కాళేశ్వరం ప్రాజెక్టు గుట్టు ఎట్టకేలకు బట్టబయలయ్యింది. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం హయాంలోని నిధుల ఆటను ప్రస్తుత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బయటపెట్టింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించింది. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు కూడా పాలుపంచుకున్నాయి. వాప్కోస్‌ ‌వంటి కేంద్ర ఏజెన్సీలు డిజైన్‌, ‌నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ వంటి ఆర్థిక సంస్థలు నిధులు సమకూర్చాయి. ఇందులో అంతరాష్ట్ర అంశాలు కూడా ఉండటంతో ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించడం అవసరమని కమిషన్‌ ‌సూచించింది. ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై శాసనసభలో చర్చకు పెట్టి తన నిర్ణయాన్ని ప్రకటించింది.

దేశంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని ప్రచారం చేసుకున్న అప్పటి కె.చంద్రశేఖరరావు ప్రభుత్వం.. శాస్త్రీయతను, వాస్తవ పరిస్థితులను, నిపుణుల సలహాలను పక్కనబెట్టి గూగుల్‌ ‌మ్యాప్‌లు చూసి ఈ ప్రాజెక్టును డిజైన్‌ ‌చేశారని జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌నివేదిక పేర్కొంది. లొకేషన్‌, ‌డిజైన్‌ ‌మాత్రమే కాదు.. అలైన్‌మెంట్‌, ‌నిర్మాణంలో అనుసరించాల్సిన పద్ధతులకు కూడా గూగుల్‌ ‌మ్యాప్‌నే నమ్ముకొన్నట్లు తేలింది. సాక్షాత్తూ ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి ఈ మేరకు అఫిడవిట్‌ ‌దాఖలు చేశారని నివేదిక చెబుతోంది. ఈ కారణంగానే మేడిగడ్డలో రెండు బ్లాకులు కుంగి పోయాయని అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలంటూ రాజకీయంగా ఒత్తిళ్లు, ఆర్థిక అజాగ్రత్తలు, భద్రత, ఇంజనీరింగ్‌ ‌లోపాలు తదితర అంశాలు కలగలిపి ఈ ఘోర వైఫల్యానికి దారి తీసినట్లు జస్టిస్‌ ‌ఘోష్‌ ‌కమిషన్‌ ‌స్పష్టం చేసిందని విపక్షాలు అంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించే విషయంలో నిపుణులు, కమిటీల సిఫారసులను పక్కన పెట్టి గూగుల్‌ ‌మ్యాపుల్లో చూసి నిర్ధారించారని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. గత పాలకులు దీనిని సాంకేతిక ప్రాజెక్టుగా కాకుండా.. రాజకీయ ప్రాజెక్టుగానే చూశారని జస్టిస్‌ ‌ఘోష్‌ ‌కమిషన్‌ ‌నివేదిక ఆధారంగా అనుమానాలు, సందేహాలు బలపడుతున్నాయి. అప్పటి ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, జస్టిస్‌ ‌ఘోష్‌ ‌కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో ఈ వివరాలన్నీ ఉన్నాయంటున్నారు.

బట్టబయలైన బండారం

అప్పటి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎస్‌కే జోషి ఇచ్చిన అఫిడవిట్‌లో.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో నిపుణులతో కలిసి గూగుల్‌ ‌మ్యాప్‌ను విస్తృతంగా పరిశీలించి ప్రణాళికలను సిద్ధం చేశారని పేర్కొన్నారని కమిషన్‌ ‌నివేదిక తెలిపింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, దాని బదులు ప్రాణహిత నదిపై.. వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని 2015 జనవరి 15న ఏర్పాటైన నిపుణుల కమిటీ సూచించిందట. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణంతో ఆర్థిక నష్టాలు తప్పవని తెలిసి కూడా అక్కడే నిర్మాణం చేపట్టాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారని అప్పటి అధికారులు కుండబద్దలు కొట్టారు.

సర్వం కేసీఆర్‌?

‌వాప్కోస్‌ ‌డీపీఆర్‌ అం‌చనా వ్యయం చెప్పక ముందే..బ్యారేజీ నిర్మాణ వ్యయం రూ. 71వేల 436 కోట్లు అవుతుందని నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. వాస్తవానికి వాళ్లు రూపొందించిన ప్రతిపాదన ప్రకారం ప్రాజెక్టు ఖర్చు రూ. 13 వేల 594 కోట్లు మాత్రమే అని తెలుస్తోంది. నిపుణుల కమిటీ నివేదికకు 46 రోజుల ముందే భారీ అంచనాలతో కేసీఆర్‌ ఈ ‌ప్రకటన చేయడానికి ఆధారం, ప్రాతిపదిక ఏమిటో తెలియడం లేదని కమిషన్‌ ‌తన నివేదికలో పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అంశాల్లో పేరు కమిటీదే అయినా.. నిర్ణయం మాత్రం పూర్తిగా కేసీఆర్‌దే అని అప్పుడు ముఖ్యపాత్ర పోషించిన అధికారుల అఫిడవిట్లు స్పష్టం చేస్తున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లకు సంబంధించి ఇంజనీర్లు ఇచ్చిన అఫిడవిట్లలో డిజైన్ల గురించి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారని కమిషన్‌ ‌స్పష్టం చేసింది. మూడు బ్యారేజీల డిజైన్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ పరిధిలోని కేంద్ర డిజైన్‌ ‌విభాగం ఇచ్చిన ప్రకారమే ఉన్నాయని చెప్పారు. చీఫ్‌ ఇం‌జనీరు ఎన్వీ వెంకటేశ్వరరావు వాగ్మూలంలో మాత్రం, కాంట్రాక్టు సంస్థల అఫిడవిట్లలో సెంట్రల్‌ ‌డిజైన్‌ ఆర్గ నైజేషన్‌ ‌నుంచి డిజైన్లు, డ్రాయింగ్‌లు ఇవ్వడంలో జాప్యం జరిగినట్లు ఉందట. నిర్మాణ ఏజెన్సీలు ఇచ్చిన లెటర్లకు శాఖాపరమైన సమాధానాలు వెంటనే అందివ్వలేదని, మేనేజ్‌మెంట్‌ ‌సమావేశానికి సంబంధించిన రికార్డులు కూడా లేవని తేలింది.

ఇక, టర్న్‌కీ విధానంలో కాకుండా గుంపగుత్తగా పనులను కేటాయించడం వల్ల.. డిజైన్‌, ‌డ్రాయింగ్‌, ‌నాణ్యత విషయంలో కాంట్రాక్ట్ ‌సంస్థ బాధ్యత తీసుకోలేదని కమిషన్‌ అభిప్రాయ పడింది. డిజైన్లు పూర్తికాకుండా, పరిశోధనల ఫలితాలు రాకముందే పనులు ప్రారంభించడంతో ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యతపై ఇప్పటికీ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారులే డ్రాయింగ్‌లు, డిజైన్లు ఇచ్చారని, సమయానికి భూములు ఇవ్వలేక పోయామని, ఫలితంగా ఏజెన్సీలు కోరినట్లు పొడిగింపు అవకాశం వ్యవధి(ఈవోటీ) ఇచ్చామని ఇంజనీర్లు కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చారట. తప్పు ప్రభుత్వం వైపు ఉన్నందున.. ఈవోటీకి ఎలాంటి జరిమానా విధించలేదని వాళ్లు చెప్పారు. 2016లోనే కాంట్రాక్టు ఇచ్చినా.. మొదటి డ్రాయింగ్‌ను పూర్తి స్థాయిలో కాకుండా.. కేవలం నమూనా అధ్యయనం కోసం మాత్రమే అనే నోట్‌తో 2017లో అందజేశారట. 2017, 2018లో విడతల వారీగా డ్రాయింగ్‌లు ఇచ్చారని తేలింది. ఎన్‌ఐటీ-వరంగల్‌, ఐఐటీ- మద్రాస్‌ ‌వంటి సంస్థల నుంచి అధ్యయనాల నివేదికలు రాక ముందే.. నిర్మాణ పనులను ప్రారంభించారని, ఫలితంగా బ్లాకులు కుంగిపోవడం, పిల్లర్లకు పగుళ్లు రావడం లాంటివి చోటు చేసుకున్నాయని విశ్లేషించారు. ఫ్లడ్‌ ‌బ్యాంకులు, మళ్లింపు ఛానల్‌ ‌వంటి కొత్త పనులు చేయడం కూడా నిధుల దుర్వినియోగానికి కారణమన్న వాదనలకు బలం చేకూరుతోంది.

రాజకీయ ఒత్తిళ్లతో నాణ్యతాలోపం

ఎన్నికలలోపు పనులను పూర్తిచేయాలన్న మితిమీరిన రాజకీయ ఒత్తిళ్లు ప్రాజెక్టు నాణ్యతను దెబ్బతీశాయని తెలుస్తోంది. ఆరు నుంచి ఏడేళ్లు పట్టే ప్రాజెక్టు నిర్మాణాన్ని కేవలం రెండు మూడేళ్లలోనే పూర్తి చేశారు. నాటి ముఖ్యమంత్రే స్వయంగా డిజైన్లలో మార్పులు చేశారని, డీపీఆర్‌ ‌తయారీలో, తుది నిర్ణయాల్లో జోక్యం చేసుకున్నారని, గూగుల్‌ ‌మ్యాప్స్ ఆధారంగా లొకేషన్‌లు ఎంపిక చేశారని, ప్రభుత్వ ఒత్తిడి వల్ల నిర్మాణ సంస్థలు కూడా నాణ్యతను గాలికొదిలేశాయని, కనీసం క్యూరింగ్‌కు సమయం ఇవ్వలేదని జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌నివేదికలో తేటతెల్లమైంది. పరీక్షల్లేకుండా కాంక్రీట్‌ ‌పనులు పూర్తి చేయడంతో.. భవిష్యత్తులో వరదలొస్తే.. బ్యారేజీ తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఏటేటా మరమ్మతుల, నిర్వహణ ఖర్చులు పెరుగుతూ పోతాయి. రూ. 80 వేల కోట్ల ప్రాజెక్టు నిర్మాణ అంచనా రూ. లక్షా 20 వేల కోట్లకు చేరింది. ఫలితంగా ప్రజలపై అప్పుల భారం పడింది. ప్రాజెక్టు నిర్వహణకు విద్యుత్తు బిల్లులు భారంగా మారాయి. చాలాచోట్ల కాలువలు పూర్తికాలేదు. నది సహజ ప్రవాహాన్ని మార్చడం వల్ల వరద ప్రభావిత ప్రాంతాలు పెరిగాయని, కొన్ని గ్రామాలు తరచూ నీటమునిగే పరిస్థితి దాపురించిం దని, పర్యావరణ అనుమతులున్నప్పటికీ.. ఆచరణలో వాటిని ఉల్లంఘించారని కమిషన్‌ ‌తేల్చి చెప్పింది.

‘మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించకూడదని నిపుణుల కమిటీ సూచించినప్పటికీ•, నీటి లభ్యత పేరుతో దానిని పట్టించుకోలేదు. డీపీఆర్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే అంచనాలు ఆమోదించారు. అప్పటి సీఎం నిర్ణయం ప్రకారమే మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిర్మితమయ్యాయి. నిర్మాణపనులకు కాంట్రాక్టులు ఇచ్చిన విధానం సరైనదికాదు.కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడమే లక్ష్యంగా నిబంధనలను సడలించి అంచనాలను పెంచడంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మేడిగడ్డకు ఇచ్చిన సబ్‌స్టాన్షియల్‌ ‌సర్టిఫికేట్‌ ‌చట్టవిరుద్ధం’ అని ఘోష్‌ ‌కమిషన్‌ ‌తేల్చింది.

అసెంబ్లీ సాక్షిగా సర్కారు నిర్ణయం

జస్టిస్‌ ‌ఘోష్‌ ‌నివేదిక రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ కమిషన్‌ ‌నివేదికపై చర్చించేందుకే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించింది. మరోవైపు.. ఈ నివేదికను అసెంబ్లీలో చర్చించకుండా చూడాలని, నివేదికను బహిర్గతం చేయొద్దని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, వాళ్లకు నిరాశే ఎదురయ్యింది. దీంతో, అసెంబ్లీలో రెండు రోజుల పాటు చర్చించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆదివారం అయినప్పటికీ ఆగస్టు 31వ తేదీ అర్థరాత్రి దాటేదాకా దాదాపు తొమ్మిది గంటల పాటు ఈ నివేదికపై చర్చను నిర్వహించారు. జస్టిస్‌ ‌ఘోష్‌ ‌కమిషన్‌ ‌నివేదికను ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ పెన్‌‌డ్రైవ్‌ ‌రూపంలో అందజేసింది.

బీజేపీ ప్రతిస్పందన

జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌నివేదికపై చర్చ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, నివేదికలో కేసీఆర్‌ అవినీతిపై ప్రస్తావన లేకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ,ఈ ప్రాజెక్టు అవినీతిపై బీజేపీ మొదటి నుంచీ చేస్తున్న ఆరోపణ నిజమేనని స్పష్టమైందని అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఇందుకు పూర్తి బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. ఈ ప్రాజెక్టు అవినీతిపై తాము మొదటి నుంచి సీబీఐ విచారణ కోరుతున్నామని, అయితే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ను కాపాడే ఉద్దేశంతోనే ఇంత జా•ప్యం చేసిందని ఆరోపించారు.

ప్రాజెక్టును మూసివేస్తారా?: బీఆర్‌ఎస్‌

‌కాళేశ్వరం ప్రాజెక్టు కేసు సీబీఐకి అప్పగించడం అంటే ప్రాజెక్టును మూసివేయడమేనని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు స్పందిస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణ వరప్రదాయినిని శాశ్వతంగా మూసివేసి గోదావరి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్‌ ‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కవిత వ్యాఖ్యలతో ప్రకంపనలు

ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్‌ ‌కూతురు, ఎమ్మెల్సీ కవిత పార్టీ నేతలు హరీష్‌ ‌రావు, సంతోష్‌ ‌రావులపై చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీశాయి. కేసీఆర్‌ ‌బద్‌నాం కావడానికి వారిద్దరే కారకులని, ప్రాజెక్టు వ్యవహారంలో వారిదే కీలక పాత్ర అని, అందుకే రెండోసారి హరీష్‌రావును నీటి పారుదల శాఖ నుంచి తప్పించారన్నారు.అవినీతి అనకొండల మధ్య తన తండ్రి బలిపశువు అవుతున్నా రని అన్నారు. ఇలా ఉండగా, జస్టిస్‌ ‌ఘోష్‌ ‌నివేదిక ఆధారంగా నాటి చంద్రశేఖరరావు, హరీష్‌రావులపై చర్యలు తీసుకోవద్దన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 7‌కు వాయిదా వేసింది.

సుజాత గోపగోని

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE