అంతా అనుకున్నట్టే భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రపురమ్ పొన్నుసామి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఎన్‌డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఇండీ కూటమి తరఫున బరిలోకి దిగిన సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి బి. సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లు 767. ఎన్‌డీఏ అభ్యర్థికి 452 ఓట్లు, ఇండీ అభ్యర్థికి 300 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్(4), అకాలీదళ్(1), బీజేడీ(7), ఒక ఇండిపెండెంట్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మొత్తంగా 14 మంది ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరు కాగా, 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి.
సీపీ రాధాకృష్ణన్ అచ్చమైన స్వయంసేవక్. ఎలాంటి ఆర్భాటాలు, ఎలాంటి సంచలన ప్రకటనలు ఇవ్వకుండా తనదైన ధోరణిలో ప్రచారం చేసుకు న్నారు. అయితే జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అలా కాదు. ఆయన విమర్శలకు, ప్రతి విమర్శలకు కేంద్ర బిందు వయ్యారు. ఆయన కొన్ని ఆరోపణలు ఎదుర్కొనక తప్పలేదు. జవాబులు ఇవ్వక తప్పలేదు.
రాధాకృష్ణన్ అక్టోబర్ 20, 1957న తమిళనాడు లోని తిరుప్పూర్‌లో జన్మించారు. బిజినెస్ అడ్మిని స్ట్రేషన్‌లో బీఏ పట్టా పొందారు. ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్‌గా ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1996లో తమిళనాడులో బీజేపీ కార్యదర్శిగా నియమితు లయ్యారు. 1998లో కోయంబత్తూరు నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎంపీగా ఉన్న కాలంలో జౌళి రంగానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు పార్లమెంటరీ కమిటీకి, ఆర్థికానికి సంప్రదింపుల కమిటీకి సభ్యుడిగా ఉన్నారు. 2004లో పార్లమెంట్ ప్రతినిధుల బృందంలో భాగంగా ఐక్యరాజ్యసమితిని సందర్శించారు. అక్కడి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 2004- 2007 మధ్య కాలంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 93 రోజుల పాటు 19 కి.మీ.ల మేర రథయాత్రను చేపట్టారు. నదుల అనుసంధానం, ఉగ్రవాద నిర్మూలన, ఏకీకృత పౌరస్మృతి అమలు, అస్పృశ్యతానివారణ, మాదక ద్రవ్యాల మహమ్మారిపై పోరా•ం లక్ష్యంగా రథ యాత్రను సాగించారు. 2020-2022 మధ్య కాలంలో కేరళ రాష్ట్రానికి బీజేపీ అఖిల భారత ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ఫిబ్రవరి 18, 2023న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి నాలుగు నెలల కాలంలోనే రాష్ట్రంలో మొత్తం 24 జిల్లాల్లో పర్యటించారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తిం చారు. జూలై 31, 2024న మహారాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. క్రీడల విషయానికి వస్తే.. ఆయన కాలేజీ చాంపియన్, రన్నర్. క్రికెట్, వాలీబాల్ క్రీడలను ఆస్వాదిస్తారు. రాధాకృష్ణన్‌కు విదేశీ పర్యటనలంటే ఎంతో మక్కువ. అమెరికా, యూకే, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, బెల్జియం, హాలాండ్, టర్కీ, చైనా, మలేసియా, సింగపూర్, తైవాన్, థాయ్ ల్యాండ్, ఈజిప్టు, యూఏయీ, బాంగ్లాదేశ్, ఇండోనేషియా, జపాన్ దేశాల్లో పర్యటించారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలలో సుదర్శన చక్రం ప్రయోగించానని ఇండీ, కొన్ని మీడియా సంస్థలు సంబరపడిన మాట నిజం. జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి పరిస్థితి చూసిన తరువాత చాలామందికి ఒక మాట గుర్తుకొచ్చి ఉంటుంది. ‘వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు’ అన్న మాట అది. నక్సల్స్ సానుభూతి పరునిగా మొదటే జస్టిస్ సుదర్శనరెడ్డి మీద విమర్శ మొదలయింది. ఆ విమర్శకు అమిత్ షా ఇంకాస్త పదును తెచ్చారు సల్వా జుడుం వంటి నక్సల్ వ్యతిరేక ఉద్యమాన్ని అణచివేయడానికి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి న్యాయ వ్యవస్థను ఉపయోగించుకున్నా రన్నది షా ఆరోపణ. నక్సల్ ఉద్యమం రెండు దశాబ్దాలు కొనసాగేందుకు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి దోహదపడ్డారని కేంద్ర హోం మంత్రి బాహాటంగానే ఆరోపించారు.
సల్వాజుడుం స్థాపకుడు మహేంద్ర కర్మ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే. ఆయనను నక్సల్స్ చంపేశారు. మీ పుణ్యమా అంటూ సల్వాజుడుం (కోయసేన) రద్దయిన తరువాత కొన్ని వేలమందిని నక్సల్స్ చంపేశారు. ఇంకొన్ని వేల మంది గిరిజనులను నుంచి తరిమేశారు. ఇక్కడ మీరు ఎవరి హక్కులు కాపాడినట్టు? గతానికి బందీలు కారు కాబట్టి కాంగ్రెస్ వారు ఆ హింస, ప్రతిహింసలకు దారి తీసిన (అమిత్ షా దృష్టిలో) తీర్పరి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని బరిలోకి దింపింది. సల్వా జుడుం ద్వారా నక్సల్స్ హక్కులు కాపాడిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, తరువాత వారి నుంచి గిరిజనుల హక్కుల రక్షణ గురించి ఏమీ మాట్లాడలేదు.
తాను ఏ పార్టీ తరఫున బరిలోకి దిగలేదని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పదే పదే చాటుకున్నారు. ఇది జనం నమ్మే వివరణ కాదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి స్థాయి వారికి తెలియదని అనుకోలేం. ఇంతకీ వసుదేవుడంతటి వాడు అన్నమాట ఎవరి విషయంలో? గడ్డి కుంభకోణం ద్వారా చిరకీర్తిని ఆర్జించిన లాలూ ప్రసాద్ విషయంలోనే. పార్ల మెంటరీ వ్యవస్థను సక్రమ మార్గానికి తెస్తానని ఢంకా బజాయించిన తరువాత కూడా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి లాలూను కలవడం నిజంగా అక్షరాలకు అందనంత సాహస చర్య. నేషనల్ హెరాల్డ్ కేసుతో పాటు, ‘చిల్లర’మల్లర కేసులు మరో 20 కూడా ఎదుర్కొం టున్న రాహుల్ గాంధీ, దేశ పౌరురాలు కాకుండానే ఓటు హక్కు సంపాదించిన ఘటికురాలు సోనియా గాంధీ వెంటరాగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నామినేషన్ వేశారు. సెప్టెంబర్ 7వ తేదీన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి లాలూను కలుసుకున్నారు. లాలూ జీవితంలో రెండు విషయాలు సుస్పష్టం. ఒకటి, నిండా అవినీతి. రెండు, కుటుంబ పాలన పట్ల ఎనలేని విశ్వాసం. కాబట్టి జస్టిస్ గారు ఈ రెండు అంశాల మీద సంపూర్ణంగా రాజీ పడ్డారని భావించవచ్చునేమో! తామిద్దరూ సమావేశమైన సంగతిని లాలూ ప్రసాద్ అలా తొందరపడి సామాజిక మాధ్యమాలలో ప్రదర్శించి, తన మచ్చను కాస్త వెలిసేటట్టు చేసుకునే ప్రయత్నం చేస్తారని జస్టిస్ ఊహించలేదేమో మరి! లాలూ ఎంపీ కాదు. ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యేల•, ఎమ్మెల్సీలకి ఈ ఎన్నికతో పనిలేదు. మరి ఎందుకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి పనిగట్టుకుని పట్నాలో లాలూ ఇంటికి వెళ్లి కలిసినట్టు? ఉప రాష్ట్రపతిగా ఎన్నికైతే రాజ్యాంగ వ్యవస్థలకి ఇక ఇబ్బడి ముబ్బడిగా భద్రత అని చెప్పుకున్న న్యాయమూర్తి అంతరాత్మకు ఈ పని సబబు అనే అనిపించిందా? నిజానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుని ఆయన తాను కుటుంబ పాలనకు, అవినీతికి వ్యతిరేకమేమీ కాదన్న సంగతిని వ్యక్తం చేశారు. అయితే వాటికి ఆయన అనుకూలమని ముమ్మాటికీ అనలేం.
సల్వా జుడుం మీద తాను తీర్పు ఇవ్వలేదని, అది సుప్రీంకోర్టు తీర్పు అని, హోం మంత్రి ఆ తీర్పును ప్రతిని క్షుణ్ణంగా చదివి ఉండవలసిందని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి హితవు పలికారు. కానీ దీనికి అమిత్ షా స్పందిస్తే, ఆ స్పందన ఇలా ఉండేదేమో కదా! అయ్యా! న్యాయమూర్తి గారు! మీరు కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగారు. ఈ దేశంలో అత్యవసర పరిస్థితిని రుద్దిన పార్టీ అదేనని మీకు గుర్తు చేయవలసి రావడం బాధగా ఉంది. షాబానో కేసులో అవసరమైతే సుప్రీం కోర్టు తీర్పును పక్కన పెట్టి పార్లమెంట్ చేత చట్టం చేయిస్తాం అన్న పార్టీ నాయకుడు కూడా అందులో నుంచే ప్రధాని అయ్యాడు. అది కుటుంబ పాలనకు చిరునామా. ప్రధాని, కేంద్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని విలేకరుల సమావేశంలో పరపరా చింపేసిన వ్యక్తి ఇవాళ మీ ప్రధాన మద్దతుదారుడు. ఈ విషయాలేవీ మీరు పరిశీలించనట్టే ఉంది.
దేశంలో ఆర్టికల్ 356 ద్వారా 1950 నుంచి 134 పర్యాయాలు రాష్ట్రాల ప్రభుత్వాలను కూలిపోతే, అందులో సింహభాగం కాంగ్రెస్ నిర్వాకమేనన్న సంగతి మీరు సౌకర్యంగా మరచిపోయినట్టున్నారు! ఈ విస్మృతి భావ్యమా! అలా కూల్చేసిన తొలి ప్రభుత్వం మీ హృదయ సీమను అలంకరించే ఉండే కమ్యూనిస్టు పార్టీదే న్యాయమూర్తి గారు! అదే, ఈఎంఎస్ నంబూద్రి ప్రభుత్వం. కేరళలోనే కదా! ఆ పని చేసింది నెహ్రూయే. ఇంకొక జాబితా కూడా మీ ముందు ఉంచడం అవసరమనిపిస్తున్నది. ఆ 134 కూల్చివేతలలో రికార్డు సృష్టించిన వారెవరో మీకు తెలియదని చచ్చినా అనుకోలేం. ఇందిరాగాంధీయే. 356 అధికరణతో 50 సార్లు ప్రభుత్వాలను కూల్చి పారేశారు. అంతేనా, ప్రథమ ప్రధాని నెహ్రూ (7 ప్రభుత్వాలని), రాజీవ్‌గాంధీ (6 ప్రభుత్వాలు), పీవీ, మన్మోహన్‌సింగ్ (చెరి 11 ప్రభుత్వాలు) కూల్చినవారే. ఇప్పుడు ఆ పార్టీ సాయంతో మీరు రాజ్యాంగ వ్యవస్థలను రక్షించే పని, రాజ్యాంగాన్ని రక్షించే పని జమిలిగా చేపడతామంటే మీరు అమాయకత్వం నటిస్తున్నారేమోనని అనిపించక మానదు. ఇక డీఎంకే అన్న పార్టీ చేసే పనులన్నీ మీకు తెలియకుండా ఉండవు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హిందూధర్మాన్ని కరోనాతో, డెంగీతో పోల్చాడు. ఆ పార్టీ మద్దతు తీసుకుంటున్నారు కాబట్టి ఆ విమర్శలు మీకు సమ్మతమనే కదా అర్ధం! ఆ పార్టీ కుటుంబ పాలన గురించి మీరు ఏమీ అనలేరు కదా! బీసీ గణన, ఓబీసీ రాజ్యాధికారం గురించి నోటికి విశ్రాంతి లేకుండా మాట్లాడుతున్న రాహుల్ మిమ్మల్ని కాకుండా ఆ వర్గం వారిని ఎందుకు పోటీకి దింపలేదు? రాహుల్ మీరు మీ నినాదానికి కట్టుబడితే మంచిదని మీరైనా అన్నారా?
ఎన్నికలకు రెండు రోజుల ముందు, అంటే సెప్టెంబర్ 7న మీరు ఇచ్చిన పిలుపు వింటే, ఎందుకో 1969లో సరిగ్గా ఇందిరాగాంధీ ఇచ్చిన పిలుపునకు ప్రతిధ్వనిలా ఉంది. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి అని కదా పిలుపునిచ్చారు! పార్టీ సమా వేశంలో కూర్చుని నీలం సంజీవరెడ్డి పేరును ఖరారు చేసిన ఇందిర, తరువాత తన అభ్యర్థిగా వివి గిరిని నిలిపి ‘ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి’ అని పిలుపునిచ్చారు. ఇలాంటి పిలుపు మీ నోటి నుంచి కూడా రావడం సబబేనా? ఆ చర్యతో భారత ప్రజా స్వామ్యానికి వచ్చిన అపఖ్యాతిని మీరు విస్మరించడం చిత్రమే. విప్ ఉండదు కాబట్టి పార్టీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయమని చెప్పడం అనైతికమేనని మీ వంటి న్యాయ నిపుణులకు తెలియనిది కాదు. తెలుగువారైన జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయమని తెలంగాణ నుంచి తెలుగు ఎంపీలకు పిలుపు వెళ్లింది. దీనిని సమర్ధిస్తారా? అంటే తెలుగు ప్రాంతాల నుంచి ఎన్నికైన బీజేపీ సభ్యుల ఓట్లు మీకు రుచికరమేనా? అన్నట్టు ఎన్నికలలో కాంగ్రెస్ ప్రదర్శించే చేతివాటం, తుచ్ఛపు వ్యూహాలు అన్నీ మీ గెలుపు కోసం కూడా ప్రదర్శించాలని ఉబలాట పడింది. క్రాస్ ఓటింగ్ మీద కాంగ్రెస్‌కు చాలా ఆశలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ‘దేశభక్తి ఉంటే నాకు ఓటేయండి’ అని పిలుపునిచ్చిన మీరు ఇలాంటి కాంగ్రెస్ మార్కు ‘ఆశలు’ ఆత్మహత్యా సదృశమని ఎందుకు ప్రకటించలేదు? కాబట్టి మీ దేశభక్తి అంటే వేరే ఏదో! మరొక ప్రశ్న! దేశభక్తి అన్న పదం మీరు ఇంతకు ముందు ఉపయోగించిన సందర్భం ఏదైనా ఉందా? అమిత్ షా ప్రశ్నల వర్షం ఇకచాలు.
చట్టసభలను, రాజ్యాంగ వ్యవస్థలను చక్రమేసి రక్షిస్తానని చెప్పిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి విలేకరుల నుంచి రావలసిన కొన్ని ప్రశ్నలు కూడా రాలేదు. ఎందుకంటే, తమ వారిని ఇబ్బంది పెట్టడం మీడియాలో చాలామంది ఎర్ర భృత్యులకు నచ్చదు. మీకు ఆర్‌జేడీ, కాంగ్రెస్ ఓటు వేశారు. మమత పార్టీ కూడా. వీళ్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను దారుణంగా వ్యతిరేకిస్తున్నారు. దీని మీద మీ వైఖరి ఏమిటి? ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలన్న సరదా కాంగ్రెస్‌కి ఉంది. ఇది సబబేనా? ఈ ఆర్టికల్‌ను మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా రద్దు చేసిందన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా? అన్నట్టు తలాక్ తలాక్ రద్దు చేయడం ముస్లిం మహిళలకు మంచిదా కాదా? ఇవన్నీ విలేకరులు మిమ్మల్ని అడిగి ఉంటే, మీరే ఏం చెప్పి ఉండేవారో కదా!
ఏమైనా మీరు ఓడిపోవడం మీకే మేలు. రాజ్య సభలో కాంగ్రెస్ సభ్యులను నిలువరించడం మీ వంటి పెద్ద మనుషులకు సాధ్యంకాదన్నది రెండు వందల శాతం నిజం. న్యూయార్క్ టైమ్స్‌లో వార్తల ఆధారం గానో, జార్జ్ సోరోస్ మనుషుల దుష్ప్రచారా లను పట్టుకునో దిగువ సభతో పాటు ఎగువ సభను కూడా స్తంభింప చేయడం ఇటీవలి కాంగ్రెస్ వ్యూహం. దానిని మీరు నివారించే అవకాశం లేదు. ఒక వేళ మిమ్మల్ని గెలుపించుకున్నా, సభలో మీ చేత మూడు చెరువులు నీళ్లు తాగించేది. ఓడిపోయి నందుకు అభినందనలు.
– జాగృతి డెస్క్