రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లుల మీద గవర్నర్లు తప్పనిసరిగా మూడు నెలల్లోగా సంతకాలు పెట్టాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ఈ సమస్యకు శాశ్వతంగా తెర దించకపోగా మరో వివాదానికి తెరతీసింది. తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడుతో సహా పశ్చిమ బెంగాల్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు మరోసారి సవాలు చేశాయి. సంతకాలు పెట్టడానికి గవర్నర్లకు మూడు నెలల కాల పరిమితిని ఇవ్వడాన్ని ఇవి గట్టిగా వ్యతిరేకించాయి. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లుల మీద సంతకాలు చేయడానికి గవర్నర్లకు మూడు నెలల సమయం ఇవ్వడం చాలా ఎక్కువని, నిజానికి వారు తక్షణం బిల్లులను ఆమోదించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలు వాదించాయి. గవర్నర్లకు మూడు నెలల సమయం ఇవ్వడం వల్ల రాజ్యాంగపరమైన సమస్యలు తలెత్తుతాయని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గత సెప్టెంబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో వాదించాయి.
గవర్నర్ల ఇష్టానిష్టాల మీద ప్రజాభిప్రాయం, ప్రజల ఆకాంక్షలు ఆధారపడి ఉండకూడదని పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు వాదించాయి. శాసనసభలు ఆమోదించిన బిల్లులు ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తాయని అవి పేర్కొన్నాయి. బిల్లుల మీద సంతకాలు చేయకుండా కాలయాపన చేయడమంటే బిల్లులపై సంతకాలు చేసే ఉద్దేశం గవర్నర్లకు లేదనే అర్థమని అవి తెలిపాయి. బిల్లుల మీద అభ్యంతరాలు ఉన్నప్పుడు వాటిని పునఃపరిశీలనకు ప్రభుత్వాలకు తిప్పి పంపాల్సి ఉంటుందని, గవర్నర్లు ఆ పని కూడా చేయకపోవడం రాజ్యాంగ విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడమే అవుతుందని అవి వాదించాయి. గవర్నర్ల అధికారాలను, హోదాను, హుందాతనాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలను, అభిప్రాయాలను గౌరవించాలని గవర్నర్లు కూడా భావించాలని అవి తెలిపాయి.
రాజ్యాంగం ఏమంటోంది?
రాజ్యాంగంలో గవర్నర్ల అధికారాలకు సంబంధించిన సెక్షన్ 200లో గవర్నర్లకు కాల పరిమితి విధించే నిబంధనేమీ లేదు. అవసరమైనప్పుడు గవర్నర్ ప్రభుత్వాలు ఆమోదించే బిల్లులను రాష్ట్రపతికి పంపించే అధికారాన్ని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని గవర్నర్లు దాదాపు ప్రతి బిల్లునూ తొక్కిపెడుతున్నారని, దీనివల్ల ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన పథకాలు, కార్యక్రమాల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతోందని తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు మొదటి నుంచి ఫిర్యాదులు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా కొద్ది కాలం క్రితం తన తీర్పులో గవర్నర్లకు, చివరికి రాష్ట్రపతికి కూడా ఈ విషయంలో కాల పరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే అవకాశం లేదు. పైగా, రాష్ట్రపతికి కాలపరిమితి విధించడం అన్నది సుప్రీంకోర్టు పరిధిలో లేని అంశం. ఫలితంగా ఈ తీర్పు అమలులో ప్రతిష్ఠంభన ఏర్పడింది. అయితే, ప్రభుత్వాలు మళ్లీ సవాలు చేయడంతో సుప్రీంకోర్టు దీనిపై మళ్లీ స్పందిస్తూ, గవర్నర్లకు మూడు నెలల కాల పరిమితి విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ సారథ్యంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెప్పింది.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 68 బిల్లుల వరకూ గవర్నర్ల సంతకాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లంతా రాజ్యాంగ నిపుణలని, వారికి రాజ్యాంగ విలువలు గానీ, రాజ్యాంగ స్ఫూర్తి గానీ తెలియకపోలేదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పథకాలు, కార్యక్రమాలు, నియామ కాలు, చట్టాల విషయంలో ఈ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు రాజ్యాంగ నిబంధనలు పాటించకపోగా, సొంత అజెండాలను ముందుకు తీసుకు వెడుతు న్నాయని గవర్నర్ల కార్యాలయాలు తరచూ విమర్శలు సాగించడం జరుగుతోంది. నియామకాల్లోనూ, కార్యక్రమాల్లోనూ, చట్టాలు రూపొందించడంలోనూ వివక్షను ప్రదర్శించడం, సర్వసమానత్వానికి తిలోదకాలు ఇవ్వడం, ఉద్దేశపూర్వకంగా ఒక వర్గాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతోందని తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి సన్నిహితులు బహిరంగంగానే వ్యాఖ్యానించడం కూడా జరిగింది. గవర్నర్లు ఈ కారణంగానే బిల్లులను ఆపివేయడం, పునఃపరిశీలనకు తిప్పి పంపినా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని యథా తథంగా గవర్నర్లకు తిరిగి పంపడం జరుగుతోందని తెలిసింది.
వివక్షలు అధికం?
తమిళనాడు గవర్నర్ ఆ రాష్ట్ర శాసససభ ఆమోదించిన పది బిల్లులను తొక్కి పెట్టి ఉంచారు. కొన్నేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రెండవ పర్యాయం ఈ బిల్లులను ఆమోదించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి, గవర్నర్ తీరుతెన్నులపై ఫిర్యాదు చేసింది. రాష్ట్ర శాసనసభలు బిల్లులను ఆమోదించిన తర్వాత వాటిని గవర్నర్ అనుమతికి పంపించాలని సూచించే రాజ్యాంగం 200వ సెక్షన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్‌ను పునఃపరిశీ లించాల్సిన అవసరం ఉందని కూడా అది వ్యాఖ్యా నించింది. న్యాయస్థానం ప్రధానంగా గవర్నర్లకు బిల్లులను ఆమోదించే విషయంలో లేదా స్పందన తెలియజేసే విషయంలో కనీస కాలపరిమితి ఉండాలన్న అంశం పైనే దృష్టి కేంద్రీకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు రెండవ పర్యాయం బిల్లులను గవర్నర్‌కు పంపించినప్పుడు వాటిని తిరస్కరించడానికి వీల్లేదని రాజ్యాంగం చెబుతోంది. సుప్రీం కోర్టు ఇదే విషయాన్ని పదే పదే చెబుతోంది. నిజానికి, బిల్లులపై సంతకాలు చేయడానికి గవర్నర్లు కాలయాపన చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి సందేహం కలిగినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్‌ను స్వయంగా కలుసుకుని, చర్చించి ఆమోదం పొందడానికి అవకాశం ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్టికల్‌ను ఉపయోగించుకుంటున్న దాఖలాలు లేవు.
నిజానికి, ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలన్న పక్షంలో ఒక పకడ్బందీ అయిన చట్టం అవసరం. బిల్లుల ఆమోదానికి సంబంధించి గవర్నర్లు వ్యవహరించాల్సిన తీరును రాజ్యాంగం స్పష్టంగానే నిర్వచించింది. బిల్లులపై నిర్ణయం తీసుకునే అధికారం మంత్రిమండలికి ఉంటుంది. ఒకసారి ఆ బిల్లులను రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత, వాటిపై శాసనసభకు కూడా అధికారం ఉంటుంది. బిల్లులపై ఆమోద ముద్ర వేయడం అన్నది చాలావరకు లాంఛనం మాత్రమే. అయితే, ఇది తప్పనిసరి లాంఛనం. బిల్లును అవసరమైతే ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపడానికి గవర్నర్‌కు అధికారం ఉంది. రెండవ సారి తప్పనిసరిగా ఆమోదంతెలియ జేయాల్సి ఉంటుంది. తప్పనిసరి అనుకున్నప్పుడు గవర్నర్లు ఈ బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపించవచ్చు. అయితే, బిల్లులను ఆమోదించే విషయంలో రాజ్యాంగం ఎటువంటి కాలపరిమితినీ విధించలేదు. దీనిని అవకాశంగా తీసుకుని గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పెడుతున్నారన్న అభిప్రాయం ఉంది. సుప్రీం కోర్టు ప్రధానంగా ఈ లొసుగులపైనే దృష్టి సారిస్తోంది.
గవర్నర్లు ఈ అవకాశాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు సుప్రీం కోర్టు ఒక చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉంది. బిల్లును తొక్కిపెట్టి ఉంచడమనేది బిల్లు తిరస్కరణకు సంకేతమా, బిల్లును పునఃపరిశీ లించాల్సిన అవసరం ఉందని లేదా శాసనసభ ఈ బిల్లును మార్చాల్సి ఉంటుందని చెప్పడం దీని ఉద్దేశమా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై సుప్రీంకోర్టు నిర్దిష్టమైన రూలింగ్ ఇవ్వడంతో పాటు ఒక స్పష్టమైన చట్టాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 200 ప్రకారం ఒకసారి బిల్లును పునఃపరిశీలన చేసిన తర్వాత గవర్నర్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కువ కాలం అతని దగ్గర ఉంచుకోవడానికి అవకాశం లేదు. నిజానికి, రాజ్యాంగం ఈ విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ‘సలహాలు, సహాయాలు’ అన్న మాటలకు అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది. అయితే, గవర్నర్లు ఈ రెండు మాటలను పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్లు తమకు లేని విచక్షణాధికారాలను ఇష్టారాజ్యంగా ఉపయోగించు కుంటున్నారన్న అభిప్రాయాన్ని వ్యాపింపజేస్తున్నాయి. గవర్నర్ల వ్యవస్థకు సంబంధించిన అంశాలన్నిటినీ సుప్రీం కోర్టు పునస్సమీక్షించి, ఇకనైనా సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
జి.రాజశుక
సీనియర్ జర్నలిస్ట్