ప్రభుత్వం అంటే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగించాల్సిన వ్యవస్థ. వ్యాపారాలు, లాభాపేక్ష వంటివి ప్రభుత్వ పాలనలో అస్సలు కనిపించకూడదు. ప్రజాస్వామ్యంలో ఇది ప్రాథమిక నియమం. కానీ, ఇప్పుడు కాలం మారింది. ప్రభుత్వాలను నడిపిస్తోన్న రాజకీయ పార్టీలు సొంత ఎజెండాలు, సొంత నిర్ణయాలు, సొంత వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. తమకు నచ్చిన తీరులో సాగుతున్నారు. ఫలితంగా ప్రజలు సందిగ్ధంలో పడిపోతున్నారు. అసలు భవిష్యత్తుకు భరోసా ఎలా? అన్న మీమాంసలో పడిపోతున్నారు. వాస్తవ పరిస్థితులు కూడా ఈ అంచనాలకు తగ్గట్లే ఉంటున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటి రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని నడిపించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ గానీ రాష్ట్ర ప్రయోజనాలను అస్సలు లెక్క చేయడం లేదన్న సంకేతాలు ఎక్కడ చూసినా, ఏ వ్యవహారాన్ని గమనించినా అర్థమవుతోంది. ఇటు.. ఖాళీ ఖజానా… అటు చూస్తే..రూ. వేల కోట్ల విలువైన పథకాలకు సంబంధించిన హామీలు..వచ్చిన ఆదాయం వచ్చినట్లు ఊడ్చుకుపోతున్న పరిస్థితులు… రేపటి గురించి ఆలోచనే లేని పాలనా పద్ధతులు.. వెరసి ప్రజల భవిష్యత్తును అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తును గాలిలో దీపంలా మార్చేస్తున్నారు. ఓవైపు.. పాలకులే.. రాష్ట్రం దివాళా తీసిందంటారు. విపక్షాలకు ఉచ్చు బిగించే ప్రయత్నాలు చేస్తారు. కానీ, ఆ ప్రయత్నాలు బెడిసికొట్టినా తమ దారిలో తాము జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తుంటారు.

ఇటీవలి పరిణామాలనే విశ్లేషిస్తే.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి, అవుతున్న ఖర్చులకు, ఇప్పటికే ఉన్న అప్పులకు వడ్డీలు చెల్లించడానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. అయినప్పటికీ సర్కారు పెద్దలు కొత్త కొత్త పథకాలు ప్రకటిస్తున్నారు. వందలు, వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. ప్రకటిస్తున్నారు. ఘనంగా శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలు సరేసరి.. దీంతో, ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఆదాయానికి ఉన్న మార్గాలేంటి? ఖజానాకు రాబడి ఎలా పుట్టించాలి? అన్న ఆలోచనలో ప్రభుత్వ యంత్రాంగం నిండా మునిగిపోతోంది. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ అమ్మేస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆదాయం ఎలా ఉందో, ఖజానా పరిస్థితి ఏంటో చూస్తే.. తీవ్ర ఆవేదనగా ఉందంటున్నారు విశ్లేషకులు. రోజు రోజుకూ ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రాన్ని చుట్టుముడుతున్నాయని, నాన్‌ టాక్స్‌ రెవెన్యూ ఏ మాత్రం ఆశాజనకంగా లేదని అంటున్నారు. లాభాల్లో ఉన్న ఖజానా.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలన నుంచే నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. వచ్చే ఆదాయం, పోయే ఖర్చుకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఆర్థిక ఇబ్బందులు రోజురోజుకూ తీవ్రంగా పెరిగిపోతున్నాయి. నాన్‌-ట్యాక్స్‌ రెవెన్యూ రాబడులను పెంచడంలో అధికార యంత్రాంగం దారుణంగా విఫలమవుతున్నదన్న చర్చ నడుస్తోంది. ఫలితంగా బడ్జెట్‌ కేటాయింపుల్లో తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సొంత రాబడులను తీసుకుంటే.. గ్రోత్‌ 2.2 శాతం మాత్రమే ఉంది. రెవెన్యూ ఆదాయం 2.5 శాతం, మొత్తం ఆదాయం 5.8 శాతం దగ్గరే నిలిచిపోయింది. తెలంగాణ సెక్రెటేరియట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ క్యాపిటల్‌ సబ్‌కమిటీ ప్రదర్శించిన తెలంగాణ ఆదాయ గణాంకాల నివేదికలు ఈ వాస్తవాలను బయటపెట్టాయి. దీంతో, నాన్‌టాక్స్‌ ఇన్‌కమ్‌పై అధికారులు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాలంటే నాన్‌-ట్యాక్స్‌ రెవెన్యూ, కేంద్ర నిధుల సమీకరణ చాలా కీలకం. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరుల ద్వారా సేకరించే ఆదాయం ప్రధానం. వస్తుసేవల పన్నులో రాష్ట్ర వాటా, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, ఆస్తి పన్ను, వాహనాల పన్ను, ఎక్సైజ్‌ డ్యూటీ. నాన్‌-ట్యాక్స్‌ రెవెన్యూ అంటే,, లైసెన్స్‌ ఫీజులు, పరీక్ష ఫీజులు, నీటిపారుదల ఫీజులు వంటి గవర్నమెంట్‌ సర్వీసుల ద్వారా వచ్చే ఫీజులు. ఈ రాబడులు రాష్ట్ర ఆర్థిక అవసరాలను తీర్చడానికి, అభివృద్ధి ప్రాజెక్టులు, పరిపాలనా ఖర్చులను భరించడానికి ఉపయోగపడతాయి. కానీ, సొంత రాబడిలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. మొత్తం రెవెన్యూ రశీదుల వృద్ధి కూడా 2024-25లో 5.8 శాతానికే పరిమితమైంది. ఈ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌ గణాంకాలను బట్టి కొన్ని శాఖలకు అధిక నిధులు కేటాయిస్తుండగా, మరికొన్ని శాఖలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే సూచనలు కనిపించడం లేదు. నిధుల కొరతతో పలు శాఖలు అల్లాడుతున్నాయి. నిధుల లేమి, బడ్జెట్‌ కేటాయింపుల్లో అసమతౌల్యం, మొత్తంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గందరగోళం పరిస్థితిని తలపిస్తున్నట్టు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ ఖర్చు చేయాలని, ఖర్చులను రేషనలైజ్‌ చేయాలని సర్కారు సూచించినప్పటికీ, అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదని చెప్తున్నారు.

ఆర్థికంగా రాష్ట్రం తీవ్ర ఒడుదొడుకుల్లో ఉండగా.. ఇప్పటికీ ఇంకా అక్కడక్కడా మిగిలి ఉన్న ప్రభుత్వ భూములను అమ్ముతోంది సర్కారు. అలా భారీగా ఆదాయం సమకూర్చుకుంటోంది. కోట్లలో సమకూరుతున్న ఈ భూములమ్మిన డబ్బులు ఖజానాకు మళ్లిస్తూ.. ఖర్చులను తీర్చుకుంటోంది. పైగా.. రియల్‌ ఎస్టేట్‌ సంస్థల మాదిరిగా.. వేలం పాటలో భూములకు భారీగా ధర పలికిందని, ఖజానాకు పెద్ద మొత్తంలో డబ్బులు సమకూరాయంటూ సాక్షాత్తూ ప్రభుత్వమే గొప్పగా ప్రకటించుకుంటోంది. ఈ పరిణామాలు సర్కారు దుస్థితికి అద్దం పడుతున్నాయి.

ప్రధానంగా హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకం.. ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక రెండు దశాబ్దాల నుంచి మొదలయ్యింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దీన్ని ఆపడం కాకుండా.. కొనసాగిస్తున్నాయి. ఒక రకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలంటూ స్థాయికి మించిన పథకాలను రూపొందిస్తూ.. ప్రకటిస్తూ.. అమలు చేస్తూ, ప్రజలను ఒకరకంగా సోమరిపోతుల్లా మార్చేస్తున్నాయి. జనం కూడా ఏ పథకం వచ్చినా లబ్ది పొందేందుకు పోటీ పడుతున్నారు. ప్రభుత్వం కూడా కొంత కాలంగా తన భూములను అమ్ముతోంది. వేలం పాటలో ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తోంది. ఇటీవలే కూకట్‌పల్లి హౌజింగ్‌ బోర్డు కాలనీలో నిర్వహించిన భూముల వేలంలో.. గజం స్థలానికి రూ.2.98 లక్షలు ధర పలికింది.

తాజాగా గచ్చిబౌలిలో కూడా భూముల వేలం పాట నిర్వహించింది. గచ్చిబౌలిలో 4 ప్లాట్లను అమ్మకానికి పెట్టగా, వేలంలో అన్నీ అమ్ముడయ్యాయి. అలాగే, చింతల్‌లో 10 ప్లాట్లను అమ్మకానికి పెడితే 3 ప్లాట్లను ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేశారు. చింతల్‌లో హౌసింగ్‌ బోర్డు అధికారులు గజం ధరను రూ.80 వేలుగా నిర్ణయించగా వేలంలో అత్యధికంగా రూ.1.14 లక్షలు పలికింది.

 ఇక నిజాంపేటలోని అపార్ట్‌మెంట్లలో 413.43 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్న 8 ఫ్లాట్లను వేలం వేశారు హౌజింగ్‌ బోర్డు అధికారులు. వీటిలో ప్రైవేటు వ్యక్తులు 4 ఫ్లాట్లను కొనుగోలు చేశారు. నిజాంపేటలో ఒక్కో ఫ్లాట్‌ ధరను హౌసింగ్‌ బోర్డు అధికారులు రూ.16.55 లక్షలుగా నిర్ణయించారు. అయితే, అత్యధికంగా ఒక ఫ్లాట్‌కు రూ.18.21 లక్షలు పలికింది. చింతల్‌లో 10 ఖాళీ స్థలాలకు గాను కేవలం 3 స్థలాలే అమ్ముడు పోయాయి. ప్లాట్లు, ఫ్లాట్ల వేలం ద్వారా ఒకేరోజు మొత్తం రూ.65,01,91,176 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గచ్చిబౌలిలో 3271 గజాలు, చింతల్‌లో 799 గజాలు, నిజాంపేటలో 4 ఫ్లాట్లు అమ్మకాలు చేసినట్లు అధికారులు వివరించారు. గచ్చిబౌలిలో గజానికి సగటు ధర రూ.1.63 లక్షలు, చింతల్‌లో గజానికి రూ.1.01 లక్షలు వచ్చిందని తెలిపారు. మొత్తం 22 ఆస్తులను వేలం వేయగా.. 11 ఆస్తులు అమ్ముడు పోయాయి.

ప్రభుత్వాలు ప్రకటిస్తున్న పథకాలు అమలు చేయాలంటే కొన్నేళ్లుగా భూముల అమ్మకాలు ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయాయి. ఈ తంతు ఇలాగే కొనసాగితే.. కొన్నాళ్లకు భూతద్దం పెట్టి వెతికినా ప్రభుత్వ భూమి అనేది కనిపించకుండ పోయే ప్రమాదం పొంచి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

– సుజాత గోపగోని, సీనియర్‌ జర్నలిస్ట్‌, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE