ఎన్ని అధికారణాలు ఉన్నాయో, ఎన్ని షెడ్యూళ్లు ఉంటాయో, ఎన్ని సవరణలు జరిగాయో తెలియడమొక్కటే రాజ్యాంగం మీద నిజమైన అవగాహనకు చాలదు. అలాగే అది దేశానికి అత్యున్నత చట్టమన్న సామాజిక దృష్టి మాత్రమే రాజ్యాంగ వైశాల్యమెంతో అంచనా వేయడానికి సరిపోయేదీ కాదు. సాంస్కృతిక ఐక్యత భారతదేశాన్ని చిరకాలం కలిపి ఉంచిన సంగతి చరిత్ర చెబుతుంది. తరువాత ఈ దేశం మీద భక్తి, ఈ దేశానికి స్వాతంత్య్రం తేవాలన్న ఏకసూత్రం, అందుకు జరిగిన పోరాటం, సంఘర్షణ మరికొంత కాలం జాతిని కలిపి ఉంచిన తాత్త్వికతలు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ దేశ మూలాల ప్రాతిపదికగా సాంస్కృతిక ఏకాత్మతతో; రాజకీయ, భౌగోళిక ఐక్యతను నిర్మించినదే భారత రాజ్యాంగం. ఈ అన్ని అంశాలు భావి భారత పౌరులకు తెలియడం అవసరమే కాదు అనివార్యం. నిజానికి చాలామంది నేటి వయోజనులలో కూడా రాజ్యాంగం గురించిన కనీస అవగాహన లోపి స్తున్నదన్న ఆరోపణ ఉంది. కానీ  సమాజంలో నీ స్థానాన్ని నిర్దేశిస్తున్నదీ, నీ హక్కులేమిటో ప్రకటిస్తున్నదీ, వాటి రక్షణకు భరోసా ఇస్తున్నదీ ఆ అత్యున్నత చట్టమే. కాబట్టే రాజ్యాంగ రచన చరిత్ర, అందులోని తాత్త్విక, రాజకీయ చింతనల పట్ల కనీస అవగాహన ఈ దేశ పౌరులమైన మనకు అవసరమే.

‘మన రాజ్యాంగం ఆమోదం పొందిన నాటి నుంచి డెబ్బైరెండేళ్ల తర్వాత కూడా అది రక్షించ వలసిన అధికారం ఇవ్వవలసిన భారత ప్రజలే దాని గురించి అవగాహన లేకుండా మిగిలి పోయారు. రాజ్యాంగసభ సభ్యులు అది సామాజికంగా పరివర్తన చెందే పత్రమనీ, దేశ మూలస్తంభమనీ కార్యనిర్వాహక, శాసనపరమైన అతిక్రమణలను వివక్షనూ మెజారిటీ పోకడలను వ్యతిరేకించే బలమైన అడ్డుగోడలా నిలుస్తుందనీ ఆశించారు’ అన్నారు శ్రీదేవి మురళీధర్‌. అది నిజం. స్వాతంత్య్రం తరువాత కొన్ని సందర్భాలలో మినహా రాజ్యాంగం తన బాధ్యతను నిర్వర్తించింది. ఈ అంశాలన్నీ వర్తమానతరాలకి అందించడానికి ఆమె అందించిన పుస్తకమే ‘సచిత్ర భారత సంవిధానం: తెలుగు బాల బాలికలు, యువత కోసం’.

చట్టాల రూపకల్పన పక్రియ బ్రిటిష్‌ ఇం‌డియాలోనే ఆరంభమైంది. అంతకు ముందు భారతదేశ చరిత్రలో చట్టాలు, న్యాయవ్యవస్థ లేవని కాదు. ఎన్నో స్మృతులు పుట్టాయి. అర్ధశాస్త్రం కేవలం రాజ్య నిర్వహణన నిర్వచించేదే. కానీ చట్ట నిర్మాణం, అందులో మార్పులు రెండూ కాలానుగుణంగా ఉంటాయి. ఆ క్రమంలోనిదే ఆధునిక చట్ట నిర్మాణ పక్రియ. 1909 భారత ప్రభుత్వ చట్టం వంటివి ఆ కోవలోనివే. 1919, 1935 చట్టాల రాజ్యాంగ రచనకు దారి చూపాయనీ చెప్పవచ్చు. తరువాత డిసెంబర్‌ 6, 1946‌న స్వతంత్ర భారత రాజ్యాంగ రచనకు శ్రీకారం చుట్టారు. అంటే భారత స్వాతంత్య్రోద్యమానికి పరాకాష్ట రాజ్యాంగ పరిషత్‌ ఏర్పాటు. పురాతనమూ, సమున్నతమూ అయిన సంస్కృతి, సాంస్కృతిక వైవిధ్యం, ఏడెనిమిది వందల ఏళ్ల విదేశీ పాలన భారతీయతకు, జాతికి చేసిన గాయాలు వంటి ఎన్నో అంశాలను గమనించు కుంటూ రాజ్యాంగం నిర్మించే బాధ్యత పరిషత్‌ ‌మీద పడింది. రాజ్యాంగ ఆవిర్భావ క్షణాలకు ఉన్న మరొక సంక్లిష్ట నేపథ్యం, ‘కొత్త రాజ్యాంగం ఆవిష్కరించే నాటికి భారతదేశం నైతికత, మనస్సాక్షి, ప్రేరణ యొక్క స్వరాన్ని కోల్పోయిన విషాద సమయం. మహాత్మా గాంధీ జనవరి 30, 1948 నాడు హత్యకు గురైనారు’. ఇన్ని పరిణామాలనూ, గుణపాఠాలనూ గమనిస్తూ ఆధునిక కాంలో ఉన్నామన్న స్పృహతో ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టించగలిగే రాజ్యాంగ రచన బాధ్యతను నిర్వర్తించారు వారు. రాజ్యాంగ పరిషత్‌ ‌గొప్పదనం ప్రాచీన భారతదేశం కూడా న్యాయ శాస్త్రంలో తనదైన ప్రమాణాలు కలిగి ఉన్నదని నమ్మకం కలిగి ఉండడం. ‘రాజ్యాంగ సభ సభ్యులందరూ దేశానికి చెందిన అతి ముఖ్యమైన రాజ్యాంగ పత్రాన్ని రూపొందించేటప్పుడు ఈ సామాజిక ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకున్నారు.’ డిసెంబర్‌ 9, 1946‌న పరిషత్‌ ‌తొలి సమావేశం జరిగింది. ఈ విషయమంతటినీ పన్నెండు ప్రకరణలలో రచయిత్రి శ్రీదేవీ మురళీధర్‌ ‌పొందు పరిచారు. ఇందులో కొన్ని పూర్తిగా రాజ్యాంగంలోని అంశాల గురించి విశ్లేషిస్తాయి. కొన్ని స్వాతంత్య్రో ద్యమ ఘట్టాలను గుర్తు చేస్తూ రాజ్యాంగ పరిషత్‌ ‌సభ్యులు అంతరంగాన్ని ఆవిష్కరించే పనిచేస్తాయి.

మొదటి ప్రకరణం పేరు ‘రాజ్యాంగం అంటే ఏమిటి?’ దేశాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా, సమానత్వంతో, సహనంతో, సభ్య సమాజంగా స్థిరపరచాలంటే ఆ పని రాజ్యాంగం ఒక్కటే చేయగలదు. పౌరులందరి హక్కులు రక్షించేది రాజ్యాంగం. అలాగే విధులను గుర్తు చేసేదే కూడా. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు అనే అంశంలో ఒక చరిత్రాత్మక పరిణామాన్ని రచయిత్రి ఉటంకించారు. 1975లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించారు. అది ఆమెకు రాజ్యాంగం ఇచ్చిన హక్కే, కానీ ఆ పేరుతో ఆమె రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే 1977లో రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికలలో ఓటు హక్కు ఆయుధంతో ప్రజలు ఇందిరను ఓడించారు. ఇది దేశ చరిత్రలోనే పెద్ద ఘట్టం. ఒకరి హక్కు ఇంకొకరి హక్కులు హరించే ఆయుధం కారాదు. ఇదే మన రాజ్యాంగం చెబుతోంది.

రెండవ ప్రకరణాన్ని రాజ్యాంగ పీఠికను విశ్లేషించడానికి కేటాయించారు. దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘భారత ప్రజలమైన మేము…’ అనే పదాలతో ప్రారంభమైన ఈ పీఠిక ప్రతి భారతీయుడి సంక్షేమం కోసం ఉద్దేశించి నటువంటిది’. వందల ఏళ్ల బానిసత్వంలో మగ్గి, విముక్తమైన భారతజాతి గొంతు ఈ పీఠికలోనే ధ్వనిస్తుందని రచయిత్రి అంటారు. ఇందులో తరువాతి కాలాలలో చేర్చిన ‘లౌకికవాదం’ (సెక్యులరిజం) పదం వివాదాస్పదమైనదని ఆమె సరిగానే వ్యాఖ్యానించారని చెప్పవచ్చు. రాజ్యాంగ సభ ఏర్పాటు తీరుతెన్నులు, ముస్లింలీగ్‌ ‌రాజకీయాలు, కాంగ్రెస్‌ ‌పోరాటం, పరిషత్‌లో ఉప సంఘాలు, వాటి కృషి మూడో ప్రకరణలో చదువుతాం. నిజానికి అదొక గొప్ప చర్చా వేదిక. చరిత్రాత్మకమైన మేధోమథనం. ముసాయిదా సంఘం అధ్యక్షులు డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సాంఘిక నేపథ్యం, అనుభవం రాజ్యాంగ రచనలో ఏ విధంగా ప్రతి బింబించినదీ రేఖామాత్రంగా రచయిత్రి పరిచయం చేశారు. ఆయన ముద్ర రాజ్యాంగానికి మరింత సామాజిక దృష్టిని ఇచ్చిందంటే సత్యదూరం కాదు. ఇంకా నాటి తాత్కాలిక ప్రభుత్వ సారథి నెహ్రూ, డాక్టర్‌ ‌బాబూ రాజేందప్రసాద్‌, ‌సర్దార్‌ ‌పటేల్‌, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌, ఎస్‌ఎన్‌ ‌ముఖర్జీ, బెనెగల్‌ ‌నరసింగరావు, జైపాల్‌ ‌సింగ్‌ ‌మూండా వంటి వారి సేవలతో పాటు; సరోజినీ నాయుడు, సుచేతా కృపలానీ, ఏనీ మాస్కరీన్‌, అ‌మ్రిత్‌ ‌కౌర్‌, ‌లీలా రాయ్‌, ‌విజయలక్ష్మి పండిట్‌, అమ్ము స్వామినాథన్‌, ‌దాక్షాయణి వేలాయుధన్‌, ‌బేగం ఐజాక్‌ ‌రసూల్‌, ‌దుర్గాబాయ్‌ ‌దేశ్‌ముఖ్‌, ‌హంసా జీవరాజ్‌ ‌మెహతా వంటి పరిషత్‌కు సేవలు అందించిన పదిహేను మంది మహిళల గురించి కూడా ఈ ప్రకరణలో పరిచయం చేశారు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అంటే ఏమిటో, వారి పరిధి ఏమిటో తెలియచెబుతుంది ఐదో ప్రకరణం. తరువాతి ప్రకరణాలలో ప్రభుత్వ నిర్మాణం, శాసన నిర్మాణం, న్యాయవ్యవస్థ వాటి పరిధుల గురించి, గణతంత్ర భారతం, ఓటు హక్కు, మొదటి ఎన్నికలు, రాజ్యాంగం స్వీకరించిన గణతంత్ర చిహ్నాలు, మొదటి గణతంత్ర దినోత్సవం వంటి అంశాలు ఇచ్చారు. రాజ్యాంగ ప్రతిని మన పురాతన వ్యవస్థలలోని ముఖ్యుల చిత్రాలతో, ఘట్టాలతో అలంకరించారు. ఇందులో నందలాల్‌ ‌బోస్‌ ‌కృషి ఎంతటిదో చదివి తెలుసు కోవాలి. పదకొండవ ప్రకరణాన్ని రాజ్యాంగాన్ని పిల్లల కోసం సంక్షిప్తంగా పరిచయం చేయడానికి కేటాయించడం ఎంతో సబబుగా అనిపిస్తుంది.

భారత స్వాతంత్య్రోద్యమాన్ని అధ్యయనం చేయించడం దగ్గరే వర్తమాన తరం విఫలమయ్యే పరిస్థితిలో ఉంది. ఆజాదీ కా అమృతోత్సవ్‌ ‌వంటి సందర్భాలలోనే చరిత్ర చదవాలన్న నియమం లేదు. అది మన గతం. మనను భవిష్యత్తులోకి నడిపించే చోదకశక్తి. దీనికి పరాకాష్ట వంటిది రాజ్యాంగ రచన. 1857 నుంచి 1947 వరకు స్వాతంత్య్రం పోరాటం చదవడం ఒక అనుభవం. డిసెంబర్‌ 9, 1946 ‌నుంచి జనవరి 26, 1950 వరకు జరిగిన రాజ్యాంగ రచనా పక్రియను అధ్యయనం చేయడం అద్భుత అనుభవం. దీనిని పిల్లల కోసం విడమరచి రాయడం స్వాగతించదగినదే.

సచిత్ర భారత సంవిధానం

తెలుగు బాలబాలికలు, యువత కోసం

రచన : శ్రీదేవీ మురళీధర్‌

ఇమెయిల్‌: ‌[email protected]

About Author

By editor

Twitter
Instagram