అన్ని రంగాలు సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని సరికొత్త రూపును సంతరించుకుంటున్న విధంగానే, ఉగ్రవాదంలో కూడా కొత్త కోణం ఆవిష్కృతమవడం తాజా పరిణామం. 1990 తర్వాత టెక్నాలజీలో వేగంగా చోటుచేసుకున్న మార్పులు, ప్రపంచీకరణ, విద్యావంతుల్లో మారుతున్న ధోరణుల వల్ల ఈ తరహా ఉగ్రవాదం విస్తరిస్తోంది. ఫలితంగా సైబర్‌ ఉగ్రవాదం, ఆర్థికపరమైన మద్దతు, బయో టెర్రరిజం వంటి రూపాలను సంతరించుకుంటుండటం ప్రభుత్వాలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. ఇప్పటివరకు ఉపాధి అవకాశాలు దొరకని, పెద్దగా చదువు అబ్బని యువతను మతఛాందస వాదం ముసుగులోకి లాగి వారిచేత విధ్వంసాలు సృష్టించడం మనం చూసాం. ఇప్పుడు సమాజంలో గౌరవ వృత్తులలో కొనసాగుతున్న విద్యావంతులు కూడా ఈ ఊబిలో కూరుకుపోవడం దారుణం మాత్రమే కాదు, సమాజానికి అత్యంత ప్రమాదకరం కూడా. దీన్నే మనం ‘వైట్‌ కాలర్‌ ఉగ్రవాదం’ అంటున్నాం.

నిజానికి ఏ మతం కూడా మానవ హననాన్ని, జాతుల విధ్వంసాన్ని, హింసాకాండను ప్రోత్స హించదు. మతానికి తప్పుడు వ్యాఖ్యలు చెబుతూ, తప్పుదోవ పట్టించే ఛాందసులు, దుర్మార్గుల కారణంగా మంచివారు కూడా విధ్వంసాలకు పాల్పడుతూ తమకు, తమ కుటుంబాలకు, చుట్టుపక్కల సమాజానికి పెద్ద ఎత్తున చెరుపు చేస్తున్నారు. అత్యంత గౌరవప్రదమైన వైద్యవృత్తిలోని నిపుణులను, విద్యార్థులను, కొందరు మతోన్మాదులు ఉగ్రవాదంలోకి దింపి ‘‘వైట్‌ కాలర్‌ ఉగ్రనెట్‌వర్క్‌’’ను నెలకొల్పగా వీరిలో ఒక డాక్టర్‌ ఆవేశం తట్టుకోలేక భద్రతా బలగాలను హెచ్చరిస్తూ వేసిన పోస్టర్లు మొత్తం ఉగ్ర నెట్‌వర్క్‌ గుట్టుమట్లను బయటపెట్టడానికి దోహదం చేయడం తాజా పరిణామం.

ఒక తెలివైన ఐపీఎస్‌ అధికారి చురుగ్గా స్పందించడంతో దేశవ్యాప్తంగా ఈ వైట్‌ కాలర్‌ ఉగ్రనెట్‌వర్క్‌ ఏవిధమైన విధ్వంస కాండకు పాల్పడా లనుకున్నదీ వెల్లడి కావడంతో దేశం యావత్తూ ఔరా అని ముక్కుమీద వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఒకవేళ ఆ డాక్టర్‌ పోస్టర్లను అంటించి ఉండకపోతే లేశమాత్రం అనుమానానికి కూడా ఆస్కారంలేని ఈ వైట్‌కాలర్‌ ఉగ్ర నెట్‌వర్క్‌ బయటపడి ఉండేది కాదేమో?

గుట్టుమట్లను విప్పిన పోస్టర్లు

 కుల్గాంలోని వాన్‌పురాకు చెందిన డాక్టర్‌ ఆదిల్‌ అహమ్మద్‌ అక్టోబర్‌ నెలలో భారత భద్రతా బలగా లను బెదిరిస్తూ శ్రీనగర్‌, బాన్‌పొరా, నౌగామ్‌ సహా అనేక చోట్ల పోస్టర్లు వేయించడం కొనసాగించాడు. నిజానికి 2019 వరకు కశ్మీర్‌ ఉగ్రసంస్థలు సైనిక అధికార్లను బెదిరిస్తూ పోస్టర్లు వేసేవారు. సైన్యం అప్రమత్తత కారణంగా ఇది బాగా తగ్గిపోయింది. అక్టోబర్‌19న శ్రీనగర్‌లో రహస్యంగా తరలిస్తున్న ఈ జైషే మహమ్మద్‌ పోస్టర్లను ఐపీఎస్‌ ఆఫీసర్‌ సందీప్‌ గుర్తించారు. తక్షణమే సీసీటీవీ ఫూటేజీ తెప్పించి ముగ్గురు యువకులు పోస్టర్లను తరలిస్తున్న దృశ్యాలను గుర్తించారు. వారిని అరెస్ట్‌ చేసి విచారించగా షోపియాన్‌కు చెందిన మత గురువు ఇమామ్‌ ఇర్ఫాన్‌ అహమ్మద్‌ ఆధ్వర్యంలో జైషే కుట్ర జరుగుతున్నట్టు వెల్లడైంది. విచారణలో జమ్ము`కశ్మీర్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో ఉగ్రదాడులకు పథకం వేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫరీదా బాద్‌లోని అల్‌ ఫలాప్‌ా యూనివర్సిటీలో డాక్టర్లుగా పనిచేస్తున్న ముజంమీల్‌ షకీల్‌, ఆదిల్‌ అహమ్మద్‌ సహా ఎనిమిదిమందిని అరెస్ట్‌ చేశారు. వీరికి జైషే`మహ్మద్‌, ఘజ్‌వాత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉందని తేలింది. అరెస్టయిన ఎనిమిది మందిలో ఏడుగురు కశ్మీరీలే కావడం గమనార్హం. అరెస్టయిన వారిలో అరీఫ్‌ నిజార్‌దార్‌ అలియాస్‌ సాహిల్‌, యాసిల్‌ ఉల్‌ అష్రఫ్‌, మక్సూద్‌ అహ్మద్‌దార్‌ అలియాస్‌ షాహిద్‌ (నౌగమ్‌), మౌల్వీ ఇర్ఫాన్‌ అహ్మద్‌ (షోపియాన్‌), జమీర్‌ అహ్మద్‌ అహంగీర్‌ అలియాస్‌ ముత్లాషా(వకు రా), డాక్టర్‌ ముజామిల్‌ అహ్మద్‌ ఘనీ అలియాస్‌ ముసేబ్‌ (పుల్వామా), డాక్టర్‌ ఆదిల్‌ (కుల్గాం)లతో పాటు లక్నోకు చెందిన వైద్యురాలు షాహీన్‌ కూడా ఉంది. జమ్ముకశ్మీర్‌, హరియాణాలోని ఫరీదాబాద్‌, ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో జరిపిన విస్తృత దాడుల్లో పోలీసులు వీరిని అరెస్ట్‌ చేయడంతో ఉగ్రమాడ్యూల్‌ వ్యవహారం మొత్తం బయటపడిరది. వీరిచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌, హరియాణా, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాల్లో పోలీసులు నిర్వహించిన ముమ్మర తనిఖీల్లో ఏకంగా 2913 కిలోల అమ్మోనియం నైట్రేట్‌, పొటాసియం నైట్రేట్‌, సల్ఫర్‌ అలాగే రెండు ఏకే`47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో ఇంతపెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను పై మూడు రాష్ట్రాల పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. అనంత్‌నాగ్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆదిల్‌కు చెందిన లాకర్‌లో ఏకే`47 రైఫిల్‌ లభించింది. ఇతడిని విచారించి నప్పుడు ముజామిల్‌ ఘనీ షకీల్‌ అనే మరో వైద్యుడు సైతం ఈ ఉగ్రకుట్రలో భాగస్వామి అని వెల్లడైంది. అతడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారించి సేకరిం చిన సమాచారంతో ఫరీదాబాద్‌లో గత మూడేళ్లుగా అద్దె కడుతున్న ఒక లాడ్జ్‌లో తనిఖీలు చేసిన పోలీసు లకు 8 పెద్ద, నాలుగు చిన్న సూట్‌కేసులు లభించాయి. వీటిల్లో ఏకంగా 2563 కిలోల ఐఈడీ పేలుడు పదార్థాలుండటంతో అవాక్కవడం పోలీసుల వంతైంది. ఈ షకీల్‌ స్వస్థలం పుల్వామాలోని కోలీ. ప్రస్తుతం ఇతను హరియాణాలోని అల్‌`ఫలాల్‌ మెడికల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో సీనియర్‌ డాక్టరుగా పనిచేస్తున్నాడు. ఢల్లీి`జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో మతకల్లోలాలు సృష్టించాలని పాకిస్తాన్‌ హ్యాండర్ల నుంచి తమకు ఆదేశాలందాయని విచా రణలో షకీర్‌, ఆదిల్‌లు వెల్లడిరచినట్టు తెలుస్తోంది. ఢల్లీి`ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో వైద్యులను ఎవ్వరూ అనుమానించరు కనుక, తమను ఈ ఉగ్ర కలాపాలకు ఎంచుకున్నారని కూడా వారు వెల్లడిరచారు. విచిత్రమేమంటే వీరు హ్యాండర్ల నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పట్టుబడటం ఒకరకంగా మన అదృష్టం. లేకపోతే దేశం ఎంతటి పెను విధ్వంసాన్ని చవి చూడాల్సి వచ్చేదో! తలచు కుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఉగ్ర మాడ్యూల్‌కు పథక రచన పాకిస్తాన్‌లో జరిగితే, ఆదేశాలు అక్కడి హ్యాండ్లర్లనుంచి అందుతాయి. 2018`21 మధ్య కాలంలో కశ్మీర్‌లో భద్రతా బలగాల కాల్పుల్లో గాయపడిన ఉగ్రవాదులకు చికిత్స చేసినట్టు కూడా వీరు విచారణలో అంగీకరించడం గమనార్హం.

విధ్వంసాన్ని ఆపిన తెలుగు ఐపీఎస్‌ అధికారి

ఈ భారీ హింసాకాండకు పథకం వేసిన జైషే మహమ్మద్‌ ఉగ్ర కుట్రను చిన్న పోస్టర్‌తో ఛేదించిన ఘనత కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్‌ జి.వి. సందీప్‌ చక్రవర్తికి దక్కుతుంది. ఈ పోస్టర్లను గుర్తించిన ఆయన సంబంధిత అధికార్లను అప్రమత్తం చేసి దేశాన్ని పెను విధ్వంసం నుంచి కాపాడారు. ఈయన మన తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. ఈయన ఇప్పటికే ఆరుసార్లు రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకం అందుకున్నారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్‌ మెడల్‌ అందుకున్నారు. ఇది ఆయనకు మరో అవార్డు కావడం విశేషం. ఈయన 2014లో సివిల్స్‌లో ర్యాంకు సాధించి ఐ.పి.ఎస్‌. అయ్యారు. ప్రస్తుతం శ్రీనగర్‌లో సీనియర్‌ ఎస్‌.పి. (ఎస్‌ఎస్‌పీ)గా సేవలందిస్తున్నారు.

వరుస బాంబుపేలుళ్లకు కుట్ర

బాబ్రీ మసీదును కూల్చేసిన తేదీన అంటే డిసెంబర్‌ 6న డిల్లీలో వరుస బాంబుపేలుళ్లకు పాల్పడాలని వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు సమాచారం. ఆరు దశల్లో ఉగ్ర దాడులు నిర్వహించేందుకు 32 కార్లను సిద్ధం చేసినట్టు కూడా ఎన్‌ఐఏ అధికార్లకు కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో వివిధ ప్రాంతాల్లో అనుమానిత కార్లకోసం జల్లెడ పడుతున్నారు. ఫరీదాబాద్‌లో అల్‌`ఫలాప్‌ా విశ్వవిద్యాల యం సమీపంలోని తన అద్దె ఇంట్లో పేలుడు పదార్థాలను దాచిపెట్టేందుకు ఉగ్రవాదులకు సహాయపడిన మతబోధకుడు మౌల్వీ ఇస్తియాఖ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన అల్‌`ఫలాప్‌ా విశ్వవిద్యాలయంలో తరచుగా మతపరమైన కార్యక్రమాలను నిర్వహించేవాడు. అలా ఉమర్‌, ఘనీ సహా పలువురు వైద్యులు, విద్యార్థుల మెదళ్లలోకి ఉగ్రవాద భావజాలాన్ని నింపినట్లు తేలింది. ఈ మౌల్వీ సహాయంతో గతంలోనే ఉగ్రమూకలు 200 ఐఈడీల తయారీలో నిమగ్నం కావడమే కాకుండా ఢల్లీిలోని ఎర్రకోట, ఇండియా గేట్‌, కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌, గౌరీశంకర్‌ ఆలయం, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌ సహా దేశంలోని పలు కీలక ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వేస్టేషన్లు, మాల్స్‌ వద్ద పేలుళ్లు జరపాలని భారీ ప్రణాళిక వేసుకున్నట్టు తేలింది. పుల్వామా దాడుల వ్యూహకర్త ఉమర్‌ ఫారూక్‌ భార్య అపీరా బీబీతో ఇటీవల ఫరీదాబాద్‌లో అరెస్టయిన డాక్టర్‌ షహీన్‌ సయీద్‌కి సంబంధాలున్నట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఇటీవల ఏర్పాటైన జైషే మహమ్మద్‌ మహిళా విభాగం జమాత్‌ ఉల్‌ మెమినాత్‌లో అపీరా బీబీది కీలక పాత్ర అని దర్యాప్తు సంస్థలు అనుమాని స్తున్నాయి. డాక్టర్‌ షహీన్‌ కేవ లం అపీరా బీబీతో మాత్రమే కాదు, జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ చెల్లెలితో కూడా సంప్రదింపులు జరిపినట్టు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఫరీదాబాద్‌ పేలుడు పదార్థాల అక్రమ రవాణా కేసులో డాక్టర్‌ షహీన్‌ను నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అరెస్ట్‌ చేసింది. విచారణలో జైషే మహమ్మద్‌ మహిళా విభాగాన్ని ఇండియాలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినట్లు తేలింది.

డైరీల్లో కీలక సమాచారం

ఢల్లీి కారుపేలుడులో మరణించిన డాక్టర్‌ ఉమర్‌ డైరీని పరిశీలించినప్పుడు అవాక్కవడం పోలీసుల వంతైంది. మొత్తం 8మంది ఆత్మాహుతి బాంబర్లతో దేశంలోని నాలుగు ప్రాంతాల్లో దాడులు జరిపేందుకు కుట్ర పన్నినట్లు తేలింది. అల్‌`ఫలాప్‌ా యూనివర్సిటీ 13వ నెంబరు గదిలో ఈ పేలుళ్లకు పథక రచన చేయగా, ఉమర్‌కు చెందిన 4వ నెంబరు గదిలో మూడు డైరీలు లభించాయి. ఆవిధంగా అల్‌`ఫలాప్‌ా యూనివర్సిటీ ఉగ్రకుట్రకు కేంద్రంగా మారింది. 13వ నెంబరు గది డాక్టర్‌ ముజమ్మిల్‌ షకీల్‌కు చెందినదిగా గుర్తించారు. పేలుళ్ల కుట్ర అమలుకు రూ.20లక్షలు సేకరించిన ఉమర్‌ గ్యాంగ్‌ గురుగ్రామ్‌, నూప్‌ా నుంచి పేలుళ్లకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ డైరీల్లో 25 పేర్లను పేర్కొనగా వీరిలో ఎక్కువ మంది జమ్ము`కశ్మీర్‌కు చెందిన వారే కావడం గమనార్హం. మిగిలినవారు ఫరీదాబాద్‌ పరిసర ప్రాంతాలకు చెందినవారు. నవంబర్‌ 8నుంచి 12 మధ్యకాలంలో దేశంలో పేలుళ్లకు పాల్పడాలని ప్రణాళిక వేసినట్టు అనుమానిస్తున్నారు. ఇందులో ఎనిమిదిమంది వరకు పాల్గొన్నట్టు అనుమానిస్తు న్నారు. కాగా పుల్వామాలోని డాక్టర్‌ ఉమర్‌ నబీ ఇంటిని శుక్రవారం (నవంబర్‌ 14) ఉదయం అధికార్లు బుల్డోజర్లతో కూల్చివేయడం తాజా పరిణామం.

అల్‌`ఫలాప్‌ా వర్సిటీ సభ్యత్వం రద్దు

అల్‌`ఫలాప్‌ా యూనివర్సిటీలో కొందరు మీడియా సభ్యులు నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో అక్కడి విద్యార్థులు చెప్పిన వివరాలు డా. ఉమర్‌ నబీ ఎంతటి మతఛాందస వాదో స్పష్టంగా తెలియ జేస్తున్నాయి. ఆయన క్లాస్‌కు వచ్చినప్పుడు స్త్రీ, పురుష విద్యార్థులను వేర్వేరుగా కూర్చోబెట్టేవాడట! ముఖ్యంగా తాలిబన్ల శైలి పద్ధతులు అనుసరించడమే కాదు, కచ్చితంగా పాటింపజేసేవాడని అక్కడి విద్యార్థులు చెప్పినట్లు ఒక మీడియా కథనం వెల్లడిరచింది. అంతేకాదు, డా.ఉమర్‌ నబీ, డా.ముంజా మిల్‌ సయీద్‌ గనాయ్‌ ఎవ్వరితో కలిసేవారు కాదని, కొత్తగా చేరినవారికి వీరెవరో కూడా తెలిసేది కాదని అక్కడి సిబ్బంది తెలిపినట్లు ఈ కథనం వివరించింది. ముఖ్యంగా డా.ఉమర్‌నబీ పూర్తి అంతర్ముఖుడిగా ఉంటూ, ఎవ్వరితో కలిసేవాడు కాదని కూడా వివరించింది. ఇప్పుడు ఢల్లీి బాంబు పేలుడు సంఘటన తర్వాత అల్‌ ఫలాప్‌ా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయిందని సమాచారం. ప్రస్తుతం కళాశాల యజమాని డా.షహీన్‌ సయీద్‌ కూడా పోలీసుల అదుపులో ఉండటం గమనార్హం. ఈ మొత్తం ఉగ్రకుట్రల నేపథ్యంలో అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఏఐయూ), అల్‌ ఫలాప్‌ాకు ఇచ్చిన సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. యూనివర్సి టీకి చెందిన ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరో దారుణ పథకం

ఉగ్రవాదులు భారీ సంఖ్యలో మానవ హననానికి మరో పథకం కూడా పన్నినట్టు తేలింది. అహమ్మదా బాద్‌ ఏటీఎస్‌ పోలీసులు ఇస్లామిక్‌ స్టేట్‌ ఖురాసన్‌ ప్రావెన్స్‌ (ఐఎస్‌కేపీ) కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేశారు. వీరిలో హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్‌ అహమ్మద్‌ మొయినుద్దీన్‌ సయ్యద్‌, ఉత్తరప్రదేశ్‌ షామ్లీ జిల్లాకు చెందిన ఆజాద్‌ సులేమాన్‌ షేక్‌, లక్ష్మీపూర్‌ ఖేరీ జిల్లాకు చెందిన మహమ్మద్‌ సుహైల్‌ సలీంఖాన్‌లు వున్నారు. వీరిని అధికార్లు ప్రస్తుతం వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన మందు రిసీన్‌ ఎట్లా తయారుచేశారు? దాన్ని ఎక్కడ ఎలా వినియో గించాలి? ఈ మాడ్యూల్‌లో ఇంకా ఎవరైనా వున్నారా? తదితర అంశాలను ఆరా తీస్తున్నారు. రిసీన్‌ను ప్రసాదాల్లో పంచడం ద్వారా ఎక్కువ ప్రాణనష్టం కలిగించేలా ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.

ఈవిధంగా ఉన్నత విద్యావంతులు, సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తుల్లో కొనసాగేవారిని కూడా మతమౌఢ్యంలోకి లాగడంతో రాబోయే కాలంలో ఎవరు ఉగ్రవాదో? ఎవరు కాదో? తెలుసుకోలేని దుస్థితి ఏర్పడవచ్చు. ఇది మానవ సమాజాన్ని మరింత అల్లకల్లోలం చేస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE