ్య మంత్రి అభ్యర్థిగా చాలా ముందుగానే ప్రకటించి, ఎన్‌డీఏ మంచి పని చేసింది. నితీశ్‌ కుమార్‌ మీద ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం పడకుండా ఉండడానికి ఎన్‌డీఏ మహిళా ఓటర్లను భారీ సంఖ్యలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మహిళలకు అనేక సంక్షేమ పథకాలను ప్రకటిం చడంతో పాటు, వారి ఖాతాల్లో పదివేల రూపాయలు జమ చేస్తామని ప్రకటించడం ద్వారా ఎన్‌డీఏ మహిళా ఓటర్లను తమ వైపు ఆకట్టుకోగలిగింది. ఎన్నికలు ప్రకటించడానికి చాలాకాలం ముందు నుంచి ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు ఒకే తాటి మీదకు వచ్చి పనిచేస్తూ గ్రామ స్థాయిలో, బూత్‌ స్థాయిలో ప్రచారం చేస్తుండగా, మహా గఠ్‌ బంధన్‌ కూటమిలోని పార్టీలు పరస్పర విరుద్ధ భావజాలంతో, ప్రచారాంశాలతో ప్రజల ముందుకు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ పని తీరు చాలా పేలవంగా కొనసాగింది. పార్టీ ప్రధాన ప్రచార సారథి రాహుల్‌ గాంధీ ప్రచారసరళి పార్టీ కార్యకర్తలను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. రాష్ట్రీయ జనతాదళ్‌లోనే తేజస్వి యాదవ్‌ నాయకత్వం పట్ల వ్యతిరేకత కొనసాగడం కూడా ఆ పార్టీ నమ్ముకున్న యాదవులు, ముస్లింలలో ఆ పార్టీ పట్ల అనుమానాలు రేకెత్తిం చింది. ప్రతిపక్షాల బలహీనతలు, అసత్య ఆరోపణ లతో కూడిన ప్రచారాలు ఎన్‌.డి.ఏ, జనతాదళ్‌ బలాన్ని బాగా పెంచి, నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం మరో అయిదేళ్ల పాటు కొనసాగడానికి అవకాశం కల్పించాయి.

బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడంతో బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలలో అత్యంత బలమైన పార్టీగా మారినట్టు కనిపిస్తోంది. రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ రాష్ట్రాలను కంచుకోటలుగా మార్చుకున్న బీజేపీకి చాలా ఏళ్లుగా బిహార్‌ ఒక మినహాయింపుగా మిగిలిపోయింది. ఆ పార్టీ బీహార్‌లో మాత్రం పూర్తి స్థాయిలో అధికారం చేపట్ట లేకపోయింది. ఇతర రాష్ట్రాల్లో సొంత బలంతోనో, మిత్రపక్షాల బలంతోనో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ బిహార్‌లో మాత్రం ఒక భాగస్వామ్య పక్షంగా మాత్రమే ఉండాల్సి వస్తోంది. బిహార్‌లో ఏదో ఒక పార్టీకి ఒక సహాయకారిగా ఉండడం జరుగుతోంది. ఒకప్పుడు జార్జ్‌ ఫెర్నాండెజ్‌, నితీశ్‌ కుమార్‌లు కలిసి లాలూప్రసాద్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ కు పోటీగా ప్రారంభించిన సమతా పార్టీతో కలిసి బీజేపీ అధికారాన్ని పంచుకుంది. ఆ తర్వాత నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని జనతాదళ్‌ (యు)తో కలిసి అధికారం పంచుకోవడం జరుగుతోంది. ఇటీవలి ఎన్నికలతో బీజేపీ ఈ జనతాదళ్‌ (యు)ని అధిగమించగలిగింది.

ఆచితూచి నిర్ణయాలు

ఎప్పుడు ఎక్కడ కూటములు ఏర్పడినా బీజేపీదే పైచేయిగా ఉండడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, రెండు దశాబ్దాలుగా బీహార్‌ రాష్ట్రంలో మాత్రం జనతాదళ్‌ (యు) ఆధిపత్యం చెలాయి స్తోంది. సోషలిస్ట్‌ నాయకుడైన నితీశ్‌ కుమార్‌ మొదటి నుంచి మండల్‌ రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ రాష్ట్రంలో బలమైన నాయకుడుగా అవతరించడం జరిగింది. ఆయన మందిర్‌ వ్యవ హారాల కంటే మండల్‌ వ్యవహారాలకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఇక్కడ మందిర్‌ లేదా హిందుత్వ వ్యవహారాలకు మొదటి నుంచి అంతగా ప్రాధాన్యం లేదు. పైగా సోషలిస్ట్‌ రాజకీయాల కారణంగా లాలూ ప్రసాద్‌ హయాంలో రాష్ట్ర ప్రగతి దాదాపు స్తంభించి పోయింది. నితీశ్‌ కుమార్‌ అధికారంలోకి వచ్చే వరకూ ఈ సోషలిస్ట్‌ విధానాలే కొనసాగుతూ వచ్చాయి. ఆయనకు స్వయంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఆయన తప్పనిసరిగా బీజేపీ మీదే ఆధారపడాల్సి వస్తోంది. నిజానికి ఆయన బీజేపీతో చేతులు కలిపిన తర్వాతే రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోవడం ప్రారంభించింది. ప్రాథమిక సదుపాయాల కల్పన, పేదరిక నిర్మూలన పథకాలు, మహిళా సంక్షేమం వంటివి బీజేపీ కారణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు జరగడం ప్రారంభిం చాయి.

విచిత్రమేమిటంటే, బీజేపీ కారణంగానే నితీశ్‌ కుమార్‌ నాలుగు పర్యాయాలు అధికారంలోకి రావడం, ఆయన ప్రభుత్వానికి గౌరవమర్యాదలు పెరగడం జరిగింది. ఆయనలో అనారోగ్య లక్ష ణాలు, వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ, బీజేపీ అట్టడుగు స్థాయి నుంచి సరికొత్త పథకాలతో పని చేయడం వల్ల, భారీగా నిధులు కేటాయించడం వల్ల బీజేపీ పట్ల ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావడం మొదలైంది. ఆయన అనేక పర్యాయాలు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నప్పటికీ, మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి నందుకు నిరసన వ్యక్తం చేసినప్పటికీ, చివరికి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఆయనకు విజయావ కాశాలు మెరుగుపడుతూ వచ్చాయి. ఆయన 2014కు ముందు బీజేపీతో విడిపోయినప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడం ఆయనలో మార్పు తీసుకు వచ్చింది. ఇక 2015 తర్వాత ఆయన కాంగ్రెస్‌ తో సహా కొన్ని పార్టీలను కలుపుకుని మహాగఠ్‌బంధన్‌ను ఏర్పాటు చేశారు కానీ, కాంగ్రెస్‌ తోనూ, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీతోనూ ఇమడలేక మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ ఎంతో వివేకంతో, దూర దృష్టితో వ్యవహరించి ఆయనను మళ్లీ కూటమిలోకి తీసుకుని ఆయన విజయాలకు మార్గం సుగమం చేసింది.

కొత్త వ్యూహాలతో ముందడుగు

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంతో వ్యూహాత్మ కంగా వ్యవహరించింది. హోం మంత్రి అమిత్‌ షా పట్నాలోనే ఎక్కువ సమయం గడిపారు. ధర్మేంద్ర ప్రధాన్‌, వినోద్‌ తావ్డేలతో కలిసి ఎప్పటికప్పుడు వ్యూహాలు, ప్రచారాంశాలను మార్చుకుంటూ, అట్టడుగు స్థాయి నుంచి భాగస్వామ్య పక్షాల కార్య కర్తలను సామాన్య ప్రజలకు దగ్గర చేశారు. లోక్‌ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్‌ పాశ్వాన్‌తో విభేదాలను పరిష్కరించుకున్న నితీశ్‌ కుమార్‌ సాఫీగా, హ్యాపీగా ఓట్ల బదిలీ జరగడానికి అవకాశం కల్పించారు.

 ఈ ఎన్నికల్లో నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడం ఒక విశేషం కాగా, బీజేపీ తన బలాన్ని పెంచుకోవడం మరొక ప్రధానాంశం. వ్యక్తిగతంగా కూడా భారీ విజయాన్ని చేజిక్కించుకున్న బీజేపీ పాలక పక్షమైన జనతాదళ్‌ (యు)కు ఒక భాగస్వామ్య పక్షంగా మిగిలిపోతుందా లేక అధికారానికి వస్తుందా అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం దొరకకపోవచ్చు. కానీ, అందుకు మార్గం మాత్రం సుగమం అయింది. కేంద్రంలో చేపట్టే పథకాలతో పాటు, కేంద్రంలో జరిగే పరిణామాలు, చోటు చేసుకునే విధానాలు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేసే అభివృద్ది వగైరాల మీద అంతా ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో బీజేపీ నాయకత్వం తొందరపాటుతో కాక, దూరదృష్టితో వ్యవహరించే అవకాశం ఉంది.

ఎన్నికల ఫలితాలు ఇంత స్పష్టంగా ఉన్నా కాంగ్రెస్‌, ఆర్‌జేడీ వాటి పూర్వపు ధోరణి నుంచి బయటపడడం లేదు. బిహార్‌లో ఓటమికి కాంగ్రెస్‌ ఓటర్లను బాధ్యులను చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన ప్రకటన చేయడం ఎంత శోచనీయం! ఎన్నికల ఓటమిని లాలూ కుటుంబం భరించలేని తీరు మరీ హాస్యాస్పదంగా జుగుప్సాకరంగా ఉంది. కుటుంబం లోని ఆడపడుచుల మీద వీరంగం వేసినట్టు వార్తలు వెలువడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. మహిళా రిజర్వేషన్‌ బిల్లును చిరకాలం ఆపిన ఘనత ఉన్న నాయకుడి కుటుంబంలో మహిళలకు ఇంతకు మించి గౌరవం ఎలా లభిస్తుంది. బీజేపీ ఆరోపించినట్టు అచ్చంగా ఆ బిహార్‌ ప్రముఖ రాజకీయ కుటుంబంలో ఆటవిక న్యాయమే అధికంగా కనిపిస్తున్నది.

  • జి.రాజశుక, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE