మే 12 రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సమయం సందర్భం ఎరిగిన ప్రధానిగా మోదీ కాల్పుల విమరణ నిర్ణయం సృష్టించిన గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. ఉద్వేగంతో ఆయన మాట్లాడారు. ఒక యుద్ధంలో తెరవెనుక ఉండే అన్ని అంశాలను బయటపెట్టడం సాధ్యం కాదన్న ధ్వని కూడా ఆయన ఉపన్యాసంలో ఉంది. ఉగ్రవాదం-చర్చలు, ఉగ్రవాదం-వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావు.. ఒకేచోట నీళ్లు, నెత్తురు ప్రవహించవు అని వాస్తవం చెప్పారు. భారత దేశాన్ని, ప్రజలను కాపాడుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయానికైనా వెనుకాడబోమని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్నే కాదు, దానికి అండనిస్తున్న శక్తులను విడిచిపెట్టేది లేదని ఆయన పాంచజన్యం పూరిం చారు. ఉగ్రవాదం వెనుక ఉన్నవారు ఎవరో కూడా స్పష్టంగానే చెప్పారు. ఒకటి పాకిస్తాన్‌, ‌రెండు పాక్‌ ‌సైన్యం. ఇంకా ఐఎస్‌ఐ. ‌పాక్‌ ‌సైన్యం, అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదానికి ఎలా నీళ్లు, ఎరువు వేస్తూ వస్తున్నాయో అలాగే అవి ఏదో ఒకరోజు ఆ దేశాన్ని కూడా అంతం చేస్తాయి. పాకిస్తాన్‌ ‌తనను తాను కాపాడుకోవాలంటే ఉగ్రవాద వ్యవస్థల్ని ధ్వంసం చేయాల్సిందే నిర్ద్వంద్వంగా వెల్లడించారు మోదీ.

ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌మొదలయ్యాక జాతినుద్దే శించి ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్‌ ‌వైఖరిని స్పష్టంగా చాటి చెప్పారు. తన ప్రసంగంలో మోదీ ఉపయోగించిన భాష, అందులోని భావం క్షిపణి ధ్వనులను మరిపించాయంటే అతిశయోక్తి కాదు. నిప్పుల వానలా సాగిన ఆ 22 నిమిషాల ప్రసంగంలో అనేక కీలకాంశాలు వచ్చాయి.

భారత్‌ ‌ప్రళయ భీకర దాడులను తట్టుకోలేకే పాకిస్తాన్‌ ‌కాల్పుల విరమణ పేరుతో కాళ్ల బేరానికి వచ్చిందని నరేంద్రమోదీ పేర్కొన్నారు. నవయుగ యుద్ధంలో పాక్‌ను భారత్‌ ‌మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మన సేనంతో వాళ్ల గుండెపైనే కొట్టగలిగామన్నారు. కాల్పుల విరమణ కాలమంతా ఆ దేశ ప్రవర్తనను పరిశీలిస్తా మని, మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దాయాది దేశం మన పాఠశాలలు, సాధారణ ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటే, వారి ముఖ్యమైన మౌలిక వసతులు, ఉగ్రవాద స్థావరాలను విధ్వంసం చేసి మన సత్తాను చాటగలిగామని ప్రధాని ప్రకటించారు. ఇంకా ఆయన- 21వ శతాబ్దపు సరికొత్త యుద్ధంలో భారత్‌ ‌తన స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపింది. పెహల్గావ్‌లో ఉగ్రవాదులు వికృత క్రూరత్వాన్ని ప్రదర్శించి కుటుంబసభ్యుల ముందే అమాయక ప్రజలను చంపినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్ర సౌధాలను కుప్ప కూల్చి 100 మందికి పైగా పేరుమోసిన ఉగ్రవాదులను అంతమొందించాం. ఆ దేశంతో చర్చలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన, పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌పైన మాత్రమే. భారతదేశాన్ని, ప్రజలను రక్షించుకోవడా నికి ఎంత పెద్ద నిర్ణయానికైనా వెనుకాడబోము. సైనిక శౌర్య పరాక్రమాలకు సెల్యూట్‌. అన్నింటికంటే ముందు మన సేనలు, నిఘా విభాగాలు, శాస్త్రవేత్త లకు ప్రతి భారతీయుడి తరపున సెల్యూట్‌ ‌చేస్తున్నా. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌లక్ష్యం సాదించడానికి మన వీర సైనికులు విశేష శౌర్య పరాక్రమాలు ప్రదర్శించారు. నేను వారి వీరత్వం, సాహసం, పరాక్రమాన్ని ఈ దేశంలోని తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నాను. సెలవుల్లో ఆనందంగా గడుపుతున్నవారిని మతం అడిగి మరీ, వారి పిల్లల ముందు పాశవికంగా చంపడం ఉగ్రవాద వికృత రూపానికి, క్రూరత్వానికి పరాకాష్ట.  ఇది నాకు వ్యక్తి గతంగా అత్యంత దుఃఖం కలిగించింది. ఈ దాడి తర్వాత దేశం మొత్తం ఒక్కటైంది. ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరించాలని నినదించింది. ఆ తర్వాతే మేం ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేందుకు మన సేనలకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాం. మన సోదరీ మణులు, బిడ్డల నుదుటి సిందూరం తుడిచేయడానికి ప్రయత్నించిన ప్రతి ఉగ్రవాది, ఉగ్రవాద సంస్థకు దాని పర్యవసానం ఏమిటో తెలిసి వచ్చింది. కోట్ల మంది మనోభావనల ప్రతిబింబం ఆపరేషన్‌ ‌సిందూర్‌, ‌కేవలం పేరుకాదు. కోట్ల మంది ప్రజల మనోభావనల ప్రతిబింబం. భారత్‌ ఇం‌త పెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించలేదు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారతీయ క్షిపణులు, డ్రోన్లు విరుచుకు పడ్డాయి. బహవల్‌పుర్‌, ‌మురీద్‌కెలు ప్రపంచ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలుగా మారాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ పెద్ద ఉగ్రవాద దాడి జరిగినా అందులో వీటి పాత్ర ఉంటున్నది. 9/11 సహా దేశంలో దశాబ్దాల తరబడి జరుగుతూ వచ్చిన పెద్ద పెద్ద ఉగ్రవాద దాడులన్నీ వీటితో ముడిపడి ఉన్నాయి. ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరం తుడిచేస్తూ వచ్చారు. అందుకే ఆ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాన్ని సైన్యం ధ్వంసం చేసింది. గత మూడు దశాబ్దాలుగా ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వచ్చారు. ఒక్క దెబ్బతో వీరిని సైన్యం తుడిచిపెట్టింది.

భారత్‌ ‌కార్యాచరణను చూసి పాకిస్తాన్‌ ‌నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయింది. బిత్తరపోయింది. ఈ తత్తరపాటులో మరో దుస్సాహసానికి పాల్పడింది. ఉగ్రవాదంపై పోరులో భారతదేశానికి మద్దతు పలకడానికి బదులుగా భారత్‌పైనే దాడి చేయడం మొదలు పెట్టింది. మన పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాలు, ఆలయాలు, సామాన్య ప్రజల ఇళ్లను, మన సైనిక స్థావరాలనూ లక్ష్యంగా చేసుకుంది. కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పాకిస్తాన్‌ ‌డ్రోన్లు, క్షిపణులు ఎలా గడ్డిపోచల్లా గాల్లో కలసి పోయాయో ప్రపంచం చూసింది. ఆ నష్టాన్ని ఊహిం చడం కష్టం. అందుకే బయటపడే మార్గం కోసం పాక్‌ ‌వెదికింది. ప్రపంచం మొత్తం తిరిగి అందరినీ ప్రాధేయ పడింది. ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం పాకిస్తాన్‌ ‌సైన్యం మన డీజీఎంవోని సంప్రదించింది. ఆలోపే మనం పాకిస్తాన్‌లోని మొత్తం మౌలిక వసతులను పూర్తిగా ధ్వంసం చేశాం. ఉగ్రవాద స్థావరాలను శిథిలాలుగా మార్చేశాం. అందుకే తమవైపు నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు, సైనిక దుస్సాహసాలు ఉండవని పాకిస్తాన్‌ ‌చెప్పింది. భారత్‌ ‌కూడా వాటిని పరిగణన లోకి తీసుకుని ఆలోచించింది. యుద్ధ మైదానంలో మనం ప్రతిసారీ పాక్‌ను మట్టి కరిపించాం. ఈ ఆపరేషన్‌ ‌ద్వారా ‘భారత్‌లో తయారీ’ ఆయుధాల ప్రామాణికత నిరూపితమైంది. ఈ యుగం యుద్దానిది కాదు… ఉగ్రవాదులదీ కాదు. దేశ ప్రజలారా! ఈరోజు బుద్ధ పూర్ణిమ. బుద్ధ భగవానుడు మనకు శాంతిమార్గం చూపారు. శాంతి మార్గం కూడా అత్యంత శక్తితోనే ఉంటుంది. వికసిత్‌ ‌భారత్‌ ‌కలలను సాకారం చేసుకోవాలంటే భారత్‌ ‌శక్తిశాలి కావడం చాలా అవసరం. అవసరమైనప్పుడు ఈ శక్తిని ఉపయోగిం చడం కూడా అత్యవసరం. గత కొన్ని రోజుల్లో భారత్‌ ఇదే చేసింది అన్నారు మోదీ.

ఇంకా- మనం పాకిస్తాన్‌ ఉ‌గ్రవాద, సైనిక స్థావరాలపై దాడులు నిలిపేశాం. రాబోయే రోజుల్లో ఆ దేశం ప్రతి అడుగునూ, ప్రతి ఆలోచననూ పరిశీలిస్తాం. దళాలన్నీ నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయి. మెరుపుదాడులు, గగనతల దాడుల తర్వాత ఇప్పుడు ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌నిర్వహించాం. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్‌ ‌విధానం ఇక ఇదే. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది. భారతదేశం మీద ఉగ్రవాదానికి పాల్పడితే మూతి పగులగొట్టేలా గట్టి సమాధానం ఇస్తాం. మన సొంత మార్గంలో, స్వీయ నిబంధనల ప్రకారం స్పందిస్తాం. ఉగ్రవాద మూలాలు బయటపడే ప్రతిచోటా కఠిన చర్యలు తీసుకుంటాం. అణుబాంబు బెదిరింపులను భారత్‌ ‌సహించదు. ఈ ముసుగులో విజృంభిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై కచ్చిత మైన, నిర్ణయాత్మకమైన దాడి చేస్తుంది. ఉగ్రవాద తండాలను, వాటిని ప్రోత్సహించే ప్రభుత్వాన్ని భారత్‌ ‌విడివిడిగా చూడదు. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌ద్వారా ప్రపంచం మొత్తం పాకిస్తాన్‌ ‌వాస్తవ చిత్రాన్ని చూసింది. హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఆ దేశం ఉన్నతా ధికారులు పాల్గొనడం, ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి ప్రజల సాక్ష్యం. భారత్‌ ‌తన ప్రజలను కాపాడుకోవడానికి నిరంతరం భారీ నిర్ణయాలు తీసుకుంటుంది అన్నారాయన. చివరిగా ‘భారత్‌ ‌మాతాకీ జై’ అని మూడుసార్లు మోదీ నినదించారు.

ప్రధాని ఉపన్యాసం ఇంత తీవ్ర పదజాలంతో సాగినా పాక్‌ ‌సైనికుల తలకెక్కడం లేదు. ఇరు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్ముకశ్మీర్‌లోని సాంబ సమీపంలో ఆ రాత్రే డ్రోన్ల కదలికలు కనిపించాయి.

జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE