తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనం, అందులో సనాతన ధర్మంలోని పండుగలు, పర్వదినాల సమాహారం ప్రారంభమవుతుంది. ఈ తిథి నుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహా విష్ణువు పాలకడలిలో శేషశయ్యపై యోగనిద్రలో ఉంటాడని విష్ణుపురాణం పేర్కొంది.  ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఆ రోజు నుంచి దక్షిణ దిక్కును అనుసరిస్తాడు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించే వారట. ఈ నాలుగు నెలల పాటు వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కనుక, ఆరోగ్య పరిరక్షణ నియమాలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మురాసురుడు అనే రాక్షసుడితో యుద్ధంలో అలసిన శ్రీహరి పాలకడలిలో శేషశయ్యపై శయనిస్తాడు. ఆయన యోగనిద్రను అదునుగా భావించిన దానవులు దేవతలపై విజృంభించారు. పురాణగాథను బట్టి, భీతితో వైకుంఠధామానికి చేరిన సురులను కాపాడేందుకు భగవానుడి శరీరం నుంచి ఉద్భవించిన ‘సత్త్వశక్తి ’ దానవుల దాష్టీకాన్ని కట్టడి చేసింది. మేల్కొన్న పరంధాముడు ఆ శక్తికి ‘ఏకాదశి’ అని పేరు పెట్టాడు. ఆమె వీరోచిత పోరాటానికి సంతసించిన స్వామి మూడు వరాలు అనుగ్రహిం చాడు. ఎల్లకాలం హరికి ప్రియమైనదిగా ఉండడం (హరిప్రియ), ఏకాదశికి సర్వ తిథుల్లో ప్రాధాన్యం దక్కి లోకం శిరోధార్యంగా భావించడం (పుణ్యతిథి), ఆనాడు ఉపాసనతో విధులు నిర్వర్తించే వారికి ముక్తి లభించడం (మోక్ష ఏకాదశి). ‘వ్రతోత్సం చంద్రిక’ ఈ తిథిని ‘మహా ఏకాదశి’గా అభివర్ణించింది. దశమితో కూడి ఉన్న ఏకాదశి వ్రతానికి, ఉపవాసానికి పనికిరాదని, ద్వాదశితో కలసి ఉన్న ఏకాదశి భగవంతుడి సాన్నిధ్యాన్ని కలిగి ఉంటుందని, ఆ రోజునే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలన్నది శాస్త్ర వచనం.

ఇతర వ్రతాలను కోర్కెలు సిద్ధించేందుకు ఆచరిస్తుండగా, ఈ ఏకాదశి పరమార్థం మోక్షమే కనుక ‘మోక్ష ఏకాదశి’ అంటారు. మహావిష్ణువు యోగ నిద్ర నుంచే భక్తులను గమనిస్తూ ఉంటాడు. ఆయన ప్రీతి కోసం ఈ నాలుగు నెలలు వ్రతాదులు నిర్వహిస్తారు. ‘సుప్తే త్వయి జగన్నాథ! జతత్సుప్తం భవేదిదం/విబుద్ధే చ విశుద్ధ్యేత ప్రసన్నో మే భవాచ్యుత/ఇదం వ్రతం మయా దేవ గృహీతం పురతస్తవ/నిర్విఘ్నం సిద్ధిమయాతు ప్రసాదాత్‌ ‌తవ కేశవ…’ అనే ప్రార్థనతో వ్రతాన్ని ఆరంభించాలి. ఈ వ్రత ఆచరణతో దేహశుద్ధి, కార్యసిద్ధితో పాటు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణవచనం. తన రాజ్యంలో అనావృష్టి నెలకొన్నప్పుడు మాంధత చేసిన ‘శయనైక ఏకాదశి’ వ్రత ఫలితంగా వర్షాలు కురిసి పరిస్థితి చక్కబడిందని గాథలు చెపుతున్నాయి. సూర్యవంశ చక్రవర్తి, సత్యసంధుడు మాంధాత, సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందారట.సాధువులు, భక్తజనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణు సాయుజ్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు.

                                                                                              * * *

శ్రీ మహవిష్ణువు యోగనిద్ర కాలంలో యతీశ్వరులు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు. గ్రామ పొలిమేర దాటకుండా ఒకేచోట నాలుగు నెలలు ఉండడాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు. నిష్ఠతో తపస్సు, అనుష్ఠానం, వేదాంత అధ్యయనం , ధార్మిక చింతనతో ఈ దీక్ష సాగుతుంది. యతి/సన్యాసి ఏ గ్రామంలోనూ ఒక్క రాత్రికి మించి ఉండకూడదనేది నియమం. అయితే వారి శిష్యుల ద్వారా చేపట్టే దీక్షకు మినహాయింపు ఉంటుంది. తమ గృహంలో ఈ దీక్షను చేపట్టాలన్న శిష్యుని విన్నపాన్ని గురువు మన్నిస్తాడు. శిష్యుడు ఆయనకు శుశ్రూష చేస్తూ ధన్యత పొందినట్లు భావిస్తాడు. దీక్ష ప్రారంభానికి ఏకాదశినాడు వీలు కుదరని వారు మరుసటి తిథి (ద్వాదశి)నాడు లేదా పౌర్ణమి నాడు ఆరంభిస్తారు. (‘తేనాషాఢ శుక్లైకాదశ్యాం, పౌర్ణమాస్యాంవో ఆరంభః ప్రతివర్షంచ యః కుర్యాదేవం వై సంస్మరన్‌ ‌హరిమ్‌’-‌స్మృతికౌస్తుభం). వాస్తవానికి అన్ని వర్గాలు, చతుర్విధ ఆశ్రమాల వారు ఈ దీక్షను పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘కాలమాన పరిస్థితులను బట్టి అందరు ఈ దీక్షను చేయలేకపోవచ్చు. అందుకు బదులుగా దానాది కార్యాలను నిర్వహించడం; దీక్షాపరులు, యతీశ్వరుల, సత్పురుషలతో సాంగ త్యంతో అంతకు సమానమైన ఫలాన్ని పొందవచ్చు’ అని చెబుతారు.దీక్ష ఎప్పుడు ప్రారంభమైనా కార్తిక శుద్ధ ద్వాదశి నాడే ముగుస్తుంది.

ఈ కాలంలో ఆహార కట్టుబాట్లను అత్యంత ప్రధానంగా చెబుతారు. ఈ నాలుగు నెలలు వర్షాలు కురుస్తూ వాతావరణంలో మార్పులు, వ్యాధి కారక సూక్ష్మక్రిములు వ్యాప్తికి అవకాశం ఉన్నందున, చాతుర్మాస్య వ్రతం పాటించే వారు ఆహార విహారాది నిమమాలు పాటించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో పేలపు పిండిని తరచూ ఆహారంగా తీసుకుంటారు. ఇందులో ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య కోణమూ ఇమిడి ఉంది. పేలాల పిండి పితృదేవతలకు ఎంతో ఇష్టమని చెబుతారు. వారి పేరిట నివేదించిన దానిని ప్రసాదంగా తీసుకుంటారు. ఆరోగ్య పరంగా చూస్తే…వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలను బట్టి శరీరం మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలిగిస్తుంది. ‘స్వామి కార్యం… స్వకార్యం’ అన్నట్లు ఈ తిథినాడు దేవాలయాల్లోనూ, ఇళ్ల వద్దా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. ఎలా చూసినా మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఈ ఈ వ్రతదీక్ష ఉత్తమమైనదని పురాణ వాఙ్మయం పేర్కొంటోంది.

పేలాల పిండి పితృదేవతలకు ఎంతో ఇష్టమని చెబుతారు. పూర్వీకులను స్మరించుకుంటూ వారికి నివేదించి , వారి పేరుతో ప్రసాదంగా తీసుకుంటారు. ప్రతి ఆధ్యాత్మిక అంశం వెనుక శాస్త్రీయ కోణం దాగి ఉంటుంది.పేలాల పిండి భుజించడమూ అలాంటిదే. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం. ఆరోగ్యపరంగానూ, ఉష్ణోగ్రతలను బట్టి శరీరం మార్పులకు లోనవు తుంది. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలిగిస్తుంది. ‘స్వామి కార్యం… స్వకార్యం’ అన్నట్లు ఈ తిథినాడు దేవాలయాల్లోనూ, ఇళ్ల వద్దా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.


గురుశిష్య బంధంలో దివ్యానుభూతి

భారతీయ సంస్కృతిలో గురుపరంపర అనాదిగా సాగుతూనే ఉంది. గురువును దైవంగా ఆరాధించడం మన దేశ తరతరాల సంప్రదాయం. గురువంటే దార్శనికుడు, పథ నిర్దేశకుడు. లౌకిక జ్ఞానాన్ని భగవత్‌ ‌శ్శక్తితో అనుసంధానించ కలిగినవాడు. గురువు అంటే కేవలం జ్ఞాన ప్రదాతే కాదు సమర్ఫణ, త్యాగభావం కలవారు. వృత్తాసుర సంహారానికి అవసరమైన వజ్రాయుధం రూపొందడానికి తన వెన్నెముకను సమర్పించిన దధీచి త్యాగధనుడు.

జ్ఞానం ప్రచులితమయ్యే చోట గురు దర్శనం అవుతుందని వ్యాస భగవానుడి మాటగా చెబుతారు. పవిత్రాత్మగల గురువులు ఉన్న చోట సర్వ దేవతలు సంచరిస్తుంటారని శాస్త్రవాక్యం. అలాంటి గొప్ప గురువుల ప్రస్తావన పురాణాల్లో, చరిత్రలో కనిపిస్తుంది. కనుకనే అవతార పురుషుల నుంచి కారణజన్ముల దాకా గురుసన్నిధిలో సామాన్యులుగా ప్రవర్తిల్లారు. శిష్యులు గణనీయం గానే ఉంటారు. వారిలో గురుభక్తులు, గురువు పట్ల గురి కలవారు అరుదనే చెప్పాలి.

గురుశిష్య పరంపర వేదకాలం నుంచే ఉండేది. నాటి గురువులు వేదవిద్యను మౌఖికంగా నేర్పేవారు. వారి ఆధ్వర్యంలో నడిచే గురుకులాల్లో రాజు-పేద తేడా లేకుండా అన్ని వర్గాల పిల్లలకు బోధన ఒకే రీతిన ఉండేది. అందుకు శ్రీకృష్ణ కుచేలుదు, ప్రహ్లాద ఇతర దానవ కుమారులే ఉదాహరణ. గురుశిష్యుల అనుబంధానికి సంబంధించిన అనేక గాథలు మన పురాణాల్లో, ఆధ్యాత్మిక గురువుల చరిత్రల్లోనూ కనిపిస్తాయి.

గురుత్వం అంటే ఒక వ్యక్తి రూపం కళ్లలో మెదలినా అందుకే పరిమితం కాదు. ఒక మహాపురుషుడు, ప్రవక్త, ఒక సిద్ధాంతం, ఒక స్ఫూర్తి చిహ్నం, ఒక ప్రతీకం…ఇలా మార్గనిర్దేశనం చేయవచ్చు. ఏకలవ్యుడికి ద్రోణుడు మట్టి బొమ్మగా, శ్రీకృష్ణుడు అర్జునుడికి మిత్రుడిగా, ఆదిశంకరులకు ఎదురైన పరమేశ్వరుడు చండాలుడిగా, లీలా శుకునికి తండ్రి అయిన వ్యాసునిలా, మైత్రేయికి భర్త అయిన యాజ్ఞవల్క్యుడిగా… ఇలా ఏ రూపంలోనైనా ప్రబోధించవచ్చు.

రామకృష్ణుల వంటి అవతార పురుషులు, ప్రహ్లాద, ఆదిశంకర రామానుజ,మధ్యాచార్యుల వంటి కారణజన్ములు గురుస్థానానికి ఎంతో విలువ ఇచ్చి తరించారు. గురు సంప్రదాయానికి సదాశివుడు (దక్షిణామూర్తి) మూల పురుషుడు. విశ్వామిత్ర, వశిష్ఠుల వద్ద రామలక్ష్మణులు, సాందీపుని వద్ద బలరామకృష్ణులు, పరుశురాముని వద్ద భీష్ముడు, ద్రోణుని వద్ద అర్జునుడు, గోవిందాచార్యుల వద్ద ఆదిశంకరులు, పంచాచార్యుల వద్ద రామానుజుడు, రామకృష్ణ పరమహంస వద్ద వివేకానందుడు..ఇలా ఎందరో గురుకృపతో ధన్యులయ్యారు.

శ్రీరామచంద్రుడు గురువు వశిష్ఠుని పాదతీర్థం సేవించి శిరస్సున చల్లుకొని దివ్యబోధనను (యెగ వాశిష్ఠం) ఆలకించాడు. భావి గీతాశాస్త్ర ప్రవచకుడు, జగద్గురువు కృష్ణ పరమాత్మ సాందీపమునికి శుశ్రూష చేసి చదువు నేర్చాడు. ప్రహ్లాదుడు ‘చదివించిరి నను గురువులు…’ అంటూ చదువుల సారాన్ని ఏకరవు పెట్టాడు. సృష్టిలోని ఇరవై నాలుగు జీవులు తన గురువులని అనసూయాత్రి పుత్రుడు శ్రీ దత్తుడు వ్యాఖ్యానించి, జ్ఞానబోధ చేశాడు. గురు నామాన్ని మనసులో స్మరించినంతనే అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి ప్రతిమను పూజించి సర్వ విద్యలను నేర్చుకొన్న సంగతి తెలిసిందే. గురువు, గోవిందుడు ఎదుట నిలిచినపుడు గురువుకే ప్రణామం చేస్తానని, గురువు ద్వారానే భగవంతుడిని దర్శించాను అంటారు కబీరు. శొంఠి వెంకట రమణయ్య వద్ద సంగీత విద్యను అభ్యసించిన త్యాగరాజు ‘గురులేక ఎటువంటి గురిణి తెలియగ బోదు’ అన్నారు.

మన దేశాన్ని ఏలిన చాలా మంది రాజులు, మహనీయులకు వారి గురువుల నుంచి ఉత్తమ సంస్కారం లభించింది. ఒక సద్గురువు నుంచి ఉపదేశాన్ని పొంది జీవితానికి ఒక లక్ష్యాన్ని, ఒక మార్గాన్ని ఏర్పరచుకోవడం హిందూజీవన విధానంలో ప్రత్యేకత. ఈశ్వరాంశగా మన్నన అందుకుంటున్న ఆదిశంకరాచార్యులు గురువు గోవిందాచార్యులు, ఆయన (గోవిందాచార్యులు)తమ గురువు గౌడ పాదులు వద్ద సకల శాస్త్రాలు అభ్యసించారు. ముస్లింలు పరమపవిత్రంగా భావించే ఖురాన్‌ ‌కానీ, ముస్లిం మహిళలు కాని తన కంటబడితే గ్రంథాన్ని కాపాడి, ఆ మహిళలను సురక్షితంగా గమ్యం చేర్పించే వాడు. ‘నాకు శరీరాన్ని ఇచ్చిన తండ్రికి రుణపడి ఉన్నాను.

అయితే సరైన విధంగా జ్ఞానాన్ని ప్రసాదించిన నా గురువుకు ఇంకా రుణపడి ఉన్నాను’ అని అలెగ్జండర్‌ ‌తన గురువు అరిస్టాటిల్‌ను ఉద్దేశించి అన్నాడు. మొరటు యోధుడిగా పేరు పొందిన అలెగ్జండర్‌ ‌తన విజయయాత్ర సందర్భంగా తారసిల్లిన కట్టడాలు, శిల్పాలు, తదితర నిర్మాణాలను ధ్వంసం చేయకపోవడానికి గురుబోధనల వల్ల అబ్బిన సంస్కారం కావచ్చని విశ్లేషకులు అంటారు. వర్తమాన సమాజంలో గురుశిష్య సంబంధాల విషయంలో కొన్ని పెడ పోకడలు కనిపిస్తున్నా వారి మధ్య అనుబంధం భవ్యమైనది.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE