ఆం‌ధప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ సారథ్య యాత్ర ముగింపు సందర్భంగా విశాఖ రైల్వే మైదానంలో సెప్టెంబరు 14న నిర్వహించిన భారీ బహిరంగ సభ రాజకీయ, అభివృద్ధి చర్చలకు కేంద్రంగా మారింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ముఖ్య అతిథిగా ఈ సభలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఎన్‌. ‌చంద్రబాబు నాయుడు నాయకత్వంతో రాష్ట్రం అసాధారణ వృద్ధి సాధించనుందని నడ్డా ప్రకటించారు. గత వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం హామీల నెరవేర్చడం ద్వారా ప్రజల ఆశలను తీరిస్తోందని స్పష్టం చేశారు.

ఆంధప్రదేశ్‌ ‌ప్రధానమంత్రి మోదీ హృదయంలో ఉందని, ఆయన కూడా రాష్ట్ర ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని నడ్డా తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అంధకారం, అసమర్థ పరిపాలన రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని ఆయన ఆరోపించారు. ‘ఆర్థిక అస్థిరత, పెండింగ్‌ ‌ప్రాజెక్టులు లాంటివి ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించాయి. నేను తిరుపతికి వచ్చినప్పుడు ఈ పరిస్థితిని స్వయంగా గమనించి, మార్పు తీసుకురావాలని నిర్ణయించు కున్నాను. ఫలితంగా 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి భారీ మెజారిటీ ఇచ్చారు. ఇది రాజకీయ మలుపు మాత్రమే కాదు. ప్రజాస్వామ్య విజయం. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఈ అభివృద్ధి కూటమి బలాన్ని ప్రకటిస్తూ,రెండు పార్టీల మధ్య సమన్వయాన్ని సూచిస్తుందన్నారు.

మున్నెన్నడూలేని ప్రాధాన్యం

ఆంధప్రదేశ్‌కు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నంత ప్రాధాన్యం గతంలో ఎన్నడూ లేదని నడ్డా పేర్కొన్నారు. రాష్ట్రంలో 9 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మితమవుతున్నాయని,ఇది అనుసంధాతను మెరుగుపరచి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను సులభతరం చేస్తుందని అన్నారు.స్మార్ట్ ‌సిటీలు, సాగరమాల పథకం కింద 14 పోర్టుల అభివృద్ధి – విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం రేవులు రాష్ట్రాన్ని ఎగుమతుల హబ్‌గా మారుస్తాయన్నారు. ఇప్పటికే ఆంధ్ర ఎడ్యుకేషనల్‌ ‌హబ్‌గా మారిందని, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు సాయం అందిస్తున్నామని తెలిపారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు, గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌ప్రాజెక్టు, రూ.625 కోట్లతో భోగాపురం విమానాశ్రయానికి ఆర్ధిక సహాయం – ఇవి రాష్ట్ర అభివృద్ధికి మైలురాళ్లు. ఆరు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తుంది. ఇవన్నీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు.

 బీజేపీ 14 కోట్ల సభ్యులతో, 2 కోట్ల మంది క్రియాశీల కార్యకర్తలతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా విస్తరించిందని నడ్డా వర్ణించారు. దేశంలో పార్టీ తరపున అత్యధిక మంది ఎంపీలు, 1,500 మంది ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాల్లో ప్రజాప్రతినిధులతో ఉన్నట్టు పునరుద్ఘాటించారు. గతంలో 11 ఏళ్ల కిందటి ప్రభుత్వాలు మేనిఫెస్టోలు లేకుండా అవినీతి, వారసత్వ రాజకీయాలతో నడిచాయని విమర్శిస్తూ, మోదీ ప్రభుత్వం హామీలతో ముందుకు సాగుతూ వాటిని నెరవేర్చినట్లు అడుగుతోందని చెప్పారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్‌. ‌మాధవ్‌ ఆధ్యర్యంలో సాగిన సారథ్య యాత్ర పార్టీ విస్తరణకు ఒక గొప్ప అవకాశంగా నడ్డా పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ జెండాను ప్రతి గ్రామంలో ఎగురవేయాలని కార్యకర్తలకు సూచిం చారు. ప్రభుత్వ పథకాలను,  ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన, పిఎం కిసాన్‌, ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌లాంటివి ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజల్లోకి చేర్చాలని చెప్పారు.

 జీఎస్టీ 2.0 భావి తరాలకు మేలు

ఆర్థిక సంస్కరణలను ప్రస్తావించిన నడ్డా.. జీఎస్టీ 2.0ను భవిష్యత్‌ ‌తరాలకు మేలు చేసే సంస్కరణగా వర్ణించారు. రెండు స్లాబుల్లో పన్నులు ఉండడంతో సామాన్యులపై భారం తగ్గుతుందని, ముఖ్యంగా ఆరోగ్య బీమాపై పన్ను ఎత్తివేస్తూ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. వ్యవసాయం, చిన్న పరిశ్రమలపై ఆధారపడిన రాష్ట్రానికి జీఎస్టీ తగ్గింపు ఊతం ఇస్తుందని, అన్ని విధాల ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. 11 ఏళ్ల మోదీ పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. ఔషధ రంగంలో భారత్‌ ‌గ్లోబల్‌ ‌హబ్‌గా మారిందని చెబుతూ, ప్రపంచ వ్యాప్తంగా మందుల సరఫరా ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. అంతేకాకుండా, భారత్‌లో 92శాతం మొబైల్‌ ‌ఫోన్‌లు తయారవుతున్నాయని చెప్పారు. ‘మేక్‌ ఇన్‌ ఇం‌డియా’ చొరవతో, సామ్‌సంగ్‌, ఆపిల్‌ ‌లాంటి కంపెనీలు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశాయన్నారు. తిరుపతి, విశాఖలో పలు పారిశ్రామిక యూనిట్లు ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. ఇది ఆర్థిక వృద్ధికి, యువతకు అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని అభివర్ణించారు.

‘సారథ్యం’ మరో ఆరంభం

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ ‌మాధవ్‌ ‌స్పష్టం చేశారు. ఈ ‘సారథ్యం’ ముగింపు ముగింపు కాదని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరించడానికి ఇదో ఆరంభమని అన్నారు. త్వరలో ‘సారథ్యం’ మలివిడత యాత్ర ప్రారంభిస్తామన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఉనికికి త్యాగం చేసినవారు, సర్వస్వాన్ని సమర్పించినవారి త్యాగాలను స్మరించుకోడానికి ఈ యాత్ర లక్ష్యమని చెప్పారు. ఈ యాత్రలో భాగంగా చాయ్‌పే చర్చ ద్వారా స్ధానిక సమస్యలు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశామన్నారు. ‘ప్రధానిని కలసిన సందర్భంలో ట్రంప్‌ ‌సుంకాలను ఎదుర్కోవ డానికి మరో స్వదేశీ ఉద్యమం చేపట్టాలని సూచిం చారు. డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌తో రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తున్నాం. జీఎస్టీ సరళీకరణతో నిత్యావసర సరకుల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశం నుంచి పేదరికం తొలగేలా కేంద్రం పథకాలు రూపొందిస్తోంది. సౌత్‌ ‌కోస్టల్‌ ‌రైల్వే జోన్‌ ఇచ్చి ఈ ప్రాంత ప్రజల కలను మోదీ సాకారం చేశారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను కల్పించ నున్నార’ అని మాధవ్‌ ‌చెప్పారు.

భవిష్యత్‌ ‌వృద్ధి ఆశలు: సత్యకుమా

రాష్ట్రంలో బీజేపీకి బలం తక్కువని ఇతర పార్టీలు భావిస్తున్నాయని, కానీ ఈ సభకు తరలి వచ్చిన జనసమూహం దానికి సరైన సమాధానం లాంటిదని రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి వై. సత్యకుమార్‌ ‌యాదవ్‌ అన్నారు. మోదీ-చంద్రబాబు నాయకత్వంలో వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో అసాధారణ వృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి వికసిత్‌ ‌భారత్‌ ‌నినాదంతో విశ్వగురు స్థానానికి చేరుకోవడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. ఐదేళ్ల వైసీపీ విధ్వంసం నుంచి బయటపడేందుకు చర్యలు చేపడు తున్నామన్నారు. బీజేపీని సంస్థాగతంగా విస్తరించా ల్సిన అవసరం ఉందని, ఇందుకు కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలన్నారు.

విశాఖకు మోదీ ప్రాధాన్యం

కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, కేంద్రంలో మోదీ మూడో సారి అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షల కోట్ల నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా విశాఖకు మోదీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చి రెండుసార్లు వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా విశాఖ గిన్నీస్‌ ‌బుక్‌లో నమోదైందన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు, స్టీల్‌ ‌ఫ్యాక్టరీకి రూ.11,500 కోట్లు ప్యాకేజీని ఇచ్చినట్లు చెప్పారు. నక్కపల్లిలో ఆర్‌ఎస్‌ఎల్‌ ‌మిట్టల్‌ ‌స్టీల్‌ ‌ప్లాంట్‌ అనుమతులు మంజూరు చేస్తోందన్నారు. దేశంలో పలు పార్టీలు నాయకత్వలేమితో ఉన్నాయని, కానీ బీజేపీ కార్యకర్తల నుంచి అగ్రనేతల ఆధారంగా పనిచేస్తోందన్నారు. పార్టీని కేంద్రంలో మూడోసారి అధికారంలోకి తెచ్చిన ఘనత నడ్డాకే దక్కు తుందన్నారు.

బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు విష్ణు కుమార్‌రాజు మాట్లాడుతూ, ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు రాష్ట్రానికి కేంద్రం అందిస్తోందన్నారు. 2019లో రాష్ట్ర ప్రజలు పొరపాటున వైసీపీకి పట్టం కట్టడం వల్ల రాష్ట్రం ఐదేళ్లపాటు సర్వనాశన మైందన్నారు. మోదీ, చంద్రబాబునాయుడు, పవన్‌ ‌కల్యాణ్‌ ‌కలయికతో రాష్ట్రం వికసిత్‌ ఏపీగా రూపాంతరం చెందుతోందన్నారు.

బీజేపీ జాతీయ సంయుక్త కార్యదర్శి శివప్రకాశ్‌, ఎం‌పీలు సీఎం రమేష్‌, ఆర్‌.‌కృష్ణయ్య, పాకా సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఈశ్వరరావు, పార్థసారథి, సుజానా చౌదరి, కామినేని శ్రీనివాసరావు, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE