రష్యా నుంచి భారత్‌ ‌చేస్తున్న చమురు కొనుగోళ్లను ఆపి వేయాలని భారత్‌ను బెదిరించడంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌కు మతి తప్పిందని అంతా నిర్ధారించుకున్నారు. తరువాత ఉన్మాద స్థితికి వెళ్లాడాయన. ఫలితమే భారత్‌ను ‘డెత్‌ ఎకానమీ’ (మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ) అంటూ ప్రకటించి ప్రపంచ మానవాళిని ఆశ్చర్యంలో ముంచేశారు. తన ఈర్ష్య, అసూయ, అక్కసును కూడా వెళ్లగక్కారు. దశాబ్దం క్రితం ప్రపంచ దేశాల అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితాలో 10వ స్థానం ఉన్న భారత్‌, ‌నేడు 5వ స్థానానికి ఎదగడంతో పాటు రానున్న రోజుల్లో సగర్వంగా 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరడం ఖాయమని మన దేశ ఆర్థిక ప్రగతి పరుగుల అంచనాలు రుజువు చేస్తున్నాయి. భారత ఆర్థిక ప్రగతి 6.5 శాతానికి పైగా నమోదు కావడంతో ఐఎంఏఫ్‌ అం‌చనాలను (3 శాతం మాత్రమే) సహితం తలక్రిందులు చేసినట్లు అయింది. భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత అంచనాలను చేరిందంటూ ఆర్‌బీఐ కూడా కితాబు ఇవ్వడం గమనార్హం. ఆర్థిక ప్రగతిలో యూఎస్‌ను సహితం తలదన్నే విధంగా భారత్‌ ‌ముందుకు దూసుకుపోతున్నది. ప్రపంచ దేశాలు ఏం తినాలి, ఏం తాగాలి, ఎప్పుడు నిద్ర పోవాలి అంటూ హిట్లర్‌ ‌మానసిక స్థితితో ట్రంప్‌ ‌తన స్థాయిని మరిచి వాగడం వల్ల అమెరికా ప్రతిష్ట మసకబారడం కొనసాగుతున్నది. రష్యా నుంచి కొనుగోళ్లకు నిరసనగా విధించిన సుంకాలు మొత్తానికే ముప్పు తెచ్చే రీతిలో ఉన్నాయి. 

పెహల్గామ్‌ ‌దుర్ఘటన తర్వాత భారత్‌ ‌చేపట్టిన ‘‘ఆపరేషన్‌ ‌సిందూర్‌’’ ‌సైనిక చర్య ద్వారా పాకిస్థాన్‌ను మూడు రోజుల్లోనే మట్టి కరిపించి కాళ్ల బేరానికి వచ్చే దుస్థితికి తీసుకురావడాన్ని ట్రంప్‌ ‌జీర్ణించుకోలేక పోతున్నట్లు అర్థం అవుతున్నది. ప్రపంచానికి భారత సైనిక సత్తా ఏమిటో అవగతమయింది. అమెరికా, చైనా, రష్యాల సరసన భారత్‌ ‌నిలవడం ట్రంప్‌ ‌తిక్కను పెంచుతున్నది. ఆధునిక సాంకేతిక యుద్ధ క్షేత్రంలో భారత సైన్యం తన ప్రతిభను ప్రపంచానికి చాటింది. పాకిస్తాన్‌కు చెందిన వందల కి.మీ దూరంలో యుద్ధ విమానాలను అతి సులభంగా, అత్యంత కచ్చితత్వంతో కూల్చివేయడం చూసిన అమెరికన్‌ ‌ట్రంప్‌కు మతిపోయినట్లయింది. భారత్‌ అన్ని రంగాల్లో అంచనాలను మించి దూసుకుపోతోంది. భారతదేశ వ్యాప్తంగా మౌలిక వనరుల కల్పన ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పడుతున్నారు. మేకిన్‌ ఇం‌డియా మాద్యమంగా వికసిత్‌ ‌భారత్‌ -2047 ‌లక్ష్యాలను అధిగమించడానికి వడివడిగా అడుగులు వేస్తున్నది. గత దశాబ్ద కాలంలో ఐదు నగరాల్లో ఉన్న మెట్రో రవాణా సౌకర్యాలను 24 నగరాలకు విస్తరించారు. ఐఐటీ, ఏయిమ్స్, ఐఐఎం ‌లాంటి ఇనిష్టిట్యూట్స్ ఆఫ్‌ ఇం‌పార్టెన్స్ ‌సంస్థలను మూడు రెట్లు పెంచారు. డిజిటల్‌ ‌లావాదేవీల్లో భారత ప్రజలదే అగ్రస్థానం. విమానాశ్రయాలను 74 నుంచి 160కి పెంచడం వాస్తవం. రైల్వే లైన్ల విద్యుదీకరణను గత పదేళ్లలో రెట్టింపు పూర్తి చేయడం ఓ అద్భుత ప్రగతిగా గుర్తించాలి. 2014లో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు 91,287 కిమీ ఉండగా, 2024 వరకు 1,46,195 కిమీల వరకు పెంచారు. ‘సంస్కరణలు, పని తీరు, మార్పు’ అనే మూడు సూత్రాలే చోదక శక్తిగా భారత ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంది.

‘ముందే కోతి, ఆపైన నిప్పులు కొక్కింది’ అన్న చందంగా ట్రంప్‌ ‌తీసుకునే ప్రతి చర్య, పలికే ప్రతి మాట పిచ్చోడి చేతిలో రాయి వలె మారినట్లు కనిపిస్తున్నది. సగటు అమెరికన్లు ట్రంప్‌ ‌వైఖరికి సిగ్గు పడుతున్నారు. భారత దిగుమతులపై 50 శాతం వరకు సుంకాలను పెంచడానికి కారణంగా రష్యా నుంచి భారత్‌ ‌చవకగా చమురు కొనుగోలు చేయడమే అని ట్రంప్‌ ‌హద్దులు మీరి అరుస్తున్నారు. అన్ని దేశాలకు తానే సూపర్‌ ‌బాస్‌ అనుకుంటూ అరుస్తున్నారు, అభాసుపాలవుతున్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలోనే  ట్రంప్‌ ‌నోటికి పని చెబుతున్నారు.

ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంతో, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న స్థితిలో కూడా భారతదేశం ఆర్థికంగా ప్రగతి సాధిస్తూనే ఉంది. అంతర్జాతీయంగా ఒక ఆర్థిక శక్తిగా ఉన్న భారత దేశం మీద, భారతదేశ ఆర్థిక సహాయ సహకారాల మీద అనేక దేశాలు ఇదివరకే కాదు, ఇప్పటికి కూడా ఆధారపడి ఉన్నాయి. భారతదేశ ఆర్థిక విశ్వసనీయత రేటింగ్‌ ‌పెరిగిందనీ, తాము ఎంతటి రుణ సహాయానికైనా సిద్ధమనీ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌), ‌ప్రపంచ బ్యాంక్‌, ‌ఫ్రాన్స్ ఆర్థిక సహాయ సంస్థ తదితర అంతర్జాతీయ ఆర్థిక సహాయ సంస్థలు కోవిడ్‌ ‌కాలంలోనే కాక, కోవిడ్‌ అనంతర కాలంలో కూడా పదే పదే సూచించినప్పటికీ భారత ప్రభుత్వం ఆ సహాయాన్ని ఉపయోగించుకోలేదంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీడీపీ వృద్ధి, స్థిరంగా ఉన్న స్థూల ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సంస్కరణలు వగైరాలన్నీ కలిపి భారతదేశ ఆర్థిక వ్యవస్థను అన్ని విధాలా పరిపుష్టం చేశాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు సుస్థిరంగా, పటిష్ఠంగా ఉందనడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్‌ ‌తదితర అంతర్జాతీయ సంస్థల వార్షిక నివేదికలే సాక్షీభూతాలు.

అజ్ఞానానికి పరాకాష్ఠ

ఒక జాతీయ పార్టీకి నాయకుడై ఉండి, లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నాయకుడై ఉండి రాహుల్‌ ‌గాంధీ కనీస మాత్రంగా ఈ నివేదికలను అధ్యయనం చేయకపోవడం, దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల అవగాహన లేకుండా వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన వ్యాఖ్యలకు పూర్తిగా విరుద్ధమైన పరిస్థితి దేశం ఇప్పుడు ఆర్థికంగా దూసుకుపోతోంది. ప్రపంచంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న దేశాలన్నిటికంటే భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఎక్కువ. గత ఏడాది భారతదేశ వాస్తవిక జీడీపీ 8.2 శాతానికి చేరుకుంది. అమెరికా 2.5 శాతం, చైనా 5.2 శాతం, జపాన్‌ 1.9 ‌శాతం, జర్మనీ 0.3 శాతంతో భారతదేశం కంటే బాగా వెనుకబడి ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా భారతదేశ జీడీపీ 6.5 నుంచి 7 శాతానికి చేరుకుందని తన తాజా నివేదికలో ప్రకటించింది. భారత్‌లో గ్రామీణాభివృద్ధి, ప్రాథమిక సదుపాయాల కల్పన మీద బడ్జెట్‌ ‌కేటాయింపులు పెరుగుతున్న కారణంగా అతి వేగంగా ఆర్థిక పురోగతిని సాధి స్తోందని కూడా అది తెలిపింది. భారతదేశం ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, 2026 నాటికి దాని జీడీపీ 6.8 శాతానికి చేరుకుంటుందని అది తెలియజేసింది.

మరో రెండేళ్లలో, అంటే 2027 నాటికి భారతదేశం ఆర్థిక పురోగతిలో జర్మనీని మించిపోయి, 5.2 ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా పరిణామం చెందాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అంతేకాక, 2030 నాటికి ఇది 7.3 ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది కూడా ప్రభుత్వ దృఢ సంకల్పం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ ‌గాంధీకి తెలియని, అర్థం కాని, అవగాహన లేని విషయమేమిటంటే భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐద•వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకుంది. దేశీయ ఉత్పత్తులను పెంచుతూ, ఆర్థిక సంస్కరణలను కొనసాగిస్తూ, పెరుగుతున్న తమ యువ జనాభా సహాయంతో ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే అయిదేళ్లలో అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధిలో భారత దేశ వాటా 12.9 శాతానికి పెరగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఇందులో ప్రస్తుతం అమెరికా వాటా 11.3 శాతం ఉంటోందని అంతర్జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలు తెలిపాయి. ప్రపంచాన్ని ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు ముంచెత్తు తున్నా, భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్నా, ప్రకృతి వైపరీత్యాలు విజృంభిస్తున్నా, వాణిజ్య ఒప్పందాలు అతలాకుతలం అవుతున్నా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరకుండా పురోగతి సాధించడంతో పాటు, 2027-30 సంవత్సరాల మధ్య అగ్ర రాజ్యాలను అన్ని విధాలా మించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

నిజానికి, విజయాలు, సాఫల్యాల విషయానికి వచ్చేసరికి భారతదేశం ప్రచారార్భాటాలకు దూరంగా ఉండడం మొదటి నుంచి జరుగుతున్న విషయమే. భారతదేశం వంటి బహుళ జాతులు, బహుళ సంస్కృ తుల, బహుళ మతాల దేశంలో పది పన్నెండేళ్ల కాలంలో ఇంతగా ఎదగడమనేది ఆషామాషీ విషయం కాదు. విచిత్రమేమిటంటే, భారతదేశం తాను మాత్రమే ఎదగడం కాదు. పొరుగున ఉన్న అనేక దేశాలను కూడా ఎదిగేలా చేస్తోంది. భూటాన్‌, ‌మాల్దీవులు, శ్రీలంక, నేపాల్‌, ‌సూడాన్‌, అఫ్ఘానిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌తదితర దేశాలు భారత్‌ ‌తోడ్పాటుతో ఆర్థికంగా ఎదుగుతున్న విషయాన్ని ప్రపంచ ఆర్థిక సహాయ సంస్థలన్నీ గుర్తించడంతో పాటు తమ వార్షిక నివేదికల్లో కూడా ప్రస్తావిస్తున్నాయి. నిజానికి, పౌరులంతా గర్వపడే స్థితిలో భారత్‌  ఉం‌ది. ఇతర దేశాలలోని భారతీయులు తలెత్తుకు తిరిగేలా అన్ని రంగాల్లోనూ వేగంగా పురోగతి సాధిస్తోంది. కృతనిశ్చ యంతో, దృఢ సంకల్పంతో పైపైకి దూసుకుపోతోంది. భారతదేశాన్ని మృత ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ అనేక ప్రతికూలతల మధ్య భారత్‌ ఎదుగుతున్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. దేశంలోనే ఉంటూ అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ ‌గాంధీ నాలుగు ఓట్ల కోసం స్వదేశం మీద విమర్శలు, వ్యాఖ్యానాలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనం.

సవాలక్ష ఆధారాలు

భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారడానికి, అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తుండడానికి ప్రధాన కారణం దేశంలోని ఉత్పత్తి రంగం క్రియాశీలంగా, సచేతనంగా మారడమే. ఈ ఏడాది జూలై నాటికి దేశంలోని ఉత్పత్తి రంగం 59.2 పాయింట్లకు చేరుకుంది. గత 17 ఏళ్ల కాలంలో భారతదేశం ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ఉత్పత్తి రంగం ఎదుగుదలకు కావలసిన డిమాండ్‌, ‌సరఫరా వ్యవస్థలు బాగా ఊపందుకున్నాయి. ఉత్పత్తి రంగంలో భారతదేశం అగ్రస్థానానికి చేరుకుంటోందనే విషయం కాదనలేని వాస్తవమని ఎస్‌ అం‌డ్‌ ‌పి గ్లోబల్‌ ఇం‌డియా మ్యాన్యుఫాక్చరింగ్‌ ‌పర్చేసింగ్‌ ‌మేనేజర్స్ ఇం‌డెక్స్ ‌తెలియజేసింది. ఫార్మస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ ‌రంగాల్లో భారతదేశం కొత్త పుంతలు తొక్కుతోందని కూడా అది తెలిపింది. ప్రస్తుతం జీడీపీలో ఉత్పత్తి రంగం వాటా 13 శాతం ఉంది. మేకిన్‌ ఇం‌డియా విధానం కారణంగా ఇది త్వరలో 25 శాతానికి పెరిగే అవకాశం ఉందని కూడా అది తెలిపింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు బాగా తగ్గుముఖం పట్టాయని, ద్రవ్యోల్బణం 3.4 శాతానికి చేరుకోగా, నిరుద్యోగ సమస్య 14 శాతం నుంచి 8 శాతానికి పడిపోయిందని కూడా ఇది తెలిపింది.

కాగా, 2024 డిసెంబర్‌ ‌నాటి వరకూ విదేశీ పెట్టుబడుల మొత్తం 1.7 ట్రిలియన్‌ ‌డాలర్లకు చేరుకుందని, ఇది ఈ ఏడాది మరో 71 బిలియన్‌ ‌డాలర్లు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు తెలియజేస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకునే విషయంలో కూడా భారతదేశం ప్రస్తుతం 15వ స్థానంలో ఉంది. వ్యవసాయ రంగ భవిష్యత్తు పూర్తిగా మారి పోతోందని, పారిశ్రామికాభివృద్ధి అమెరికాను మించిపోతోందని, దేశవ్యాప్తంగా 200కు పైగా నగరాలు అంచనాలకు మించి అభివృద్ది చెందాయని, సుమారు 900 పట్టణాలు నగరాల స్థాయికి ఎదుగుతున్నాయని, విద్యుదుత్పత్తి రంగం కూడా కొత్త పుంతలు తొక్కు తోందని దేశ ఆర్థికాభివృద్ధి సూచికలు తెలియజేస్తు న్నాయి. రవాణా రంగం, రైల్వేలు, విమానాశ్రయాలు వంటివి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్నాయి. రక్షణ రంగం స్వావలంబన సాధించుకుంది. టెక్నాలజీ రంగం, అంతరిక్ష పరిశోధన రంగం అమెరికా, రష్యా, చైనా, దక్షిణ కొరియా, జర్మనీ వంటి అగ్ర రాజ్యాలతో పోటీ పడుతున్నాయి. నైపుణ్యాల అభివృద్దిలో 2013 వరకూ బాగా వెనుకబడి ఉన్న భారతదేశం 2023 నాటికి అభిలషణీయ స్థాయికి చేరుకుంది. దేశంలోని బ్యాంకింగ్‌ ‌వ్యవస్థ అనేక సంస్కరణల కారణంగా లాభాల బాట పట్టడంతో పాటు, నిరర్ధక ఆస్తుల నుంచి దాదాపు పూర్తిగా కోలుకోవడం జరిగింది.

ఇక 2027 నాటికి భారతదేశం 5.2 ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమనేది ఒక లక్ష్యమే కాక, ఒక అగత్యంగా కూడా కనిపిస్తోంది. ప్రపంచ దేశాల్లో తానే ఒక అగ్రరాజ్యంగా ఎదగాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దేశానికి పెను సవాళ్లు కాబోతున్నాయి. అయితే, రాజకీయ సుస్థిరతతో పాటు, సుస్థిర పాలనకు కూడా అవకాశం ఉన్న ప్రస్తుత సమయంలో ప్రభుత్వం ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకు పోతోంది. భారతదేశ ప్రగతిని బద్ధశత్రువైన చైనాతోసహా సుమారు 122 దేశాలు అబ్బురంగా చూస్తూ, ప్రశంసల వర్షం కురిపిస్తున్న సమయంలో దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌పార్టీ విమర్శలు చేయడం, విచిత్ర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తోందనో, చచ్చుబడిందనో లేక డెడ్‌ ఎకానమీ అనో వ్యాఖ్యలు చేయడం మానసిక దౌర్బల్యానికి, దివాలాకోరుతనానికి నిదర్శనం.

జి.రాజశుక

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE