హైడ్రా.. హైదరాబాద్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ అం‌డ్‌ అసెట్స్ ‌ప్రొటెక్షన్‌ ఏజెన్సీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న స్వయం ప్రతిపత్తి సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ కార్యాచరణలో మొదటి నుంచీ ప్రశంసలు, విమర్శలు, వివాదాలు, ఆరోపణలతో సాగుతోంది.

 తొలినాళ్లలో దాదాపు మెజార్టీ వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్న హైడ్రా.. క్రమక్రమంగా విమర్శల పాలవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అసలు హైడ్రా అనేది ఒకటుందని, చెరువులకు సంబంధించిన భూములను కాపాడబోతోందని ముందుగా పెద్దగా ప్రచారం లేకుండానే నేరుగా కార్యాచరణలోకి దిగింది. తొలుత హైదరాబాద్‌ ‌నగర శివారులో బెంబేలెత్తించింది. నేరుగా బుల్డోజర్లను వెంట తీసుకెళ్లి కూల్చేసిన తర్వాతే మాట్లాడటం ప్రారంభించింది. దీంతో, అక్రమార్కులు, కబ్జాదారుల గుండెల్లో గుబులు మొదలయ్యింది. దీంతో, సామాన్యులు, జనాలు, మెజార్టీ వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. చెరువులకు చెందిన ఫుల్‌ ‌ట్యాంక్‌ ‌లెవెల్స్ (ఎఫ్‌టీఎల్‌), ‌బఫర్‌ ‌జోన్లలో ఉన్న కట్టడాలను కూల్చేయడం, ప్రధానంగా నగర శివారులోని బడా నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధుల భారీ కట్టడాలు, ఫామ్‌హౌజ్‌లపైనే దృష్టిపెట్టడం కూడా దీనికి కారణం. ఎప్పుడు ఎటువైపు నుంచి హైడ్రా బుల్డోజర్లు వస్తాయో, తమ నిర్మాణాలు ఎన్నాళ్లు సేఫ్‌గా ఉంటాయో, ఏ తెల్లవారు జామున నేలమట్ట మవుతాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లో చెరువుల చెంతన భారీ నిర్మాణాలు చేపట్టిన వాళ్లను భయం వెంటాడుతోంది. అనుకున్నట్లుగానే.. వారాంతపు సెలవులు వస్తే చాలు.. హైడ్రా బుల్డోజర్లు ఒక్కసారిగా హడావిడి మొదలుపెడుతున్నాయి. టార్గెట్‌ ‌చేసిన ప్రాంతాల్లోకి వెళ్లి నేరుగా కూల్చివేతలు మొదలు చేపడుతున్నాయి. అందరూ తేరుకునే లోగానే, తెల్లవారే లోగానే అంతా పూర్తయిపోతోంది. నిర్మాణాలు నేలమట్టమై పోతున్నాయి. దీనికోసం హైడ్రా టీమ్‌ అత్యంత పకడ్బందీ వ్యూహాలను ముందుగానే సిద్ధం చేసుకుంటోంది. ఏ ప్రాంతంలో కూల్చివేతలకు ఎన్ని బుల్డోజర్లు అవసరం? అక్కడ నిర్మాణాలు నేలమట్టం చేసేందుకు సిబ్బంది ఎంతమంది అవసరం? అన్న విషయాల్లో పక్కాగా వ్యవహరిస్తోంది. అంతేకాదు.. తెల్లవారు జామున హైడ్రా బుల్డోజర్లు, సిబ్బంది ఎటువైపు ముందుకు సాగాలో, ఏ ప్రాంతంలో నిర్మాణాలు కూల్చేయాలో ఆ క్షణం దాకా తెలియనీయడం లేదు. సంబంధిత ప్రాంతానికి వచ్చేదాకా సిబ్బందికి, బుల్డోజర్లకు కూడా తెలియడం లేదు. ఇలా.. హైడ్రా మాటలు తప్ప చేతలకే ప్రాధాన్యం ఇవ్వడంతో నిజంగానే నలుగురి నోళ్లలో నానేలా చర్చనీయాంశ మవుతోంది.

దటీజ్‌ ‌రేవంత్‌

‌తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.వాస్తవానికి కాంగ్రెస్‌ ‌పార్టీ అంటేనే సముద్రం. మహామహుల కలయిక. కురువృద్ధుల గ్రూప్‌. ‌హస్తినలోని అధిష్టానంతో సత్సంబంధాలు కలిగిన వాళ్ల పార్టీ. ఈ లెక్కన చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలోని ఓ మోస్తరు నాయకుల్లో అత్యంత జూనియర్‌ ‌రేవంత్‌రెడ్డి. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం వెనుక.. సీనియర్లు, అంతకుముందే ఉన్న నాయకుల పాత్ర ఎంత ఉందో.. రేవంత్‌రెడ్డి ఒక్కరి పాత్రే అంత ఉందని చెప్పుకోవచ్చు. అందుకే ఢిల్లీ పెద్దలు రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఇక, గడిచిన పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీని ఒంటిచేత్తో నడిపించిన కె.చంద్రశే•రరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా నడిపించారో, ఎంత నియంతృత్వంగా దూసుకెళ్లారో రేవంత్‌రెడ్డి స్వయంగా చూశారు. అంతేకాదు.. కేసీఆర్‌ ఆటలో రేవంత్‌రెడ్డి పావుగా మారి బాధితుడిగా కూడా మారారు. అందుకే అతిచిన్న వయసులోనే, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం పీఠం అధిష్టించారు రేవంత్‌రెడ్డి. అది కూడా కాంగ్రెస్‌పార్టీలో. అయితే, ఆ విషయం పూర్తిగా రేవంత్‌రెడ్డికి తెలుసు. అందుకే రేవంత్‌రెడ్డి కొన్ని అంశాల్లో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఎవరినీ లెక్కచేయడం లేదు. అందరినీ తన వాక్చాతుర్యం, తన నడవడికతో కట్టి పడేస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌పార్టీలోని మిగతా నేతలు కూడా రేవంత్‌రెడ్డి నిర్ణయాల విషయంలో విభేదించడం లేదు. ఈ క్రమంలోనే హైడ్రా ఆలోచన, నిర్ణయం, ఏర్పాటు అంతా రేవంత్‌రెడ్డి మస్తిష్కంలోంచే పుట్టింది. ఆయన ఆలోచనకు తగినట్లుగానే హైడ్రా మాస్‌ ఇమేజ్‌ను కట్టబెట్టింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన సన్నిహితుల వద్ద తరచూ ‘ముఖ్యమంత్రి అవుతామని ఎప్పుడైనానుకున్నామా? దేవుడి పుణ్యమా అని అయ్యాం. భయపడుతూ కూర్చుకుంటే ఏ పని చేయలేం. వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టొద్దు. పాలనలో మన ముద్ర వేద్దాం. అనవసర భయాలకు పోవద్దు. మంచి చేసుకుంటూ పోదాం. ఏది జరిగితే అది జరుగుతుంది’ అని సందర్భం వచ్చినప్పుడల్లా వ్యాఖ్యానిస్తుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నిజానికి ఈ తెగింపే రేవంత్‌కు కొత్త ఇమేజ్‌ను తెచ్చి పెట్టిందని అంటున్నారు. ఈ కోవలోనే తెర మీదకు వచ్చింది హైడ్రా. విపత్తుల వేళ సాయం చేసేందుకు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ముఖ్యమంత్రి రేవంత్‌కు సరికొత్త ఇమేజ్‌ ‌ను తీసుకురావడమే కాదు.. ఆయనకు ఒకలాంటి మాస్‌ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. రేవంత్‌ ‌ప్రభుత్వ గ్రాఫ్‌ ‌విషయానికి వస్తే.. కొన్నిసార్లు అప్‌.. ‌మరికొన్నిసార్లు డౌన్‌ అన్న పరిస్థితి. అందుకు భిన్నంగా హైడ్రా పుణ్యమా అని రేవంత్‌ ‌సర్కారు గ్రాఫ్‌ ‌దూసుకెళుతోంది. హైడ్రా పని తీరు మీద ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు మాత్రమే కాదు.. పాలకులు సైతం ఫోకస్‌ ‌చేస్తున్నారని చెబుతున్నారు. హైడ్రా వ్యవస్థ ఏర్పాటు వివరాల్ని తమకు షేర్‌ ‌చేయాలని కోరుతున్న పరిస్థితి ఉందంటున్నారు.

ఇప్పటిదాకా కూల్చేసి ఇప్పుడు ఇలా ప్రకటన :

తొలి రోజుల్లో పెద్దల ఫామ్‌హౌజ్‌లపైనే ఫోకస్‌ ‌పెట్టిన హైడ్రా.. తర్వాత హైదరాబాద్‌ ‌నగరంలోకి ప్రవేశించింది. ప్రధానంగా హైటెక్‌సిటీ, మాదాపూర్‌ ‌ప్రాంతంలోని ఎన్‌ ‌కన్వెన్షన్‌లో అక్రమకట్టడాలను కూల్చివేసింది. ఆ పరిణామంతో హైడ్రాకు మరింత ఇమేజ్‌ ‌వచ్చింది. కొన్నాళ్లపాటు జనంలో హైడ్రా సంచలనం అయ్యింది. ఆ తర్వాత భారీ వర్షాలతో హైద్రాబాద్‌లో కాలనీలకు కాలనీలు నీట మునగడం వంటి పరిణామాలతో హైడ్రా కాస్త విరామం తీసుకుంది. హైడ్రా సిబ్బంది ఆ సహాయక చర్యల్లో తలమునకలైపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ హైడ్రా హడలెత్తించింది. అయితే, ఈసారి నివాస స్థలాలపైనా హైడ్రా కొరడా ఝుళిపించింది. ఈ పరిణామంతో హైడ్రాపై విమర్శలు కూడా మొదలయ్యాయి. చాలామంది స్థానిక, గల్లీ లీడర్లు డబ్బులు తీసుకొని నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలతో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేయించడంతోపాటు.. వాళ్ల దగ్గర నెలవారీ అద్దెలు కూడా వసూలు చేస్తున్న అంశాలు బయటకు వచ్చాయి. దీంతో, విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల తర్వాత హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే నివాసాలు ఉంటున్న ఇళ్లను కూల్చబోమని ప్రకటించారు. హైదరాబాద్‌ ‌నగరంలో చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి ఇళ్లు, వాణిజ్య భవనాలు నిర్మించిన వారిపై కొరడా ఝళిపిస్తున్న హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ‌కొత్తగా వివరణ ఇచ్చారు. ఎఫ్‌టీఎల్‌, ‌బఫర్‌జోన్‌లో వచ్చే కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామని తెలిపారు. బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలో ఇప్పటికే నిర్మించి, అందులో ఎవరైనా నివాసం ఉంటే ఆ ఇళ్లను పడగొట్టబోమని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రం కూల్చేస్తామని రంగనాథ్‌ ‌స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్‌, ‌బఫర్‌జోన్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు, భూమి కొనుగోలు చేయవద్దని కూడా సూచించారు. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటినీ కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన చాలామందికి ఊరట నిచ్చింది.

ఇన్నాళ్ల కూల్చివేతలకు బాధ్యులెవరు?

హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌తీరిగ్గా చేసిన ఈ ప్రకటన విమర్శలకు తావిస్తోంది. ఇన్నాళ్లుగా పలు నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. దాదాపు మూడు దశాబ్దాలుగా నివసిస్తున్న వారి ఇళ్లను కూడా కూల్చేసింది. కొన్ని అపార్ట్‌మెంట్లు, విల్లాలను కూడా నేలమట్టం చేసింది. వాళ్ల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అయోమయంగా మారింది. ఇప్పుడు తాపీగా ప్రజలు ఇప్పటికే ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న వాటిని కూల్చేయబోమని, కొత్తగా కడుతున్నవాటిని, వాణిజ్య అవసరాలకు వాడుతున్న వాటిపైనే కొరడా ఝుళిపిస్తామని చేసిన ప్రకటన.. వివాదాస్పద మయ్యింది. కానీ, ఆ ప్రకటన చేసిన రోజే.. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణల కూల్చివేతలు కొనసాగాయి. ప్రధానంగా మాదాపూర్‌ ‌సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌ల•ని నిర్మాణాలను నేలమట్టం చేశారు.మూడంతస్తుల ఇల్లు సహా ఐదు అంతస్తుల భవనం కూల్చివేశారు. వీటికి తోడు ఎఫ్‌టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌లో ఏర్పాటు చేసిన 15 షెడ్లు, 20కిపైగా గుడిసెలు, ఒక హోటల్‌ను కూడా హైడ్రా ఆఫీసర్లు తొలగించారు.

హైడ్రా కార్యాచరణపై నీలినీడలు

మరోవైపు.. హైడ్రా పనితీరుపై, కార్యాచరణపై నీలినీడలు అలుముకున్నాయి. హైడ్రా అమలులోకి వచ్చినప్పటినుంచీ తెలంగాణలో నేతల ఫామ్‌హౌజ్‌ల గొడవ నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను తీసుకురావడంతో పోలిటికల్‌ ‌హీట్‌ ‌పెరిగింది. హైదరాబాద్‌ ‌చుట్టుపక్కల భూములన్నీ బంగారుబాతు గుడ్లే. ఎకరం వంద కోట్ల పై మాటే. ఈ నేత ఆ నేత అని కాదు.. అధికారంలో ఎవరుంటే వారు బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌ ‌భూముల అన్ని చుట్టేశారు. నేతల కబ్జాలతో కొండలన్నీ కరిగిపోయాయి. చెరువులన్నీ వట్టి పోయాయి. అయితే రియల్‌ ఎస్టేట్‌ ‌ప్లాట్ల దందా, లేకపోతే ఫామ్‌హౌజ్‌ల నిర్మాణాలు. అన్ని పార్టీల నేతల తీరు ఇదే. ఇప్పుడు ‘నువ్వు దొంగ అంటే నువ్వు దొం•’•• అనుకుంటున్నారు. అది నాది కాదు.. నా దోస్తుదంటున్నారు. నాది సక్రమమే నీదే అక్రమమంటున్నారు. ఫస్టు నీ ఫామ్‌హౌజ్‌ ‌కూల్చాలని ఒకరు, మొదలు నీదే కూల్చాలని ఇంకొకరు ఇలా మాటలతో టైం పాస్‌ ‌చేస్తున్నారు. కౌంటర్లిచ్చు కుంటూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. కేటీఆర్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కేవీపీ, గడ్డం వివేక్‌, ‌మధుయాష్కీ, పట్నం మహేందర్‌రెడ్డిల ఫామ్‌హౌజ్‌ ‌లన్నీ అక్రమంగా నిర్మించినవే అన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు హైదరాబాద్‌ ‌శివారుల్లోని ఫామ్‌హౌజ్‌లను వదిలి.. నగరంలోని చెరువులు, నాలాల ఆక్రమణలపై హైడ్రా పడిపోయింది. పైగా.. కమినర్‌ ‌రంగనాథ్‌ ‌చేసిన తాజా ప్రకటన కూడా సందిగ్ధానికి కారణమయ్యింది. ఇప్పటికే నివసిస్తున్న వాళ్ల నిర్మాణాలు కూల్చేయబోమని చెప్పడంతో.. ఇక ఫామ్‌హౌజ్‌ల జోలికి కూడా వెళ్లరా? అన్న చర్చ కూడా మొదలయ్యింది. ఈ క్రమంలో హైడ్రా తొలి నాళ్లలో దూకుడు కొనసాగిస్తుందా? మొదట్లో మాదిరిగానే సుత్తిలేకుండా సూటిగా పనిచేసుకు వెళ్తుందా? లేదంటే దారి తప్పి ముందుకెళ్తుందా? అనేది చూడాలి.

– సుజాత గోపగోని

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 

About Author

By editor

Twitter
YOUTUBE