ఉన్మాదంతో కొత్త పుంతలు తొక్కుతున్న ఉగ్రవాదులు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొనడానికి వినూత్న పద్దతులను అనుసరిస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించే భారత్‌లో భక్తులు స్వీకరించే ప్రసాదాల్లో సైనైడ్‌ కంటే ప్రమాదకర విషపూరిత ‘రైసిన్‌’ ద్రవాన్ని కలపాలనే భయంకర కుట్రలు పన్నడంతో యావత్‌ దేశం ఉలికిపడిరది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా ఉన్న ఇస్లామిక్‌ స్టేట్‌ ఖురాసన్‌ ప్రావెన్సీ (ఐఎస్‌కేపీ) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగున్న మతోన్మాదులు దేశంలో అరాచకాలు సృష్టించేందుకు పన్నిన వ్యూహాలను గుజరాత్‌ పోలీసులు విఫలం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇలాంటి ఉగ్ర కుట్రలకు హైదరాబాద్‌ వేదిక కావడంతో తెలుగు ప్రజలు భయంకపితులయ్యారు. ఉగ్రవాదులు భయంకర ఆలోచనలను పోలీసులు నవంబర్‌ 7వ తేదీన బహిర్గతం చేయడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ కేంద్రంగా ‘రైసిన్‌’ ఉగ్ర కుట్రలకు ఐసిస్‌ బీజం వేసింది. గుజరాత్‌ పోలీసులు అహ్మదాబాద్‌లో ముగ్గురు ఐసిస్‌ సానుభూతిపరులకు అరెస్టు చేస్తే రైసిన్‌ కుట్రలు బయటపడ్డాయి. హైదరాబాద్‌ నగరానికి చెందిన డాక్టర్‌ అహ్మద్‌ మోహియుద్దీన్‌ సయ్యద్‌, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అజాద్‌ సులేమాన్‌ షేక్‌, మహ్మద్‌ సుహెల్‌ సలీం ఖాన్‌లను గుజరాత్‌ పోలీసులు అహ్మదాబాద్‌లో అరెస్టు చేయడంతో ప్రమాదకరమైన రైసిన్‌ కుట్రలు వెలుగు చూశాయి. పట్టుబడ్డ ఈ ముగ్గురిలో మోహియుద్దీన్‌ రైసిన్‌ తయారీ నిపుణుడైతే, మిగతా ఇద్దరు అక్రమ ఆయుధాల సరఫరా నిందుతులు. లక్నో, ఢల్లీి, అహ్మదాబాద్‌ నగరాల్లో దాడుల కోసం రెక్కీ నిర్వహించిన ఈ ముగ్గురు ఉగ్రవాదులు బాంబులు, ఆయుధాలతో కంటే ‘రైసిన్‌’ విష రసాయనంతోనే తీవ్ర ప్రాణ నష్టం చేయవచ్చనే దురాలోచనలతో పలు రద్దీ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఈ ఉగ్ర కుట్రల్లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మోహియుద్దీన్‌ తయారుచేసిన ‘రైసిన్‌’ అత్యంత ప్రమాదకరమైన పదార్థమని పోలీసుల విచారణలో తేలడంతో కొత్తరకమైన ఈ ఉగ్రదాడి కుట్రలపై ప్రత్యేక దృష్టి పెట్టి కేసును పరిశోధిస్తున్నారు.

ఓ ఆముదం గింజలను ప్రాసెస్‌ చేసిన అనంతరం మిగిలే వ్యర్థాల నుండి సైనైడ్‌ కంటే ప్రమాదకరమైన ‘రైసిస్‌’ అనే విష రసాయనాన్ని తయారు చేసి దాని ద్వారా విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాదులు కుట్రలు పన్నారు. దీనిని ప్రయోగిస్తే శరీరంలోని కణాలు చనిపోతాయి. ఒక మిల్లీ గ్రామ్‌ ‘రైసిన్‌’ ఒక వ్యక్తిని చంపగలదు. ఈ పదార్థానికి ఎలాంటి వాసన, రుచి ఉండదు. బాంబులతో పని లేకుండా సులభంగా విష పదార్థంతో భారీ స్థాయిలో ప్రజల ప్రాణాలను తీయడానికి ఈ పద్దతిని ఉగ్రవాదులు ఎంచుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఈ రసాయనాన్ని దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆహార మార్కెట్లలోని పండ్లు, కూరగాయాల్లో, దేవాలయాల వద్ద ప్రసాదాలు తయారు చేసే నీటిలో, మంచినీటి సరఫరా వ్యవస్థలో కలపాలనే దురాలోచనలతో ఉగ్రవాదులు పలు ప్రాతాల్లో రెక్కీ కూడా నిర్వహించి ఉగ్రదాడులకు సిద్ధమయ్యారు. ఆసియాలోనే అతి పెద్ద పండ్ల కూరగాయల మార్కెటైన ఢల్లీిలోని అజాద్‌పూర్‌ మండి, అహ్మదాబాద్‌లోని సరోడా పండ్ల మార్కెట్‌, లక్నోలోని సరుకుల మండీల్లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారు. మరోవైపు దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యంగా లక్నోలోని సంఘ కార్యాలయంలో కూడా దాడులకు ప్రణాళికలు రూపొందించారు. ఐఎస్‌కేపీ సూచనలు మేరకు ‘రైసిన్‌’ విషాన్ని సిద్దం చేసిన స్థానిక ఉగ్రవాదులు దాన్ని ఎక్కడ ఎప్పుడు ప్రయోగించాలో అఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఐసిస్‌ ఉగ్రవాది అబూ ఖదీజా ఆదేశాల కోసం ఎదురు చూస్తుండగా గుజరాత్‌ పోలీసులకు పట్టుబడడంతో దేశం పెద్ద ప్రమాదం నుండి బయటపడిరది.

ఈ విష పదార్థాన్ని రూపొందించిన మోహియు ద్దీన్‌కు యూనానీ వైద్యంలో పట్టుండడంతో అతడికి ప్రకృతిలో లభించే పదార్థాలతో చికిత్స చేయడంపై అవగాహన ఉంది. ఇన్‌స్ట్రాగాం ద్వారా పరిచయమైన అబూ ఖదీజా ప్రేరణతో మోహియుద్దీన్‌ ఐఎస్‌కేపీలో చేరి తన యూనాని అనుభవాన్ని దుర్వినియోగం చేశాడు. ఖదీజా నాన్‌ టెరిటోరియల్‌ టెర్రరిజం (ఎన్‌టీటీ) పేరుతో ఒక టీం ఏర్పాటు చేసి ఉగ్ర కుట్రలకు తెరలేపడంతో ఇందులో మోహియుద్దీన్‌ కూడా పాలుపంచుకున్నాడు. ఖదీజా ప్రేరణతో మోహియుద్దీన్‌ ఎన్‌టీటీ ద్వారా ఐఎస్‌కేపీ నెట్‌వర్క్‌ విస్తరించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌తో పాటు పలు నగరాలు, రాష్ట్రాల్లోని విద్యావంతులతో సంప్రదిం పులు జరిపి ఉగ్రకుట్రలకు తెరలేపారు. మోహియుద్దీన్‌ కొత్తగా ఉగ్రవాదులను తయారుచేయడానికి నియామకాలు చేపట్టేవాడు, నిధులు సేకరించేవాడు, ఈ నిందితులందరూ ‘ఎన్‌క్రిప్టెడ్‌’ యాప్స్‌ వినియో గించి రహస్య కోడ్‌లో చర్చించేవారు. టెలిగ్రాంలో పాకిస్తాన్‌ ఉగ్రవాదులతో మోహియుద్దీన్‌ తరచూ సంభాషించేవాడు. ప్రమాదకరమైన ‘రైసిన్‌’ తయారీ కోసం మోహియుద్దీన్‌ యునానీ పరిజ్జానానికి ఖదీజా పంపిన కొన్ని పత్రాల అంశాల వివరాలు కూడా తోడైనాయి. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో నివ సిస్తున్న మోహియుద్దీన్‌ ఆన్‌లైన్‌ ద్వారా రసాయనాలు తెప్పించుకొని ఇంట్లోనే ప్రమాదకరమైన ప్రయోగాలు చేశాడు. అతని ప్రవర్తనపై కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ప్రశ్నిస్తే తాను ఖరీదైన రసాయనా లను తయారుచేస్తున్నానని నమ్మబలికేవాడు. వ్యాపార నిమిత్తం పేరుతో కోల్‌కతా, అహ్మదాబాద్‌, ముంబాయి ప్రాంతాలకు తరచూ వెళ్తు ఉగ్రవాద కార్యకలాపాలపై దృష్టి సారించేవాడు. ఈ నేపథ్యం లోనే అహ్మదాబాద్‌లో గుజరాత్‌ పోలీసులకు తన అనుచరులతో సహా చిక్కాడు.

తెలంగాణకు చెందిన మోహియుద్దీన్‌ ఖమ్మం, వరంగల్‌లో విద్యాభ్యాసం చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. 2007లో చైనాకి వెళ్లి ఎంబీబీఎస్‌ చేసిన ఈయన నగరంలో పలు ప్రయివేట్‌ ఆసుపత్రుల్లో డాక్డర్‌గా పనిచేశాడు. వైద్యానికి సంబంధించి ఆన్‌లైన్‌ కన్సల్టెన్సీ నిర్వహించాడు. ఈ క్రమంలోనే ఆయనకు ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిరది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ పాతబస్తీలోని కార్వాన్‌ సమీపంలో ఓ హోటల్‌ నిర్వహించిన ఈయన తర్వాత జ్యూస్‌ దుకాణం పెట్టాడు. రాజేంద్రనగర్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు మోహియుద్దీన్‌ పట్టుపడడంతో ఆయన నిర్వహించిన వ్యాపారాలు, కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు ఆయనకు ఎవరెవరితో సంబంధా లున్నాయి. అందులో ఉగ్ర కుట్రలూ ఉన్నాయా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

ఉగ్రవాద కోణంతో ‘రైసిన్‌’ వంటి భయంకర విష పదార్థాన్ని నగరం నడిబొడ్డున తయారు చేస్తున్నా కనిపెట్టడంలో స్థానిక పోలీసుల నిఘా వైఫల్యం చెందడం ఆందోళనకరమైన విషయం. ఇప్పటికైనా హైదరాబాద్‌ నగర పోలీసులు ఉగ్ర కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రసాదాల్లో, నీటిలో ‘రైసిన్‌’ విషం కలపాలనే ప్రయత్నాలు చూస్తే నా చిన్ననాటి ఘటన గుర్తుకొస్తోంది. 1991లో అయోధ్య ఉద్యమం సంద ర్భంగా హైదరాబాద్‌ పాతబస్తీలో కర్ఫ్యూ విధించిన సమయంలో మంచినీటి సరఫరా ట్యాంకుల్లో విషం కలిపారనే ప్రచారంతో ఒక రోజంతా మేము నీళ్లు తాగకుండా బిక్కుబిక్కుమంటూ గడిపిన భయంకరమైన ఘటన కళ్లముందు మెదిలింది.

ఉగ్రవాదానికి మతం ఉండదని కుహనా మేధావులు, సెక్యులరిస్టులు నిత్యం వల్లె వేస్తుంటారు. వీరి వాదన తప్పని మరోసారి రుజువైంది. దేశంలో సనాతన ధర్మాన్ని అనుసరించే మెజార్టీలను లక్ష్యంగా చేసుకొని భగవంతుడి ప్రసాదంలో ప్రమాదకరమైన విషం కలిపి భారీస్థాయిలో ప్రాణాలను బలిగొనాలని ఉగ్రవాదులు ప్రయత్నించడంలో మతం కోణం లేదని మేధావులు చెప్పగలరా? లౌకికవాదం పేరుతో బుజ్జగింపులకు పాల్పడుతూ ఓట్ల రాజకీయాలకు ప్రాధాన్యతిచ్చినంత కాలం ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టలేమని ‘రైసిన్‌’ విష వంటి ప్రయోగాలు రుజువు చేస్తున్నాయి.

– శ్రీపాద

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE