భారత రాజ్యాంగాన్ని ఎంతటి సమున్నత స్థానంలో ఉంచాలో నేటితరం ఇంకొంచెం తెలుసుకోవలసిన అవసరం ఉందనిపిస్తుంది. రాజ్యాంగ రచన బాధ్యతను నిర్వర్తించినవారికి సరే, దాని ఫలితాలను అనుభవిస్తున్నవారికీ దాని ఔన్నత్యం తెలిసి ఉండాలి. అది నేటితరానికి హక్కులను, బాధ్యతలను గుర్తు చేసేది మాత్రమే కాదు. పురాతన భారత మేధస్సుతో వర్తమానతరం సంభాషించేదని నాటి రాజ్యాంగకర్తలు భావించారు. దాని ఫలితమే అసలు రాతప్రతికి నందలాల్‌ ‌బోస్‌ ‌చేసిన అలంకరణ. ప్రతి ప్రకరణానికి బోస్‌ ‌వేసిన బొమ్మలు హరప్పా, సింధు సంస్కృతి, రామాయణ భారతాలు ఇచ్చిన సందేశాన్ని ఆ అలంకరణ ద్వారా అందించారు. ధర్మం అనే అపురూపమైన తాత్త్వికత అర్ధమయ్యేటట్టు చేయడానికి ఆ అలంకరణలో గొప్ప కృషి జరిగింది. దీని కొనసాగింపు, ‘శ్రీఅరబిందో అండ్‌ ‌ది కానిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇం‌డియా’ కాఫీ టేబుల్‌ ‌పుస్తకం.

అరవిందుల ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక దృష్టి అనితర సాధ్యమైనది. రాజ్యాంగంలోని ప్రతి ప్రకరణంలోని సారాంశానికి అనుగుణంగా అరవిందుని రచనలలో కొన్ని వ్యక్తీకరణలు ఉన్నాయి. వాటినే కొన్ని అధ్యాయాలకు ముందు పొదిగి అందించిన పుస్తకమిది. మొదటి రెండు ఉటంకింపులలో రెండోదీ, పక్కన ఉన్న రాజ్యాంగం ముఖచిత్రానికి ఒక తాత్త్విక బంధమే కనిపిస్తుంది. ‘ఎన్ని బలహీనతలైనా ఉండవచ్చు గాక, జాతీయత అనే సమున్నత భావనకు గీటురాయి దేశ భవిష్యత్తు పట్ల అచంచలమైన విశ్వాసం ఉండడమే’ అంటుందా ఆ ఉటంకింపు. రాజ్యాంగ నిర్మాతల ఆశయం ఇదే కదా! తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి. స్వేచ్ఛ, సమత్వం, సౌభాత్రం అనే మాటలతో ఉంటుంది రాజ్యాంగ పీఠిక. ఆ మూడు సమున్నత భావనల విలువ, ఆ మూడు పదాల చరిత్రను వివరిస్తూ అరవిందుల సంపూర్ణ రచనల నుంచి తీసుకున్న ఒక పేరాను ఇచ్చారు. మొదటి భాగం (ది యూనియన్‌ అం‌డ్‌ ‌టెరిటరీ)కి నందలాల్‌ ‌వేసిన బొమ్మ- మొహెంజదారో తవ్వకాలలో దొరికిన అద్భుతమైన ఎద్దు బొమ్మ ముద్రిక. నిజానికి వ్యవస్థను పాలించేది నైతిక, సామాజిక, న్యాయ, సంప్రదాయికంగా వస్తున్న న్యాయం కలగలసిన ధర్మమేనని, రాజు కంటే ఇవే గొప్పవని చెబుతూ అరవిందులు చెప్పిన మాటను ఈ ప్రకరణానికి ఇవ్వడం అద్భుతమే. మూడో అధ్యాయం ‘ప్రాథమిక హక్కులు’ ముందు రామాయణంలోని పాత్రల ఆత్మలను ఆవిష్కరించే ఒక పేరాను ఇచ్చారు. ఆదేశికసూత్రాలకు భారతంపై రాసిన వ్యాఖ్యాన భాగాన్ని ఇచ్చారు.

ఒక పక్క రాజ్యాంగం మూల ప్రతిలోని పుటనూ, పక్క పేజీలో  ఆ శీర్షికకు సంబంధించి నందలాల్‌ ‌వేసిన చిత్రంతో పాటు, అరవిందుల వ్యాఖ్యనూ ప్రచురించడం అపురూపంగా అనిపిస్తుంది. ఈ పుస్తకం చదవడం వల్ల అరవిందుల సమున్నత తాత్త్విక రాజకీయ చింతనతో కాస్త పరిచయమే కాదు, రాజ్యాంగకర్తలు పురాతన భారతంలోని స్మృతికర్తలను ఎంత బాగా అధ్యయనం చేశారో, అవసరమైన మేరకు ఎలా తీసుకున్నారో కూడా అర్ధమవుతుంది. ఇలాంటి పుస్తకం ప్రచురించాలన్న ఆలోచనతోనే శ్రీఅరబిందో సొసైటీ ఔన్నత్యం బోధపడుతుంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల సందర్భం,  అరవిందుల 150వ జయంతి ఏకకాలంలో రావడం, ఆ గొప్ప సందర్భాన్ని ఇలాంటి పుస్తకంతో అలంకరించడం ఎంతో సముచితంగా ఉంది. ఆఖరిగా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న వార్త విన్న తరువాత తనకున్న ఐదు కలల గురించి అరవిందులవారు తెలియచేశారు. వాటిని కూడా ఇందులో ఇచ్చారు. తన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో భారత్‌ ఓ ‌కొత్త ప్రపంచాన్ని నిర్మించాలని కోరుకున్నారు. భారత్‌ ‌స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినా  అదింకా ఐక్యతను సాధించవలసి ఉందని ఆయన చెప్పడంలో గొప్ప ఆంతర్యమే ఉంది. హిందూ-ముస్లిం సమస్య, అణగారిన వర్గాల స్వేచ్ఛవంటి విషయాల గురించి ఆయన ఎంత ఆలోచించారో ఇందులో తెలుస్తుంది. ఈ పుస్తకం చదవడం నేటితరం బాధ్యతలలో ఒకటి.

ప్రతులకు : సొసైటీ హౌస్‌ ‌నెం. 11, మార్టిన్‌ ‌స్ట్రీట్‌, ‌పుదుచ్చేరి-605 001

About Author

By editor

Twitter
Instagram