ఇంగ్లిష్‌ ‌వాళ్లు రాసిన భారత చరిత్రనే మనం చదువుత•న్నాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా అదే చదువుకోవడం దురదృష్టకరం. ఈస్టిండియా కంపెనీ తరఫున వచ్చిన సివిల్‌, ‌మిలటరీ అధికారులు కొంత సమాచారం సేకరించి వాళ్ల దృష్టికోణం నుంచి చరిత్ర రాశారు. ఈ దేశాన్ని శాశ్వతంగా పరిపాలించాలంటే ఇక్కడి ప్రజల మనసులను ఎలా చెడగొట్టవచ్చునో అలా రాశారు. జాన్‌ ‌స్ట్రాచీ మొదలు కన్నింగ్‌హ్యామ్‌ ‌వరకు పెద్ద జాబితాయే ఉంది. చరిత్రను వక్రీకరించడానికి వాళ్లు చేసిన ప్రయత్నంలో కీలకమైనదే ఆర్యులు బయటి నుంచి వచ్చారని చెప్పడం, నమ్మింపచేయడం. ఆర్యులు ఇక్కడివారేననీ, ఆ వాదన అసంబద్ధమైనదనీ శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం నేను చేశాను. సామ్రాజ్యవాదుల దృష్టికోణంతో రాసిన చరిత్రలోని అనేక అంశాలను వడబోయడానికి ప్రయత్నం చేశాను. అది మొదటి విషయం. రెండవది విదేశీ దండయాత్రలు. గ్రీకులు, శకులు, కుషాణులు, హూణులు వచ్చారు. తర్వాత అరబ్స్ ‌వచ్చారు. ఈ దండయాత్రలని ఏ దృష్టితో చూడాలి? వాళ్లని ఆనాడు ఏ విధంగా మనవారు ఎదిరించగలిగారు? దేశంలో స్థానం లేకుండా చేయగలిగారు అన్న అంశాన్ని సరైన కోణంలో చూపించడానికి ప్రయత్నించాను. ఇస్లామిక్‌ ‌దండయాత్రలలో, యూరోపియన్‌ ‌దండయాత్రల సమయంలో ప్రతి యుద్ధంలో ఓడిపోయిన జాతిగా చరిత్రలో మనని నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఓడిన మాట వాస్తవం, రాజ్యాన్ని పోగొట్టుకున్న మాట వాస్తవమే. కానీ, అనేక సందర్భాల్లో ఇక్కడి పాలకులు వీరోచితంగా ప్రతిఘటించారు. గెలిచిన సందర్భాలు కొన్ని ఉన్నాయి.

అక్బర్‌ను ప్రతిఘటించిన రాణాప్రతాప్‌ ‌యుద్ధ నీతిని మార్చాడు. ఇది లోతుగా విశ్లేషించవలసిన అంశం. గజబలంతో కూడిన ఆనాటి యుద్ధనీతితో మనం ఓడిపోయాం. దాన్ని రాణాప్రతాప్‌ ‌విశ్లేషించి పక్కకు పెట్టాడు. గుర్రం (చేతక్‌) ‌మీద నుంచి యుద్ధం చేశాడు. రెండవ విషయం-ఒక ప్రత్యేక వర్గం నుంచి కాక, సాధారణ ప్రజలను సైన్యంలోకి తీసుకున్నాడు. మూడవది – కోశాగారాన్ని ఎప్పుడూ రాజధానిలో అట్టేపెట్టలేదు. దీనిని చాలామంది చరిత్రకారులు గమనించలేదు. అంతకుముందు ఎవరు రాజధానిని ఆక్రమించినా, సంపదంతా వాళ్ల చేతుల్లోకి పోయేది. రాణాప్రతాప్‌ ‌యుద్ధానికి బయలుదేరేముందు కోశాగారాన్ని అడవుల్లో దాచాడు. అందువల్ల యుద్ధంలో వెనుకడుగు వేయాల్సి వచ్చినా వెంటనే సైన్యాన్ని పునర్నిర్మించుకోవడానికి వనరులు సమకూరాయి. అందుకనే చివరిదాకా పోరాడాడు, ఓడిపోలేదు. రాణాప్రతాప్‌ ‌రాజ్యం చివరిదశలోనూ స్వతంత్రంగానే ఉంది. శివాజీ ఇంచుమించు ఇదే రకమైన యుద్ధనీతిని అనుసరించాడు. శివాజీ యుద్ధనీతిని వియత్నాం ఉద్యమకారుడు హోచిమన్‌ ‌కొనియాడాడు. అనుసరించారు కూడా. 20వ శతాబ్దిలో గెరిల్లా పోరాటానికి అదే మూలం.

వీటితో పాటు నేను ప్రత్యేక దృష్టితో రాసిన అంశాలూ ఉన్నాయి. వాటిని ఇతర చరిత్ర గ్రంథాల్లో చ••డం. అసలు భారతదేశానికి ఎందుకీ దారిద్య్రం? అధ్యయనం చేయవలసిన చారిత్రక అంశాలలో ఇది ప్రధానమైనది. చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలో గ్రీకు రాయబారి మెగస్తనీస్‌ ‘ఇం‌డికా’ అనే గ్రంథం రాశాడు. అందులో భారతదేశంలో కరవులు రావు, పేదరికం ఉండదు అని రాశాడు. అనేక నదులు, సారవంతమైన నేల, మంచి పంటలు పండుతాయి. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తింటారు అని రాశాడు. అలాంటి దేశానికి పేదరికం ఎలా వచ్చింది? ఇస్లామిక్‌ ‌దండయాత్రలు జరిగినప్పుడు, ఖిల్జీలు, తుగ్లక్‌లు దేవాలయాల్లో ఉన్న అపార సంపత్తిని దోచుకున్నారు. తర్వాత కోటల నుంచి వజ్రవైఢూర్యాలు, బంగారం తీసుకెళ్లిపోయారు. పంట కోసుకుపోయేవారు. ఇవన్నీ ఖాళీ చేసి సామాన్య ప్రజల మీద పడ్డారు, పన్ను వసూళ్ల పేరుతో. ఢిల్లీ సుల్తానుల పన్నులు, వసూళ్లు ఎలా ఉండేవో రాశాను. ఒక సంవత్సరం పంటను ఎత్తుకుపోతే భరిస్తారు కానీ, ఏళ్ల తరబడి దోచుకపోతుంటే ఏ రైతు మళ్లీ పండించగలడు? అందుకే గంగా, సింధు మైదా నాలలో సారవంతమైన భూములను బీళ్లుగా వదిలేశారు. అలా కరవులు మొదలైనాయి. తొలితరం మొగల్‌ ‌చక్రవర్తులు హుమాయున్‌, అక్బర్‌, ‌జహంగీర్‌, ‌షాజహాన్‌, ఔరంగజేబ్‌ల కాలంలో 24 దుర్భిక్షాలు వచ్చాయి. వేల సంవత్సరాల భారత చరిత్రలో అత్యంత భీకరమైన కరవు కనిపించేది అక్బర్‌ ‌కాలంలోనే. కోట్లాదిమంది నశించిపోయారు.

 సంపదను పోగొట్టుకోవడంతోను, సంపదను ఉత్పత్తి చేసే సాధనాలు వినియోగించులేక పోవడంతోనూ దేశం బీదదవుతూ వచ్చింది. సుల్తానులు, పాదుషాలు ఇక్కడి సంపద తరలించడం మానేసిన తర్వాత కూడా వీళ్లు ఢిల్లీ, ఆగ్రా, లాహోర్‌లలో దాచిన సంపద, సామాన్య ప్రజలను లూటీ చేసి పోగేసిన సంపద మంగోలులు లేదా ఇరానియన్స్ ‌కొల్లగొట్టేవారు. కాకతీయుల కోహినూరు వజ్రాన్ని ఢిల్లీలో పెట్టుకుంటే నాదిర్షా ఎత్తుకెళ్లాడు. ఇది ఒక చిన్న ఉదాహరణ. మన సంపదంతా తరలిపోయింది. దేశం బీదది కావడానికి ఇది ప్రధాన కారణం. ఆ తర్వాత బ్రిటిషువారు, పోర్చుగీసు వారు ఏ విధంగా దేశాన్ని లూటీ• చేశారో వివరంగా చెప్పాను. ఇక్కడే ఇంకొక అంశం కూడా హైలైట్‌ ‌చేశాను. అది ప్రపంచ గతిని మార్చింది. ప్లాసీయుద్ధం (1757)లో క్లైవ్‌ ‌గెలిచాక ఓడిన సిరాజిద్దౌలా కోశాగారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ముర్షీదాబాద్‌ ‌నగరంలో ఉన్న ఆ కోశాగారంలోని సంపద వెలకట్టలేనిది. దాన్ని ఓడలలో నింపుకొని ఇంగ్లండ్‌ ‌తీసుకెళ్లారు. అక్కడ అప్పుడే పారిశ్రామిక విప్లవం ఆరంభమైంది. యంత్రాలు కనుగొన్నారు, వాటిని ఉపయోగించుకోవటానికి కావలసిన పెట్టుబడి- కాపిటల్‌- ‌లేదు. క్లైవ్‌ ‌దోచుకుపోయిన బెంగాల్‌ ‌సంపద, పారిశ్రామిక విప్లవానికి కాపిటల్‌ అయింది. అప్పటి నుంచి బ్రిటన్‌ అజేయ శక్తిగా ఎదిగింది. ప్రపంచ గతిని మార్చిన, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ముఖ్య కారణం సిరాజిద్దౌలా కోశాగారం.

వీటన్నితోపాటుగా సంస్కృతిని కూడా సమాం తరంగా అంచనా వేస్తూ వచ్చాను. ఇక్కడ మొదటి నుంచి అనేక రాజ్యాలు ఉన్నాయి. రాజులు ఒకరితో ఒకరు పేచీపడేవారు, మళ్లీ కలిసేవారు. కానీ దేశమంతటా అంతర్లీనంగా ఒక ఐక్యత ఉంది. ఆ ఐక్యతను కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అదే ఫండమెంటల్‌ ‌యూనిటీ అనీ ఒక చాప్టర్‌లో చెప్పాను. ఉదాహరణకు జ్యోతిర్లింగాలు, వైష్ణవ క్షేత్రాలు దేశమంతా ఉన్నాయి. అష్టాదశ పీఠాలు విస్తరించి ఉన్నాయి. ఈ తీర్థ యాత్రలు చేయడం ద్వారా ఇది నా దేశం అనే భావం నిర్మాణం కావడానికి ఒక మెకానిం ఆచారాల రూపంలో అమలైంది. అదొక అద్భుత ప్రయత్నం. ఆదిశంకరాచార్యులు నాలుగు పీఠాలను నెలకొల్పడం దాన్లో భాగమే.

ఇది కాక ఇప్పుడు ఉపనిషత్తులో సామాజిక స్పృహ ఏ విధంగా ఉందనే విషయాన్ని సంక్షిప్తంగా చూపే ప్రయత్నం చేశాను. సామాజిక స్పృహ లేకపోతే సమాజం ఇంతకాం నిలబడడం సాధ్యం కాదు. ఎవరైతే సమాజాన్ని అనేక రకాలుగా సుసంపన్నంగా ఉంచే ప్రయత్నం చేశారో- బుద్ధుడు, మహావీరుడు, తరువాత ఆదిశంకరాచార్యుల వారు గానీ వీళ్లందరి సేవ విలువ ఏమిటి అన్న విషయం స్పృశించే ప్రయత్నం చేశాను.

తమిళనాడులో నాయనార్‌లు, ఆళ్వార్లు ఒక కులానికి సంబంధించినవారు కాదు. వారి విగ్రహాలను అనేక దేవాలయాలలో పెట్టి పూజిస్తారు. కులవ్యవస్థ ఉన్నప్పటికీ దానికి అతీతంగా సమాజాన్ని ఒకటిగా ఉంచడం కోసం జరిగిన ప్రయత్నంలో భాగంగా మనం దీనిని చూడవచ్చు. రామానుజులు కులవ్యవస్థకు వ్యతిరేకంగా సమాజాన్ని నిలిపి ఉంచే ప్రయత్నం చేశారు. తర్వాత బసవేశ్వరుడు, మధ్వాచార్య రాజులు, రాజరికాలు, రాజ్యవ్యవస్థకు అతీతంగా సమాజాన్ని ఒకటిగా ఉంచడానికి ప్రయత్నం చేశారనే విషయం ఈ రచనలో చూపించే ప్రయత్నం చేశాను. ఇంకొక అంశం కూడా. ఇస్లామిక్‌ ‌దండయాత్రల సమయంలో హిందూ రాజులు సామాన్య ప్రజలకు రక్షణ ఇవ్వలేకపోయిన తర్వాత, నిస్సహాయ స్థితిలో పడిపోయిన సామాన్య ప్రజలకు రామానంద, కబీర్‌, ‌గోస్వామి తులసీదాస్‌, ‌చైతన్య మహాప్రభు, అస్సాంలో శంకర్‌దేవ్‌, ‌గురు నానక్‌దేవ్‌, ‌భక్తతుకారం, సమర్థ రామదాసు, వీళ్లందరు భక్తి సందేశ రూపంలో, కీర్తనల రూపంలో అనేక రకాలుగా ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారు.

భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఇంకొక పార్శ్వం ఈ రచనలో ఉంది. భారతీయ సంగీతం, భారతీయ నృత్యం. ఇవి ఏ రకంగా జాతిని ఒకటిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినది చెప్పాను. సంగీతం, నృత్యం ఆ రెండూ భక్తి ప్రధానంగా విస్తరించాయి. మణిపూరి, ఒడిస్సి వంటి అనేక సంప్రదాయ నృత్యాలు ఆవిర్భవించాయి. ఈ సందర్భంగా చిన్న అంశం చెబుతాను – 1025 జనవరిలో గజనీ సోమనాథ్‌ ‌దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు సరిగ్గా అదే సమయంలో రాజరాజ చోళుడు బృహదీశ్వరాలయం నిర్మించాడనే విషయం చరిత్రలో చెబుతారు, గజనీ సోమనాథ్‌ ‌దేవాలయాన్ని ధ్వంసం చేశాడన్న విషయం చెప్పరు. అలా చెప్పడం వల్ల ప్రజలకు అందే సందేశం వేరే. అదే సమయంలో అంకొర్‌వాట్‌లో బ్రహ్మాండమైన విష్ణుమందిరాన్ని హిందువులు నిర్మించారు.

వీటితోబాటు భారతీయ సైన్సు ఏ విధంగా విస్తరించింది, ఖగోళశాస్త్రం, ఇటువంటివన్ని కూడా ఏ విధంగా విస్తరించాయో దీంట్లో స్పృశించడం జరిగింది.

స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి ఒక ముఖ్యమైన అంశాన్ని నేను హైలైట్‌ ‌చేశాను. అది పొలిటికల్‌ ఇస్లాం. ఔరంగ జేబ్‌ ‌చనిపోయిన తర్వాత ముస్లిం మేధావుల్లో వచ్చిన మార్పు. ఔరంగజేబ్‌ 1707‌లో పోయినాడు. ఆ తర్వాత ముస్లిం నవాబులు, పాలకులు, ఇస్లాంను ఇక ఎవరూ రక్షించలేరన్న అభిప్రాయానికి వచ్చారు.

కాబట్టి దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ముస్లిం మేధావుల్లో ఒకరకమైన ఆలోచనలు మొదలైనాయి. ఇది పొలిటికల్‌ ఇస్లాంగా పరివర్తనం చెందింది. దానిని ఫలితాలేమిటో మనందరికీ తెలుసు.

(సంక్షిప్త భారతదేశ చరిత్ర – సంస్కృతి (వేదకాలం నుంచి 1947 వరకు)ను వెలువ రించడం వెనుక ఉద్దేశాన్ని, ప్రత్యేకతను వివరిస్తూ ఆచార్య శేషగిరిరావు చెప్పిన మాటలివి.)

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram