ఏప్రిల్‌ 13 ‌ప్రాణహిత పుష్కరాలు

దేశంలో ఎన్నో నదులు, ఉపనదులు ఉన్నా జీవనదులైన కొన్నిటికే పుష్కరాలు వస్తాయి. అలాంటి వాటిలో ‘ప్రణీత’ (ప్రాణహిత) ఒకటి. గోదావరి ఉపనదులలో ప్రధానమైన ప్రాణహిత పుష్కరాలు గురువు (బృహస్పతి) మీనరాశిలో ప్రవేశించడంతో ఏప్రిల్‌ 13‌న ప్రారంభమవుతాయి. దక్షిణ భారత•దేశంలో పుష్కరయోగం గలిగిన మరో ఉపనది ఇది (కృష్ణా ఉపనది తుంగభద్రకు గత ఏడాది పుష్కరాలు జరిగాయి). ప్రతి రాశికి ఆయా నదీ పరీవాహక ప్రాంతాలపై ఆధిపత్యం ఉంటుంది. ఆ క్రమంలోనే మీనరాశికి ప్రాణహితపై ఆధిపత్యం ఉంటుంది.

కడిమి చెట్టు పన్నెండేళ్లకు ఒకసారి పూస్తుంది. జీవనదులకు పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కనుక పుష్కరం మహా పర్వదినం. పుష్కరుడు అంటే పుణ్యజలమనీ అర్థం చెబుతారు. అంటే ఆయన నివాసం ఉన్నంత కాలంలో ఆయా నదులు మరింత పుణ్యదాయినిలుగా భావిస్తారు. గురువు (బృహస్పతి) గ్రహం ఏడాదికి ఒక రాశి వంతున పన్నెండు రాశలను పన్నెండేళ్లలో చుట్టివస్తుంది. అలా ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఆ నదికి మహత్వం కలుగు తుందంటారు. అప్పుడు ఆ నదికి పుష్కరాలు వచ్చినట్లు.

పుష్కరాల ఆవిర్భావ నేపథ్యాన్ని స్మరించుకుంటే.. సృష్టి ఆరంభంలో తుందిలుడు అనే గంధర్వుడు ఘోరతపస్సుతో పరమేశ్వరుడిని మెప్పించాడు. ఈశ్వరుడిలో శాశ్వతస్థానం పొందేలా వరం కోరగా, తథాస్తు అన్న పరమేశ్వరుడు, తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో తుందిలుడికి శాశ్వత స్థానం కల్పించాడు. అలా మూడున్నర కోట్ల తీర్థాలకు అధిపతి, జలాధిపతి అయినందున పుష్కరుడయ్యాడు.

పురాణాల ప్రకారం…

సృష్టి నిర్మాణ క్రమంలో బ్రహ్మకు జలంతో అవసరం ఏర్పడి శివుడి వద్ద నుంచి జలాధికారి పుష్కరుడిని గ్రహిస్తాడు. దాంతో పుష్కరుడు విధాత కమండంలో ప్రవేశిస్తాడు. కాగా సకల జీవరాశిని పునీతం చేసేందుకు, అందుకు జీవనాధారమైన జలం ఇవ్వాలని బ్రహ్మదేవుడిని బృహస్పతి అర్థించాడు. అయితే ఆ కమండలాన్ని వీడేందుకు పుష్కరుడికి మనస్కరించలేదు. చివరికి విధాత వారిద్దరి మధ్య సానుకూల ఒప్పందం కుదుర్చుతాడు. ఆ ప్రకారం, బృహస్పతి ఒక నది నుంచి మరో నదికి మారేటప్పుడు పన్నెండు రోజులు, ఏడాది చివర బృహస్పతి మరో నదికి మారేటప్పుడు పన్నెండురోజులు పుష్కరుడు ఆయనను అనుసరించి ఉండేలా అవగాహన కుదురుతుంది. ఏడాదిలో మిగిలిన రోజులలో ప్రతిదినం మధ్యాహ్నం రెండు ముహూర్తముల (నాలుగు గడియలు) సమయం మాత్రమే బృహస్పతితో ఉండి, మిగతా కాలమంతా తన కమండలంలోనే ఉండేలా పుష్కరుడిని బ్రహ్మ ఒప్పించాడు. అలా బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఆ ప్రకారం మేషంలో (గంగ), వృషభం (రేవ), మిథునం (సరస్వతి), కర్కాటకం (యమున), సింహం (గోదావరి), కన్య (కృష్ణా), తుల (కావేరి), వృశ్చికం (భీమారథీ), ధనుస్సు (బ్రహ్మపుత్ర), మకరం (తుంగభద్ర), కుంభం (సింధు), మీనం (ప్రాణహిత).. ఇలా పుష్కరాలు వస్తుంటాయి. పుష్కరుడితో పాటే సమస్త దేవతలు, రుషులు, ఇతర నదీమ దేవతలు కూడా ప్రవేశిస్తారని, పుష్కరాల విశిష్టతకు అదీ ఒక కారణమని చెబుతారు.

‘ప్రాణహిత’ ఆవిర్భావం

జనం నీటి కడగండ్లను తీర్చేందుకు బ్రహ్మదేవుడు తన వద్ద ‘ప్రణీత పాత్ర’ (య్ఞపాత్ర) నుంచి జలాన్ని సృష్టించాడు కనుక ఆ నదికి ప్రాణహిత అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ నది వింధ్య పర్వతాలలో ఆవిర్భవించింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి, తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాల సరిహద్దులో ప్రవహించే ఇది గోదావరి ఉపనదులలో అతి ముఖ్యమైనది. చెన్నూర్‌ ‌వద్ద గోదావరిలో కలుస్తుంది. దీనికి వార్ధా, వెయిన్‌ ‌గంగా అనే ఉపనదులు కలుస్తున్నాయి. 113 కిలోమీటర్ల మేర ఈ నది ప్రవహిస్తోంది. మొత్తం మీద గోదావరిలో ప్రవహించే జలాల్లో ప్రాణహిత నుంచి వచ్చేది 40 శాతం వరకు ఉంటుంది. దానిని ‘దక్షిణ గంగోత్రి’ అనీ వ్యవహరిస్తారు. ఈ నదీ పరీవాహక ప్రాంతంలో వేములవాడ రాజరాజేశ్వస్వామి, కొండగట్టు ఆంనేయ స్వామి ఆలయాలు ప్రసిద్ధమైనవి.

ఈ నదీ తీరంలోని మరో ప్రసిద్ధ క్షేత్రం కాళేశ్వరం. కాళేశ్వరస్వామి, ముక్తీశ్వరస్వామి వార్లు ఒకే పానపట్టంపై ప్రతిష్ఠితులు కావడం విశేషం. కాళేశ్వర, ముక్తీశ్వర లింగాలను యమధర్మరాజు, బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించారని పురాణవాక్కు. కాళేశ్వరంలో మహా సరస్వతి కొలువుదీరారు. బాసరలో శారదాదేవి జ్ఞాన సరస్వతిగా పూజలందు కుంటుండగా, కాళేశ్వరంలో మహాసరస్వతిగా, ప్రౌఢ సరస్వతిగా ఖ్యాతినొందారు.

పుష్కర విధులు

‘జన్మప్రభృతి యత్పాతం స్త్రియావా పురుషైనవా

పుష్కరేత్‌ ‌స్నాన మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి’..  పుట్టినప్పటి నుంచి సంక్రమించే పాపాలు తొలగి పోవాలంటే పుష్కర సమయంలో నదీస్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. ఏ నదిలోనైనా బృహస్పతి ఏడాది పొడవునా ఉన్నా, తొలి పన్నెండు రోజులు, తుది పన్నెండు రోజులు శ్రేష్ఠతరమైనవని చెబుతారు. వాటినే ఆది, అంత్య పుష్కరాలని అంటారు. ముఖ్యంగా.. పుష్కర స్నానం సమయంలో పాటించవలసిన క్రమశిక్షణను, విధినిషేధాలను శాస్త్రం నిర్దుష్టంగా చెప్పింది. ఒడ్డున ఉన్న మృత్తికను (మట్టిని) లేదా పసుపును తీసుకొని నీటిలో వదిలిన తరువాతే స్నామమాచరించాలి. శాస్త్రానుసారం జపం, హోమం, అర్చన, దానం, పితృతర్పణం వంటివి చేయాలి. పుష్కర సహితుడైన బృహస్పతి, ముక్కోటి దేవతలు, పితృదేవతలు నదిలో ఉంటారని పురాణవచనం. పితృదేవతలు అంటే జన్మనిచ్చిన వారో, వంశంలోని పెద్దలో కారని, దేవగణాల మాదిరిగానే పితృగణాలు 33 ఉన్నాయని ప్రవచనకర్తలు చెబుతారు.

పుణ్యస్నానం అంటే మునకలు వేయడమే కానీ ఈతగొట్టడం, జలకాలాటలు కాదు. నీటిలో ఉమ్మకూడదు. పాదరక్షలతో నీటిలో దిగకూడదు. మలమూత్ర విసర్జన చేయకూడదు. వస్త్రాలను శుభ్రపరచకూడదు. నిద్రా సమయంలో ధరించిన దుస్తులతో కాకుండా శభ్రమైన వస్త్రాలను ధరించి స్నానం చేయాలి. పుష్కరస్నానం వేళ ‘శంనో దేవీరభీష్టయ ఆపోభవంతు పీతయే/శంయోరభి స్రవస్తునః’ (దివ్యములైన ఈ జలాలు మంగళకరములై మా అభీష్టములును నెరవేర్చుగాక! తాగేందుకు అనువైన నీటిని ఇచ్చుగాక! నీరు మా వైపు ప్రవహించుగాక) అని రుషిప్రోక్తమైన జలదేవతా ప్రార్థన చేస్తారు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram