వ్యవసాయానికి నీటి పారుదల సదుపాయాలే ప్రాణం. తాగునీటికైనా, సాగునీటికైనా బహుళార్థ సాధక ప్రాజెక్టులతో పాటు.. నీటి పారుదల ప్రాజెక్టులే అధికంమొత్తంలో ఆధారంగా ఉన్నాయి. కానీ, అలాంటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులను గాలికి వదిలేసిందన్నవాదనలూ వినిపిస్తున్నాయి. వివిధ డ్యామ్‌ల నిర్వహణలో సర్కారు అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, వాటి పర్యవేక్షణ, నిర్వహణ లోపభూయిష్ఠంగా మారిందని వ్యవసాయ వేత్తలు, నిపుణులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రధాన ప్రాజెక్టు లకు కూడా సకాలంలో అవసరమైన మరమ్మతులు పూర్తి చేయడం లేదని అంటున్నారు.
రాష్ట్రంలోని పలు జలాశయాల నిర్వహణను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని, అరకొర పనులతో సరిపెట్టేస్తోందనే విమర్శలు వినిపిస్తు న్నాయి. చిన్న నీటి పారుదల ప్రాజెక్టులను పక్కనబెట్టినా.. కనీసం కీలక ప్రాజెక్టుల నిర్వహణ విషయంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందంటున్నారు. నాగార్జున సాగర్ స్పిల్‌వేకు ఈ ఏడాది మరమ్మతులు చేయలేదు. జూరాల ప్రాజెక్టులో గేట్ల రోప్‌లు తెగిపోయాయి. శ్రీశైలం గేట్లను ఐదేళ్లలో మార్చాల్సిందేనని నిపుణులు సూచనలు, సలహాలు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవు తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు కొన్నిసార్లు రూ.కోట్ల ఖర్చుతో మరమ్మతులు చేసినా. అవి అరకొరగా ఉండడంతో ఉపయోగం లేకుండా పోతోందని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 66 క్రస్టు గేట్లకు మరమ్మతుల కోసం 2022లో టెండర్లు పిలిచి మరుసటి సంవత్సరానికి కొంతమేర పనులు చేశారు. రూ. 11 కోట్లతో చేపట్టిన ఈ పనులు నిర్ణీత సమయంలో పూర్తి కాకపోవడంతో 8 గేట్లకు సంబంధించిన రోప్‌లు తెగిపో యాయి. మరోవైపు.. శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను కూడా మార్చాల్సిందేనని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేశారు. లేదంటే ఆ ప్రాజెక్టుకు తుంగభద్ర ప్రాజెక్టు పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. గత ఏడాది తుంగభద్ర డ్యామ్ గేటు వరద నీటిలో కొట్టుకుపోవడం ఇంకా మర్చిపోలేదు. నిర్ణీత గడువులో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను మార్చకపోతే తుంగభద్ర డ్యామ్ అనుభవం పునరావృతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో ప్రధాన ప్రాజెక్టు నాగార్జున సాగర్ స్పిల్‌వేకు కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడం లేదంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్‌వే మరమ్మతులు ఈ ఏడాది చేయించలేదన్న చర్చ నడుస్తోంది. 1967లో నిర్మాణం పూర్తయిన ఈ ప్రాజెక్టు స్పిల్‌వేకు ఇప్పటి వరకు నాలుగుసార్లు మరమ్మతులు చేశారు. చివరిసారిగా 2023లో రూ.20కోట్లతో బాగు చేయించారు. అయితే, ఈ స్పిల్‌వేపై మళ్లీ భారీ గుంతలు ఏర్పడడంతో ఆధునిక పరిజ్ఞానంతో శాశ్వత ప్రాతిపదికపై మరమ్మతులు చేపట్టాలని నిపుణులు సిఫారసు చేశారు. స్పిల్‌వే వద్ద కదిలే క్రేన్‌ను ఏర్పాటు చేస్తే మరమ్మతులు సులభమవుతాయని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఢిల్లీకి చెందిన నీటి పారుదల రంగ నిపుణుల బృందం ఓ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులతో గత జూన్‌లో సాగర్ స్పిల్‌వేను పరిశీలించింది. నిధులు కేటాయించగానే తొలుత ఒక గేటు స్పిల్‌వేకు మరమ్మతులు చేసి, ఈ ఏడాది వరదల్ని తట్టుకుంటే మిగిలిన అన్ని స్పిల్‌వేలకూ మరమ్మతులు చేపడతామని ఆ బృందం ప్రభుత్వానికి వెల్లడించింది. అయితే, ఆ దిశగా ఇంకా ఎలాంటి అడుగులూ పడలేదంటున్నారు. ఇక, రాష్ట్రంలోనూ, ఎగువనా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సాగర్‌కు వరద కొనసాగుతోంది. అంటే.. ఇక, ఈ ఏడాదికి సాగర్ స్పిల్‌వే మరమ్మతులు ప్రారంభించే అవకాశం లేదు. అయితే, క్రస్ట్ గేట్లకు మాత్రం సర్వీసింగ్ పూర్తి చేశారు. ఏటా జూన్‌లో క్రస్ట్ గేట్ల రబ్బరు సీళ్లను సరిచేయడం, గేట్లను ఎత్తడానికి ఉపయోగించే రోప్‌లకు గ్రీజింగ్ చేయడం, మోటార్ల సర్వీసింగ్ వంటి పనులు చేపడతారు.ఈ పనులు మాత్రం పూర్తి చేసినట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.
శాలి గౌరారం ప్రాజెక్టు చూస్తే.. ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేసిందన్న విమర్శలు వస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో 6 వేల ఎకరాలకు సాగునీరు, 50 గ్రామాల్లో భూగర్భజలాల పెంపునకు శాలిగౌరారం ప్రాజెక్టు దోహదపడుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన షట్టర్లు శిథిలమై పదేళ్లు గడిచినా వాటిని మార్చే ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ అటువైపుగా దృష్టి సారించక పోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు చెందిన కుడికాల్వ తూముకు గల నాలుగు షట్టర్లకు గాను ప్రస్తుతం ఒకటి, ఎడమకాల్వ తూముకు గల రెండు షట్టర్లలో ఒకటి మాత్రమే పనిచేయడంతో డ్యామ్‌లోని నీరు వృథాగా పోతోంది.
నల్లగొండ జిల్లాలోనే పురాతనమైనదిగా పేరుపొందిన డిండి ప్రాజెక్టు నిర్వహణ విషయం లోనూ అధికారులు శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. 2.4 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్‌కు మూడు షట్టర్లలో, మధ్య షట్టర్ నుంచి నిరంతరాయంగా నీరు బయటకు వెళ్లిపోతోంది. అంతేకాదు.. స్పిల్‌వే ముందు భాగంలో కంప చెట్లను కూడా తొలగించడం లేదు. ఈ ప్రాజెక్టు కనీస నిర్వహణపైనా దృష్టి పెట్టకపోవడంతో నీటి లీకేజీలు ఎక్కువగా ఉంటున్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల, కోయిల్ సాగర్, రామన్‌పాడు, సరళా సాగర్ జలా శయాల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. జూరాల ప్రాజెక్టుకు 66 క్రస్టు గేట్లకు గాను, 8 గేట్ల రోప్స్ తెగిపోయాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ రచ్చకు దారితీయడంతో ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపట్టింది. కోయిల్‌సాగర్ రిజర్వాయర్ గేట్లకు రబ్బర్ సీళ్లు సరిగా లేవని, గ్రీజింగ్ కూడా సరిగా చేయడం లేదని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం 13 గేట్లలో రెండు సరిగా పనిచేయడం లేదట. ప్రాజెక్టు నిండి గేట్లు ఎత్తిన సమయంలో తప్ప మిగతా సమయాల్లో పర్యవేక్షణ ఉండడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్వహణకు ఏటా రూ. 3 లక్షలు మాత్రమే కేటాయిస్తున్నారు.
రామన్‌పాడు ప్రాజెక్టు గేట్ల రబ్బర్ సీల్స్ కూడా సరి చేయడంలేదు. రోపులకు గ్రీజింగ్ చేయడం లేదు. రెండు వైపులా ఉండే స్లూయిజ్ గేట్లకు సర్వీసింగ్ లోపంతో లీకేజీలు అవుతున్నాయి. మరమ్మతులకు రూ. 4 కోట్లు అవసరమని అధికారులు పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర అలాగే ఉన్నాయి. కరీంనగర్‌లోని దిగువ మానేరు డ్యామ్‌కు (ఎల్‌ఎండీ) 20 గేట్లకు గాను, 2022లో 10 గేట్లకు ట••ర్ రోప్‌లు కొత్తవి వేశారు. మిగిలిన వాటికి రోప్‌లు మార్చేందుకు రూ. 4 కోట్లు అవసరమని అధికారులు అంచనాలు పంపించారు. ఎల్‌ఎండీకి రివర్స్ స్లూయిజ్ గేటు కుడివైపు మాత్రమే ఉంది. డ్యాం డెడ్ స్టోరేజీకి చేరుకుంటే కానీ.. వాటిని సర్వీసింగ్ చేసేందుకు వీలుండదు. మిడ్‌మానేరు ప్రాజెక్టు నాణ్యత, నిర్వహణ విషయంలో పెద్దగా ఫిర్యాదులేమీ లేవు. ఇల్లంత కుంట మండలం అనంతగిరి సమీపంలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది. 15 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను మేఘా కంపెనీకి అప్పగించారు.
రామగుండం, మంచిర్యాల మధ్యన నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు. ఎల్లంపల్లి బ్యారేజీకి 62 రేడియల్ గేట్లను అమర్చారు. వీటికి మరమ్మతులు జరుగుతున్నాయని చెబుతున్నారు.అయితే, మధ్య మధ్యలో వచ్చే వరదల కారణంగా మరమ్మతులకు అంతరాయం కలుగుతోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో 50 టీఎంసీల నీటి సామర్థ్యం గల డ్యాం ఎడవ కాలువ యూటీ (132 కి.మీ. వద్ద) గత సంవత్సరం వరదలకు కూలింది. ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయి. లైనింగ్ పనులు ప్రారంభం కాలేదు. ఎడమ కాలువకు నాయకన్‌గూడెం దగ్గర అవుట్ ఫాల్ గేటు ఒకటి మాత్రమే పనిచేస్తోంది. మరో గేటు పనిచేయడం లేదు. పాలేరు వద్ద ఇన్‌ఫాల్ గేటు రబ్బర్లు అరిగి నీరు వృథాగా పోతోంది. మినీ హైడల్ ప్రాజెక్టుకు మరమ్మతులు జరుగుతున్నాయి. కాలువపై పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పెరిగిపోయాయి. నేపథ్యంలో అక్కడి 15 మంది సిబ్బందిగా ఏడాదిగా కూర్చోపెట్టి జీతాలు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 0.75 టీఎంసీలు. కుడి, ఎడమ కాలువల ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతోంది. ప్రాజెక్టుకు 25 గేట్లు ఉండగా రెండేళ్ల క్రితం వాటికి సీళ్లు వేశారు. మొత్తం ప్రాజెక్టు సెన్సార్లతో పనిచేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించిన ఇనుము తుప్పు పడుతోంది. 1976లో నిర్మితమైన ఈ ప్రాజెక్టుకు ఇప్పటి దాకా కనీసం రంగులు కూడా వేయలేదు. ప్రాజెక్టు సబ్‌స్టేషన్ నుంచి ఉన్న విద్యుత్తు స్తంభాలు పడిపోవడంతో సరఫరాను నిలిపేశారు. సత్యనారాయణపురం సబ్‌స్టేషన్ నుంచి తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. మొత్తం 12 మంది సిబ్బంది అవసరం కాగా, ఆరుగురు మాత్రమే ఉన్నారు. వరదలు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు, సిబ్బంది ఉంటున్నారని చెబుతున్నారు.
భదాద్రి జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు 13 గేట్లున్నాయి. 7, 8, 9, 10 గేట్లలో రబ్బర్ సీళ్లు అరిగి పోవడంతో స్వల్పంగా నీరు లీక్ అవుతోంది. వరదలు వచ్చిన సమయంలో నీటి లీకేజీ ఎక్కువగా ఉంటోంది. గేట్లు ఎత్తిన సందర్భాల్లో సిల్ప్‌వేపై గుంతలు పడుతుండగా ఏడాదికోసారి మరమ్మతులు చేస్తున్నారు. ప్రాజెక్టు రెండువైపులా ఉండే స్లూయిజ్ గేట్లకు సర్వీసింగ్ చేయడం లేదు. ప్రాజెక్టుకు కొత్త సెన్సార్లు అమర్చడం లేదు. పెనుబల్లి మండలంలోని లంకసాగర్ డ్యామ్‌కు ఇరువైపులా లీకులు కనిపిస్తున్నాయి. జలాశయం ఆనకట్ట బలహీనంగా మారింది. ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.24.45 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. కానీ, నిధులు మాత్రం కేటాయించలేదని చెబుతు న్నారు.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068