యావత్ ప్రపంచాన్ని యోగా ఏకం చేయడం శుభసూచకమని, తనకు ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యా నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జూన్ 21న జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. భారత్‌తో పాటు, యావత్ ప్రపంచ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
యోగా ‘ఐక్యత’ సారమని, అది యావత్ ప్రపంచాన్ని ఇలా ఏకం చేయడం సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గత దశాబ్దకాల యోగా ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఆలోచనను భారత్ ప్రతిపాదించిన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. 175 దేశాలు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయని, ఇది యావత్ ప్రపంచ ఐక్యతకు అరుదైన సందర్భమని అభివర్ణించారు. ఈ మద్దతు కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే కాదని, మానవాళికి మేలు చేసేందుకు ప్రపంచం చేసిన సమష్టి ప్రయత్నాన్ని ఇది సూచిస్తుందన్నారు. ‘‘పదకొండు సంవత్సరాల తరువాత, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవనశైలిలో యోగా అంతర్భాగంగా మారింది’’ అని ఆయన చెప్పారు. దివ్యాంగులు బ్రెయిలీలో యోగా గ్రంథాలను చదవడం, శాస్త్రవేత్తలు అంతరిక్షంలో యోగా సాధన చేయడం గర్వంగా ఉందన్నారు. యోగా ఒలింపియాడ్స్‌లో గ్రామీణ ప్రాంతాల యువత ఉత్సాహంగా పాల్గొనడాన్ని కూడా ఆయన ప్రస్తావిం చారు. సిడ్నీ ఒపెరా హౌస్ మెట్ల మీదైనా, ఎవరెస్ట్ శిఖరం దగ్గరైనా, విశాలమైన సముద్రపు తీరంలో నైనా, ‘‘హద్దులు.. నేపథ్యాలు.. వయస్సు.. సామర్థ్యా లకు అతీతంగా యోగా అందరిదీ’’ అనే సందేశంలో మార్పు ఉండదని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తమైన ‘‘యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్’’ గురించి ప్రస్తావిస్తూ… ఈ ఇతివృత్తం.. భూమిపై ఉన్న ప్రతి జీవి ఆరోగ్యం పరస్పరం అనుసంధానమై ఉందనే లోతైన సత్యాన్ని ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. మానవ శ్రేయస్సు.. మనకు అన్నం పెట్టే నేల ఆరోగ్యం, మనకు నీటిని అందించే నదులు, మన పర్యావరణ వ్యవస్థను పంచుకునే జంతువులు, మనల్ని పోషించే మొక్కల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. యోగా మనకు ఈ పరస్పర అనుసంధానాన్ని తెలియజెప్పి, ప్రపం చంతో ఏకమయ్యే దిశగా మార్గనిర్దేశం చేస్తుందని నరేంద్ర మోడీ వివరించారు.
యోగా విజయవంతంపై సంతృప్తి
విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి.. ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేసిన ప్రజలను ప్రశంసించారు. కార్యక్ర మాన్ని అద్భుతంగా నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అభినందనలు తెలిపారు. వారిద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ యోగాంధ్ర అభియాన్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమ విజయం కోసం మంత్రి నారా లోకేశ్ కృషిని ప్రధాని ప్రత్యేకంగా అభినందిస్తూ, యోగాను నిజమైన సామాజిక వేడుకగా, సమాజంలోని అన్ని వర్గాలను కలిపే వేదికగా చూపడంలో లోకేశ్ విజయవంతం అయ్యారని పేర్కొన్నారు. ‘యోగాంధ్ర అభియాన్‌లో రెండు కోట్లకు పైగా ప్రజలు భాగస్వాములయ్యారు. ఇది ప్రజల భాగస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. ఈ స్ఫూర్తి వికసిత్ భారత్ సాధనకు పునాదిగా నిలుస్తుంది. పౌరులు స్వయంగా ఒక లక్ష్యాన్ని ఎంచు కుని దాని సాధన కోసం చురుగ్గా కృషి చేసినప్పుడు.. చేరుకోలేని లక్ష్యం ఏదీ ఉండదు’అని వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఒత్తిడి, అశాంతి, అస్థిరత నివారణకు, శాంతి స్థాపనకు యోగా మార్గాన్ని సుగమం చేస్తుందని అన్నారు. ‘‘మానవాళి గాలి పీల్చుకోవడానికీ, జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం ద్వారా తిరిగి పరిపూర్ణులుగా మారేందుకు అవసరమైన పాజ్ బటన్ వంటిదే యోగా అని పేర్కొన్నారు. ఈ యోగా దినోత్సవం ప్రపంచానికి అంతఃశాంతిని ప్రసాదించే మానవత 2.0 ప్రారంభాన్ని సూచించేలా మనమంతా కృషి చేయాలని పిలపునిచ్చారు. ఎయిమ్స్ వంటి సంస్థలు యోగా శాస్త్రీయ పరిశోధనల ద్వారా గుండె, నాడీ, మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్సలో దాని ప్రభావాన్ని నిరూపిస్తున్నాయని, జాతీయ ఆయుష్ మిషన్, డిజిటల్ పోర్టల్స్ ద్వారా యోగా ప్రజా ఉద్యమంగా మారుతోందని చెప్పారు. స్థూలకాయం వంటి సమస్యలను అధిగమించేందుకు నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలని, యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ‘‘హీల్ ఇన్ ఇండియా’’ కార్యక్రమం ద్వారా భారత్ వైద్య గమ్యస్థానంగా ఆవిర్భవిస్తున్నదని, యోగా ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నదని పేర్కొన్నారు. యోగా ప్రామాణీకరణ కోసం సాధారణ ప్రోటోకాల్, 6.5 లక్షల వాలంటీర్ల శిక్షణ, వైద్య కళాశాలల్లో యోగా మాడ్యూల్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో యోగా ఉపాధ్యాయుల నియామకం, ఇ-ఆయుష్ వీసాలతో ప్రపంచానికి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తున్నామని తెలిపారు.
యోగాను ఒక ‘జన ఆందోళన్’..అంటే ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రధానమంత్రి పిలుపు నిచ్చారు. ప్రపంచాన్ని శాంతి, ఆరోగ్యం, సామరస్యం వైపు నడిపించే ఉద్యమం అవసరమన్నారు. జీవితంలో సమతుల్యతను తీసుకురావడానికి ప్రతి వ్యక్తి యోగాతో తమ రోజును ప్రారంభించాలనీ, ఒత్తిడి లేని జీవితం కోసం ప్రతి సమాజం యోగాను స్వీకరించాలని సూచించారు. ‘‘యోగా మానవాళిని ఏకం చేసే మాధ్యమంగా పనిచేయాలి.. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదం ప్రపంచ సంకల్పంగా మారాలి’’ అని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
ప్రజాప్రతినిధుల ఉత్సాహం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు ప్రతాప్‌రావు జాదవ్, రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, భరత్‌జీ వేదికపై ఆశీనులయ్యారు. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కిందన రెండో కంపార్టుమెంట్‌లో ఆసనాలు వేశారు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు తమ నియోజకవర్గాల ప్రజలతో కలిసి కేటాయించిన కంపార్టుమెంట్లలో ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా పోస్టల్ స్టాంపు విడుదల చేశారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
విశాఖ నగరంలో నిర్వహించిన రెండు కార్యక్రమాలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ 30.16 కిలోమీటర్ల మేర 3,03,654 మందితో చేపట్టిన యోగా ప్రదర్శన గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. 2023లో గుజరాత్‌లోని సూరత్‌లో 1.47 లక్షల మందితో యోగా నిర్వహించడమే ఇప్పటి వరకూ రికార్డుగా ఉంది. ఇప్పుడు దాన్ని అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించినట్టయింది. అలాగే ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సార్లు సూర్యనమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమానికి కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చోటు దక్కింది. ఈ రెండు రికార్డులకు సంబంధించిన పత్రాలను గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఆర్కే బీచ్‌రోడ్డులోని యోగా ప్రధాన వేదిక వద్ద అందజేశారు.
ఘనంగా యోగా కార్యక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వైభవంగా జరిగింది. పెద్దల నుంచి పిన్నల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ‘యోగాంధ్ర’కు వన్నె తెచ్చారు. రాష్ట్రంలోని హైకోర్టు నుంచి పాఠశాలల వరకు, అసెంబ్లీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు ‘యోగా ముద్ర’ను సంతరించు కున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 61,266 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు యోగా సనాలు వేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు దాదాపు 60 లక్షల మంది యోగాసనాలు వేసి రికార్డును నెలకొల్పడంలో భాగమయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది యోగాసనాలు వేశారు. హైకోర్టు యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 200 మందికి పైగా ఎస్పీఎఫ్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
విజయనగరంలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్యర్యంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి, జస్టిస్ ఏవీ శేషసాయి పాల్గొన్నారు. జిల్లా న్యాయాధికారి బబిత, ఇతర న్యాయాధికారులు, న్యాయవాదులతో కలిసి యోగాసనాలు వేశారు.
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 5 వేల మంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 5125 ప్రాంతాల్లో నిర్వహంచిన యోగా కార్యక్రమంలో పది లక్షల మందికి పైగా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగులు ఆసనాలు వేశారు. అమరావతి సచివాలయ ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు యోగాసనాలు వేశారు. శాసనసభ ప్రాంగణంలో సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర ఆధ్వర్యంలో ఉద్యోగులు పలు రకాల ఆసనాలు వేశారు. నెల్లూరులోని ఏసీ స్టేడియంలో యోగా కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. మంత్రి ఆనం గార్డెన్స్‌లో ఆసనాలు వేశారు. తిరుపతి ఎన్‌సీసీ నగర్‌లో ఎన్‌సీసీ క్యాడెట్లు గుర్రాలపై కూర్చుని, నిలబడి యోగాసనాలు వేశారు. వారిని కల్నల్ సతీందర్ దహియా ప్రశంసించారు. రాజమండ్రి జైలులో 1300 మంది ఖైదీలు యోగాసనాలు వేశారు.
యోగాంధ్రలో 10.87 లక్షల మంది అనంత పురం జిల్లావాసులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విశాఖలో నిర్వహించిన యోగా వేడుకలను జిల్లాలోని నీలం సంజీవరెడ్డి పీటీసీ మైదానంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షిస్తూ కలెక్టర్ వినోద్‌కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్పీ జగదీశ్ సహా పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతిధులు, ప్రజలు యోగాసనాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 6,040 వేదికలలో 10.87 లక్షల మంది యోగాంధ్రలో భాగస్వాములయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో 4,500 వేదికలపై యోగా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. కొవ్వూరులో గోదావరి తీరంలో స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి యోగాంధ్ర రిజిస్ట్రేషన్‌లో ‘మిరాకిల్ వరల్డ్ రికార్డు’ దక్కింది. రికార్డుస్థాయిలో 18,662 మంది విద్యార్థులు యోగాంధ్రలో నమోదు చేయించుకున్నారు. జూన్ 18న 16,123 మంది విద్యార్థులతో మెగా యోగాంధ్ర నిర్వహించగా ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ దీనిని నమోదు చేసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 4,600 కేంద్రాల్లో 8 లక్షల మంది యోగాసనాలు వేశారు. కాకినాడ జిల్లాలో 4,800 కేంద్రాల్లో యోగాసనాలు వేయగా జిల్లా కేంద్రంలో కలెక్టర్ షాన్‌మోహన్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్