ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వివిధ పార్టీలతో కూడిన ఏడు ప్రతినిధి బృందాలను 33 దేశాలకు,  యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు మే 21 నుంచి పంపింది. పాకిస్తాన్‌ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు వివరించడం ఈ ప్రతినిధి బృందాల పర్యటన ప్రధాన లక్ష్యం. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రపంచ దేశాలు భారత్‌, పాకిస్తాన్‌లను ఒకే విధంగా పరిగణిస్తున్నాయి. నిజానికి పాకిస్తాన్‌ మతం ఆధారంగా ఏర్పడిన దేశం. అదే భారత్‌ బహుళ సమాజాన్ని కలిగి, సెక్యులరిజంతో కూడిన ప్రజాస్వామ్యం పరిఢవిల్లే దేశం. పాకిస్తాన్‌ చేస్తున్న పెహల్గావ్‌ వంటి అకృత్యాల వల్ల శాంతిని కోరుకునే మన దేశాభివృద్ధి దెబ్బ తింటుంది. ఈ నేపథ్యంలో మన సెక్యులర్‌,  ప్రజాస్వామ్య విలువలను ప్రపంచ దేశాలకు  తెలియజేయడమే ఈ ప్రతినిధి బృందాలను పంపడం వెనుక ప్రధాన లక్ష్యం.

ఈ ఏడు బృందాలు మొత్తం 33 దేశాల రాజధానులకు చేరుకొని అక్కడి మేధావులు, మంత్రులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీడియాలకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ సుస్థిర వైఖరిని అర్థమయ్యేలా వివరించాయి. ఉగ్రవాదంపై భారత్‌ ఎట్టి పరిస్థితుల్లో సహించబోదన్న సత్యాన్ని ఈ దేశాలకు సుస్పష్టంగా అవగతం చేశాయి. పాకిస్తాన్‌ దుష్కృత్యాలను ఎండగట్టడానికి భారత్‌ ప్రారంభించిన ఈ దౌత్యపరమైన ప్రక్రియలో భాగంగా భారత్‌ విదేశాలకు పంపిన ప్రతినిధుల బృందంలో వివిధ పార్టీలకు చెందిన 59 మంది సభ్యులుండగా, వీరిలో వివిధ పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, పార్లమెంటేరియన్లు, ఎనిమిదిమంది మాజీ రాయబారులుండటం విశేషం. వీరు సందర్శించిన దేశాల్లో ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు, ఇతర పలుకుబడి కలిగిన దేశాలున్నాయి. మొత్తం పదిరోజుల పాటు సాగిన ఈ మిషన్‌లో పాల్గొన్న ఏడు టీమ్‌లకు శశిథరూర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, సంజయ్‌కుమార్‌ ఝా, బైజయంత్‌ పాండా, కనిమొజి కరుణానిధి, సుప్రియా సూలే, శ్రీకాంత్‌ ఏక్‌నాథ్‌ షిండేలు నాయకత్వం వహించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజుజు సమన్వయం చేశారు. ఈ అఖిలపక్ష ప్రతినిధి బృందానికి విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిశ్రి వారు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చక్కగా వివరించారు.

యు.ఎన్‌.లో పాక్‌కు చెక్‌ పెట్టే వ్యూహం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యురాలిగా పాకిస్తాన్‌ మరో 17 నెలల పాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఇందులో ప్రస్తుతం సభ్యులుగా వున్న 15 దేశాలకు మన ప్రతినిధి బృందాలు వెళ్లాయి. అంతేకాదు త్వరలో సభ్యత్వం పొందనున్న మరో ఐదు దేశాలకు కూడా మన ప్రతినిధులు వెళ్లారు. యుఎన్‌ఎస్‌సీ లో సభ్యురాలిగా పాకిస్తాన్‌ మనదేశానికి వ్యతిరేకంగా పలు అంశాలు లేవనెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో, దానికి ముకుతాడు వేసే లక్ష్యంతో ఈ సభ్యదేశాలకు మన ప్రతినిధి బృందాలు వెళ్లి మనదేశం ఉగ్రవాదంపై అనుసరిస్తున్న వైఖరిని, పాక్‌ ఏవిధంగా పెహల్గావ్‌ దాడికి పాల్పడిరదీ వివరించడమే కాదు, ఆయా దేశాలు భారత్‌ జరుపుతున్న ఉగ్రవాద వ్యతిరేక పోరుకు తమ మద్దతు ప్రకటించేలా చేయడంతో కృతకృత్యం సాధించాయి. భారత్‌ అనుసరించిన సంయమనం, కఠిన వైఖరి విధానాలు ప్రపంచ వ్యాప్తంగా పరిశీలకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఆపరేషన్‌ సిందూర్‌ యుద్ధంగా ప్రజ్వరిల్ల కుండా వ్యవహరించిన తీరు ఆయా దేశాలను ఆకట్టు కుంది. ఒకవైపు ఉగ్రవాదుల పీచమణచడం, మరోవైపు దౌత్యంతో విదేశాలకు తన వైఖరిని స్పష్టం చేయడంలో భారత్‌ ఒక సరికొత్త శైలికి తెరతీసిందనే చెప్పాలి. ఇది ఇతర దేశాలకు కూడా తప్పనిసరిగా మార్గదర్శకం కాగలదు. భారత్‌ అత్యంత కచ్చి తత్వంతో నిర్వహించిన దాడులు, భారత్‌ సాధించిన ఆధునిక సాంకేతిక ప్రగతిని ప్రపంచానికి వెల్లడిర చాయి. అప్పటివరకు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న పాకిస్తాన్‌ కూడా కోలుకోలేని రీతిలో దెబ్బతిని మోకాళ్లపై నిలబడే పరిస్థితి ఏర్పడిరది. అంతేకాదు ఒకపక్క చైనా, మరోపక్క తుర్కియేల యుద్ధ విమానాలు, రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు మనముందు ఎందుకూ పనికిరావన్నది సుస్పష్టమైంది. ఈ ఆపరేషన్‌ ద్వారా భారత్‌, తాను ఉగ్రవాదంపై ఎంత కచ్చిత మైన, కఠినమైన చర్యలు తీసుకోగలదో ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపింది.

ప్రతినిధుల ఎంపికలో వ్యూహాత్మకత

ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి విదేశాలకు భారత్‌ వాదనను వినిపించేందుకు ప్రతినిధుల బృందాన్ని ఎంపిక చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహాత్మక వైఖరిని అవలంబించా రనే చెప్పాలి. ఈ ప్రతినిధి బృందం ఎంపికలో ఆయన రాజకీయాలకు అతీతంగా విశ్వసనీయతకు, యోగ్యతకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి సమర్థులైన వారిని ఎంపిక చేయడం విశేషం. ముఖ్యంగా తనను ఎప్పుడూ విమర్శించే శశిథరూర్‌, అసదుద్దీన్‌ ఒవైసీ వంటివారిని ఈ బృందంలో చేర్చడం ద్వారా ఆయన అద్భుతమైన రాజకీయ పరిణితి ప్రదర్శించారనే చెప్పాలి. ఈ విధానానికి పి.వి.నరసింహారావు ఆద్యు డని చెప్పాలి. 1990`96 మధ్యకాలంలో ప్రధానిగా ఉన్న ఆయన పాటించిన విధానాన్నే ప్రస్తుతం నరేంద్రమోదీ అనుసరించారనుకోవాలి. 1994లో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సదస్సులో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు పంపిన ప్రతినిధి బృందానికి అటల్‌బిహారీ వాజ్‌పేయికి నాయ కత్వం అప్పగించారు. తర్వాతి కాలంలో మన్మోహన్‌ సింగ్‌ కూడా ఇదేమాదిరి అఖిలపక్ష బృందాలను వివిధ సదస్సులకు పంపడం చరిత్ర! 1999 కార్గిల్‌ యుద్ధం 2001లో పార్లమెంట్‌పై దాడి, 2008లో ముంబయి దాడుల సమయాల్లో కూడా భారత్‌ దౌత్యపరంగా పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయగలిగింది. 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం సందర్భంగా భారత్‌ నియంత్రణ రేఖను దాటకుండా సంయమనం పాటించింది.

అంతర్జాతీయంగా దౌత్యపరంగా చేపట్టిన యత్నాలు ఫలించి పాకిస్తాన్‌ తన సైనిక దళాల ఉపసంహరణకు యు.ఎస్‌. తదితర దేశాలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చాయి. ఇప్పుడు ఇదే శైలిని కొనసాగిస్తున్న ప్రధాని మోదీ ఈ విధంగా అఖిలపక్ష సభ్యులతో కూడిన బృందాలను పంపడం ద్వారా కార్పొరేట్‌ రంగంలో ఛీఫ్‌ హ్యూమన్‌ రీసోర్స్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారనే చెప్పాలి. ఇక్కడ భజన పరులెవరూ లేరు. ఉన్నది కేవలం పరస్పర సహకారం అందించుకునే వ్యూహాతక ప్రతినిధి బృందం మాత్రమే!

మోదీని విమర్శించిన వారే…

గతంలో అభిషేక్‌ బెనర్జీ, అసదుద్దీన్‌ ఒవైసీ, కనిమోజి కరుణానిధి, సుప్రియా సూలేలు ప్రధాని నరేంద్రమోదిని తీవ్రస్థాయిలో వ్యతిరేకించే నాయకు లుగా పేరు పడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని పదునైన విమర్శలతో ఇబ్బంది పెట్టడానికి నిరంతరం యత్నించే నాయకులు వీళ్లు. అయినప్పటికీ ప్రపంచ యవనికపై భారత్‌ తరపున తమ వాణిని వినిపించడా నికి వీరిపైనే మోదీ విశ్వాసం ఉంచారు. ముఖ్యంగా ఈ నాయకులు నాయకత్వం వహించే పార్టీలు, బీజేపీతో తీవ్రస్థాయి సైద్ధాంతిక విభేదాలు కలిగి ఉన్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయంగా భారతీయ దౌత్యం మరింత పటిష్టంగా ఉన్నదనడానికి వీలుగా వీరి ఎంపిక జరిగింది. రాజకీయాలకు అతీతంగా ప్రత్యర్థులను విశ్వసించడం అనేది అత్యంత పరిణిత నాయకత్వ ప్రధాన లక్షణం. ఈ బృందంలో శశి థరూర్‌,సల్మాన్‌ ఖుర్షీద్‌, గులాంనబీ ఆజాద్‌, ఎం.జె. అక్బర్‌, సయ్యద్‌ అక్బరుద్దీన్‌లు అంతర్జాతీయ దౌత్యాన్ని నెరపడంలో అత్యంత నిష్ణాతులన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతినిధులు ఏయే దేశాలకు వెళ్లా లనేది ఆయా దేశాల భౌగోళిక రాజకీయ పరిస్థితులపై వారికున్న అవగాహన ఆధారంగా ఈ ఎంపిక జరిగిందనేది సుస్పష్టం. అందువల్లనే ఈ ప్రతినిధి బృందాలకు ఎంపికైన వారిలో హైప్రొఫైల్‌ లేనివారు కూడా ఉన్నారు. వీరు కనబరిచిన అత్యంత సమర్థమైన పనితీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచె త్తింది. వీరెవ్వరూ ప్రతిపక్షాలకు చెందినవారిలా వ్యవహ రించలేదు. దేశంకోసం నిలబడ్డారు. మౌనంగా ఉండటం రాజకీయ పరిణితి కాదు, కానీ దేశం కోసం ఎప్పుడు మాట్లాడాలో తెలియడం రాజకీయ పరిణితి! ఆ విధంగా దేశ ప్రతిష్టను పెంచిన ఈ నాయకుల రాజనీతిజ్ఞతను ఎంతగా ప్రశంసించినా తక్కువే. ఇటువంటి రాజకీయాలే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని నిలిపి ఉంచుతాయి. దేశానికి కావలసింది ఇదే!

దౌత్య విజయం

విదేశాలకు వెళ్లిన భారత ప్రతినిధి బృందాలు, పెహల్గావ్‌ ఉగ్రదాడి తర్వాత తీవ్రవాదంపై భారత్‌ అనుసరిస్తున్న వైఖరిని ఆయా దేశాలకు స్పష్టంగా వివరించారు. ఈ ప్రతినిధి బృందాల్లో సభ్యులుగా ఉన్న వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటేరియన్లు, మాజీ దౌత్యవేత్తలు, మాజీ మంత్రులు తమ విస్తృత అనుభవాల నేపథ్యంలో పాక్‌ వైఖరిని ఎండగట్టడమే కాదు ఇక ముందు జరిపే ప్రతి ఉగ్రదాడిని యుద్ధం గానే భారత్‌ పరిగణిస్తుందన్న అంశాన్ని స్పష్టంగా వివరించగలిగారు. యు.ఎస్‌, యు.కె, ఇజ్రాయిల్‌, సౌదీ అరేబియాలు భారత్‌ వైఖరికి మద్దతు ప్రకటిం చాయి. అయితే కొలంబియా మాత్రం పాక్‌ అనుకూల వైఖరి అవలంబించినప్పటికీ, శశిథరూర్‌ నేతృత్వం లోని బృందం అక్కడి రాజకీయ నాయకులు, మేధావులు, మీడియాకు ఈ ఆపరేషన్‌కు సంబంధిం చిన వాస్తవాలను సాక్ష్యాధారాలతో సహా వెల్లడిర చడంతో ఆ దేశం తన అభిప్రాయాన్ని మార్చుకోవడం మన ప్రతినిధిబృందం సాధించిన గొప్ప దౌత్య విజయంగా చెప్పకతప్పదు.

నిజానికి పెహల్గావ్‌ దాడులు జరిగిన వెంటనే మన విదేశాంగశాఖ మంత్రి డా॥జయశంకర్‌ యు.ఎన్‌.ఎస్‌.సి.లోని ఏడు తాత్కాలిక సభ్య దేశాలైన అల్జీరియా, గ్రీస్‌, గయానా, పనామా, స్లొవేనియా, సిర్రా లియోన్‌, సోమాలియా విదేశాంగ మంత్రులకు ఫోన్‌ చేసి విషయం తెలిపారు. అప్పటి నుంచే నేటి విస్తృత దౌత్య ప్రక్రియకు బీజం పడిరది. చివరిగా ఇప్పుడు నరేంద్రమోదీ కెనడాలో జీ`7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని సైప్రస్‌,  క్రొయే షియాల్లో కూడా పర్యటించి భారత్‌ దౌత్యం ఎంతటి పటిష్టంగా ఉంటుందో మరోసారి ప్రపంచానికి తెలియ జెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా పాకిస్తాన్‌కు మద్దతు పలికి డ్రోన్లను సరఫరా చేసిన తుర్కియేకు బుద్ధి చెప్పే ప్రక్రియలో భాగంగా ఆయన సైప్రస్‌లో పర్యటించి, ఆ దేశానికి మద్దతు ప్రకటించడమే కాదు, కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇరాన్‌`ఇజ్రాయిల్‌ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హడావిడిగా అమెరికా వెళ్లిపోవడంతో మన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ సాధ్యం కాలేదు. దీంతో ఆయన అమెరికా నుంచే నరేంద్రమోదీకి ఫోన్‌ చేసి యు.ఎస్‌.కు ఆహ్వానించగా సున్నితంగా తిరస్కరించి, తన క్రొయేషియా పర్యటన కొనసాగించారు. ఇదే సందర్భంగా భారత్‌లో జరుగబోయే క్వాడ్‌ సమా వేశంలో పాల్గొనాలని ట్రంప్‌ను ఆహ్వానించారు. అంతేకాదు, పాకిస్తాన్‌ సైన్యం అభ్యర్థనమేరకే ఆపరేషన్‌ సిందూర్‌ను తాత్కాలికంగా నిలిపామని, ఇందులో మీ మధ్యవర్తిత్వ ప్రమేయం ఏమీ లేదని కుండబద్దలు కొట్టడం ద్వారా ట్రంప్‌ చేసుకుంటున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసారు.

ఇక జి`7 శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదంపై యూరోపియన్‌ దేశాల ద్వంద్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని సహించేది లేదంటూనే మరోవైపు వాళ్లతో బేరసారాలు చేయడం మీకే చెల్లిందంటూ జీ`7 దేశాలను దెప్పిపొడిచారు. ఇటువంటి పద్ధతులు నచ్చని నరేంద్రమోదీ జీ`7 సమావేశంలో తనదైన శైలిలో ఈ దేశాల వ్యవహార శైలిని తప్పుపట్టారు. అంతేకాదు, ఆపరేషన్‌ సిందూర్‌ను తాత్కాలికంగానే నిలిపామని, పాకిస్తాన్‌ తోకజాడిస్తే ఈసారి చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సమస్య కనుక మరోదేశం ప్రమేయాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు.

ఉగ్రవాదంపై పోరు గమ్యమెటో?

సరిగ్గా ఇదే సమయంలో అమెరికాలో అసిమ్‌ మునీర్‌తో ట్రంప్‌ డిన్నర్‌ సమావేశంలో పాల్గొనడం గమనార్హం. ఇజ్రాయిల్‌కు మద్దతుగా అమెరికా ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడికి దిగే అవకాశాలున్న తరుణంలో, అసీమ్‌ మునీర్‌తో జరిపిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడిరది. ఏకంగా ఐదురోజుల పాటు అసీమ్‌ మునీర్‌ అమెరికా పర్యటన కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు, మరో దేశ సైనిక చీఫ్‌తో సమావేశమవడం కొంత విచిత్రంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రొటొకాల్‌ అనేది ఉంటుంది కదా. కానీ ఏ కారణం లేకుండానే ట్రంప్‌ ఈ పనిచేశారా? అనేది ఇప్పుడు నెలకొన్న సందేహం. అమెరికా లాంటి దేశం అసిమ్‌ మునీర్‌కు ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నదంటే, ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో యుఎస్‌ఎస్‌ఆర్‌ సైన్యం ప్రవేశించినప్పుడు ఉగ్రవాదుల రూపంలో పాకిస్తాన్‌ సహాయం తీసుకున్నట్టే ఇరాన్‌ను దెబ్బకొట్టడా నికి మళ్లీ ఇప్పుడు మళ్లీ అమెరికా పావులు కదుపుతున్న దన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా టెర్రరిస్తాన్‌ అయిన పాక్‌ ఉగ్రవాదుల సహాయంతో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయెతుల్లా ఖమేనీని అడ్డు తొలగించే వ్యూహం ఏమైనా జరుగుతున్నదా అనేది విదేశీ మీడియాలో వ్యక్తమవుతున్న సందేహం. ఇజ్రాయిల్‌ నాయకులు కూడా ఖమేనీని అడ్డు తొలగిస్తే, సమస్యకు పరిష్కారం లభిస్తుందని పదే పదే ప్రకటనలు ఇస్తుండటం గమనార్హం. విచిత్రంగా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఒకప్పటి ఇరాన్‌ రాజు రాజా పహ్లవీ ఒక ట్వీట్‌ చేశారు.

దీని ప్రకారం ఇరాన్‌కు త్వరలోనే మంచిరోజులు రాబోతున్నాయని, తాను తిరిగి ఇరాన్‌ పగ్గాలు చేపడతానంటూ పేర్కొ నడం మరిన్ని సందేహాలకు తావిచ్చేదిగా వుంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఉగ్రవాదానికి, శాంతికి మధ్య అడ్డుగోడ తొలగి పోతున్నదన్న సత్యం స్పష్టమవు తోంది. ఒక ధూర్త దేశ ఆర్మీ చీఫ్‌కు ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం వెనుక అమెరికా గట్టి ప్రణాళిక ఏదో ఉన్నదని చెప్పక తప్పదు. పాక్‌ సహాయం పొందిన అమెరికా కచ్చితంగా దానికి దన్నుగా ఉండక మానదు. దాని మాట కాదనలేని సహచర దేశాలు కూడా అదే బాట పట్టకమానవు. దీంతో కశ్మీర్‌ను రావణకాష్టంలా మార్చే ప్రక్రియ మళ్లీ మొదలు కావచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో మన ఉగ్రవాదంపై పోరు ఏ గమ్యానికి చేరుతుందో కాలమే నిర్ణయించాలి.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE