– ‌కపిల సాయిమోహన్‌దాస్‌

‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


‘మానస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర తరణం’ ముందు దూరంగా లీలగా తరువాత దగ్గరగా వినిపించిన బృందగానంతో కళ్లు తెరిచింది వసుధ. నగర సంకీ ర్తన బృందం యిల్లు దాటి వెడుతోంది. ‘‘అమ్మో! అప్పుడే తెల్లారిపోయింది. ఇవాళేగా అబ్బాయి, కోడలు, మనుమలు వచ్చేది! ఈయనన్నా లేపచ్చుగా’’ అను కుంటూ పడకగది నుంచి బయటికి వచ్చింది. శ్రీపతి అప్పటికే కాలకృత్యాలు అయి, యోగాభ్యాసంలో వున్నాడు. వసుధ మనసులో ఎన్నో ఆలోచనలు.. చాలా కాలం తర్వాత వస్తున్నాడు కొడుకు శశిధర్‌ అమెరికా నుంచి. అక్కడి పరిస్థితులు గందర గోళంగా వుండటం, పని ఒత్తిడి, శలవు పెట్టే అవకాశం లేక పోవటంతో నాలుగేళ్లుగా రానేలేదు. వస్తున్నాననటం, తీరా సమయానికి ‘సారీ ప్రాజెక్టు పని అవలేదు, తర్వాత వీలు చూసుకొని వస్తాన’ నటం. ఈసారి మాత్రం అంతా సవ్యంగా అయి వస్తున్నాడు.

క్రితం సారి చంటివాడితో వచ్చి, వున్న పదిహేను రోజూల్లో అది చూడాలి, ఇది చూడాలి అని, వాళ్లని కలవాలి, వీళ్లని కలవాలి అని ఇంటిపట్టునే లేడు. అప్పటి చంటిగాడు, అదే శ్రీనాథ్‌ ‌యిప్పుడు ఎలా వున్నాడో? రెండవ పిల్లని చూడనే లేదు. వీడియో కాల్‌ ‌చేసినప్పుడు చూడటమేగానీ.

వస్తున్నాడని తెలిసినప్పటి నుంచి హడావిడే! ఇంటిని శుభ్రం చేయించి, అన్నీ సక్రమంగా సర్దటం ఒకవైపు, అప్పడాలు, వడియాలు, తినుబండారాలు తయారు చేయటం మరొక వైపు. వాడికి ఇష్టమయిన వన్నీ చేసిపెట్టాలి మళ్లీ ఎప్పుడు వస్తాడో! అనే తపన. అసలే మొహమాటస్తుడు.

కోడలు రేవతి కూడా ఉద్యోగస్తురాలే. ఏం చేస్తుందో, ఏమి పెడుతుందో! పెళ్లయి ఏడేళ్లయినా పట్టుమని పది రోజులు కూడా లేదు తనదగ్గిర. పెళ్లవ గానే అమెరికా వెళ్లడం, పురిటికి కూడా యిక్కడకి రాకుండా వాళ్ల అమ్మనే పిలిపించుకుంది. ఇద్దరు పిల్లల విషయం లోనూ అంతే అయింది. అదేమి టంటే పిల్లలకి అక్కడి సిటిజన్‌ ‌షిప్‌ ‌రావాలంటే అక్కడే పుట్టాలట. కాలవైపరీత్యం కాకపొతే ఏమిటీ! ఇక్కడ పుట్టిన వాళ్లు చెడిపోలేదుకదా!

అమెరికా వెళ్లాడనేమాటే గానీ శశిధర్‌లో మార్పేమీ లేదు. తామంటే ప్రేమా పల్లెత్తు తగ్గలేదు. పైగా పిల్లల పేర్లు కూడా తమ పేర్లు కలసివచ్చే టట్టుగా బాబుకి శ్రీనాథ్‌ అని, పాపాయికి వసుమతి అని పెట్టాడు. పిల్లలకి చిన్న చిన్న శ్లోకాలు, తెలుగు పద్యాలు చెప్పి,వల్లె వేయిస్తాడు. ప్రతివారం వీడియో కాల్‌ ‌చేసి పిల్లల చేత మాట్లాడిస్తాడు. శ్రీనాథ్‌ ‌కొంత యింగ్లీష్‌లో కొంత తెలుగులో కబుర్లు చెపుతాడు. చిన్నదీ వాడికి పోటీగా ముద్దుముద్దుగా మాటలు చెపుతూ వుంటుంది.

‘కొడుకు వచ్చే హడావిడిలో నన్ను మర్చిపో యావ్‌, ‌కాఫీ యివ్వలేదు’ శ్రీపతి గారు గట్టిగా అన టంతో ఆలోచన సుడి లోంచి బైట పడింది. పనికి అలవాటు పడిన ప్రాణం అవటంతో అన్నీ గబగబా చేసేసింది. అంతలోనే కొడుకు, కోడలు, మనుమలు దిగారు. వీడియోలో చూడటం, మాట్లాడటం అలవాటవటంతో బామ్మ, తాత దగ్గర చాలా తక్కువ సమయంలోనే మచ్చిక అయ్యారు పిల్లలిద్దరూ. వాళ్లకి వచ్చిన శ్లోకాలు, పద్యాలు చెపుతూవుంటే తాత,బామ్మ తెగ మురిసిపోయారు. బామ్మ అయితే వెంటనే చారెడు ఉప్పుతో వాళ్ళకి దిష్టి తీసింది. మొదటిసారిగా దిష్టి గురించి వింటున్న పిల్లలకి తమాషాగా, రేవతికి చాదస్తంగా అనిపించేది.

పిల్లలకైతే అలవాటయింది కానీ రేవతికి కొంత బెరుకుగానే వుంది. తను అత్తగారితో కలసి వున్నది చాలా తక్కువ సమయం. అందువలన పెద్దగా చనువు ఏర్పడలేదు. పైగా శశిధర్‌ ‌తరచుగా వాళ్లమ్మ గురించి చాలా గొప్పగా చెపుతూ వుండటంతో ఏమి చెయ్యాలన్నా బిడియంగానే వుంటుంది. తన పద్ధతి వేరు. అన్నీ కూడా ఒక క్రమంలో ఉండాలనుకుం టుంది. శశిధర్‌ ఆలోచన వేరు. అతనికి పనవటం ముఖ్యం కానీ ఒక పద్ధతిలోనే వుండాలని లేదు. దానితో పిల్లలకి కూడా వాళ్ల నాన్న చెపితే ఏదయినా యిష్టంగా చేస్తారు. పైగా ‘నీకు పిల్లల మనస్తత్వం తెలీదు. మా అమ్మ దగ్గర నేర్చుకో’ అంటాడు, ఆవిడేదో సైకాలజిస్ట్ ‌లాగా.

అమెరికా నుంచి ప్రత్యేకంగా వీళ్లకోసం తెచ్చినవి యిస్తూవుంటే వసుధ, శ్రీపతి గారూ ఆనందంతో వుబ్బిపోయారు.

‘మీ కోడలి కానుక’ అంటూ గిన్నెలు కడిగే మిషను (డిష్‌ ‌వాషర్‌) ‌ని చూపిస్తే ‘నాలుగు గిన్నెలు కడగటానికి ఒక మిషను కావాలా! దానికి తెలియక పోతే నీ బుర్ర ఏమయింది’ అని వసుధ అనటంతో ‘చాదస్తపు మనిషి’ అనుకుంది మనసులో.

‘నేచెపుతూనే వున్నా, నిన్ను ఆశ్చర్యంలో, ఆనం దంలో వుంచాలని తీసుకుంది. వాడి చూడు, దాని వుపయోగం నీకు తెలుస్తుంది’’ అంటూ వేరే విషయా లలోకి వెళ్లిపోయారు.

వీళ్లు వస్తారని చేసిన పిండివంటల రకాలు, పిల్లల కోసం, తనకోసం తయారుచేసిన బట్టలు చూసి రేవతి ఆశ్చర్యపోయింది. అంత సమయం, ఓపికా ఎలా వస్తాయని.

బామ్మచేసిన పిండివంటలు శ్రీనాథ్‌తోపాటు పిల్లలు కూడా ఆత్రంగా తింటుంటే రేవతి మనసు విలవిలలాడింది వాళ్ల కడుపులు ఎక్కడ పాడవు తాయోనని. ‘మరేం ఫరవాలేదు, తిననీ, హోమియో మందు వేస్తే సర్దుకు పోతుందిలే’ అనే అత్తగారి మాటలకి ఎదురు చెప్పలేకపోయింది. తాత ,బామ్మ ముద్దు చేయటంతో పిల్లల్లో పెంకితనం పెరిగింది. తనమాట అసలు వినటం మానేసారు. చాటుగా భర్తతో పిల్లల గురించి చెప్పినా ‘అమ్మ చూసుకుంటుం దిలే, టెన్షను పడకు’ అంటాడు గానీ పట్టించుకోడు. నీటి మార్పో, తిండి మార్పో గానీ రేవతి భయపడ్డట్టే పిల్లలకి కొంత నలత చేయటం అత్తగారు ఆవిడ మందులపెట్టె తీసి ఏవో గోలీలు వేయటం, మర్నాటికి ఆరోగ్యాలు కుదుట పడటం జరిగింది. ‘అత్తగారు పెద్దగా చదువుకోలేదు కానీ చాలా సమర్థురాలు’ అనుకుంది రేవతి మనసులో.

రోజులు నిమిషాల్లాగా గడుస్తున్నాయి. ఆరోజు రేవతి తల్లి పుట్టినరోజు. శుభాకాంక్షలు చెప్పి, శ్రీనాథ్‌ ‌చేత చెప్పిద్దామని పిలవటం, వాడు వినకుండా బయటకి పరుగెత్తడం జరిగింది. రేవతి చాలా బాధ పడింది. ఆడిఆడి యింటికి వచ్చాక కూడా రేవతి పిలుస్తున్నా వాడు బామ్మ దగ్గరకి పరుగుతీస్తుంటే రేవతికి కోపం, ఉక్రోషం అవధులు దాటి కొడుకుకి బుద్ధి చెప్పాలని, అత్తగారికి కూడా తన బాధ తెలియాలి అనుకుంటూ వాడి వెనుక వెడుతోంది. వంటగది నుంచి వసుధ గొంతు వినిపించి ఆగింది. ‘మీ నాన్నని తిట్టాలిరా’ వసుధ మాటలకి ‘ ఎందుకు బామ్మా’ అంటూ శ్రీనాథ్‌ అడిగితే ‘నీకు ఏవో శ్లోకాలు చెప్పాడుగానీ ముఖ్యమైనది చెప్పలా’ అని వసుధ అనటం ‘ఏమిటదీ ప్లీజ్‌ ‌నువ్వు చెప్పవా’ అన్న మనవ డితో ‘‘న గాయత్య్రాః పరం మంత్రం న మాతుః పర దైవతా’’ అంటే గాయత్రి మించిన మంత్రం లేదు, అమ్మని మించిన దేవత లేదు అని. ‘గాయత్రీ మంత్రం చేయటానికి నీకు యింకా వయసు రాలేదు కానీ అమ్మని మించిన దైవం లేదు అనే దానికి మనిషి పుట్టుకతోనే మొదలవుతుంది’ బామ్మ మాటలకి ‘అందుకే డాడీ నీ గురించి చెపుతారు’ అని మనవడు అనగానే ‘ మరి నువ్వు మీ అమ్మ మాట వింటున్నావా’ అంటూ సూటిగా అడిగింది వసుధ. ‘ఇందాక మీ అమ్మ పిలుస్తున్నా వెళ్లిపోయావు. అమ్మమ్మకి హేపీ బర్త్‌డే చెప్పలేదు.’ బామ్మ మాటలు మనవడిని కొంచం కదిలించాయి. ‘సారీ బామ్మా’ అంటున్న మనవడితో ‘నాకు కాదు, అమ్మకి చెప్పు’ అంటూ వాడిని వెనక్కి పంపించింది. వాళ్ల సంభాషణ చాటుగా విన్న రేవతి గబగబా తనగదికి వెళ్లి పోయింది. ‘వెరీ సారీ మమ్మీ.. యిక ఎప్పుడూ నువ్వు చెప్పినట్టే వింటా’ అంటూ అమాయకంగా ఆవేదనగా వున్న కొడుకుని చూసి కరిగిపోయింది రేవతి హృదయం. వాడిని గట్టిగా కౌగిలించుకుని ‘సరే’ అని మాత్రం అనగలిగింది.

ఆ క్షణంలో తన భర్తకి వాళ్ల అమ్మ అంటే ఎందు కంత గురో కూడా అర్థ్ధమయింది. ఆవిడది చాదస్తం కాదు, వయసుతో వచ్చిన అనుభవం అనుకుంది. ఆరోజు రాత్రి పిల్లలు పడుకున్నాక ‘థాంక్స్ అత్తయ్య గారూ! శ్రీనాథ్‌•ని దారిలో పెట్టారు’ అంటూ వచ్చిన కోడలుతో ‘ఓస్‌ ‌దీనికేనా థాంక్స్? అయినా వాడు యింకా చిన్నవాడే. వయసుతో పాటు అన్నీ నేర్చు కుంటాడు. నీకూ కొంచం ఓర్పు వుండద్దా? పిల్లలతో మనం పంతం పడతామా?’ అంటూ సూటిగా అడి గింది. అత్తగారి మాటలకి కోపం రాలేదు పైగా ‘మీరూ మాతోపాటు కొన్నాళ్ళు వుంటే పిల్లలే కాదు, నేను కూడా చాలా నేర్చుకోవచ్చు. ప్లాన్‌ ‌చేయండి ప్లీజ్‌ ’ అం‌టున్న కోడలితో ‘బాగుంది నీకేం తక్కువ? ఎటొచ్చీ ప్రథ•మ కోపం. రోజూ కొద్దిసేపు ధ్యానం చేస్తూ వుంటే అదీ పోతుంది. వయసుతో పాటు మన అనుభవాలు పెరుగుతాయి. వాటితో పాటు మనమూ మారతాము. మేము రావటం అంటావా! మాకు యిక్కడ వున్న స్వేచ్ఛ, పిలిస్తే పలికేవాళ్లు, తెలిసిన డాక్టర్‌ ‌సదు పాయం అక్కడ దొరకవు. అందుకని మీరే వీలు కల్పించుకొని వస్తూ వుండాలి’ అంటూ జవాబిచ్చింది వసుధ. ‘తప్పకుండా వస్తాం. ఒకవేళ ఆయనకి వీలు కుదరక పోయినా పిల్లలని తీసుకుని నేను వస్తాను’ అంది రేవతి. ‘అత్తాకోడళ్లు ఒకటయి నన్ను వేరు చేస్తున్నారా? ఇంకొక రెండు సంవత్సరాలు అయితే నా కాంట్రాక్ట్ అయిపోతుంది. అందరం యిక్కడే వుంటాం’ అంటూ మాట కలిపాడు శశిధర్‌.

About Author

By editor

Twitter
Instagram