ఈశాన్య భారతదేశంలో ఉన్న మణిపూర్ అక్కడి ఇతర రాష్ట్రాల వంటిది కాదు. అనేకానేక సమస్యలకు నిలయం. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగానే కాదు, అనేక స్వార్థ పూరిత శక్తులకు కూడా ఆటపట్టుగా మారింది. నెహ్రూ జన్మనిచ్చిన ఏ సమస్యకూ ఒక పట్టాన పరిష్కారం సాధ్యం కాదనడానికి ఒక ఉదాహరణ మణిపూర్ సమస్య. మణిపూర్ రాష్ట్రంలో కూడా చిక్కుముళ్లు ఎక్కువ. సెప్టెంబర్ 13న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు సమస్య చాలావరకు పరిష్కారమయిందనే అభిప్రాయం అక్కడి ప్రజల్లో కలిగింది. ఇది ఒక్క రోజులో పరిష్కారమయ్యే సమస్య కాదు. కానీ, మోదీ పర్యటనతో దాదాపు యాభై శాతం పరిష్కారమయ్యే సూచనలు కనిపించాయి. మణిపూర్ రాష్ట్రంలోని మైతీలు, కుకీల మధ్య రెండున్నర ఏళ్ల క్రితం ప్రారంభమైన ఘర్షణలు, వివాదాలకు ఇక తెరపడే రోజులు సమీపించాయి.
మణిపూర్‌లో సంఘర్షణలు ప్రారంభమైన రెండున్నర ఏళ్లకు మోదీ ఈ రాష్ట్రాన్ని సందర్శించడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ సమస్య ఆద్యంతాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి మోదీ. ఈ సమస్యను పరిష్కరించడానికి సమయం పడుతుందని ఆయనకు, హోం మంత్రి అమిత్ షాకు క్షుణ్ణంగా తెలుసు. ఇంటెలిజెన్స్ వర్గాలతో సహా అనేక మార్గాల్లో వీరు మణిపూర్ సమస్యను అధ్యయనం చేస్తూనే ఉంటా రన్నది అందరికీ తెలిసిన విషయమే. మయన్మార్, బాంగ్లాదేశ్ దేశాల నుంచి కుకీలు, నాగాల చొరబాట్లు, గంజాయి పెంపకం, మణిపూర్‌నే కాక, యావత్ ఈశాన్యరాష్ట్రాలను క్రైస్తవ దేశంగా మార్చాలన్న విదేశీ కుట్రలు, విదేశీ ఆయుధాలు, నిధుల ప్రవాహం, ఇక్కడి రెండు వర్గాల మధ్య ఘర్షణలు పెంచాలన్న రాజకీయ పార్టీల ప్రయత్నాలు, డీప్ స్టేట్ కుట్రలు, కుతంత్రాలు వగైరాలన్నిటినీ పరిశీలించి, వీటన్నిటికీ అడ్డుకట్ట వేయడం వంటివి ఒక్క రోజులో, ఒక్క సంవత్సరంలో పరిష్కారమయ్యే వ్యవహారాలు కావు. అత్యంత జటిలమైన కశ్మీర్ సమస్యతో సహా అనేకానేక దేశ సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్న మోదీకి వీటిని ఢల్లీిలోనే కూర్చుని పరిష్కరించాల్సి ఉంది. ఇంత కాలంగా ఆయన అవే ప్రయత్నాలు చేస్తున్నారు.
అభివృద్ధికి పెద్ద పీట
ఇంతకూ ఆయన తన మూడు గంటల మణిపూర్ పర్యటనలో ఏ వర్గం వైపునా మాట్లాడలేదు. ఏ వర్గాన్నీ సమర్థించలేదు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలను పెంచడం, విద్య, వైద్య సదుపాయాలను విస్తృతం చేయడంవంటి విషయాల మీదే ఆయన దృష్టి కేంద్రీకరించారు. ప్రజల నాడిని పట్టుకునేందుకు వీలైనంతగా ప్రయత్నించారు. చురా చాంద్‌పూర్ లోని పీస్‌గ్రౌండ్స్‌లోనూ, ఇంఫాల్‌లోని కాంగ్లా ప్రాంతంలోనూ ఆయన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కుకీలకు ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండును గానీ, ఘర్షణల తర్వాత ప్రారంభమైన పునరావాస కేంద్రాలను ఎత్తేయాలన్న డిమాండును గానీ, మైతీలు కోరుతున్నట్టుగా జాతీయ రహదార్లపై స్వేచ్ఛగా రాకపోకలు సాగించడానికి వీలు కల్పించే విషయం మీద కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఆయన ఈ రెండు ప్రాంతాల్లోనూ పిల్లలతో కలుపుగోలుగా వ్యవహరించారు. ఇక్కడి నిరాశ్రయుల సమస్య గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు కానీ, ఆయనతో పాటు ఈ రెండు ప్రాంతాల్లోనూ పర్యటించిన రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా మాత్రం ఈ నిరాశ్రయులకు పునరావాసం కల్పించ డానికి పథకాలను రూపొందించినట్టు ప్రకటించారు. ముఖ్యంగా నిరాశ్రయులందరికీ ఇళ్లు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు కూడా చెప్పారు. తమ గురించి ప్రస్తావిస్తారని, తమకు వాగ్దానాలు చేస్తారని, వరాల వర్షం కురిపిస్తారని ఎదురు చూసిన కుకీలు, మైతీలు తప్పకుండా హతాశులయి ఉంటారు. మణిపూర్ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఎటువంటి చర్యలు చేపట్టకూడదు వంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలతో పత్రికల శీర్షికలను నింపుతున్న స్థానిక రాజకీయ నాయకులు, వ్యాఖ్యాతలు, పత్రికా ప్రతినిధులు కూడా హతాశులు అయి ఉంటారనడంలో సందేహం లేదు.
భవిష్యత్ ప్రణాళిక
అయితే, మణిపూర్ రాష్ట్రం విషయంలో మోదీకి ప్రత్యేక విజన్ ఉన్నట్టు ఆయన ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను బట్టి తేలికగా అర్థమవుతోంది. ఆయన ఈ విమర్శలను, ఆరోపణలను పట్టించుకునే అవకాశం లేదు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చిన ప్రధాని ఘర్షణ వర్గాల మధ్య చిచ్చుపెట్టే అవకాశం లేదు. అది ఒక రాజనీతిజ్ఞుడు చేయదగిన పని కాదు. ఈ రాష్ట్రంలో కుకీలు, మైతీలే కాక 33 గుర్తింపు పొందిన ఆదివాసీ జాతులున్నాయి. వారి సమస్యలను కూడా మోదీ పరిశీలించాల్సి ఉంది. ఇందులో కొన్ని జాతుల జన సంఖ్య కంటే కుకీలు, మైతీల సంఖ్య బాగా తక్కువ. అయితే, మైతీలు, కుకీల మధ్య ప్రారంభమైన వివాదానికి మాత్రం సుదీర్ఘ చరిత్ర ఉంది. మే 3, 2023 నుంచి ఈ రెండు వర్గాల మధ్య అకస్మాత్తుగా ఘర్షణలు చెలరేగడంతో మణిపూర్ సమస్య ఒక్కసారిగా పతాక శీర్షికలకు ఎక్కింది. స్థానిక రాజకీయ నాయకులు, ఆదివాసీ నాయకులు విదేశీ శక్తుల సహాయ సహకారాలతో ఈ రెండు వర్గాల మధ్య మంటల్ని ఎగదోయడంతో ఈ చిచ్చు రేగింది.
నిజానికి, ఈ రెండు వర్గాలు చర్చల ద్వారా సామరస్యంగా తమ సమస్యలను పరిష్కరించుకోవడా నికి అవకాశం ఉంది. అటవీ భూముల నుంచి కబ్జాదారులను వెళ్లగొట్టడం, మైతీలలో కొన్ని వర్గాలకు ప్రత్యేక ఆదివాసీ హోదా కల్పించాలని డిమాండ్ చేయడం, గంజాయి పెంపకానికి వ్యతిరేకంగా పోరాడడం, మయన్మార్, బాంగ్లాదేశ్‌ల నుంచి అక్రమ చొరబాట్లు జరగకుండా అడ్డుకోవడం వంటి సమస్యలను చట్టపరంగా, ప్రభుత్వపరంగా పరిష్క రించుకోవడానికి అవకాశం ఉన్నా స్థానిక రాజకీయ నాయకులు ఈ సమస్యలను పక్కదోవ పట్టించి, ఇక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి దీనినొక ఆయుధంగా వాడుకోవడం ప్రారంభించారు. నాగాలు, కుకీలు, మైతీలు ఈ రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారిపోయారు. ఇక్కడి విభిన్న వర్గాల మధ్య చర్చల ద్వారా సామరస్యాన్ని పెంచ డానికి, సమస్యలను పరిష్కరించడానికి మోదీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారు.
సామరస్యానికి ప్రాధాన్యం
పర్వత ప్రాంతాల్లో స్థిరపడడానికి కలిసి కట్టుగా ప్రయత్నిస్తున్న కుకీలు, నాగాలు ఇప్పుడు ఎవరికి వారే తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది మయన్మార్ నుంచి అక్రమంగా మణిపూర్ రాష్ట్రంలో చొరబడినవారే. ఇక్కడి జాతు లందరి మధ్యా ఏకాభిప్రాయం సాధించడమన్నది చిన్న విషయం కాదు. ఆషామాషీ వ్యవహారం అంతకంటే కాదు. మోదీ, అమిత్ షాలు ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఇక్కడి కార్యక్రమాల్లో ఈ సమస్యలను ప్రస్తావించకపోవడాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ రెండున్నరేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం మయన్మార్, బాంగ్లాదేశ్ వైపుల నుంచి అక్రమ వలసలను నివారించడానికి ఇక్కడ పెద్ద ఎత్తున కంచెల నిర్మాణం చేపట్టింది. భద్రతా వ్యవస్థలను కట్టుదిట్టం చేసింది. కుకీలు, మైతీల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న నాయకులను, విదేశీ శక్తులను గుర్తించి, ఏరిపారే యడం మొదలు పెట్టింది. ఇక్కడి క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయంటూ విదేశీ శక్తులు, విదేశీ పత్రికలు చేస్తున్న విష ప్రచారాన్ని అడ్డుకునేందుకు, తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. సామాన్య ప్రజానీకం శాంతియుతంగా జీవించడానికి, శాంతిభద్రతలను కాపాడడానికి కూడా పాలనాపర మైన చర్యలు తీసుకుంటోంది.
ఇక మోదీ స్వల్పకాలిక పర్యటనతో కుకీలు, నాగాలు, మైతీలకే కాక, ఇక్కడి రాజకీయ నాయకులకు అర్థమైన విషయమేమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ హింసాకాండను ఎటువంటి పరిస్థితుల్లోనూ సహిం చదు. ఏ సమస్యనైనా చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందే. హింసాకాండ ద్వారా తమ కోర్కెలను, డిమాండ్లను సాధించుకోవడానికి అవకాశమిచ్చే పక్షంలో ప్రభుత్వాలను స్తంభింపజేయ డానికి ప్రతి వర్గమూ ప్రయత్నం చేస్తుంది. ఇతర వర్గాలు కూడా ఇదే ఆయుధాన్ని వీలైనప్పుడల్లా ప్రయోగిస్తుంటాయి. ఈ ఉచ్చులో కేంద్రప్రభుత్వం పడే అవకాశం లేదు. సుమారు రూ. 8,500 కోట్ల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మోదీ ఇక్కడి నుంచి ‘వికసిత్ భారత్, వికసిత్ మణిపూర్’ అనే పిలుపునిచ్చారు. అన్ని సమస్యలకూ సమాధానం అదే. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక సదుపాయాల కల్పనకు మోదీ ప్రభుత్వం ఇక నుంచి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. మణిపూర్ కోసం మోదీ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. మణిపూర్ సమస్యల పరిష్కారానికి, వివిధ వర్గాల మధ్య సఖ్యతను, సామరస్యాన్ని పెంపొందించడానికి మోదీ ప్రభుత్వం వినూత్న మార్గాన్ని ఎంచుకుంది.
విచిత్రమేమిటంటే, తమకు ఎటువంటి వరాలూ ప్రకటించలేదని, ఎటువంటి హామీలు ఇవ్వలేదని మొదట్లో కినుక వహించిన మైతీలు ఆ తర్వాత మోదీ ప్రభుత్వ ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో మోదీ అనేక పర్యాయాలు మణిపూర్‌ను సందర్శించే అవకాశం ఉంది. పైకి చెప్పకుండానే వివిధ వర్గాల ఆశలు, ఆకాంక్షలు, కోర్కెలు, డిమాండ్లను నెరవేర్చ డానికి కూడా అవకాశం ఉంది. మణిపూర్ సమగ్ర తను కాపాడడమే మోదీ ప్రధాన ధ్యేయంగా కనిపి స్తోందంటూ స్థానిక బీజేపీ శాసనసభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఏకాభిప్రాయంతో, ప్రజల ప్రమేయంతో సమస్యలను పరిష్కరించడమే మోదీ ఉద్దేశం. మణిపూర్‌లో ఆ దిశగా మొదటి అడుగుపడిరది.
– జి.రాజశుక, సీనియర్ జర్నలిస్ట్