– డా అమ్మిన శ్రీనివాసరాజు, 7729883223

సాహితీ పక్రియల్లో అన్నిటికి మిన్నగా నిలిచేది కథా పక్రియ. అనుభూతి మాత్రమే కాదు, అనుభవాన్ని, చైతన్యాన్ని, స్ఫూర్తిని, ఆత్మస్థైర్యాన్ని అందించగల సత్తా కథా పక్రియ సొంతం. గురజాడ నుంచి నేటితరం రచయితల వరకు ఎందరో తెలుగు కథను శిఖరాయమానంగా తీర్చిదిద్దారు. తెలుగు కథ పురుడు పోసుకున్న విజయనగరంలోనే పుట్టిన శివల పద్మ రాసినవి ‘పసిడికి పన్నీరు పులిమిన’ చందంగా, అసలైన కథా వస్తువుకు అబ్బుర పరిచే శిల్పం సరిజోడితో ఉండే ‘ఆశావాద చైతన్య కథలు.’ పద్మ తెలుగు కథాసీమకు అంతగా పరిచయం లేదేమో అనే కన్నా, రాసినవి రాశిలో కొంచమైన వాసిలో ఘనమైనవి. ఆ కథలకు అంతటి విలువను ఆపాదించినది- చక్కని శిల్పం.

తన కథా ప్రస్థానంలో సుమారు అర్థశతి వరకు కథలు రాసిన పద్మ, ‘ఫలించిన స్వప్నం’, ‘ఎన్నాళ్ళీ మౌనం?’ అనే రెండు కథా సంపుటాలు వెలువరించారు. ఆమె కథల్లో దేశభక్తి, వనవాసి ప్రేమ సమపాళ్లలో కనిపిస్తాయి. రచనలతో కంటే చర్యల పరంగానే సమాజంలో వేగవంతమైన మార్పు తేగలమని దృఢంగా నమ్మిన పద్మ మూడు దశాబ్దాలుగా వనవాసీ కల్యాణ పరిషత్‌ ‌సేవా సంస్థలో పని చేస్తున్నారు. వివిధ హోదాల్లో నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ అడవిబిడ్డల జీవితాలు ఆకళింపు చేసుకున్నారు. ఈ నేపథ్యం వల్లే ఆమె కథల్లో తత్త్వచింతన, భారతీయతత్త్వం అభిమాన విషయాలుగా సాక్షాత్కరిస్తాయి.

 వస్తువు అతి సాధారణమైనది అయినా, శివల పద్మ కథాశిల్పం సాయంతో అసాధారణ కథగా మలుస్తారు. వీరి కథలను రెండు భాగాలుగా విభజించుకుంటే అందులో మొదటివి దేశభక్తియుతమైనవి, రెండో వర్గానివి వనవాసి ప్రజలవి. ‘ఎన్నాళ్ళీ మౌనం?’ అని ప్రశ్నిస్తూ చైతన్య పరిచే కథలు కొన్ని అయితే, ‘‘ఫలించిన స్వప్నం’’ అంటూ లక్ష్యం ఉంటే సాధన సుసాధ్యమే అని నిరూపించి ఆత్మస్థైర్యం పెంచేవి మరికొన్ని. చైతన్యం ఆత్మస్థైర్యం, అనే రెండు దారుల గుండా సాగిన పద్మ కథలు చదువుతుంటే సంభాష ణల సాయంగా శిల్పం తోడుగా విషయం కళ్ల ముందు కదలాడి చిత్రం చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

చైతన్య పూరిత కథల సరసన చేరేవి ‘ఎన్నాళ్ళీ మౌనం?’, ‘వెంటాడే వాస్తవం’, ‘గుణపాఠం’, ‘హామీ’, ‘పాజిటివ్‌ ‌థింకింగ్‌’, ‘ఆరోజు వస్తుంది’, ‘చూసే వాళ్లంతా ఎందుకు చూస్తారో?’, ‘పిడికెడంత గుండెలో’, ‘శిలాక్షరాలు’, ‘తప్పటడుగు’ ఉంటాయి.

కొత్త సహస్రాబ్ది మొదటి దశకంలో మన ఆధునిక సమాజ పోకడలు బహు చిత్రం. ప్రాచీన విధానాలతో సంతృప్తి చెందలేనితనం, సౌకర్యాలు ఉన్నా వాటి దరిచేరలేని ఆశనిరాశల సమయం. ఒకరకంగా అది ప్రాచీన ఆధునిక కాలాల సంధి యుగం. రచయిత్రి ఆలోచనలు సహజంగా ఆధునికత వైపే దూసుకు పోతున్నప్పటికీ, సమాజ పరిస్థితులు అందుకు సిద్ధంగా కనిపించడం లేదు. మనిషిలో ఎంత ఆధునీకరణ కనిపించినా, ఆలోచనలు మాత్రం అత్యంత హేయంగా, చేష్టలు మృగాలను పోలి ఉంటే ఇక మానవజాతిని దేనితో పోల్చాలి? అన్న ఆలోచ నలకు ప్రతిరూపం ‘అదేప్రశ్న’ కథ. దీనిలో తరత రాలుగా స్త్రీలు అనుభవిస్తున్న అవమానాలు, బాధలు చూపిస్తూ, ఒక ప్రశ్న లేవదీశారు. స్త్రీ విద్యాపరంగా, ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ కాలంలో కూడా, ఒక తరంలో విద్యకు నోచుకోని స్త్రీ పడ్డ పాట్లే పడటం ఏమిటి? అంతర్గతంగా స్త్రీ చైతన్యాన్ని ఇందులో రచయిత్రి ఆవిష్కరించారు. స్త్రీ పురుష సంబంధాలు, అంతరాల తీరుపై వైవిధ్యంగా చెప్పిన కథ ‘తప్పటడుగు’. మనుషుల మనసుల కలయిక, ప్రేమానుబంధాలకు వయోభేదం తగదనే భావాన్ని ఈ కథలో వివరించే ప్రయత్నం చేశారు.

నిత్యం సమాజ కార్యంలో మమేకం కావడం, సేవాభావంతో మెలగడమనే సహజ గుణాలు ఉన్న రచయిత్రి కాలయాపనకు కారణభూతమైన టీవీల మీద స్పందించకుండా ఎలా ఉంటారు? వాటి మీద ఆమె సంధించిన వ్యంగ్యబాణమే ‘చూసేవాళ్లంతా ఎందుకు చూస్తారో?’ కథ. అంతర్ధానమవుతున్న లేఖల సంస్కృతి గురించి విచారం ప్రకటిస్తూనే, లేఖా రచన ప్రయోజనాల గురించి వివరించిన కథ ‘నీ లేఖ కోసం’. మానవ సంబంధాలను పర్యావరణంతో అన్వయించి అందంగా చెప్పిన కథ ‘పిడికెడంత గుండెలో’.

 పద్మ దృష్టిలో దేశభక్తి అంటే జాతీయ పర్వదినాల్లో త్రివర్ణ పతాకానికి వందనం చేయడం, స్వాతంత్ర పోరాటంలో అమరులైన దేశభక్తులను స్మరించుకొని గౌరవించడం, నేడు దేశ రక్షణలో భాగస్వాములవుతున్న జవాన్లను అభిమానించి ఆదరించడం మాత్రమే కాదు. సాటివారికి సాయపడటంలోనూ దేశభక్తి ఉందని నిరూపించే యత్నం చేశారు రచయిత్రి. సామాజిక అంశాలే ఇతివృత్తంగా తీసుకున్నా, కుటుంబ నేపథ్యాలతో కథలు చెప్పినా వాటిని తనదైన దేశభక్తి భావనతో సింగారించారు శివల పద్మ.

గురువు విలువను చాటి చెప్పిన కథ ‘ఫలించిన స్వప్నం.’ స్త్రీశక్తినీ తల్లి ప్రేమనూ ఆవిష్కరించే కథలు ‘న ధైర్యం న పలాయనం’, ‘అమ్మ మనసు.’ సాంస్కృతి వల పునాదిగా సంఘటిత కార్యానికి స్ఫూర్తిని పంచే కథలు, ‘యువత చేజారితే’, ‘చేయి చేయి కలిపి’. ఆశా, తృప్తి సమపాళ్లలో ఉన్నప్పుడు అవి జీవిత గమనానికి ఎంత చక్కగా ఉపయోగ పడతాయో చెప్పిన కథ ‘ఆనందం’. అలాగే ఆనందించే తీరు, ఆనందం విలువ తెలియ చెప్పినది ‘లక్ష్యం’ కథ. సమాజానికి మానవ సంబంధాల ఎంత అత్యవస రమో విశ్లేషించిన అందమైన కథ ‘ఏది తన పాలు? ఏది గంగపాలు?’. ఇలా ప్రతి కథలో విలు వైన అర్థం, పరమార్థం కలసి ఉండటమే కాక చదివిన సంతృప్తిని కూడా అందించే మంచి కథలు ఇవి.

మానవజాతికి మూలవాసులని చెప్పుకునే ఆదివాసుల జీవన నేపథ్యంతో రాసిన కథలు అడవిబిడ్డల మీద రచయిత్రికి గల గౌరవాభిమా నాలను వెల్లడిస్తాయి. ‘మానవత్వం’, ‘నిజం’, ‘సీత కథ’, ‘యద్భావం తద్భవతి’ వంటి కథల్లో అచ్చంగా గిరిజన జీవితాలను వివరించారు. అదే సమయంలో ఆధునికకాలంలో స్వార్థపరుల చెరలో అడవిబిడ్డలు అనుభవిస్తున్న అష్ట కష్టాలను ఆవిష్కరించారు. ఇంకా, వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించే ప్రయత్నం చేశారు, ఆత్మస్థైర్యానికి విలాసమనదగ్గ పద్మ.

సాధారణంగా గిరిజనులు సంస్కృతీ సంప్ర దాయాలన• జవదాటరు. అలాగే బలీయమైన వారి నమ్మకాలే ఒక్కోసారి మూఢనమ్మకాలుగా రూపాం తరం చెంది ఇబ్బందులు తెస్తాయి. ఆ విషయంలో వారిని చైతన్యపరచాల్సిన గురుతర బాధ్యత మాన నీయ విలువల పట్ల విశ్వాసం కలిగిన వారందరిదీ నన్న భావన రచయిత్రి తన కథలతో ఆవిష్కరించారు. ఆడపిల్లలను అమ్మడం అనే అలవాటు లంబాడా గిరిజనుల్లో కనిపిస్తుంది. అదంతా వారి ఆర్థిక వెనుకబాటుతనం వల్ల కావచ్చు, మరో కారణమూ ఉండి ఉండవచ్చు. ఏదైనా ఆ ధోరణి తప్పు అని ఒప్పించడమే కాదు, తల్లీబిడ్డల పేగుబంధం విలువ, మానవ సంబంధాలతో ముడిపెట్టి చెప్పడం వెనుక రచయిత్రిలోని మాతృమూర్తి ప్రభావం అయి ఉండాలి. ‘సీత కథ’లో ఈ మాతృప్రేమను పాఠకులు చవిచూస్తారు. గిరిజనుల మంచితనాన్నీ, మాట తప్పని గుణాన్నీ ఆసరా చేసుకుని స్వార్ధ మతశక్తులు కొందరు అడవిబిడ్డలను ఎలా మతం మారుస్తున్నారో చెబుతూనే, అలాంటి సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చైతన్యవాద దృక్పథంతో చెప్పిన కథలు ‘మానవత్వం’, ‘యద్భావం తద్భవతి’.

యద్భావం… కథలో చుక్క అనే గిరిజన యువతి సాధారణ స్థితి నుంచి గొప్ప లక్ష్యంతో, కృషి పట్టుద లతో ఎంతో ఎత్తుకు ఎదిగి తనవారి అభివృద్ధి కోసం కంకణం కట్టుకుంటుంది. ఈ కథాంశం నేటి గిరిజన విద్యావంతులందరికీ ఆదర్శం. ‘హిందూ సంస్కృతిలో అంతర్భాగమైన గిరిజన సంస్కృతిని అడవి అంతటా చాటుతాను…’ అనే మాటలు చుక్కి నోటితో చెప్పించినా.. అవి అక్షరాల రచయిత్రి మాటలే.

గిరిజన సంస్కృతిని కాపాడటం అంటే వారికి ఆధునిక సంస్కృతి అంటకుండా చేయడం కాదు. వారిని వారిలా జీవించేటట్టు చేస్తూనే సాయపడుతూ వారు నచ్చిన, మెచ్చిన తీరులో బతికేందుకు అవకాశం కల్పించాలి. అదే ఉత్తమ గిరిజన వికాస మనే విషయాన్ని రచయిత్రి తనదైన కొత్త కోణంలో ఆవిష్కరించారు, ‘నిజం’ కథలో. ప్రతి కథలో ఒక సామాజిక అవసరాన్ని చూపించడమే గాక అంతర్గ తంగా ఆత్మవిశ్వాసం రంగరించి అందమైన శిల్పంతో మానవతా విలువలు గుండా రచనను నడిపించిన తీరు అపురూపం, ఆదర్శనీయం.

కథల ప్రత్యేక లక్షణాలని చెప్పే ఊహించని మలుపులు, ముగింపులు, శివల పద్మ కథలు బాగానే కనిపిస్తాయి. పాఠకులకు అనిర్వచనీయమైన అనుభూతినీ, సంతృప్తినీ అందిస్తాయి. మాతృభాష పట్ల మమకారం, అచ్చ తెలుగు పదాలు పొందు పరచడం ఆ కథలకు అదనపు ఆకర్షణలు. చక్కని కథాశిల్పి పద్మ కలం నుంచి మరెన్నో కథాశిల్పాలు వెలుగు చూడాలని ఆశిద్దాం.

వ్యాసకర్త: తెలుగు ఉపన్యాసకుడు,

ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాల, వాజేడు.

About Author

By editor

Twitter
Instagram