ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

– పాలంకి సత్య


రోమ్‌ ‌చరిత్రను వివరంగా చెప్పిన తర్వాత తండ్రి కుమారుని ప్రశ్నించాడు. ‘‘విషయమంతా అవ గతమయిందా? ఈ పాఠంతో నీకు తెలిసినదేమిటి?’’

‘‘పూర్తిగా అర్థమయింది. అధికారం చేజిక్కించు కొనడానికి సోదరులను బంధించినా, సంహరించినా తప్పులేదు. అది పాపహేతువు కాదు. దేవతల ఆగ్రహానికి గురిచేయదు’’.

‘‘నీవు చెప్పింది నిజమే. కానీ నీకు అధికారం కోసం పోరాడే అవకాశం లేదు. నగర నిర్మాణం జరిగినప్పుడు రోములస్‌ ‌ముఖ్యమైన వంద కుటుంబా లకి పెట్రీషియన్లు అనే ముఖ్యస్థానం అప్పగించాడు. మన కుటుంబం వాటిలో ఒకటి. మన వంశానికి విహితమైన విధి దేవరాజైన జూపిటర్‌ని పూజించ డమే. అర్చకత్వ విధిలో ఉన్నవారు అశ్వారోహణం చేయరాదు. గుర్రాన్ని తాకడం కూడా నిషిద్ధమే. స్వగృహంలోనే నిద్రించాలి. ఆపద్ధర్మంగా ఇల్లు వదలివెళ్ల వలసి వస్తే ఎక్కడా మూడురాత్రులు మించి శయనించరాదు. రోమ్‌ ‌నగరాన్ని వీడి ఒక్కరోజు కూడా ఎక్కడా ఉండిపోకూడదు. సైన్యంతో ఏ సంబంధముండకూడదు. జూపిటర్‌ ‌దేవాలయంలోని ప్రధానార్చకులకు ఈ నియమాలు తప్పనిసరి. నా అనంతరం నీవే ప్రధాన పూజారిగా బాధ్యతలు స్వీక రించగలవు. కాబట్టి, నీకు శత్రుసంహారం, అధికారం చేజిక్కించుకొనడం వంటివి అసాధ్య కార్యాలు.’’

‘‘మీ దగ్గరకి చావు అప్పుడే రాదు. ఈలోగా నేను అధికారం సంపాదించి, నియమాలు మార్చే స్తాను’’ అని జూలియస్‌ ‌సీజర్‌ అనుకొన్నాడు. అతని ధైర్యానికి రెండు కారణాలు. మేనత్త జూలియా భర్త మారియస్‌ ‌సైన్యంలో ఉన్నత పదవిలో ఉన్నాడు. జూలియస్‌ ‌సీజర్‌ ‌తల్లి ఆరిలియా కోట్టా రాజ వంశీకురాలు.

జూలియస్‌ ‌సీజర్‌ ‌మనసులో ఏమనుకున్నా తండ్రి ఎదుట మౌనం వహించాడు. విద్యాబోధన పూర్తయ్యే నాటికి సీజర్‌ ‌పదహారేళ్ల వయసువాడయి నాడు. జనకుని వద్ద పూజా నిర్వహణ, బలి సమర్పణ మొదలయినవి నేర్చుకుంటున్న సమయంలోనే మన్మథ శాస్త్రం కూడా పఠించినాడు. కామసూత్రాల నతడు పఠించినది సెర్విలియా అనే వివాహిత వద్ద. తన కన్నా నాలుగు సంవత్సరాలు పెద్దదయిన స్త్రీతో శయన సంబంధం సీజర్‌కు తప్పుగా అనిపించలేదు. ధర్మ, అర్థ్ధ, కామాలన్న పురుషార్థాలను వరుసగా సాధించాలన్నది సనాతన భారతీయ నీతి. అర్థ్ధ, కామ ములనే ముఖ్యంగా గ్రహించడం అనార్య సంస్కృతి. ఇక జూలియస్‌ ‌సీజర్‌ ‌దృక్పథంలో వింత ఏముంది?

* * * *

జూలియస్‌ ‌సీజర్‌కి తండ్రి ప్రధాన అర్చకుని ముఖ్యమైన నియమ నిబంధనలను బోధించిన నాటి సాయంకాలమే సెర్విలియా నుండి అతనికి లేఖ వచ్చింది. సూర్యాస్తమయమయ్యే సమయానికి తన వద్దకు రమ్మంటూ గూఢమైన సంకేతం ఆ లేఖలో ఉంది. తన ప్రేయసి కోరినట్లుగానే అతడు ఆమె దగ్గరికి వెళ్లాడు. కుశల ప్రశ్నలయిన తరువాత ఆమె తాను గర్భవతినని చెప్పింది.

జూలియస్‌ ‌సీజర్‌ ‌పుత్రోత్సాహంతో పొంగి పోయాడు. ‘‘చిన్న జూలియస్‌ ‌సీజర్‌ ‌పుట్టబోతున్నా డన్నమాట.’’

‘‘అదేం మాట? కుమారుడు జన్మిస్తే అతనికి మార్కస్‌ ‌బ్రూటస్‌ అన్న పేరే సరియైనది.’’

‘‘నీ భర్త పేరా? పుట్టబోయేది నా పుత్రుడు కదా!’’

‘‘నీవు నా భర్తవు కావు. వంశ పరంపరగానే పిల్లల పేర్లు ఉంటాయన్న సంగతి నీకు తెలియనిది కాదు.’’

‘‘ఆ విషయమే మాట్లాడాలని వచ్చాను. నీ భర్తను విడిచిపెట్టి నన్ను వరించు. త్వరలోనే నేను రాజ్యాధి కారం చేజిక్కించుకోగలను. నిన్ను నా హృదయ సీమకు రాణిగా ఏనాడో చేసుకున్నాను. రోమ్‌కు నిన్ను రాణిని చేయగలను’’.

‘‘రోమ్‌లో రాజరికమే లేదు. దుర్మార్గులైన రాజు లను సహించలేని రోమనుల రాజరికపు వ్యవస్థను కూలదోసి సెనేట్‌ ‌ద్వారా పరిపాలిస్తున్నారని నీకు తెలియదా? లేనిపోని ఊహలు మనసులోకి రానీ యటం నీకు శ్రేయస్కరం కాదు జాగ్రత్త.’’

‘‘విద్యావతివి, విదుషీమణివి, అనేక కళలలో ఆరి తేరిన దానవు. నీతో వాదించి నేను గెలవగలనా?’’

‘‘మరి ఏమి చేయగలవు?’’

సీజర్‌ ఆమె దగ్గరగా జరగబోయేసరికి ఆమె నిలబడి ‘‘నా భర్త ఇంటికి వచ్చే సమయమైంది’’ అన్నది.

‘‘అందుకే అతనిని వదలి నన్ను వివాహం చేసుకోమని అడుగుతున్నాను’’ అన్నాడు సీజర్‌.

‘‘‌సెలవు’’ అని చెప్పి సెర్విలియా లోనికి వెళ్లి పోయింది. జూలియస్‌ ‌సీజర్‌ ‌కొంత నిరాశతో, కొంత కోపంతో బయటకు నడిచాడు.

* * * *

మరునాడు సీజర్‌ ‌తన మేనత్త భర్త మారియస్‌ ‌వద్దకు వెళ్లి, తనకు సైన్యంలో చేరి, యుద్ధంలో పాల్గొనాలని ఉందన్న కోరికను తెలియపరచాడు. మారియస్‌ ‘‘‌నీ కోరికను నీ జనకులెరుగుదురా?’’ అని ప్రశ్నించినాడు. తెలియదని సీజర్‌ ‌ప్రత్యుత్తర మిచ్చాడు.

‘‘నీ తండ్రి అనంతరం నీవు జూపిటర్‌ ఆల యంలో ప్రధాన అర్చకుడవు కావలసియున్నది. అర్చకత్వమూ, సైన్యాధిపత్యమూ ఒకే సమయంలో చేయగలిగిన కార్యాలు కావు. అయినంతలో నీ కోరికను తిరస్కరించుట సరియైనది కాదు. నా సహచరుడైన కొర్నీలియస్‌ ‌సిన్నాతో సంప్రదించి, నీకు నా నిర్ణయం చెబుతాను.’’

* * * *

తన కుమార్తె కొర్నీలియాను వివాహమాడేందుకు అంగీకరించిన పక్షంలో సీజర్‌ను సేనలో చేర్చు కొనడానికి అంగీకరించగలనని కొర్నీలియస్‌ ‌సిన్నా అన్నాడు. వరకట్నంగా చాలా ధనం, భవనాలు ఈయగలనని తెలిపాడు. కొర్నీలియాతో వైవాహిక సంబంధంను తిరస్కరించవలసిన కారణం సీజర్‌కు కనిపించలేదు.

తానొకటి తలస్తే దైవమొకటి తలిచిందని ఆర్యోక్తి. సీజర్‌ ‌తండ్రి ఆకస్మికంగా మరణించాడు. పదనారేళ్ల వయసులోనే జూలియస్‌ ‌సీజర్‌ ఇం‌టి బాధ్యతనూ, దేవాలయ ప్రధాన అర్చక బాధ్యతనూ స్వీకరించవలసి వచ్చింది. అదే సమయంలో రోమ్‌లో జరుగుతున్న ఆధిపత్య పోరాటం అంబరాన్ని అంటింది.

రోమ్‌ ‌రక్త ప్రవాహంలో కొట్టుకొని పోగల దనిపించింది. సీజర్‌ ‌మేనమామ మారియస్‌, ‌మామగారు కొర్నీవియస్‌లు తమ ప్రత్యర్థి జుల్లాతో యుద్ధం చేయవలసి వచ్చింది. చివరకు జుల్లాదే పైచేయి అయింది. తన ప్రత్యర్థులకు బంధువయిన కారణంగా అతడు సీజర్‌ ఆస్తినీ, సీజర్‌కు భార్య ద్వారా సంక్రమించిన కట్నకానులకలనీ స్వాధీనం చేసుకొని, వంశ పరంపరగా సంక్రమించిన అర్చక పదవి నుంచి కూడా తొలగించాడు.

ప్రాణాలకు ముప్పు తప్పదేమోనన్న భయంతో సీజర్‌ ‌భార్యతో సహా అజ్ఞాతం లోనికి వెళ్లిపోవలసి వచ్చింది. కొంత కాలానికి సీజర్‌ ‌తల్లి ఆరివియా కోట్టా తన బంధువుల సహాయంతో సీజర్‌ని మరణ భయం నుంచి తప్పించింది. కానీ ప్రాణగండం ఏనాటికైనా తప్పదన్న భయంతో సీజర్‌ ‌రోమ్‌ను వదలి వెళ్లిపోయినాడు. అనేక రాజ్యాలలో ఎందరో సైన్యాధి పతుల దగ్గర పనిచేసి, యుద్ధవిద్యలలో ఆరితేరినాడు. జుల్లా చనిపోయేవరకు రోమ్‌ ‌నగరంలో అడుగు పెట్టలేదు. ఇరువది రెండేళ్ల యౌవనంలో ధనహీను డిగా ఒక సాధారణ గృహంలో నివాసమేర్పరుచుకుని, రోమ్‌ ‌నగరవాసి కాగలిగాడు.

* * * *

విక్రమాదిత్యుడు మంత్రి సామంతులతో కొలువు తీర్చినాడు. ఆనాడు ఇతర రాజ్యాల నుంచి వచ్చిన దూతలకు మహారాజు దర్శనమీయగలడని ముందుగానే తెలియచేశారు. రాయబారులు తెచ్చిన కానుకలను సమర్పించి, సందేశాలు విన్నవిస్తున్నారు. విక్రమాదిత్యుడు మంత్రులకు తగు ఆదేశాలు ఇస్తున్నాడు.

‘‘ప్రభూ! నేను అజయమేరు నగరం నుంచి చహమాన వంశీయుడు అజయ రాజు వద్ద నుండి తమ ధర్శనార్ధం వచ్చాను. మా ప్రభువులు తమకు స్వర్ణ కంకణమునూ, మృణ్మయ భంజికలనూ కానుకగా పంపినారు.’’

‘‘తమ రాకకు కారణం?’’

‘‘తమ దర్శనానికే మహాప్రభు!’’

‘‘మంచిది… మా నగరంలోనే తమకు నివాస మేర్పరచడం జరుగుతుంది.’’

‘‘కృతజ్ఞుణ్ణి’’

(అజయము-నేటి అజ్మీరు; చహమాన వంశం పేరే చౌహాన్‌గా మారింది)

‘‘చిత్తం! మహాప్రభూ… మా రాజుగారు అజయ రాజు తమ కుమార్తె లక్ష్మీదేవి కోసం తమ హస్తాన్ని అర్ధిస్తున్నారు. ప్రభువుల సాహచర్యంలో తమ పుత్రిక జీవితం ఆనందమయం కాగలదని వారి నమ్మకం.

విక్రమాదిత్యుడు తన పంకించి, దూతను వీడు కొలిపాడు. ఆపైన మహామంత్రిని పిలిపించి మాట్లా డాడు. చహమాన వంశం కూడ పరమార వంశం వలెనే అగ్ని నుండే ఉద్భవించింది. మ్లేచ్ఛులూ, శకులూ తమ రాజ్యాన్ని ఆక్రమించకుండా చహ మానులు నిరోధించగలుగుతున్నారు. అజయమేరు పాలకునితో వైవాహిక బంధం ఉజ్జయినికి లాభ దాయకమే కాగలదు.

ఆనాటి రాత్రి విక్రమాదిత్యుని ఆలోచనా ప్రవాహం అనేక దిక్కులకు సాగింది. తన పితృ పాదులు అగ్నివంశ క్షత్రియులతో వివాహ బంధం శ్రేయస్కరమని ఇదివరలోనే సూచించారు. నేడు మహామంత్రి అదే మాట అంటున్నాడు. వివాహం కేవలం రాజ్యశ్రేయస్సున కేనా? తన మనసులోనికి వలపు, అనురాగం, ప్రేమ వంటి పదాలు రానీయ రాదా? ఇందప్రస్థ నగరం వెలుపల యోగమాయా దేవి మందిరంలోని బహిః ప్రాంగణంలో కన్పించిన దెవరు? వీర విద్యా ప్రదర్శనను తన మనసు మెచ్చు కున్నది. తీయని కంఠమూ, ఒత్తైన దీర్ఘ కుంతలాలూ ఆమె స్త్రీ అనే అన్పిస్తున్నది. ఇంతకూ ఎవరామె? ఎవరైన నేమి? తన ప్రస్తుత కర్తవ్యం భరతభూమిని ఏకచ్ఛత్రం క్రిందకు తీసుకొని వచ్చి, మ్లేచ్ఛుల దురా క్రమణ పాలు కాకుండా కాపాడడం. ఆ ప్రయత్నానికి చహమాన రాజులతో సంబంధ బాంధవ్యాలు ముఖ్యం.

విక్రముడు తండ్రి ఆశ్రమానికి వెళ్లి, విషయం విన్నవించి, జనకుని అనుమతితో ‘‘అజయమేరు రాజ కుమార్తెను చేపట్టడం మాకు అంగీకారమే’’ అన్న వార్తను దూత ద్వారా అజయరాజుకు పంపించినాడు.

ళి       ళి       ళి

ఉజ్జయినీ పతి బంధుమిత్రులతో, పరివారంతో అజయమేరు నగరాన్ని సమీపించడానికి ఆరు యోజనాల దూరంలోనే కన్యాదాత మంత్రులతో, భటులతో ఎదురు వచ్చి, స్వాగత సత్కారాలు చేసి, కోటకు దగ్గరలోని ఉద్యానవనంలోని భవనంలో విడిది చేయించాడు. వివాహానికి ఏర్పాట్లు పూర్తయినవనీ, మూడవనాటి ఉదయమే కోటలోనికి తీసుకొని వెళ్లగలననీ విన్నవించినాడు.

విక్రమాదిత్యుడు ‘‘ఆ విషయం తర్వాత ఆలో చింపవచ్చును’’ అని రాజును వీడు కొలిపాడు.

* * * *

వివాహానికి ముందు నాటి రాత్రి ఎంత ప్రయత్నించినా విక్రమునికి నిద్ర పట్టలేదు. అతడు ఉద్యానవనంలోనికి వెళ్లి, భవనాలకు దూరంగా, కోట గోడకు దగ్గరగా ఒక వృక్షం క్రింద కూర్చుండి, పరమేశ్వరుని ఉద్దేశించి పాట పాడుకోసాగినాడు. తన మనసు ధర్మానికే అంకితం కావలెననీ, కోరికల వైపు మరలరాదనీ పాట సారాంశం.

పాట ముగిసే సరికి పాదాల దగ్గర ఒక కర్ర వచ్చి పడింది. ఆ కర్రకు భూర్జపత్రం చుట్టి ఉన్నది. అతడు నలువైపులా చూసినప్పటికీ ఎవరూ కన్పించ లేదు. కోటగోడపై నిలబడి ఎవరైననూ విసిరి ఉండవచ్చునా?

దూరంగా అడుగుల చప్పుడు వినబడినది. ఎవరా వ్యక్తి? కొయ్యముక్కను విసిరిన వారేనా?

‘‘విక్రమా! ఇక్కడకు వచ్చావా? నిద్రపట్టడం లేదా’’?

‘‘మిహిరా, నీవా?’’

‘‘ఎవరనుకున్నావు?’’

‘‘అజ్ఞాత వ్యక్తి ఎవరో ఒక కొయ్యకు పత్రం చుట్టి విసిరినారు. ఆ వ్యక్తి ఈ ప్రాంతంలోనే ఉండాలి కదా!’’

‘‘తెల్లవార వస్తున్నది… లోనికి పోదాం రా!’’

విక్రముడు లేచి మిత్రునితో పాటు నడచి భవనం చేరుకునేసరికి అజయమేరు రాజభటులు వేచి ఉన్నారు.

లేఖను చదివిన విక్రమాదిత్యుడు స్తంభీభూతుడై నిలబడిపోయినాడు.

‘‘దేవాలయంలో ప్రేమగీతమెందుకు?

ఉద్యానవనములో భక్తి సంగీతమెందుకు?’’

‘‘మిత్రమా’’ అన్న మిహిరుని పిలుపు విక్రమునకు విన్పించలేదు. రెండవసారి పిల్చినా వినబడలేదు. ‘‘మహారాజా! మనం తరలివెళ్లే సమయమైంది’’ అని మిహిరుడు విక్రముని చెవి దగ్గరగా చెప్పి, అతనిని బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చాడు.

* * * *

వివాహ కార్యక్రమం ప్రారంభమైంది. పురోహి తులు చెప్పిన విధంగా విక్రమాదిత్యుడు హోమ, దాన మంత్రోచ్చారణ విధులను నిర్వహిస్తున్నాడు. అతని మనసులో ఒక్కటే ఆలోచన నిలకడగా ఉంది. ‘‘నా కర్తవ్యం నేను మరువకుందును గాక. ధర్మం తప్పకుందును గాక. వివాహం ధర్మాచరణకే కానీ తృతీయ పురుషార్ధమైన కామం కోసం కాదని మరువకుందును గాక. నేను వివాహమాడుతున్న కన్యయందే నా హృదయం లగ్నమగును గాక.

వధువును నెమ్మదిగా ఆమె మాతృమూర్తి, సఖీ జనం కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి కూర్చుండ పెట్టారు. ‘‘ఈమె చేతిని గ్రహించి, సహధర్మచారిణిగా స్వీకరించవలసినది’’ అనే అర్ధంతో మంత్రాలు చదువుతుండగా, కన్యాదాత తన కుమార్తె లక్ష్మీదేవి చేతిని వరుని చేతిలో ఉంచాడు. అప్రయత్నంగా కనులెత్తిన విక్రమాదిత్యుని ముఖంలో ఆశ్చర్యమూ, ఆనందమూ కలసి తాండవించినాయి. వధువు మోముపై చిరునవ్వు కదలాడినది. అది ఆనంద సంకేతమా లేక పరిహాస సూచకమా?

మంత్ర పఠనం సాగిపోతోంది. లక్ష్మీదేవి నెమ్మ దిగా ‘‘నా లేఖ తమకు చేరినదా?’’ అని అడిగినది.

‘‘వేడుకగా ఉన్నదా?’’

‘‘లేదు…భయం’’ ఆమె చేయి చెమటతో తడిసి, అతని చేతిలో ఇమిడిపోయింది. అతడు ధైర్యం కలిగించడానికా అన్నట్లుగా ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. సభాసదులంతా చూస్తున్నారన్న భావం సంభాషణకు అడ్డుపడింది.

(సశేషం)

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram