ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌నిర్వహించిన భారత సైనికులకు రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌జీ భాగవత్‌, ‌ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే ఈ మేరకు మే 9న ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని, ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌చర్యను ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేతలు సంపూర్ణంగా సమర్ధించారు. వారిద్దరు ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ప్రకటనలు ప్రధాన కార్యదర్శి మాత్రమే ఇస్తారు. నిరాయుధులైన పర్యాటకులను చంపిన పాక్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదులపై ఇలాంటి పటిష్టమైన చర్య తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వ నాయకత్వాన్ని, సాయుధ బలగాలను అభినందిస్తున్నట్టు ఒక ప్రకటనలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వెల్లడించింది. ఉగ్రవాదుల మీద, వారి మౌలిక వ్యవస్థల మీద, వారికి అండగా ఉన్న సంస్థల మీద భారత్‌ ‌సైనిక దాడి చేయడం అనివార్యమని తాము భావిస్తున్నట్టు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పేర్కొన్నది. ఇలాంటి సంక్షోభ సమయంలో కేంద్రానికి, భద్రతా బగాలకు జాతి మొత్తం వెన్నుదన్నుగా ఉండాలని కూడా పేర్కొన్నది. ఇటీవల  భారత సరిహద్దులలోని పౌర ఆవాసాల మీద పాకిస్తాన్‌ ‌షెల్స్ ‌ప్రయోగించడం గర్హనీయమని తెలియచేసింది. ఇది క్రమశిక్షణతో మెలగవలసిన సమయమని, ఐకమత్యంగా ఉండాలని, ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలని, సమాజంలో గొడవలు రేపే ప్రయత్నం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పిలుపునిచ్చింది. పవిత్రమైన పౌర విధులను నిర్వర్తిస్తూ, జాతి వ్యతిరేక శక్తులు కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా పేర్కొన్నది.

ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందే డాక్టర్‌ ‌మోహన్‌జీ ఢిల్లీలో ప్రధాని నివాసానికి వెళ్లి, మోదీతో దాదాపు గంటసేపు చర్చించారు. ఇప్పుడు ఆపరేషన్‌ ‌సిందూర్‌కు మద్దతుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రకటన విడుదల చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. పరిస్థితి తీవ్రతను, ప్రభుత్వం ఎంత తీవ్రంగా యోచిస్తున్నదీ కూడా వెల్లడి అవుతున్నది. ఈ ప్రకటనలో కేంద్రం తీసుకున్న చర్యకు పరిపూర్ణమైన మద్దతు ప్రకటించారు. ఈ చర్య వల్ల దేశ ప్రజానీకంలో ఆత్మ గౌరవం పెరిగిందని, నైతిక స్థయిర్యం బలపడిందని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యాఖ్యానించింది. దేశ భద్రత దృష్ట్యా ఇలాంటి సైనిక చర్య అనివార్యమేనని సంస్థ అభిప్రాయపడింది. జాతీయ భద్రత విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉన్న నిబద్ధత కూడా దీనితో వ్యక్తమయిందని కూడా భావిస్తున్నారు. పెహల్గావ్‌ ఉదంతాన్ని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పాశవిక హత్యాకాండ అంటూ తీవ్ర పదజాలంతోనే ఖండించింది. దేశంలోని ధార్మిక కేంద్రాలను, జనావాసాల మీద పాకిస్తాన్‌ ‌దాడులు చేయడాన్ని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విమర్శించింది.

About Author

By editor

Twitter
YOUTUBE