పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు కొద్ది నెలల దూరంలో ఉన్నాయి. బిహార్ శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి సంబరాలు జరుపుకుంటున్న బీజేపీ పశ్చిమ బెంగాల్ లో కూడా విజయం సాధించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఆమె నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడం ఖాయమని ఆ పార్టీలో బాగా నమ్మకం కుదిరినట్టు కనిపిస్తోంది. బిహార్ నుంచి గంగానది పశ్చిమ బెంగాల్ లోకి పారబోతోందని, మమతా బెనర్జీ పార్టీని తుడిచిపెట్టేస్తుందని బిహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఢల్లీిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే, మమతా బెనర్జీని, ఆమె పార్టీని గద్దె దించడం ఆషామాషీ వ్యవహారం కాదు. మాటలు చెప్పినంత తేలిక కాదు. బీజేపీకి ఎంతగా మందీ మార్బలం ఉన్నా బిహార్‌లో విజయం సాధించినంతగా పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించడం తేలికేమీ కాదు. ఆ విషయం మోదీ, అమిత్ షా ద్వయానికి తెలియకపోలేదు.
ప్రజలను భావోద్వేగపరంగా రెచ్చగొట్టడంలో మమతా బెనర్జీ ఘటికురాలు. రాష్ట్రంలో స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్)ను, అంటే ఓటర్ల జాబితా పునఃపరిశీలనను మమతా బెనర్జీ భావోద్వేగ పరంగానే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని ఆమె రాష్ట్రంలోని సుమారు 30 శాతం ముస్లింలను ఒకే తాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం కోటికి పైగా బాంగ్లాదేశ్, పాకిస్థాన్, మయన్మార్ శరణార్థులకు, రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించిన మమతా బెనర్జీ ఈసారి ఎన్నికల్లో కూడా వారి సహాయ, సహకారాలతోనే ఎన్నికల్లో గెలవగలననే ధీమాతో ఉన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరీ నినాదం బిహార్‌లో విఫలం చెందడంతో దాన్నే మరో రూపంలో పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం చేయడానికి ఆమె ఇప్పటి నుంచే సర్వశక్తులూ కూడగడుతున్నారు.
అడుగడుగునా అగ్నిపరీక్షలే!
భౌగోళికంగా చూస్తే బిహార్ నుంచి బయలుదేరిన గంగానది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు జార్ఖండ్‌లోకి ప్రవేశిస్తుంది. ఎంత శ్రమపడినప్పటికీ జార్ఖండ్‌లో హేమంత్ సోరేన్ నాయ కత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా మీద బీజేపీ విజయం సాధించలేకపోయిందన్న విషయం తెలిసిందే. అంతేకాదు, పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించిన తర్వాత గంగానది పద్మానదిగా మారిపోతుంది. ఆ పద్మానది పశ్చిమ బెంగాల్ నుంచి బాంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం తప్పకుండా ఒక అగ్నిపరీక్ష కానుంది. గత 2021 శాసనసభ ఎన్నికల్లోనూ, 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీకి చేదు అనుభవాలు కలగడం విస్మరించలేని విషయం.
రాష్ట్ర జనాభాలో 30 శాతం వరకూ ముస్లింలు ఉన్నారు. మొత్తం 294 శాసనసభ స్థానాల్లో వందకు పైగా స్థానాలు పూర్తిగా ముస్లింల ఇష్టానిష్టాలపై ఆధారపడి ఉన్నాయి. సహజంగానే రాష్ట్రంలోని ముస్లింలందరూ తృణమూల్ కాంగ్రెస్ వైపే ఉన్నారని ఇటీవలి గణాంకాల్లో కూడా వెల్లడైంది. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని, బీజేపీ అధికారంలోకి వచ్చే పక్షంలో బుల్‌డోజర్ రాజ్యం అవతరించడం ఖాయమని మమతా బెనర్జీ ఈ మధ్య కాలంలో ముస్లింల సమావేశాల్లో బాగా ఊదరగొడుతున్నారు. సి.ఏ.ఏ, ఎన్.ఆర్.సి, వక్ఫ్ బిల్లు, యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి అంశాలను ఆమె పదే పదే ప్రస్తావిస్తున్నారు.
వీటికి తోడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి కూడా ఆమె ముస్లింలలో భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా ముస్లిం శరణార్థులు, రోహింగ్యాల పేర్లను తొలగించడానికి ఆమె ససేమిరా అంగీకరించడం లేదు. ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది బీజేపీ వ్యతిరేక ఓటర్లను తొలగిస్తున్నా రనే ప్రచారాన్ని ఆమె ఉధృతంగా కొనసాగిస్తున్నారు.
రోహింగ్యాలే బలం
బాంగ్లాదేశ్, పాకిస్థాన్, మయన్మార్‌ల నుంచి అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించడం, వారికి ఆధార్ కార్డులు తయారుచేసి ఇవ్వడం, వారికి ఓటర్ కార్డులు మంజూరు చేయడం, వారికి ప్రభుత్వ పథకాలను అమలు చేయడం వంటివన్నీ ఓట్ చోరీ కిందకే వస్తాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య విమర్శలు సాగిస్తున్నారు. ఇటువంటి పేర్లను తొలగించడం దేశ భద్రతరీత్యా అనివార్యమని కూడా ఆయన చెబుతున్నారు. ఇక మమతా బెనర్జీ తనను తాను దుర్గామాతగా కూడా పరిగణించుకుంటున్నారు. తాను ఢల్లీి రాక్షసుల నుంచి పశ్చిమ బెంగాల్ ప్రజానీకాన్ని కాపాడుతున్నట్టు సభలు, సమావేశాల్లో ప్రకటించడం జరుగుతోంది. రాష్ట్రంలోని ముఖ్యమైన ఆలయాలను సందర్శిస్తూ, హిందువుల మనసులను గెలుచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పాలనకు నిలయంగా ఉన్న భద్రలోక్ కాంప్లెక్స్‌లోని హిందూ మేధావులు, లౌకికవాదులు, చరిత్రకారులు, పరిశోధకులు, వామపక్షవాదులు రాష్ట్రంలోని అధ్వాన పరిస్థితులను, ప్రభుత్వ వైఫల్యాలను ఏనాడూ విమర్శించిన పాపాన పోలేదు కానీ, బీజేపీ బూచిని చూపించి భయపెట్టే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. విచిత్రమేమిటంటే, భద్రలోక్ మేధావుల్లో అత్యధిక శాతం మంది కోల్‌కతా నగర దారుణ పరిస్థితులను భరించలేక, సహించలేక ఢల్లీికి ఏనాడో తరలిపోవడం జరిగింది.
ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ చేయగలిగిందే మిటి? బడుగు వర్గాలు, ఎస్సీలు, గిరిజనులు తదితర వర్గాలను కూడగట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది. కానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఈ వర్గాల మీద పట్టుబిగించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ముస్లింలకు ప్రాధాన్యం, ప్రాభవం ఉన్న వంద స్థానాలు పోగా మిగిలిన 194 స్థానాల్లో కనీసం 150 స్థానాలను బీజేపీ చేజిక్కించుకుంటే తప్ప అధికారం చేపట్టే అవకాశం లేదు. కానీ, రాష్ట్రంలోని మిగిలిన అన్ని స్థానాల్లోనూ పోలింగ్ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ దాదాలే రాజ్యమేలుతుంటారు.
విచిత్రమేమిటంటే, సుమారు 14 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ మమతా బెనర్జీ ఇంతవరకూ ముఖ్యమంత్రి పదవిలో స్థిరపడలేదు. ఆమె ఒక ప్రతిపక్ష నాయకురాలి మాదిరిగానే వ్యవహరిస్తుంటారు. పాలనా వ్యవ హారాల కంటే ఆమె కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏదో ఒక కారణం మీద విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు.
దుష్ప్రచారాలకే ప్రాధాన్యం
దేశంలో ఉపాధి హామీ పథకానికి, ప్రధాని ఆవాస్ యోజనకు, ఇతర కేంద్ర పథకాలకు అత్యధికంగా నిధులు పొందుతున్న రాష్ట్రం పశ్చిమ బెంగాలే అయినప్పటికీ, కేంద్రం తమ పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తోందనే వాదనతోనే ఆమె పొద్దుపుచ్చుతుంటారు. ఓటర్లను శాశ్వతంగా అయోమయంలో, గందరగోళ స్థితిలో ఉంచడమే ఆమె ఉద్దేశం. రాష్ట్రాన్ని పాలిస్తున్నది ఢల్లీియా, దీదీయా అన్న సందేహం కూడా ఓటర్లకు కలుగు తుంటుంది. అయితే, ప్రజలను అయోమయంలో పడేయడం, భావోద్వేగపరంగా రెచ్చగొట్టడం ఆమె వ్యూహంలో ప్రధాన భాగం. ఆమె ఉద్దేశంలో ఆమె ఒక పెద్ద పులి. ఒక వీరాంగన. ఢల్లీి నుంచి కోల్‌కతా వచ్చే హిందుత్వ రాక్షసుల నుంచి తాను తమ రాష్ట్ర ప్రజలను కాపాడుతున్నట్టు ఆమె చెప్పుకుంటుంటారు. రాష్ట్రంలోకి ‘బయటివారు ప్రవేశించి హిందీ-హిందుత్వ-హిందుస్థాన్‌లను బలవంతంగా రుద్దుతున్నారనే ఆమె వాదనను భద్రలోక్ మేధావులు కూడా అనేక విధాలుగా సమర్థిస్తుంటారు.
విశేషమేమిటంటే, బీజేపీని హిందుత్వ పార్టీగా అభివర్ణించి ముస్లింలనే కాక, హిందువులను కూడా అనేక రకాలుగా భయపెట్టే మమతా బెనర్జీ ఎన్నికలకు ముందు తప్పకుండా హిందుత్వవాదిగా మారి పోతారు. ప్రతి రోజూ ఏదో ఒక ఆలయాన్ని సందర్శిస్తారు. తాను రాష్ట్ర ప్రజల యోగ క్షేమాల కోసం ప్రార్థనలు చేశానని చెబుతుంటారు. అదే సమయంలో ఆమె నమాజ్ చేయడం కూడా జరుగుతుంటుంది. ఇక్కడ కమ్యూనిస్టులు 34 ఏళ్లకు పైగా రాజ్యమేలారు. ఈ రాష్ట్రం విప్లవకారులకు ప్రధాన కేంద్రంగా ఉండేది. అయినప్పటికీ, మత ప్రభావం, కుల ప్రభావం బాగా ఎక్కువగా ఉండేది ఈ రాష్ట్రంలోనే. నిజానికి, తృణమూల్ కాంగ్రెస్ అనేక విధాలుగా కమ్యూనిస్టు భావజాలాన్ని పుణికి పుచ్చుకుంది. దాదా వ్యవస్థ, కండ బలం, భుజ బలం వంటివి మార్క్సిస్టు పార్టీ నుంచి సంక్రమించినవే. జెండా మాత్రమే మారింది. దీదీ దాదాగిరి ఏ స్థాయిలో ఉంటుందంటే, బీజేపీ ఏ గ్రామంలో అడుగుపెట్టినా, ఏ పట్టణంలో అడుగుపెట్టినా తృణమూల్ దాదాలతో తలపడాల్సిందే.
తాను బీజేపీ బాధితురాలినని, మోదీ-అమిత్ షాలు కలిసి తనను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ప్రచారం చేసుకుంటుంటారు. బీజేపీ అధికారంలోకి వస్తే పశ్చిమ బెంగాల్‌లో మాంసాహారాన్ని భుజించడానికి అవకాశం ఉండదని, ముఖ్యంగా చేపలు తినడానికి కూడా అవకాశం ఉండదని కూడా ఆమె ప్రచారం చేయడం ప్రారంభించారు. గంగానది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి ప్రవహించవచ్చు కానీ, ఆ నీటిని ఫరక్కా బ్యారేజ్ దగ్గర కంట్రోల్ చేసేది మాత్రం దీదీనే.
అయితే, తృణమూల్ కాంగ్రెస్ అంటే బిహార్‌లోని రాష్ట్రీయ జనతాదళ్ కాదని బీజేపీ వ్యూహకర్తలకు బాగా తెలుసు. ఇక్కడ తాము విజయం సాధించాలన్న పక్షంలో విభిన్న వ్యూహాన్ని అనుసరించాలన్న విషయం కూడా వారికి తెలుసు. ఓటర్ల జాబితాను సవరించిన తర్వాత మమతా బెనర్జీ బలమెంతో ఆమెకే కాక, తమకు కూడా అర్థమవుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మిగిలిన రాష్ట్రాల్లో మాదిరిగానే ఈ రాష్ట్రంలో కూడా బలం లేదు. శాసనసభ ఎన్నికల్లో తృణమూల్, బీజేపీల మధ్యనే పోటీ ఉండనుంది. ఈసారి మోదీ, అమిత్ షాలు తప్పకుండా చక్రం తిప్పే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఎంతో ధైర్యంగా ఉన్నాయి.
– జి.రాజశుక, సీనియర్ జర్నలిస్ట్