ఆం‌ధప్రదేశ్‌ ‌భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా  పీవీఎన్‌ ‌మాధవ్‌ ‘‌సారథ్యం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఆ సందర్భంగా పార్టీ జిల్లా, స్ధానిక నాయకులు కార్యకర్తలను కలిశారు. ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తలకు పార్టీ, రాజకీయ పదవులు లభించేలా అన్ని రకాల ప్రాధాన్యతలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్ధానిక కూడలి ప్రాంతాల్లో ఏర్పాటైన చాయ్‌పే చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నవారు తమ ప్రాంతాల్లోని అపరిష్కృత• సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. జిల్లాల అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, యువత ఉపాధి వంటి అంశాలపై విలువైన సలహాలు అందాయి. ఉదాహరణకు, ఒంగోలులో విద్యావేత్తలు, వైద్యులు, కర్నూలులో న్యాయవాదులు, విశాఖలో పారిశ్రమికవేత్తలు, ఇంజనీర్లు, ఏలూరులో చేపలు, రొయ్యల సాగురైతులు అనంతపురంలో ఉద్యాననరైతులు పాల్గొన్నారు.

భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కొత్త సారథి మాధవ్‌ ఇరవై అయిదు ‘సారథ్య’ యాత్రలు చేపట్టి, అందులో భాగంగా పెద్ద ర్యాలీలు నిర్వహించారు. సాయంత్రం మేధావులు, వ్యాపార ప్రముఖులతో సమావేశమై వారి నుంచి సలహాలు స్వీకరించారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ప్రత్యేక సమస్యలపై హామీలు ఇచ్చారు. కోస్తాలో అమరావతి రాజధాని, సీమలో వెనుకబడిన అభివృద్ధి ప్యాకేజీలపై స్పందించారు. తిరుపతి, చిత్తూరులో స్థానిక సంస్థలు, భాషా ప్రాధాన్యతలు చర్చించారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు, వచ్చే స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణలను సిద్ధం చేయడం ఈ పర్యటన వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని పొందడమే లక్ష్యంగా పేర్కొనవచ్చు. ఇతర పార్టీల నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు జరిగాయి. ఎన్డీఏ ఐక్యతను బలపరచడం కూడా కనిపించింది.

కార్యకర్తలకు ప్రేరణ – నూతనోత్తేజం

సారథ్యం పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం గణనీయంగా కనిపిస్తోంది. మాధవ్‌ ‌జిల్లాల వారీగా విస్తృత స్థాయి సమావేశాల్లో కార్యకర్తలను వ్యక్తిగతంగా కలిసేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించారు. ‘ప్రతి కార్యకర్త పార్టీ నాయకుడు’’ అంటూ, వారికి పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇవ్వడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంచారు. నిస్తేజంగా ఉన్న కేడర్‌లో కొత్త జోష్‌ ‌నింపడానికి ఈ పర్యటన పునాది వేసింది, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు మళ్లీ ఉర్రూతలూగేలా చేసింది. కృష్ణా, ఏలూరు, రాజమండ్రి, కోనసీమ, గుంటూరు, పల్నాడు వంటి జిల్లాల్లో సమావేశాల్లో కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీలు పార్టీ బలాన్ని సమర్థవంతంగా ప్రదర్శించాయి. ఉదాహరణకు, ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ర్యాలీలకు పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎండను లెక్కచేయకుండా భారీగా పాల్గొన్నారు. ఈ ర్యాలీలు ప్రత్యర్థి పార్టీలకు బలమైన సంకేతాలు పంపాయి. ముఖ్యంగా పార్టీ బలం తక్కువగా ఉన్న జిల్లాల్లో కూడా స్పందన బాగుంది. పల్నాడులో జరిగిన ర్యాలీలో టీడీపీ నాయకులు కూడా పాల్గొనడం ద్వారా ఎన్డీఏ ఐక్యతను చాటినట్లయ్యింది.

ఛాయ్‌ ‌పే చర్చతో ప్రజాసమస్యల మధనం

యాత్రలో భాగంగా, మాధవ్‌ ‌ప్రజలతో మమేక మవుతూ దినచర్యను ప్రారంభించారు. సామాన్య ప్రజలు, పేదలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, స్థానిక సవాళ్లపై ఆరా తీశారు. అణగారిన వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ ధ్యేయమని, వారి రాజకీయ, సామాజిక గుర్తింపునకు పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. స్థానిక స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చాయ్‌ ‌పే చర్చా కార్యక్రమం ద్వారా ప్రజలు, పార్టీ అధ్యక్షుడికి మధ్య దూరం గణనీయంగా తగ్గింది. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకున్నారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో విద్య, వైద్యం, రహదారులు, డ్రైనేజీ వంటి సమస్యలతో పాటు ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు ప్రస్తావనకు వచ్చాయి. తమ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలని, కొత్త పరిశ్రమలు రావాలని, తమ పిల్లలకు స్థానికoగానే ఉద్యోగ అవకాశాలు కలగాలని జిల్లాల్లోని తల్లిదండ్రులు కోరారు. స్పందించిన మాధవ్‌, ‌దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

శాంతి భద్రతలపైనా స్పందన

శాంతి భద్రతలపైనా మాధవ్‌ ‌స్పందించారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ ‌మహమ్మారిపై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని వివరించారు. విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, డ్రగ్స్ ‌రవాణ, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విజయనగరం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన ఇద్దరు యువకులకు పాకిస్థాన్‌ ఉ‌గ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు తేలడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. దేశంలో మత ఘర్షణలు సృష్టించి, శాంతికి విఘాతం కలిగించాలని చూస్తున్న ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొట్టాలని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిఘా వ్యవస్థలు మరింత పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

జిల్లా వాసులకు అభివృద్ధిపై భరోసా

ప్రతి జిల్లాల్లో ఆ ప్రాంత సమస్యలను ప్రస్తావించి హామీలు ఇచ్చారు. రాయలసీమలో సాగునీరు, కేంద్ర నిధులతో బెంగళూరు-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే, కడప ఎయిర్‌పోర్టు అభివృద్ధి వంటి ప్రాజెక్టులకు హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో వలసలు, కోస్తాలో రైతుల సమస్యలపై కూడా దృష్టి సారించారు. పల్నాడులో 4,400 కి.మీ. హైవేలు, రూ.3,000 కోట్ల అమరావతి ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌వంటి రోడ్‌మ్యాప్‌ ‌చూపించారు. ముఖ్యంగా కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తామని స్పష్టత ఇవ్వడం ద్వారా ఈ హామీలు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయి,

కొల్లేరు ప్రాంతంలోని దాదాపు మూడు లక్షల మంది పేదల సంబంధించిన దశాబ్దాల సమస్యల పరిష్కారం చూపి న్యాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని మాధవ్‌ ‌వివరించారు. ఏలూరు జిల్లాలో ఆక్వా, నిమ్మ రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఆక్వా కల్చర్‌ అభ్యున్నతి, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల కోసం రాబోయే రోజుల్లో రూ.550 కోట్లతో సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు.

విపరీతంగా పెంచిన విద్యుత్‌ ‌ఛార్జీల భారాన్ని తట్టుకోలేక ఎన్నో ఫెర్రో అల్లాయిస్‌ ‌పరిశ్రమలు నష్టాల పాలై మూతపడ్డాయని విజయనగరం జిల్లా వాసులకు గుర్తుచేస్తూ, కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందించి, మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తామని, జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టులతో సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అనాస హబ్‌ ఏర్పాటుతో రైతులకు ధర, యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్‌, ‌జాతీయ రహదారితో ఆర్థికాభివృద్ధి సాధిస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ వెనుకబాటును తొలగిస్తామని, ఆధునిక సేద్య పద్ధతులతో రైతుల దిగుబడి పెంచుతామని మాధవ్‌ ‌నొక్కిచెప్పారు. పర్యాటకం, పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయం, మూలపేట పోర్టుతో పారిశ్రామిక ప్రగతి జరుగుతుందన్నారు. అల్లూరి జిల్లాలో గిరిజనులకు జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌తో తాగునీరు అందిస్తున్నామని, పీఎంజీఎస్‌వైతో రోడ్లు నిర్మించి విద్య, వైద్యం చేరువ చేస్తున్నామన్నారు. ఉపాధి హామీ, జాతీయ రహదారి, వైద్య కళాశాల అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు. ఏకలవ్య స్కూళ్లు, అరకు కాఫీ ప్రోత్సాహం, జీవో 3 పునరుద్ధరణతో హక్కులు కాపాడతామన్నారు.

మచిలీపట్నం పోర్టు పనులు త్వరలోనే పూర్తవు తాయని, దీంతో స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా వాసులకు హామీ ఇచ్చారు. పోర్టు సరకు రవాణాకే పరిమితం కాకుండా దానికి అనుబంధంగా పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహిస్తామని, పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసి, యువత వలసలు నివారిస్తామని పేర్కొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ‘స్వదేశీ దర్శన్‌’ ‌పథకం కింద మచిలీపట్నంకు కేంద్రం రూ.11 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఆంధ్ర బ్యాంక్‌ ‌వ్యవస్థాపకులు, స్వాతంత్య్ర సమరయోధులు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి అవసరమైన అనుమతులు, నిధుల విడుదల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో వ్యక్తిగతంగా చర్చిస్తానని చెప్పారు. బందరు మిఠాయి, కలంకారి, రోల్డ్‌గోల్డ్ ‌పరిశ్రమల అభివృద్ధికి తగు ప్రోత్సాహకాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కడప జిల్లా కొప్పర్తిని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిధులు అందిస్తోందని, జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు, కడప విమానాశ్రయాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో మాట్లాడుతూ, రాయలసీమలోని పెండింగ్‌ ‌ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేసేందుకు కేందప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్‌ను తీసుకొచ్చేందుకు, రాయలసీమకు స్టీల్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు కూడా కృషి చేస్తామని, నీటి సమస్యలను పరిష్కరించడం, పర్యాటక రంగాన్ని అభివృద్ధిచేయడం వంటి అంశాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ రాయలసీమలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రాబోతున్నాయని టమోటాకు సంబంధించి ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్‌ ‌సైతం రాయలసీమకు రానుందని తెలిపారు. అనంతపురంలో మిల్లెట్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్‌ ‌రావడం మంచి పరిణామమని అన్నారు. చిత్తూరు పాడి రైతులకు మంచి ధర లభించేలా చేస్తామని హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లాలో పర్యటిస్తూ జిల్లాలో పరిశ్రమలను స్థాపించి, యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో పండ్లతోటలకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. జిల్లా లో పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఐటీ రంగ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం

పర్యటనలో కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి, ఆయుష్మాన్‌ ‌భారత్‌, ‌జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌ ‌వంటి పథకాలను బలంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలలో సింహభాగం నిధులు నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తున్న వాస్తవాన్ని గుర్తుచేస్తూ ఈ విషయాన్ని ప్రతి గడపకూ చేర్చాలని మాధవ్‌ ‌కోరారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు మరింత వేగవంతమయ్యేందుకు కేంద్రం ఇటీవల రూ.15 వేల కోట్లు కేటాయించింది. ‘కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమిష్టి కృషితో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి’ అని ప్రతి జిల్లాలో ప్రస్తావించారు.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE