కొల్లేరు అభయారణ్య ఆక్రమణలు, పర్యావరణానికి విఘాతం, ప్రజల ఇబ్బందులు, జిరాయితీ, డీఫాం భూముల అంశాలపై సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలైన నేపథ్యంలో కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) అతి త్వరలో పర్యటించనుంది. సీఈసీ కమిటీ సభ్యులు జి.భానుమతి, చందప్రకాష్‌ ‌గోయల్‌, ‌సునీల్‌ ‌లిమాయే, డాక్టర్‌ ‌జైవర్థన్‌ ‌రమన్లాల్‌ ‌భట్లు కొల్లేరు ప్రాంతాల్లో అధ్యయనం చేస్తారు. ఈ బృందం ముందుగా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అవుతుంది. ఈ బృందం మండవల్లి, కైకలూరు. మండలాల్లో రెండు రోజుల పాటు పర్యటిస్తుంది. కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం వద్ద బహిరంగ సభలో పాల్గొంటుంది.

ఆంధప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలోని సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు- కొల్లేరు. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో 122 లంకలున్నాయి. 61 రకాల చేపలకు, 17 రకాల రొయ్యలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలస వచ్చే పక్షులలో ముఖ్యమైనవి పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుండి గ్రేట్‌ ‌పెలికాన్‌ ‌వంటి మొత్తం 189 రకాల పక్షులు వలసవస్తూ ఉంటాయి. గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలువలు నీటిని చేరుస్తున్నాయి. కోల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే వాగు ద్వారా బయటికి వెలుతుంది. సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతం చేరుతుంది.

కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉంది. ఇక్కడ కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది. ఈ అభయా రణ్యంలోని ప్రధాన వృక్షజాలం ఫ్రాగ్మిట్స్ ‌కర్కా, 10 అడుగుల ఎత్తు వరకు పెరిగే కలుపు మొక్క. ఇది కొన్ని జాతుల పక్షులకు ఆశ్రయం కల్పిస్తుంది. జల వృక్షసంపదలో నిమ్ఫేయే నౌచాలి, నైఫోయిడ్స్ ఇం‌డికమ్‌, ఒట్టెలియా అలిస్మోయిడ్స్, ‌నెచమంద్ర ఆల్టర్నిఫోలియా, లిమ్నోఫిలా ఇండికా, వల్లిస్నేరియా స్పైరాలిస్‌, ‌బ్లైక్సా ఆక్టాండ్రా, ఇపోమియా ఆక్వాటికాస్‌, ఆర్టిక్‌ ‌స్కులాటికాస్‌ ‌వంటి జాతులు ఉన్నాయి. జెర్మినటం, టైఫా అంగుస్టాటా, ఫ్రాగ్మిట్స్ ‌కర్కా అనేది అరుదైన వృక్షాలు.

కాంటూర్‌ ‌వివాదం

సముద్ర మట్టానికి సమాన ఎత్తులో (సగటున సముద్ర మట్టం) పాయింట్లను కలుపుతూ మ్యాప్‌లో గీసిన రేఖలను కాంటూర్లు అంటారు. గతంలో, వర్షాకాలంలో సరస్సులో నీటిమట్టం కాంటూర్‌ 7,10 ‌మధ్య ఉండేది. ఎండాకాలంలో కాంటూర్‌ 3‌కి పడిపోయింది. కాంటూర్‌ 3‌లోని వైశాల్యం 135 చదరపు కిలోమీటర్లు, కాంటూర్‌ 10 ‌లోని వైశాల్యం 901 చదరపు కిలోమీటర్లు.

ప్రకృతి విధ్వంసం

ఇంతటి విశిష్టమైన కొల్లేరు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంది. కొల్లేరును ఆక్రమించి చేపల చెరువులు తవ్వడం విచ్చలవిడిగా సాగిస్తున్నారు. మొత్తం 15,742 ఎకరాల్లో చేపల చెరువుల ఆక్రమణలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న ఈ సరస్సు అదృశ్యమవుతున్నా అధికారులు, ప్రభుత్వాలు పట్టించుకోవడడం లేదు. అంతేకాదు మురుగు కూడా చేరి సరస్సు స్వరూపం కాలుష్య కాసారంగా మారుతోంది. గ్రేట్‌ ‌పెలికాన్‌ ‌వంటి 189 రకాల పక్షులు, 61 రకాల ప్రత్యేక మత్స్యజాతులు, 17 రకాల రొయ్యలకు, నీటి సంబంధమైన 17 వృక్షజాలాలకు కొల్లేరు నెలవన్న పేరున్నా ఆక్వాకల్చర్‌ అదంతా విధ్వంసం చేస్తోంది. 15 రకాల అరుదైన చేపల జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. ఏలూరులో రెండేళ్ల కిందట సంభవించిన వింతవ్యాధికి కొల్లేరు ఆక్వాసాగులో వాడుతున్న విష పదార్థాలే కారణమని జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు నమోదైంది. ఆ నేపథ్యంలోనే జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకే తాజా కొల్లేరు ఆక్రమణల అంశం అధికారికంగా వెలుగుచూసింది.

సుప్రీంకు పర్యావరణవేత్తలు

కొల్లేరు అక్రమ తవ్వకాలతో పక్షులు, వన్యప్రాణుల ఆవాసాలకు ప్రమాదం ఏర్పడుతోందని పర్యావరణవేత్తలు ఇరవై ఏళ్ల కిందటే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీంతో 2006లో సుప్రీంకోర్టు సాధికార కమిటీని నియమించింది. ఆ సాధికార కమిటీ కొల్లేరు సరస్సు ఆక్రమణలను స్వయంగా పరిశీలించింది. అప్పట్లో కొల్లేరు సరస్సులో దాదాపు 50వేల ఎకరాల్లో ప్రభుత్వ, జిరాయితీ, డి.ఫాం భూముల్లో చట్టానికి విరుద్ధంగా సాగుతున్న చేపల చెరువులను బాంబులు పెట్టి ధ్వంసం చేశారు. ఆపరేషన్‌ ‌కొల్లేరు పేరుతో ఆక్రమణలను ధ్వంసం చేసి మళ్లీ కొల్లేరు మంచినీటి సరస్సును పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపట్టారు. 5 కాంటూరులోపు ఉన్న ప్రాంతమంతటినీ కొల్లేరు అభయారణ్యంగా రక్షించాలని జీవో 120 ప్రకారం ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టు దీన్ని ఖరారు చేసింది. ఈ పరిధిలో 83,982.70 ఎకరాల భూమి ఉందని ప్రభుత్వం గుర్తించింది. అక్కడ ఏ ప్రభుత్వ, ప్రైవేటు, డి.ఫాం భూముల్లో చేపల చెరువులు తవ్వకూడదు. కొల్లేరును సంరక్షించాల్సిన బాధ్యత అటవీశాఖదే అని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

15,742 ఎకరాల్లో మళ్లీ చెరువులు

సాక్షాత్తూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చర్యలు చేపట్టిన తర్వాత కూడా కొల్లేటిని కాపాడలేక పోతున్నారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో 2006 తర్వాత 2022 వరకు 15,742 ఎకరాల్లో మళ్లీ కొత్తగా చేపల చెరువులు తవ్వారని ప్రభుత్వం గుర్తించింది. అందులో 11,867 ఎకరాలు ప్రభుత్వ భూమి అని చెప్పింది. దీంతో కోల్లేరును ఆక్రమణల నుంచి రక్షించాలని కోరుతూ మళ్లీ పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొల్లేరు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సరస్సులో సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకొని, వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరంగా మారిన ఆక్రమణలను తొలగించడంతో పాటు అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మత్స్యకారుల జీవనోపాధికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. చుట్టుపక్కల పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగునీటిని, వ్యర్థాలను కొల్లేరులోకి వదలకుండా అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేసింది. గతేడాది డిసెంబరు 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, మూడు నెలల్లోపు కొల్లేరు సరిహద్దులను ఖరారు చేయాలని కూడ నిర్దేశించింది. ఇంకా ఈ కేసు విచారణలోనే ఉంది.

ప్రజాప్రతినిధుల అండతో కబ్జాలు

ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. కొల్లేరువాసుల పేరుతో బయటి వ్యక్తులు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని, సరస్సు ప్రాంతాన్ని ఆక్రమించి భారీ ఎత్తున చేపల, రొయ్యల చెరువుల వ్యాపారం సాగిస్తున్నారు. రూ. కోట్లాది విలువైన ఈ వ్యాపారంలో రాజకీయ నాయకులు, అధికారులు, స్థానికులకు వాటాలు అందుతున్నాయనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం అధికారంలో ఎవరు ఉన్నా, కొందరు ఎమ్మెల్యేలు ఈ కొల్లేరు కబ్జాలకు అండగా నిలుస్తున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త చెరువుల తవ్వకాలను ప్రోత్సహించడంలోనూ, అధికారులు జోక్యం చేసుకోకుండా ఒత్తిడి తేవడంలోనూ ప్రజా ప్రతినిధులు తమ ప్రభావాన్ని చూపించడం పరిపాటి. ఈ అక్రమ లీజుల ద్వారా వస్తున్న సొమ్ములో ప్రజాప్రతినిధులు, అధికారులు, కొంతమంది స్థానికులకు వాటాలు వెళ్తుండగా, మిగిలిన మొత్తాన్ని గ్రామాల ప్రజలు పంచుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు కొందరు ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ, కొల్లేరులో తమ పాత్ర లేదని, అటవీ శాఖదే బాధ్యత అని పేర్కొంటున్నారు. అయితే అటవీ శాఖ అధికారుల పైనా విమర్శలు ఉన్నాయి. వారు కేవలం నామమాత్రపు కేసులు పెడుతున్నారే తప్ప, ఆక్రమణలను పూర్తిగా తొలగించడంలో విఫలమవు తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు గట్టును కొద్దిగా ధ్వంసం చేయడం, వాహనాలను సీజ్‌ ‌చేసి కేసు పెట్టడం వంటి చర్యలకే అటవీ శాఖ పరిమిత మవుతోంది. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే ఆ గట్లు తిరిగి పూడ్చుకుని యథేచ్ఛగా చెరువులు సాగు చేసుకుంటున్నా ఎవరూ అడ్డుకునే పరిస్థితి లేదని సమాచారం. ఈ పరిస్థితి కొల్లేరు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవాలు గుర్తించేందుకు పర్యటన

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఈసీ (సెంట్రల్‌ ఎన్విరాన్మెంట్‌ ‌కమిటీ) ఈనెల 17, 18 తేదీల్లో కొల్లేరు గ్రామాల్లో పర్యటించి ఇక్కడి స్థితిగతులపై అధ్యయనం చేయనుంది. పక్షులే కాదు లక్షలాది మంది మత్స్యకారులు, రైతుల జీవనోపాధి ప్రశ్నార్ధకంగా మారిందని దేశ అత్యున్నత న్యాయస్థానం గుర్తించిన కారణంగా ఈ ప్రాంతాన్ని ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న మత్య్సకారుల్ని కూడా ఈ కమిటి కలవనుంది. దీంతో మత్స్యకారులు కూడా తమ సమస్యలను కమిటి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఇటీవల కైకలూరు వేదికగా చేపల రైతులు- కొల్లేరు ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. 122 గ్రామాల నుంచి కొల్లేరు పెద్దలు, ప్రజాప్రతినిధులు, రైతు, మత్స్యకార సంఘాలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఏకరవు పెట్టారు. కమిటి ముందు కొన్ని అంశాలను ఉంచనున్నారు. ఈ బృందం నిడమర్రు మండలం తోకలపల్లి, భైనేపల్లి, ఆకివీడు మండలం సిద్దాపురం ప్రాంతాల్లో కొల్లేరును పరిశీలిస్తుంది. కొల్లేరులో 122 పరీవాహక గ్రామాలు ఉండగా.. మౌలిక వసతులు, శ్మశానాలకు భూములు, తాగునీటి చెరువులు, మట్టి పూడికలు వంటి అంశాలను సీఈసీకి వినతుల రూపంలో అందించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కొల్లేరు అభయారణ్యం 77,135 ఎకరాల్లో జిరాయితీ, డీఫాం పట్టా భూములు దాదాపు 20 వేల ఎకరాలు మినహాయించాలనే ప్రధాన డిమాండును సీఈసీ ముందు ఉంచనున్నారు. అటవీ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, వాటిని సవరించి ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాలని కోరనున్నారు.

సుకుమార్‌ ‌కమిటీ సూచించినట్లుగా జిరాయితీలు ‘డి’ పట్టాల భూములను రైతులకు కేటాయించాలి. పక్షులకు, పర్యావరణానికి రక్షణ కల్పిస్తూనే.. వందల ఏళ్లుగా జీవిస్తున్న ప్రజలకు జీవనోపాధిని చూపించాలి. అటవీ నిబంధనలు సడలించి తాగునీరు, రోడ్లు, శ్మశానవాటికల అభివృద్ధి, ఇతర మౌలిక వసతులు కల్పించాలి. కొల్లేరు పరీవాహకంలోని 10 కిలోమీటర్ల మేర ఎకో సెన్సిటివ్‌ ‌జోన్‌ అమలుతో చిన్న పరిశ్రమలు ఏర్పాటుకు వీల్లేదు. దీనివల్ల ప్రజలు ఉపాధి కోసం వలసల బాట పట్టాల్సి వస్తుంది.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE