తెలంగాణలో ఓవైపు ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల కార్యాచరణలు అందరినీ ఆహా ఓహో అనిపిస్తుంటే, మరోవైపు.. మోసపూరితమైన దందాలు సమాంతరంగా సాగిపోతున్నాయి. పక్క రాష్ట్రం పోలీసులు వచ్చి బట్టబయలు చేస్తేగానీ రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న దారుణమైన దందా గురించి స్థానిక పోలీసులు గానీ, ఇక్కడి నిఘా సంస్థలు గానీ, ప్రత్యేకంగా ఆకట్టుకునేలా పేర్లు పెట్టి మరీ రూపొందించిన ప్రత్యేక బృందాలు గానీ పసిగట్టలేక పోయాయి. అది వేలాది మంది విద్యార్థులు, యువకుల భవిష్యత్తును అంధకారంలో ముంచెత్తుతున్న వేల కోట్ల రూపాయల అక్రమ దందా.

రాష్ట్రంలో, ముఖ్యంగా రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో గణపతి నవరాత్రుల ముగింపు వేడుకలు, నిమజ్జన హోరు ఆవరించి ఉన్న సమయంలో మహారాష్ట్రలోని మిరా-భయాందర్‌, ‌వసాయి-విరార్‌ ‌పోలీసు- ఎంబీవీవీ అధికారులు అతిపెద్ద మాదక ద్రవ్యాల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌ ‌నడిబొడ్డున ఛేదించారు. పోలీసుల మెరుపు దాడుల్లో ఏకంగా 12 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడటంతో రాష్ట్ర పోలీసులు ఉలిక్కిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టుబడిన, బట్టబయలు చేసిన మాదక ద్రవ్యాల దందాల్లో ఇదే అతిపెద్దదని రికార్డులు చెబుతున్నాయి. మన పోలీసులు, దర్యాప్తు సంస్థలు మాత్రం తాపీగా ఇలాంటి దందాలపై ఉక్కుపాదం మోపుతామని, నగర శివారుల్లో ఉన్న ఇలాంటి రసాయన పరిశ్రమల గుట్టు విప్పుతామని షరా మామూలుగా మైకుల ముందు ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు.. విపక్షాలు కూడా ఈ పరిణామంపై గొంతెత్తడంతో రాజకీయంగానూ ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. పక్క రాష్ట్రం పోలీసులు వస్తే గానీ, ఇక్కడి పోలీసులకు ఏం జరుగుతుందో తెలియడం లేదా? అని నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు.

దశాబ్ద కాలంగా కొనసాగుతున్న దందా!

ఈ దందా దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగు తోందని ముంబై పోలీసులు తేల్చారు. గతంలోనే ఈ మాదక ద్రవ్యాల దందా నిర్వాహకులు పట్టుబడి జైలుకు వెళ్లినా.. బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఇదే దందా కొనసాగిస్తున్నారని తేల్చారు. అంటే, ఒకసారి ఇదే కేసులో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన నిందితుడిపై నిఘా పెట్టక పోవడంపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అంతకుముందు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ‌గానీ, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గానీ దీనిని గుర్తించక పోవడంపై విస్మయం వ్యక్తమవు తోంది. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పక్క రాష్ట్రం పోలీసులు వచ్చేదాకా ఇక్కడి పోలీసులేం చేస్తున్నారంటూ ప్రశ్నిం చారు.

తెలంగాణ పోలీసులు, నిఘా సంస్థల పనితీరు ప్రశ్నార్థకం

రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల కట్టడి కోసం ఎలైట్‌ ‌యాక్షన్‌ ‌గ్రూప్‌ ‌ఫర్‌ ‌డ్రగ్‌ ‌లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌- ఈగల్‌, ‌హైదరాబాద్‌ ‌నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌వింగ్‌- ‌హెచ్‌-ఎన్‌యీడబ్ల్యూ, డ్రగ్స్ ‌కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌-‌డీసీఏ వంటి విభాగాలను ఏర్పాటు చేసింది. అయితే ఇవేవీ మాదక ద్రవ్యాల పరిశ్రమను గుర్తించలేకపోవడం గమనార్హం.

ప్రకటనలు భేష్‌

 ‌తెలంగాణలో మాదక ద్రవ్యాల వాడకానికి తావు లేదని.. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వాళ్లు, వాటిని వినియోగిస్తున్న వాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పలుమార్లు, పలు వేదికలపై పదేపదే స్పష్టం చేస్తూనే ఉన్నారు. వీటికోసమే ఇంతకు ముందు పనిచేస్తున్న పలు సంస్థల పేర్లు ఆకర్షణీయంగా మార్చేశారు కూడా. యువతను మత్తుతో చిత్తు చేస్తోన్న ముఠాల పనిపట్టేందుకు, మాదక ద్రవ్యాలు, గంజాయి కట్టడికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రూ.12వేల కోట్ల ముడి పదార్థాలు

హైదరాబాద్‌లోని చర్లపల్లిలో వెలుగులోకి వచ్చిన మాదక ద్రవ్యాల తయారీ పరిశ్రమలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సెప్టెంబర్‌ 5‌న ఎంబీవీవీ పోలీసులు చర్లపల్లి పారిశ్రామికవాడలోని, నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబొరేటరీస్‌పై మెరుపు దాడులు చేశారు. రూ.12 వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాల తయారీకి అవసరమైన ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 5 కిలోల 968 గ్రాముల మెఫెడ్రోన్‌, 200 ‌డ్రమ్ముల్లో నిషేధిత మాదక ద్రవ్యాల తయారీకి వినియోగించే 35,500 లీటర్ల రసాయనాలు, 19 పెట్టెల్లో 950 కిలోల మిథైలిన్‌ ‌డైక్లోరైడ్‌ ‌పౌడర్‌ ఉన్నాయి. ఎంబీవీవీ పోలీసులు వాగ్దేవి ఇన్ఫో సైన్స్‌లో భారీగా నిల్వచేసిన మాదక ద్రవ్యాల పౌడర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని రెండు లారీలలో థానేకు తరలించారు. నిందితులు శ్రీనివాస్‌ ‌విజయ్‌ ఓలేటి, తానాజి పండరి నాథ్‌ ‌పట్వారీలను థానే కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాస్‌ ‌విజయ్‌ ఓలేటి దశాబ్ద కాలంగా నిషేధిత మాదక ద్రవ్యాలను తయారు చేసి డీలర్లకు అమ్ముతున్నాడు. అనుమానం రానివిధంగా ప్రతిసారి కనీసం 5 కిలోల మెఫెడ్రోన్‌ను సరఫరా చేసేవాడు. కిలో రూ.50 లక్షల చొప్పున ఏజెంట్లకు అమ్మేవాడు.

మూతపడిన కర్మాగారాల్లో తయారీ

కొన్ని ముఠాలు మాదక ద్రవ్యాల తయారీకి హైదరాబాద్‌ ‌శివార్లలో మూతపడిన కర్మాగారాలు, గోదాములను ఎంపిక చేసుకుంటున్నాయి. వాటిని అద్దెకు తీసుకుంటున్నాయి. మాదక ద్రవ్యాల తయారీ కేంద్రాలుగా మార్చేసుకుంటున్నాయి. గతంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ‌రెవెన్యూ ఇంటెలిజెన్స్-‌డీఆర్‌ఐ ‌జరిపిన సోదాల్లోనూ సంగారెడ్డి, పటాన్‌చెరు, జిన్నారం, జహీరాబాద్‌, ‌జీడిమెట్ల, బాలానగర్‌, ‌చర్లపల్లి తదితర ప్రాంతాల్లో కొన్ని మూతపడిన కర్మాగారాల్లో అల్ఫ్రాజోలం సహా ఇతర మాదక ద్రవ్యాల తయారీని గుర్తించారు.

ప్రైవేట్‌ ‌బస్సులు, కొరియర్‌ ‌సంస్థలతో సరఫరా

ల్యాబ్‌ ‌ముసుగులో మాదక ద్రవ్యాల కర్మాగారాన్ని నడుపుతుండడం.. అందులో కోట్ల రూపాయల విలువైనవి తయారవుతుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అయితే గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసినప్పటికీ వాటిని ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాల్లోని ఏజెంట్లకు చేరవేయాల్సి ఉంటుంది. ప్రైవేటు బస్సులు, కొరియర్‌ ‌సంస్థల ద్వారా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు తరలిస్తు న్నారు. అక్కడినుంచి దేశాలు కూడా దాటిస్తున్నారు. వీటన్నింటిపై నిఘా పెట్టాల్సిన ప్రభుత్వ విభాగాలు, పోలీసులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నా రన్న విమర్శలు వస్తున్నాయి.

కార్మికుడి అవతారంలో ముంబై పోలీసు అధికారి

ఎంబీవీవీకి చెందిన అధికారి నెలరోజుల ముందే వాగ్దేవి ల్యాబ్స్‌లో కార్మికుడిగా చేరారు. కంపెనీకి వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్న ముడి సరుకులు, రసాయనాలు, మాదక ద్రవ్యాల తయారీ కేంద్రం, కార్మికులు, రవాణా ఏర్పాట్లు తదితరాలపై నిఘా పెట్టారు. వివరాలు సేకరించారు. పక్కా ఆధారాలు దొరకగానే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఎంబీవీవీ ఇన్‌స్పెక్టర్‌ ‌ప్రమోద్‌ ‌భడక్‌, ‌తన బృందంతో వాగ్దేవి ల్యాబ్స్‌పై మెరుపు దాడులు చేశారు. మాదక ద్రవ్యాల తయారీ గుట్టును రట్టు చేశారు.

బెయిల్‌ ‌మీద జైలు నుంచి బైటికొచ్చి…:

ఎంబీవీవీ పోలీసులు బాంగ్లాదేశ్‌ ‌యువతి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మాదక ద్రవ్యాల పరిశ్రమను కనిపెట్టారు. నిందితుడు శ్రీనివాస్‌విజయ్‌ ఓలేటి గతేడాది ముంబైలో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదైంది. ముంబై కోర్టు బెయిల్‌ ‌మంజూరు చేయడంతో బయటకు వచ్చాడు. హైదరాబాద్‌ ‌కేంద్రంగా మాదక ద్రవ్యాల తయారీ మొదలు పెట్టాడు. కొన్నేళ్లుగా హైదరాబాద్‌ ‌నుంచి ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాలతోపాటు బాంగ్లాదేశ్‌ ‌వంటి ఇతర దేశాలకు కూడా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడు. హైదరాబాద్‌ ‌కేంద్రంగా వాగ్దేవి ల్యాబ్స్‌తో పాటు వాగ్దేవి ఇన్నోసైన్స్, అటెంటివ్‌ ‌టెక్నాలజీస్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌లను నిర్వహిస్తున్నాడు.

రసాయనిక కర్మాగారాలు, గోదాములపై నిఘా

మాదక ద్రవ్యాల పరిశ్రమ వెలుగులోకి రావడంతో రాచకొండ పోలీసులతో పాటు, ఈగల్‌, ‌హెచ్‌-ఎన్‌యీడబ్ల్యూ, డీసీఏ సిబ్బంది అప్రమత్త మయ్యారు. రసాయనిక కర్మాగారాలపై , మూతపడిన కంపెనీలు, గోదాములపైన నిఘా పెంచారు.

సుజాత గోపగోని

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE