ఇథనాల్ కలిపిన పెట్రోల్ లాభమా? నష్టమా?.. మన వాహనాల మైలేజీ తగ్గుతుందా? ఇంజన్ దెబ్బతింటుందా? ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. ముడి చమురు దిగుమతులనూ, కర్బన ఉద్గారాలనూ తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ దిశగా ప్రవేశ పెట్టిన ఈ20 పెట్రోల్ మీద అనుమానాలు ముసురుకున్నాయి. కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దూకుడు మీద అనుమానాలు వ్యక్తం చేసేవారూ ఉన్నారు. అయితే ఇవన్నీ అపోహలు మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల్లో ఆందోళనలు తొలగించేందుకు చమురు సంస్థలు కూడా రంగంలోకి దిగాయి.
కేంద్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల మీద విపక్షాలతో పాటు సమాజంలోని కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురు కావడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి బీజేపీ అభిమానులు కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనంతటికీ కారణం ఇథనాల్. ఈ విషయంలో స్పష్టత రావాలంటే కొన్ని క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలుసుకోవాలి.. మన దేశంలో జనాభా, వాహనాలు, వేగవంతమైన ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక అవసరాల కారణంగా ఇంధనానికి డిమాండ్ పెరుగుతోంది. ఏటా దాదాపు 2,400 లక్షల ముడి చమురును వినియోగిస్తున్నాం. అయితే మనకు తగిన చమురు నిక్షేపాలు లేవు. దేశీయ ఉత్పత్తి కేవలం 15% మాత్రమే ఉండగా, మిగిలిన 85% నుండి 90% వరకు విదేశాల నుంచే దిగుమతి చేసు కుంటున్నాం. రోజువారీ సగటు దిగుమతి దాదాపు 49 లక్షల నుంచి 55 లక్షల బ్యారెల్స్ (సుమారు 7 నుండి 8 లక్షల టన్నులు) వరకు ఉంటుంది.
మన దేశం ప్రధానంగా రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్‌ల నుండి అత్యధి కంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా రష్యానుండి భారత్‌కు సగం కంటే ఎక్కువ (సుమారు 50-52%) దిగుమతులు వస్తున్నాయి. రష్యా – ఉక్రెయిన్, అమెరికా – ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సంక్షోభంతో పాటు అమెరికా విధించిన ఆంక్షల సుంకాల కారణంగా కారణంగా దేశీయంగా చమురు అవసరాలకు కొరత రాకుండా బ్రెజిల్, వెనిజులా, నైజీరియా, అంగోలా, అర్జెంటీనా వంటి దేశాల నుంచి కూడా దిగుమతులను విస్తరించాం.
విదేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడం కోసం ఏటా సగటున 123 నుండి 135 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10 లక్షల కోట్ల నుండి 11.2 లక్షల కోట్లు) విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది. దేశ మొత్తం దిగుమతుల బిల్లులో ఒక్క ముడి చమురు వాటానే అత్యధికంగా దాదాపు 20% వరకు ఉంటుంది.
పరిష్కారంగా ఇథనాల్
చమురు దిగుమతి కోసం పెద్ద ఎత్తు విదేశీ మారక నిల్వలను అధికంగా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా పుట్టిన ఆలోచనే ఇథనాల్. ఇది స్వచ్ఛమైన జీవ ఇంధనం. చెరకు, మొక్కజొన్న, జొన్నలతో పాటు గోధుమ, వరిపొట్టు, ఇతర వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తారు. దీన్ని పెట్రోల్‌లో కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డిస్టిలరీలు పెరగడం ద్వారా గ్రామస్థాయి ఆర్థికవ్యవస్థ బలపడి, రైతులకు వేగంగా ఆదాయం అందుతోంది.
అన్నింటికన్నా ముఖ్యంగా దేశానికి వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. భవిష్యత్తులో ఇంధన కొరత లేకుండా చూసుకోవడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి ఇది ఒక ముఖ్యమైన చర్య. నిజానికి ఇథనాల్ బ్లెండింగ్ 2001లోనే మొదలైంది. ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాల్లో మొదలై… రకరకాల దశలు దాటుతూ చివరకు 2014 నాటికి బ్లెండింగ్ 2%కి చేరింది. ఆ తర్వాత కేంద్రం వేగంగా కదిలి.. ఉత్పత్తిని పెంచే చర్యలు తీసుకోవటంతో ఇపుడు పెట్రోల్‌లో ఇథనాల్ 20% చేరిపోయింది. ఇపుడు దేశంలో ఏకంగా రోజుకు 2 లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తవుతోంది. ఇథనాల్ కలిపిన శాతాన్ని బట్టి ఈ5, ఈ20 పెట్రోల్‌గా పిలుస్తారు.
గడిచిన పదకొండేళ్లలో భారతదేశ ఇథనాల్ ప్రయాణం ఈ5 నుంచి ఈ20కి విజయవంతంగా సాగింది. గతేడాది డిసెంబర్ 15న ఈ20 (20% ఇథనాల్ – 80% పెట్రోల్)ను దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఈ లక్ష్యాన్ని 2030నాటికి పెట్టుకోగా 2025 నాటికే సాధించాం. 2014-25 మధ్య లక్ష కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. ఫలితంగా 736లక్షల టన్నుల మేర కర్బన ఉద్గారాలు తగ్గాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదేమీ చిన్న విషయం కాదు. దేశ ఇంధన చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. దేశీయంగా ప్రస్తుతం ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 2000-2100 కోట్ల లీటర్లు. ఈ20కి అవసర మయ్యేది 1000-1200 కోట్ల లీటర్లే. కొద్దినెలల క్రితం చమురు కంపెనీలు 1050 కోట్ల లీటర్ల ఇథనాల్ కొనుగోలుకు టెండర్లను పిలిచాయి. తయారీదారులేమో 1776 కోట్ల లీటర్లు (70% అధికం) సరఫరా చేస్తామంటున్నారు. తాజాగా ఈ20 నుంచి 100 % ఇథనాల్ (ఈ85, ఈ100) వైపు పరుగులు తీయాలని ఉత్సాహపడుతున్నాం.
బ్రెజిల్ విజయమే ఆదర్శం
ఇథనాల్ ఉత్పత్తి, వినియోగంలో బ్రెజిల్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఆ దేశం 1970లో తలెత్తిన చమురు సంక్షోభం నుండి పాఠాలు నేర్చుకుని, మొక్కజొన్న, చెరకు ఆధారిత ఇథనాల్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణలో అద్భుతమైన విజయాలను సాధించింది.బ్రెజిల్ ఇథనాల్ బ్లెండింగ్ చట్టాలను దశాబ్దాలుగా అమలు చేస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని దశలవారీగా పెంచుతూ, ప్రస్తుతం ఈ దేశంలో పెట్రోల్‌లో ఈ32 ఇథనాల్ ఒక ప్రధాన విజయంగా చెప్పవచ్చు. 2003లో బ్రెజిల్ ప్రవేశపెట్టిన ‘ఫ్లెక్స్-ఫ్యూయల్’ ఇంజిన్ టెక్నాలజీ ఒక మైలురాయి. వాహనాలలో 100% స్వచ్ఛమైన ఇథనాల్‌ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంధనంగా వాడుకోవచ్చు. నేడు ఆ దేశంలో అమ్ముడవుతున్న కొత్త కార్లలో ఎక్కువ భాగం ఈ టెక్నాలజీతోనే వస్తున్నాయి. ఇథనాల్ ధర పెట్రోల్ కంటే కనీసం 25 % నుండి 30 % చౌకగా ఉండేలా ప్రభుత్వం పన్ను మినహాయింపులు అమలు చేస్తోంది. దీనివల్ల వినియోగదారులు ఇథనాల్ వైపు మొగ్గు చూపుతారు. ప్రతి బంకులో ఇథనాల్ సులభంగా లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులపై పోరాటంలో బ్రెజిల్ పాత్రను అత్యున్న తంగా నిలిపింది. ఇథనాల్ పరిశ్రమ బ్రెజిల్ జీడీపీకి గణనీయంగా దోహదపడుతోంది. సుమారు 1.5 మిలియన్లకు పైగా ఉద్యోగాలను సృష్టిస్తూ, గ్రామీణ అభివృద్ధిని, ఇంధన స్వావలంబనను సాధించి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించింది.
ఇథనాల్ మీద అపోహలు
ఇప్పటికే బ్రెజిల్ సహా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, ఇతర ఐరోపా దేశాలు, చైనా తదితర దేశాలు ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని వాడుతున్నాయి. అయితే మన దేశంలో ఈ20 పెట్రోల్ అందుబాటులోకి రాగానే వినియోగదారుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. అవి ఇలా ఉన్నాయి..
పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి సాంద్రత తక్కువగా ఉంటుంది. దీనివల్ల వాహనాల మైలేజ్ సుమారు 3% నుండి 10% వరకు తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా వాహనదారులు ఒకే దూరానికి ఎక్కువ ఇంధనం కొనాల్సి వస్తోంది. ఏప్రిల్ 2023 కంటే ముందు తయారైన పాత వాహనాల ఇంజన్లు ఈ20 ఇంధనానికి అనుకూలంగా లేవు. దీంతో పాత వాహనాలలోని రబ్బర్ ట్యూబులు, గ్యాస్కెట్లు, ఇంజన్ భాగాలు త్వరగా పాడవుతాయి. వాహనం వేగం పుంజుకోవడంలో ఆలస్యం కావడంతో చలికాలంలో ఉదయాన్నే స్టార్ట్ చేయడానికి కొంతమంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇథనాల్ గాలిలోని తేమను లేదా నీటిని త్వరగా లాక్కుం టుంది. వాహనాన్ని చాలా రోజులు వాడకుండా పక్కన పెడితే, ట్యాంకులో నీరు-ఇథనాల్ విడి పోతాయి. దీనివల్ల ట్యాంకు లోపల తుప్పు పట్టడం లేదా ఇంజన్ ఆగిపోవడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో వాహనదారుల్లో ఆందోళనలను తొలగించడానికి ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యత తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. ఇంధన నాణ్యతపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా బంకుల్లో లేదా కస్టమర్ కేర్‌లో నమోదు చేయాలని, సోషల్ మీడియా పోస్టులను నమ్మవద్దని చమురు సంస్థలు కోరాయి.
అవాస్తవ ప్రచారం వద్దు
ఇథనాల్ విషయంలో ప్రచారంలో ఉన్నవన్నీ అపోహలే అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతినవు. అయితే, 2023 కంటే ముందు తయారైన పాత వాహనాలలో ఇథనాల్ రబ్బరు గొట్టాలు లేదా ప్లాస్టిక్ భాగాలను కొద్దిగా అరిగేలా చేసే అవకాశం ఉంది. ఆధునిక వాహనాలు ఈ ఇథనాల్ మిశ్రమాన్ని తట్టుకునేలా తయారవు తున్నాయి. కొత్తగా వస్తున్న వాహనాలన్నీ ఈ20కి అనుకూలంగానే వస్తున్నాయని, పాత వాహనాలలో సాధారణ సర్వీసింగ్ సమయంలో చిన్నపాటి రబ్బర్ విడిభాగాలను మార్చుకుంటే పెద్దగా నష్టం ఉండదని ప్రముఖ వాహన తయారీ సంస్థలు స్పష్టం చేశాయి. ఇప్పటికే మారుతీ కార్ల సంస్థ వీటిని అందుబాటులోకి తెచ్చింది.
కాగా, ఇథనాల్‌లోని శక్తి స్వచ్ఛమైన పెట్రోల్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. దీనివల్ల దాదాపు 2% నుండి 5% వరకు మైలేజీ తగ్గే మాట వాస్తవమేనని కేంద్రం అంగీకరించింది. కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. పెట్రోల్ బంకుల్లో లేదా వాహనం ట్యాంకుల్లో నీరు చేరితే అది ఇథనాల్‌తో కలిసిపోయి ఇంజిన్ పనితీరును దెబ్బతీసే ప్రమాదం ఉంది. అయితే ఇది ఇథనాల్ చేసిన కల్తీ కాదు లీకేజీలు, నిర్వహణ లోపాల వల్ల జరిగే పరిణామం. కాగా, మన దేశం ఇథనాల్ లక్ష్యాలను చేరుకోవాలంటే, ముందుగా విక్రయ కేంద్రాలను విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. రెండోతరం ఇథనాల్ కర్మాగారాలకు ఆర్థిక లోటును పూడ్చే నిధిని 2028 నుంచి 2035 వరకు పొడిగించాలి. ఈ20 అనుకూల కార్లు తయారైన తరవాత, ఈ30కి అనుకూలమైన కార్ల ఉత్పత్తి కోసం తయారీదారులను ఇప్పుడే ఆదేశించాలి.
పెట్రోల్‌లో ఇథనాల్ 20 కలపడం వల్ల వాహన ఇంధన సామర్థ్యంలో ఎలాంటి తగ్గుదల తమ అధ్యయనంలో కనిపించలేదని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుత లేదా పాత వాహనాలకు నష్టం కలిగించే ఏ ఒక్క ఆధారం కూడా కనిపించలేదని స్పష్టం చేశారు. మైలేజీ అనేది ఇంధనం కంటే కూడా వాహనం నడిపే విధానం, రోడ్ల పరిస్థితి, వాహనం సకాలంలో మెయింటెనెన్స్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని ఐఐటీ కాన్పూర్‌లోని ఇంజిన్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ప్రాజెక్టు సైంటిస్ట్ ధ్రువ్‌రాజ్ అభిప్రాయపడ్డారు. స్వచ్ఛమైన పెట్రోల్‌తో పరీక్షలు చేసినా ఫలితాలు ఇలాగే ఉంటాయన్నారు.
వ్యవసాయానికి ప్రమాదమా?
ఇథనాల్ తయారీకి ఆహార పంటలను మళ్లించడం సరైందేనా? అనే ప్రశ్న వేస్తున్నారు.. ఇథనాల్ తయారీకి ప్రధాన వనరు అయిన చెరకు పంటకు 10,000 లీటర్ల నీరు అవసరమనే ప్రచారం జరుగుతోంది. ఇది భూగర్భ జలాలపై ఒత్తిడి పెంచుతుంది అంటున్నారు. అయితే ఇది అవాస్తవమని కేంద్రం కొట్టి పారేసింది. లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి 3-4 లీటర్ల నీరు అవసరమవు తుంది. నీటి ఎద్దడి లేని ప్రాంతాల్లో ప్లాంట్లు పెడితే చాలు. అలాగే ఇథనాల్ కోసం మొక్కజొన్న, విరిగిన బియ్యం వంటి ఆహార ధాన్యాలను భారీగా వాడటం వల్ల భవిష్యత్తులో పశుగ్రాసం లేదా ఆహార వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉం దంటున్నారు. కాగా దేశ ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత మిగిలిన ధాన్యం, చెరకును మాత్రమే ఇథనాల్ తయారీకి ఉపయోగిస్తున్నారు. దీనికి కేవలం పంట వ్యర్థాలు, అవశేషాలు, వెదురు చాలు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణకూ ఆస్కారం ఉంటుంది. పంజాబ్, హర్యానాల్లో ఏటా 3.5కోట్ల టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అవుతోంది. అందులో సగం గడ్డిని తగలబెడుతున్నారు. అక్కడ మిగిలే వ్యర్థాలతోనే పదివేల కోట్ల లీటర్ల ఇథనాల్‌ను తయారు చేయవచ్చు. భారత చమురు సంస్థ పానీపట్‌లో రూ.900 కోట్ల పెట్టుబడితో రెండు లక్షల టన్నుల వరిగడ్డిని వ•డు కోట్ల లీటర్ల ఇథనాల్‌గా మార్చే రెండోతరం కర్మాగారాన్ని నిర్మించింది. దానివల్ల 63వేల కార్లను రోడ్లపై నుంచి తొలగించినంతగా ఉద్గారాలు తగ్గాయి.
ఈ20 తప్పని సరి ఎందుకు?
కాగా దేశంలో ఈ 20 పెట్రోల్ విక్రయాలను తప్పనిసరి చేయడంపై వాహనదారులు, ప్రతిపక్షాలు, పరిశ్రమ నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంకుల్లో ఇథనాల్ లేని పెట్రోల్ లభించకుండా పోయింది. పాత వాహనాలు ఉన్నవారు కూడా బలవంతంగా ఈ20 ఇంధనాన్నే కొట్టించాల్సి వస్తోంది.
ప్రధానంగా వాహనాల మైలేజీ తగ్గడం, పాత ఇంజన్లు పాడవడం, పారదర్శ కత లేకపోవడం వంటి అంశాలపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వస్తోంది. ఈ20 పెట్రోల్ వాడటం వల్ల ఇంజన్ పాడైందంటూ దాఖలైన ఒక కేసులో, కస్టమర్‌కు కొత్త కారు ఇవ్వాలని, లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని కన్స్యూమర్ కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీనితో దాదాపు 45% మంది వాహనదారులు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు పెట్రోల్‌లో ఇథనాల్ కలుపు తున్నందున ధరలు తగ్గించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. గతంలో ఇథనాల్ వాడకం పెరిగితే పెట్రోల్ ధర లీటరుకు రూ.15 వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంకేతాలు ఇవ్వడంతో ప్రజల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువ. అందువల్ల, 20% చౌకైన ఇథనాల్ కలిపినప్పుడు ఆ లాభాన్ని వాహన దారులకు బదిలీచేసి, లీటరు ధరను తగ్గించాలని కోరుతున్నారు. మైలేజీ తగ్గినప్పుడు వినియోగ దారుడిపై అదనపు ఆర్థిక భారం పడుతుంది కాబట్టి, ఇంధన ధరను తగ్గిస్తేనే అది సమన్యాయం అవుతుందని వాహనదారులు కోరుతున్నారు
100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ మాత్రమే కావాలనుకునే వారు, ఎక్కువ ధర చెల్లించి దానిని కొనుగోలు చేయవచ్చని నితీన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇ20 ఇంధనం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయాలు సాధ్యంకావని, అయితే ఇథనాల్ లేని పెట్రోల్ కోరుకునే వారికోసం ప్రీమియం ధరలో అది లభిస్తుందని చెప్పారు.
నితిన్ గడ్కరీ దూకుడు
ఇథనాల్ వినియోగం, ఉత్పత్తిని ప్రోత్స హించడంలో నితిన్ గడ్కరీ కీలకపాత్ర పోషిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన రంగంలో స్వయం సమృద్ధి, రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఇథనాల్ వాడకాన్ని బలంగా సమర్థిస్తున్నారు. మన దేశం తన ముడిచమురు అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. దీనివల్ల ఏటా భారీగా విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతోంది. ఈ భారాన్ని తగ్గించడానికి పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ శాతాన్ని దశలవారీగా పెంచాలని గడ్కరీ సూచిస్తున్నారు. భవిష్యత్తులో 100 వినియోగం సాధించాలని ఆయన లక్ష్యంగా నిర్దేశించారు.
రవాణా శాఖ మంత్రిగా దేశంలో నడిచే వాహనాలు ఏ రకమైన ఇంధనాన్ని వాడుతున్నాయ నేది ఆయన పరిధిలోకి వస్తుంది. 100% ఇథనాల్‌తో నడిచే వాహనాలను, ఈ100 నిబంధనలను ఆటో మొబైల్ కంపెనీలు తయారు చేసేలా గడ్కరీ స్వయంగా చొరవ తీసుకుని ఆ ఫైళ్లపై సంతకాలు చేశారు. వాహనాలనుంచి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించడం, పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం తన మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతల్లో ఒకటని ఆయన తెలిపారు. అయితే స్వచ్ఛమైన పెట్రోల్ లభ్యత గురించి ప్రశ్నించినప్పుడు, ఆ నిర్ణయం తీసుకోవాల్సింది పెట్రోలియం మంత్రిత్వ శాఖేనని, తన పరిధి కాదు అని అంగీకరించారు. సాంప్రదాయ ముడి చమురు దిగుమతుల ద్వారా లబ్ధి పొందే కొన్ని పెద్ద కార్పొరేట్ శక్తులు, ఇంధన లాబీలు కావాలనే ఇథనాల్‌పై దుష్ప్రచారం చేస్తున్నాయని, దేశ ప్రయోజనాల కోసం ఆ లాబీలను ఎదిరించడానికే తాను ఈ విషయంలో గట్టిగా మాట్లాడుతున్నానని గడ్కరీ స్పష్టం చేశారు
గడ్కరీ సాధించిన విజయాలు
ఇథనాల్ విషయంలో నితిన్ గడ్కరీ తనపై వస్తున్న విమర్శలను సమర్ధవంతగా తిప్పికొడు తున్నారు. వాస్తవానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా ఆయన సాధించిన విజయాల ముందు ఆ విమర్శలు దిగదుడుపుగా చెప్పవచ్చు. దేశ మౌలిక వసతుల రంగంలో గడ్కరీ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. జాతీయ రహదారుల విస్తరణ వేగవంతమైన నిర్మాణం, అత్యాధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్స హించడంలో ఆయన ఎనలేని విజయాలు సాధించారు.
చివరగా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇథనాల్, విద్యుత్, హైడ్రోజన్, సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్స హించారు. దీనిలో భాగంగా స్వయంగా హైడ్రోజన్ కారును ఉపయోగించి ప్రజలకు అవగాహన కల్పించారు.

క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్