ఆపరేషన్ సిందూర్ అనంతరం కెనడా వేదికగా జూన్ 16, 17 తేదీలలో జరిగిన జీ`7 శిఖరాగ్ర సమావేశాలకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ పర్యటనలో భాగంగా కెనడాతో పాటు సైప్రస్, క్రొయేషియా దేశాల్లో కూడా పర్యటించారు. ఈ మూడు దేశాల పర్యటనను ఆయన ఎంతో వ్యూహాత్మకంగా వినియోగించుకొని తన విదేశాంగ చతురతను చాటుకున్నారు. ఈ విదేశీ పర్యటనపై దేశీయంగా, అంతర్జాతీయంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి ప్రధాన కారణం జీ`7 శిఖరాగ్ర సమావేశాలకు ప్రధాని మోదీ వెళ్లడంపై కొంత గందరగోళం నెలకొంది. ఈ సమావేశాలు కెనడాలో నిర్వహిస్తున్న నేపథ్యంలో మోదీ పర్యటనపై మరింత ఆసక్తి పెరిగింది.
ఖలిస్తాన్ వేర్పాటువాదులకు స్థావరంగా మారిన కెనడాతో భారత్‌కు కొంత కాలంగా సంబం ధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో జీ`7 సమావేశా లకు నరేంద్ర మోదీని పిలుస్తారా? అనే సందేహాలు వెలువడ్డాయి. మోదీ రాకను ఖలిస్తాన్ వేర్పాటు వాదులు వ్యతిరేకిస్తుండడంతో కెనడా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనే ప్రశ్నలు ఉదయించాయి. ఇందుకు తగ్గట్టుగానే జీ`7 సమావేశాలకు భారతదేశాన్ని ఆహ్వానించడంలో కొంత జాప్యం జరగడంతో కాంగ్రెస్ దాన్ని నరేంద్ర మోదీ సర్కారు విదేశాంగ వైఫల్యంగా ప్రచారం చేసింది.
జీ`7లో భారత్ సభ్యత్వ దేశం కాకపోయినా ఆహ్వానిత దేశంగా ఇప్పటివరకు 12 సార్లు ఆహ్వానం అందింది. 1975లో ఏర్పడిన ‘జీ’ సమావేశాలకు మొదటిసారిగా 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వానికి ఆహ్వానం అందింది. వాజ్‌పేయి కృషితో ప్రారంభమైన ఈ పరంపర కొనసాగడంతో 2004 నుండి 2009 వరకు మన్మోహన్ సింగ్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం భారత్‌కు ఆహ్వానాలు ఆగిపోయాయి. మళ్లీ మోదీ ప్రభుత్వం కృషితో తిరిగి 2019 నుండి భారత్‌కు జీ`7 సమావేశాలకు ఆహ్వానాలు అందుతున్నాయి. మోదీ వరుసగా 6 సార్లు హాజరయ్యారు. జీ`7 సమావేశాల్లో భారత్ పాల్గొన్న చరిత్రను చూస్తే గత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం స్పష్టమవుతోంది. వాస్తవాలు ఇలా ఉండగా కాంగ్రెస్ మాత్రం మోదీ ప్రభుత్వం వైఫల్యంతో మొదటిసారి భారత్‌కు ఆహ్వానం అందలేదని ప్రచారం చేసింది.
మోదీ వ్యతిరేక శక్తుల అంచనాలను పటాపంచలు చేస్తూ కెనడా ప్రధాని మార్క్ కార్నీ 51వ జీ`7 సమావేశాలకు భారత్‌ను ఆహ్వానించడంతో కాంగ్రెస్ నవ్వులపాలైంది. మోదీ జీ`7 సమావేశాలకు ముందు సైప్రస్‌కు, అనంతరం క్రొయేషియాకు వెళ్లారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఈ మూడు దేశాల పర్యటనలో ప్రతిదీ మన దేశానికి ప్రధానమైందే.
సైప్రస్ దేశం 12 లక్షలలోపు జనాభా ఉన్న ఒక చిన్న ద్వీపం. ఈ చిన్న దేశం భౌగోళికంగా ఆసియాలో ఉన్నా, ఐరోపాకు సింహద్వారంగా ఐరోపా యూనియన్`ఈయూలో ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంది. టర్కీ , సిరియా దేశాలతో సరిహద్దును పంచుకుంది. ఇంతకు ముందు ఈ ద్వీపానికి మన దేశ చరిత్రలో రాజకీయంగా ప్రాధాన్యతలేదు. 1982లో ఇందిరాగాంధీ, 2002లో అటల్ బిహారీ వాజ్‌పేయి సైప్రస్‌లో పర్యటించారు. 23 ఏళ్ల అనంతరం ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ పర్యటనలో విశేష ముంది. ఈ పర్యటన వెనుక భౌగోళిక, రాజకీయ అంశాలున్నాయి. సైప్రస్, టర్కీ మధ్య వైరం ఉంది. టర్కీ అక్రమంగా సైప్రస్ భూభాగాన్ని ఆక్రమించడంతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితు లున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ప్రధాని సైప్రస్ వేదికగా టర్కీకి పరోక్షంగా హెచ్చరిక సందేశం పంపారు.
పాకిస్తాన్ ఇస్లాం దేశమనే ఒకే ఒక కారణంతో పాక్‌కు నిత్యం దన్నుగా నిలిచే టర్కీ ఆపరేషన్ సిందూర్‌లో కూడా భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడిరది. భారత్ సరిహద్దులో సాధారణ ప్రజలపై పాకిస్తాన్ వినియోగించిన డ్రోన్లు టర్కీ దేశం అందించి నవే. పర్యాటక రంగంగా టర్కీకి అధికంగా భారత్ నుండే లాభాలొస్తున్నాయి. ఇంతకుముందు సంభవించిన భూకంపంతో అతలాకుతలమైన ఆ దేశానికి భారత్ అన్ని దేశాల కంటే అధికంగా సహాయ సహకారాలు అందించింది. ఇవన్నీ మరిచిన టర్కీ ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌కు అండగా నిలిచింది. పాకిస్తాన్‌కు సాయపడిన ఆ దేశానికి సరైన సమాధానం ఇవ్వాలని నిర్ణయించిన మోదీ సైప్రస్ పర్యటనకు ప్రాముఖ్యతిచ్చారు.
భౌగోళికంగా సంబంధం లేకపోయినా భారత్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పలుమార్లు చికాకు పరుస్తున్న టర్కీని గత ప్రభుత్వాలు విస్మరించినా ఆ దేశానికి గట్టి బుద్ధి చెప్పాలని ప్రధాని నిర్ణయించారు.
టర్కీ 1974లో కుట్రలకు పాల్పడి సైప్రస్‌లో ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆ దేశ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకొని ఇప్పటికీ తన అధీనంలోనే ఉంచుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ శక్తి సామర్థ్యాలను తెలుసుకున్న సైప్రస్ కూడా మనకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు 2026లో ఈయూ సారథ్య బాధ్యతలు కూడా సైప్రస్ చేతికి దక్కుతుండడంతో ఉభయకుశలోపరిగా ఆ దేశానికి సాయం అందిస్తూనే, మన లక్ష్యం కూడా నెరవేర్చుకునేందుకు మోదీ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
వ్యూహాత్మకంగా భారత్‌కు కీలకమైన భాగ స్వామిగా మారిన సైప్రస్‌కు ఆర్థికంగా, సైనిక పరంగా అండదండలు అందించేందుకు ప్రధాని ముందుకు రావడంతో పరోక్షంగా టర్కీకి హెచ్చరిక జారీ చేసినట్టయ్యింది. అందుకే మోదీ సైప్రస్ పర్యటనలో భాగంగా ఆ దేశ సరిహద్దు వరకు వెళ్లడం కూడా ఆసక్తికరమైన పరిణామమే. సైప్రస్, టర్కీ దేశాల సరిహద్దులో రెండు వైపులా రెండు దేశాల పతాకా లుంటాయి. భారత ప్రధాని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ వెంట ఆ దేశ సరిహద్దుల వరకు నడుస్తూ టర్కీ జెండాలను తిలకించడం గమనార్హం.
తన సైప్రస్ పర్యటనతో ఆ దేశ ప్రజల్లో భరోసా నింపిన భారత ప్రధానిని ఆ దేశ అత్యున్నతమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3’ పురస్కారంతో సత్కరించారు. మోదీ అనంతరం జీ`7 రెండు రోజుల సమావేశాల కోసం కెనడాలో పర్యటించారు. టెర్రరిజాన్ని సమర్థిస్తున్న దేశాల ద్వంద్వ ప్రమాణాలను జీ`7 సదస్సులో ఆయన ఎండగట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం విష సర్పం లాంటి టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే ఎప్పటికైనా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సున్నితంగా అగ్రదేశాలను హెచ్చరించారు. ఒక వైపు హడావిడిగా ఆంక్షలు విధిస్తూ, మరోవైపు టెర్రరిజానికి మద్దతిచ్చే దేశాలకు రివార్డులు, రుణాలు ఇస్తున్నారంటూ వ్యాఖ్యానించి ఉగ్రవాదంపై అగ్రరాజ్యాల నిజాయతీని ప్రశ్నించారు. జీ`7 సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూటమి దేశాల అధినేతలతో ప్రత్యేకంగా సమావేశమై ఉగ్రవాదంతో పాటు టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు అంశాలపై చర్చించారు. కెనడా వేదికగా దక్షిణ కొరియా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, మెక్సికో, జర్మనీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
జీ`7 సమావేశాల్లో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలయికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సమావేశాల మధ్యలోనే ట్రంప్ అమెరికాకు వెనుదిరగడంతో మోదీతో ఆయన చర్చలు జరపలేదు. మోదీని ట్రంప్ కలిసేందుకు ఇష్టపడ లేదని, అదే సమయంలో ట్రంప్ మోదీ కంటే పాక్ సైన్యాధిపతి మునీర్‌ను కలుసుకునేందుకే ప్రాధాన్యతి చ్చారని, ఇది భారత్ విదేశాంగా విధాన వైఫల్యమని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. మరుసటి రోజే జరిగిన పరిణామాలతో గోబెల్స్ ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇంటా బయట నవ్వులపాలైంది.
నరేంద్ర మోదీతో ప్రత్యక్షంగా చర్చించలేకపోయిన ట్రంప్ అమెరికాకు చేరిన తర్వాత ఫోన్‌లో మాట్లాడారు. ‘‘భారత్ పాక్ కాల్పుల విరమణలో మీ జోక్యం ఏమాత్రం లేదు. పాక్ కాళ్లబేరానికి రావడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించాం, మీతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలూ కుదుర్చుకోలేదు, మీ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు… ’’ అని మోదీ ట్రంప్ ముఖం మీదనే చెప్పేయడంతో ఇంతకాలం ‘నరేందర్.. సరెండర్’ అంటూ కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారానికి ముగింపు పలికినట్ల య్యింది. తిరుగు ప్రయాణంలో నరేంద్ర మోదీని ట్రంప్ అమెరికాలో పర్యటించాలని కోరినా వారి కుట్రలు, కుతంత్రాలు బాగా తెలిసిన నరేంద్ర మోదీ వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. దీంతో ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో సమావేశమైన సందర్భంలో భారత్ పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణలో తమ జోక్యం ఏమాత్రం లేదనే సత్యాన్ని అంగీకరించాల్సి వచ్చింది.
మోదీ కెనడా పర్యటనను ఖలిస్తాన్ వేర్పాటు వాదులను కట్టడి చేయడంలో చక్కగా వినియోగించు కున్నారు. భారత ప్రధాని పర్యటనకు ఖలిస్తాన్ వేర్పాటువాదులు అడ్డంకుంలు కలిగించవచ్చనే ఆందోళన నేపథ్యంలో ప్రధాని వెనకడుగు వేయకుండా జీ-7కు హాజరయ్యారు. కొంత మంది ఖలిస్తాన్ వేర్పాటువాదులు ‘కిల్ మోదీ పాలిటిక్స్, కిల్ ఇండియా పాలిటిక్స్’ అంటూ నిరసనలు చేపట్టి భారత పతాకాన్ని అవమానించారు. అయితే మోదీ కెనడా వీడిన మరుసటి రోజునే కెనడా నిఘా సంస్థ తమ దేశం నుంచే ఖలిస్తానీ వేర్పాటువాదులు భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడుతున్నారని నివేదిక ఇచ్చింది. ఇంతకాలం ఖలిస్తాన్ విషయంలో భారత్‌ను తప్పుపడుతున్న కెనడాలో ఈ మార్పు రావడానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ పర్యటనే.
మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా మోదీ క్రొయేషియాలో పర్యటించారు. ఆ దేశంలో పర్యటించిన మొదటి భారత ప్రధానిగా నిలిచారు. క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలానోవిక్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ విద్య, ఐటీ, స్టార్టప్‌లు, పునరుత్పాదక శక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి వంటి రంగాల్లో ఒకరికొకరు సహకరించేం దుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ దేశ విశ్వవిద్యాలయాల్లో హిందీ బోధనపై కూడా ఉభయ దేశాలు చర్చించాయి.
మూడు దేశాల పర్యటనలో మోదీ ముద్ర స్పష్టంగా కనిపించింది. దేశ శత్రువులపై ఎలాంటి ఉదాసీనత కనబర్చకుండా చాకచక్యంగా వ్యవహరించారు. మోదీ తన విదేశీ పర్యటనను వ్యూహాత్మకంగా వినియోగించుకొని దేశ ప్రయోజనా లకు పెద్ద పీట వేయడమే కాకుండా భారత్‌తో చెలగాటమాడే టర్కీ వంటి దేశాలకు, మేము ఏమి మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే అహంకార ధోరణితో వ్యవహరించే ట్రంప్‌నకు, ఖలిస్తాన్ ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలే పంపారు.
– శ్రీపాద