భారత్‌ ‌విదేశీ విధానం అమెరికా, చైనా, రష్యా దేశాల మధ్య సమతూకం పాటించ డంలో విషమ పరీక్షను ఎదుర్కొంటున్నది. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి దానికి కేంద్రంగా మారింది.

భారత్‌ ‌విదేశీ విధానంలో పెను మార్పు చోటు చేసుకుందా? లేక ఒక శాశ్వతమైన ప్రాతిపదికగా చైనా, రష్యా కూటమి వైపు మొగ్గు చూపుతోందా? మారుతున్న విదేశీ విధానం అధ్యక్షుడు ట్రంప్‌ ‌నేతృత్వంలో ఉన్న అమెరికా దేశానికి, భారత్‌కు మధ్య దూరాన్ని మరింత పెంచుతుందా? భారత్‌కు, ప్రపంచానికి మధ్య భౌగోళిక-రాజకీయ, వ్యూహాత్మక, ఆర్థిక వ్యవహారాల్లో మున్ముందు ఏం జరుగనుంది?

అంతర్జాతీయ వ్యవహారాల పట్ల కాస్తో కూస్తో పరిజ్ఞానం కలిగిన వారి మధ్య జరుగుతున్న చర్చల్లో పైన ప్రస్తావించిన తరహా సమాధానం లేని, ఎటూ తేల్చుకోలేని ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. గూగుల్‌, ‌వైబో నుంచి డోయిన్‌ ‌దాకా కీలకమైన సమాచార రహదారులలోకి అడుగుపెట్టినప్పుడు సైతం ఇవే ప్రశ్నలు తటస్థపడుతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌, ‌చైనా దేశాల పర్యటనతో అంతర్జాతీయ అంశాలపై సంభాషణలు పతాక స్థాయికి చేరుకున్నాయి. జపాన్‌, ‌చైనా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం 1945లో జపాన్‌ ‌లొంగు బాటు దారి తీసింది. ఆ తర్వాత ఇరు దేశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఎలాంటి విషయమూ లేకుండా పోయింది.

కొత్త మలుపులు తిరుగుతున్న భారత్‌ ‌విదేశాంగ విధానం 10 అంశాలను తెరమీదకు తీసుకొని వచ్చింది. అవి..

  •  ప్రధాని మోదీ ఒకరంటే ఒకరికి ఏ మాత్రం పడని రెండు దేశాల్లో వరుసపెట్టి పర్యటనలు చేయడంతో విశ్లేషకులు, ప్రయోక్తలు, అంతర్జా తీయ వ్యవహారాల్లో తలపండిన విలేకరుల మెదళ్లలో అనేక ప్రశ్నలు ఉదయిచాయి.
  • చైనా, జపాన్‌ ‌దేశాలు ఎడముఖం పెడముఖంగా ఉండటమే కాకుండా అంతర్జాతీయంగా రెండు వైరి శిబిరాల్లో చెరొక దానిని ఎంచుకున్నాయి. వాటి పంచన చేరాయి. ఆ శిబిరాలకు భౌగోళిక సమీకరణల్లో భారీ వ్యవహారాలు ఉన్నాయి. చైనా, రష్యా దేశాలకు అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి అంటే ఏ మాత్రమూ పడదు. జపాన్‌ ‌నాటో కూటమితో జట్టు కట్టింది.
  • అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌వాణిజ్యానికి కోరలు తొడిగారు. భారత్‌ ‌వస్తు, సేవలపై 50 శాతం సుంకాన్ని విధించారు. ఇరుదేశాల మధ్య సంబంధాల వారధిని చేజేతులా తగలబెట్టేశారు. ఈ నేపథ్యంలో మోదీ విదేశీ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
  • ప్రధాని మోదీ తన రెండు దేశాల పర్యటనలో భాగంగా చైనాలోని తియాన్‌జిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ-ఎస్‌సీవో 20వ సదస్సుకు హాజరయ్యారు. చైనా సదస్సుకు ఆతిథ్యం ఇచ్చి అధ్యక్షత వహించింది. మోదీ హాజరైన ఎస్‌సీవో సదస్సు ద్వారా తన స్థానాన్ని సుస్థిరపరుచుకోవాలని గ్లోబల్‌ ‌సౌత్‌ ‌నెట్‌వర్క్ ఆశిస్తోంది.
  • భారత్‌ అమెరికా, చైనాలతో తన సంబంధాలను పునర్‌ ‌నిర్మించుకోవడం ద్వారా స్వయంప్రతిపత్తి కలిగిన తన వ్యూహాత్మక విధానాన్ని పరీక్షకు పెడుతోందని అనేక మంది విశ్లేషకులు భావిస్తున్నారు.
  • భారత విదేశీ వ్యవహారాల శాఖలోని ఉన్నతాధి కారులు అమెరికాతో సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశిస్తున్నారు. గతంలో పోఖ్రాన్‌ అణుపరీక్షలు అనంతరం భారత్‌పై అమెరికా ఏకపక్షంగా ఆంక్షలు విధించింది.
  • అమెరికా బెదిరింపు ఎత్తుగడలకు భారత్‌ ఇక ఏ మాత్రం తలొగ్గదు. ఆలాగని తన పనిని కానిచ్చుకోకుండా కుదురుగా ఉండలేదు. భారత్‌ అం‌దుకోసం ఎలాంటి తొట్రుపాటు లేకుండా అత్యంత సమతూకంతో కూడుకున్న చర్యను ఆచితూచి చేపట్టే అవకాశం ఉంది.
  • భారత్‌ ‌ప్రస్తుత మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులు ఆధారంగా రష్యా లేదా మరో దేశంతో చమురు వాణిజ్యాన్ని కొనసాగించకూడదు అని అనడం వెనుక ఎలాంటి కారణం కనిపించడంలేదు. రష్యా, దాని భాగస్వామ్య దేశాలతో సహజ వాయువుకు సంబంధించి ఆకర్షణీయమైన ఒప్పందాలను కొనసాగిస్తున్న అటు ఐరోపాకు కానీ ఇటు అమెరికాకు కానీ చమురు వాణిజ్యాన్ని సాకుగా చూపి భారత్‌ను ఇరుకునపెట్టే అర్హత ఏ మాత్రం లేదు.
  • ప్రధాని మోదీ జపాన్‌, ‌చైనా పర్యటన భారత్‌ ఒకరంటే ఒకరికి ఏ మాత్రం పడని రెండు దేశాలతోనూ ముందుకు పోగలదని సూచిం చింది. అందుకు నిదర్శనం అన్నట్టుగా భారత్‌- ‌జపాన్‌ ‌మధ్య కుదిరిన 170 ఒప్పందాల ద్వారా భారత్‌లో జపాన్‌ ‌పెట్టుబడులు 34 బిలియన్‌ ‌డాలర్ల నుంచి 68 బిలియన్‌ ‌డాలర్లకు ఎగబాకాయి. ఇది ఇరుదేశాల వ్యూహ్మాతక, ప్రత్యేక సంబంధానికి అతి పెద్ద విజయం. భారత్‌లో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని ఎండబెట్టడం ద్వారా ఒక దుర్మార్గమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేలా భారత్‌పై ఒత్తిడి తెస్తున్న అమెరికాకు భారత్‌లో జపాన్‌ ‌పెట్టుబడులు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి.
  • జపాన్‌పై విజయాన్ని చైనా వేడుకగా జరుపుకున్న అతి పెద్ద కార్యక్రమం దరిదాపులకు కూడా భారత్‌ ‌వెళ్లలేదు. తద్వారా ప్రపంచంలో తనకు చాలా మంది మిత్రులు ఉన్నారనే భారీ సందేశాన్ని చైనాకు ఇచ్చింది.

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ ‌మధ్య ద్వైపాక్షిక సమావేశం ఇరుదేశాల మధ్య సంబంధాల పునర్‌ ‌నిర్మాణానికి కీలకంగా మారింది. వారు ఆ సమావేశానికి ‘‘ప్రత్యర్థులుగా కాకుండా’’ అభివృద్ధిలో భాగస్వాములుగా పాలుపంచుకోవడం గమనార్హం. సంబంధాలు సాధారణ స్థితికి చేరుకునే దిశగా వేసిన మొదటి అడుగు మంచి ఉద్దేశంతోనే పడింది. కానీ కొన్ని సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా సరిహద్దులు, పాకిస్తాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌ద్వారా వాకిలి ముందుకు చైనా ప్రాజెక్టులు తీసుకొని వచ్చే బెల్ట్ అం‌డ్‌ ‌రోడ్‌ ఇనీషియేటివ్‌-‌బీఆర్‌ఐ ‌లాంటివి ఉన్నాయి.

భారత్‌, ‌చైనా దేశాలు 75 సంవత్సరాల దౌత్య సంబంధాలను వేడుకగా జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ద్వైపాక్షిక సమావేశాల ఫలితాలపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ప్రధాని మోదీ సరిహద్దు వద్ద శాంతి, సామరస్యం భవిష్యత్తులో ఇరు దేశాల సంబంధాలకు ఒక ఇన్సురెన్సు పాలసీ వంటిది అని చెప్పడం ఒక కీలకమైన అంశంగా మారింది. సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయ్యింది.

సంబంధాల పునర్నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో డ్రాగన్‌, ఏనుగు ఒకే చోట ఇమడగలవా? అనే బిలియన్‌ ‌డాలర్ల ప్రశ్న ఉత్పన్న మైంది. ఇరుదేశాలు సంబంధాలను పునర్నిర్మించుకోవ డానికి ఒక సహేతుకమైన ఐచ్ఛికం, పంపక బాధ్యత ఉండాలని ఒక చైనా విద్యావేత్త అన్నారు.

తియాన్‌జిన్‌లో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌ ‌దైపాక్షిక చర్చల కోసం ఒకే కారులో రిడ్జ్ ‌కార్ల్‌టోన్‌ ‌హోటల్‌కు చేరుకోవడం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చలు జరగడానికి దారి తీసింది. ప్రోటోకాల్‌ను తోసిరాజని మరీ రష్యాలో తయారైన ఒక కారులో మోదీ, పుతిన్‌ ‌ప్రయాణిస్తున్న వీడియోలు, ఫోటోలు ఐరోపా యూనియన్‌ ‌లేదా అమెరికాకు ఏ మాత్రం మింగుపడనివిగా మిగిలిపోయాయి. ఉక్రెయిన్‌-‌రష్యా మధ్య నెలకొన్న ఘర్షణను మోదీ జరిపిస్తున్న యుద్ధంగా అమెరికా పేర్కొన్నప్పటికీ ఇద్దరు నేతల భేటీపై ఆ మాటల ప్రభావం నామమాత్రంగా కూడా లేకపోవడం విశేషం. 2025తో ఇండో- రష్యా వ్యూహాత్మక భాగస్వామానికి 15 సంవత్సరాలు వచ్చాయి. ఈ భాగస్వామ్యం ఈ ఏడాది పూర్తి కార్యాచరణకు ఉపక్రమిస్తుంది.

భారత్‌ ‌వైపు నుంచి చూసినప్పుడు 20 దేశాలతో జరిగిన ఎస్‌సీవో సదస్సు కొన్ని విజయాలను అందించాయి. పెహల్గావ్‌ ఉ‌గ్రదాడిని సదస్సు ఏకగ్రీవంగా ఖండించడం భారత్‌ ఊహించిన దౌత్య విజయంగా మిగిలిపోతుంది. అలాగే సంబంధిత కరెన్సీలలో చెల్లింపులు జరిపేలా వేర్వేరు ఎస్‌సీవో సభ్యదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు విస్తరించడం అతిపెద్ద విజయంగా పరిగణించాలి. దీంతో అమెరికా డాలర్‌, ‌యూరో కరెన్సీలతో వాణిజ్యానికి ఉన్న సంబంధం క్రమక్రమంగా తెగిపోతుంది. చైనా కరెన్సీ రెన్‌మిన్‌బీ, రష్యా రూబెల్‌, ‌భారత్‌ ‌రూపాయికి ఆమోద యోగ్యతకు సంబంధించి ఆదరణ పెరుగుతుంది.

చైనా ప్రదర్శనకు తెరపడింది. అదే సమయంలో జిన్‌పింగ్‌, ‌పుతిన్‌, ‌మోదీల మధ్య కొత్తగా నెలకొన్న స్నేహబాంధవ్యం నుంచి పుట్టుకొచ్చే పరిణామాలతో ట్రంప్‌ ‌పాలనాయంత్రాంగానికి, బ్రస్సెల్స్‌లో ఐరోపా యూనియన్‌ ‌ప్రధాన కార్యాలయంలో పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది.

 కె.ఎ.బదరీనాథ్‌

 ‌డైరెక్టర్‌ & ‌చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌,

‌సెంటర్‌ ‌ఫర్‌ ఇం‌టిగ్రేటెడ్‌ అం‌డ్‌

 ‌హోలిస్టిక్‌ ‌స్టడీస్‌, ‌న్యూఢిల్లీ.

About Author

By editor

Twitter
YOUTUBE