గ్రీకు తత్త్వవేత్తలలో ప్లేటో అంతర జగత్తుకు ప్రాధాన్యమిచ్చాడు. అరిస్టాటిల్ బాహ్య – అంతర జగత్తులు రెండింటినీ నిర్వచించాడు. అరిస్టాటిల్ చేసిన తత్త్వబోధ భారతీయుల వేదాంత శాస్త్రానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. పాశ్చాత్యులు భౌతికవాదానికి పెద్దపీట వేశారు. వస్తుతత్త్వమే విభిన్న రూపాలుగా విస్తరించి ఈ విశ్వసృష్టికి కారణమవుతోందన్న పాశ్చాత్యుల వాదన సర్వత్ర ఆమోదయోగ్యంగా ఉండదు.
మనం ఎప్పుడైనా మంచుపై కొద్దిసేపు చేయి ఉంచి… వెంటనే సలసల మరిగే నీటిలో ముంచితే… వేడిమి బాధించదు. అదే ముందుగా చల్లటి నీటిలో చేయి ముంచి, ఆ తరువాత వేడినీటిలో పెడితే చల్లగా అనిపిస్తుంది. ఈ విధంగా ఆ జలం వేడిమి కలిగినదీ లేనిదీ కూడా అయింది. ఏనుగు కంటికి చిట్టెలుక అల్పప్రాణిగా కనిపిస్తుంది. కానీ చీమ కంటికి అదే ఎలుక భారీ జంతువుగా తోస్తుంది. ఈ విధంగా ఆ మూషికం అల్పప్రాణి, భారీ జంతువు కూడా అయింది. దృష్టిభేదం ఉండే సావకాశం వల్ల ఇక్కడ ఉపయోగించిన యుక్తిని అనేక ఇతర అంశాల విశ్లేషణలో కూడా ఉపయోగించవచ్చు. దాంతో ఏ ఇంద్రియానుభూతమైన వస్తువైనా వైరుధ్య గుణాలతో కూడి ఉంటుందని తెలుసుకోవడం సాధ్యపడుతుంది. ఈ గుణాలు స్థిరంగా ఉండేవి కావు.
ఇంద్రియాలతో గ్రహించిన జ్ఞానం సత్యం కాదు. ప్రామాణికం కాదు. ఒక చిత్రం ఒకరి కంటికి అందంగా తోస్తుంది. మరొకరి కంటికి బాగా అనిపించదు. దేని గుణం నిశ్చితం, స్థిరం అవుతుందో లేదా దేనికి గుణాభావం (గుణం లేకపోవడం) నిశ్చితమై ఉంటుందో అది నిత్యవస్తువు కాదు. గ్రీకు తత్త్వవేత్త ప్లేటో దృష్టిలో, ఇంద్రియ సంబంధమైన జగత్తును తెలుసుకోజాలము. ఒకరకమైన విజ్ఞానం అనుభూతి స్థాయికి వస్తోందంటే… అది ఎవరిది? అని అడగాల్సి వస్తుంది. ఈ ప్రశ్నకు ప్లేటో సమాధానం… రూప జగత్తుకు లేదా ధారణకు చెందినది అని. ప్లేటోకి రేఖాగణితంలో అభిరుచి ఉండేది. అందువల్ల అతనికి కాల్పనిక వస్తు జగతిపై స్వాభావికంగానే మొగ్గుదల ఉండేది.
వస్తువులకు చెందిన ఇంద్రియానుభూతిలో గుణాల నుంచి ఉపలబ్ధమైన కారణ రూపం ఉంటుంది. దానివల్లనే వాటియందు సత్యత్వ ఆభాస ఉంటుంది. రూపానికి చెందినదే సమ్యక్ జ్ఞానమై ఉంటుంది. రూప, శబ్దాల ఆధారంగా మనం శాశ్వతమైనదాన్ని పొందాలని కోరుకుంటున్నాం. సారాంశం ఏమిటంటే అసంపూర్ణమైన బాహ్యజగత్తును ఆధారం చేసుకుని మనం, నిత్యసిద్ధ పూర్ణతను అన్వేషించాలనుకుంటున్నాం.
అరిస్టాటిల్ బాహ్య అంతర జగత్తులు రెండింటినీ వ్యాఖ్యానించాడు. విశాలమైన ఆలోచనల నుంచి తత్త్వజ్ఞానం పుడుతుంది అని చెప్పాడు. అరిస్టాటిల్‌కి జీవశాస్త్రంలో అభిరుచి ఉండేది. అందువల్ల మార్పు చెందని ప్రకృతి స్వభావాలలో వికారము, పరివర్థన మొదలైన సంస్కారాల ప్రాబల్యం చేత కలిగే మార్పులపై అతనికి ఆసక్తి ఉండేది. అతడి దృష్టిలో ఆకారం కలిగిన వస్తువు మాత్రమే అంతకంటే విశిష్టమైన రూపాన్ని తీసుకుంటుంది. విభిన్న వస్తువులలోని వస్తుతత్త్వమే మళ్లీ మళ్లీ వేర్వేరు రూపాలు తీసుకుంటూ ఉంటుంది. శిలలోని వస్తుతత్త్వం శిల్పి రూపొందించిన రూపాన్ని తీసుకున్నట్లే ఇది కూడాను. చెట్లు, పశువులు, మానవులు మొదలైన వాటన్నింటి శరీరాకృతిలో వస్తుతత్త్వమే ఉంది. రూపం ఏర్పడిన తరువాతనే వాటియందు ఇంద్రియానుభూతులు వగైరా భేదాలన్నీ పుడుతున్నాయి. రూపం కంటే భిన్నమైన వస్తువు ఏదీ లేదు. ఎందుకంటే భూమి, నీరు, అగ్ని, వాయువు మొదలైనవన్నీ కూడా ఏదో ఒక మూల వస్తువు నుంచి అవస్థా విశేషాలుగానే ఏర్పడ్డాయి. విశ్వానికి గతిదాయకుడు పరమేశ్వరుడే. అయినప్పటికీ ఆయన స్థాణువే. ఆయనలోని సన్మాత్ర నుంచి ఈ విశ్వం పరిపూర్తి అయింది. ఆయనకు అభిముఖంగానే దీనికి వికాసం కలుగుతోంది.
అరిస్టాటిల్ దృష్టిలో కూడా అన్ని వస్తువులూ బీజరూపంలోనే స్థితమై ఉంటాయి. అచేతనమైన మాయా ప్రకృతియే మిగిలిన అన్నింటిలోని చైతన్యానికి కారణం అవుతుంది అని అతడి అభిప్రాయం. అంతర్నిహితమైన శక్తిని తనలో నింపుకున్న భూతమే (ఆకాశాది పంచభూతాలు) మానవుడు, జంతువులు, చెట్లు మొదలైన రూపాలలో పరిణతి చెందుతుంటుంది. ఈ విధంగానే జీర్ణమైపోయిన – శిథిలమైన కలప నుంచి చెద పురుగులు, కుళ్లిన మలం నుంచి పేడపురుగులు, తడి జుట్టునుంచి పేలు, తడినేలలో తేళ్లు మొదలైనవి ఉత్పన్నమవుతూ ఉంటాయి అని అభిప్రాయపడ్డాడు. కానీ ఇది వాస్తవం కాదు. మార్కస్ వాదాన్ని సమీక్షించే సందర్భంలో ఈ విషయాన్ని గురించిన విస్తృత అధ్యయనం చేద్దాము. అంతవరకు ఇక్కడ పేడపురుగులు, చెద పురుగులు, పేలు మొదలైనవి జుత్తు మొదలైన వాటితో కూడి ఉన్న జడ శరీరం నుంచి ఉత్పత్తి కావు అని మాత్రమే చెప్పవలసి ఉంది. అలాగే వాటియందున్న చేతనత్వం ఆత్మది కాదు అని కూడా చెప్పాలి. అక్కడ కూడా మిగిలిన అన్నిచోట్లా ఉన్నట్లే వేరేచోటి నుంచి పుట్టుకలు సంభవిస్తుంటాయి. అక్కడ వాటి అభివ్యక్తి మాత్రమే కలుగుతోంది. ఎలాగైతే ఇనుము, కలప, బొగ్గు, నీరు మొదలైనవాటిలో స్వయంప్రతిపత్తి కలిగినదైన అగ్నికి అభివ్యక్తి కలుగుతుందో… అలాగే సర్వత్ర ఉనికిలో ఉన్న చైతన్యమే శరీరాల ద్వారా తన అభివ్యక్తిని తెలియచేస్తుంటుంది.
(వచ్చేవారం… తత్త్వశాస్త్రంలో అణువిజ్ఞానం)
హిందీమూలం : కరపాత్రీ స్వామి
అనువక్త : నేతి సూర్యనారాయణశర్మ