డిసెంబర్ 13. ఢిల్లీ ఎర్రకోట ప్రాంతం ఒక్కసారిగా ‘వందేమాతరం, జైహింద్, భారత్‌మాతా కీ జై’ నినాదాలతో మార్మొగింది. భారతీయ సాంస్కృతిక సంప్రదాయా నికి, తరతరాల జీవన విధానానికి అత్యంత అరుదైన గౌరవం దక్కిన సందర్భమది. భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాలతో జరుపుకునే ‘దీపావళి’ పర్వదినానికి ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. యునెస్కో ‘మానవ సంస్కృతికి చెందిన వారసత్వ జాబితా/సాంస్కృతిక వారసత్వ (Intangible Cultural Heritage) జాబితాలో చేర్చడం ద్వారా, దీని విశిష్టత విశ్వవ్యాప్తమైంది. ఈ పర్వదినానికి ఈ గుర్తింపు లభించడం భారతీయ సనాతన ధర్మానికి, సంస్కృతికి దక్కిన విశ్వవ్యాప్త ఆమోదంగా భావిస్తున్నారు. వారసత్వ సంపద అంటే కేవలం కట్టడాలు, నిర్మాణాలే కాదు. అమూర్త వారసత్వం అంటే భవనాలు, కట్టడాలు కాదు. తరతరాలుగా ప్రజలు పాటిస్తున్న ఆచారాలు, పండుగలు, కళలు, నైపుణ్యాలు కూడా.
కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే పండుగ దీపావళి. కేవలం ఒక మతపరమైన ఉత్సవంగానే కాకుండా, మానవతా విలువలకు, ఆశావాదానికి ప్రతీకగా నిలిచే దీనికి యునెస్కో గుర్తింపు రావడం ప్రతి భారతీ యుడికి గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దీపావళిని జరుపుకుంటున్నప్పటికీ, యునెస్కో ఆమోదముద్రతో అధికారిక హోదా దక్కినట్లయింది. దీనివల్ల విదేశీ పర్యాటకులు, మన సంస్కృతిని ప్రత్యక్షంగా వీక్షించడానికి అవకాశం ఉంటుది. ప్రధానంగా అయోధ్యలో జరిగే ‘దీపోత్సవం’, వారణాసిలో ‘దేవ దీపావళి’ లాంటి వేడుకల వీక్షణకు అంతర్జాతీయ పర్యాటకుల రాక గణనీయంగా పెరుగుతుందని, ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని ఆర్థికనిపుణుల అంచనా.
దీపావళి అంటే కేవలం బాణసంచా కాల్చే పండుగే కాదు. రామాయణభారతగాథలతో ముడిపడి చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక. శ్రీరాముడు వనవాసా నంతరం అయోధ్యకు తిరిగి రావడం; దుష్టశిక్షణ, శిష్టరక్షణ సూత్రంపై శ్రీకృష్ణుడు నరకా సురుడిని హతమార్చడం ఈ పండుగకు నేపథ్యం. అలాగే లక్ష్మీపూజ మరో ప్రధానాంశం. ఈ పూజ ద్వారా సిరిసంపదలను ఆహ్వానించడం హిందూ సంప్రదాయంలో భాగం. వ్యాపారులు తమ కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభించడానికి ఈ రోజును పవిత్రంగా భావిస్తారు. ఈ వారసత్వ సంపద జాబితాలో ఇప్పటివరకు గల 15 భారతీయ అంశాల సంఖ్య తాజాగా దీపావళి చేరికతో 16కి పెరిగింది. శారీరక, మానసిక ఆరోగ్యానికి మన పూర్వికులు అందించిన యోగా(2016), ప్రపంచంలోనే అతిపెద్ద కుంభమేళా(2017),పశ్చిమ బెంగాల్‌లో అత్యంత వైభవంగా జరిగే దుర్గాపూజ(2021), పార్సీల నూతన సంవత్సర వేడుక నవ్రోజ్ వంటివి ఈ జాబితాకు ఎక్కాయి. రంగోలి (కుటుంబ ఆచారాలు), చక్ లెమా (ఉత్తరాఖండ్), రామమణి (కర్ణాటక్),9. నవరాస పురుష లాంటి అంశాలు ఇప్పటికేఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
హిందువులు, సిక్కులు, జైనబౌద్ధులు దీపావళిని భిన్నరీతులలో జరుపుకుంటాయి. సిక్కులు దీపావళిని బంద్ చోర్ దివాస్ లేదా ఖైదీల విడుదల దినోత్స వంగా జరుపుకుంటారు. 1619లో ఆరవ సిక్కు గురువు గురు హర్గోబింద్ సాహిబ్ గ్వాలియర్ జైలు నుండి విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకొని దీనిని జరుపుకుంటారు. తనతో పాటు జైలులో ఉన్న మరో 52 మంది హిందూ యువరాజులనూ విడుదల చేస్తేనే తాను విడుదల అవుతానని మొగలు లకు స్పష్టం చేశారని, అలా అంతమంది ప్రాణాలను కాపాడిన మహనీయుడికి నివాళిగా భావిస్తారు.
జైనులకు ఈ పర్వదినం ప్రాముఖ్యమైనది. జైనమత 24వ వరి, తీర్థంకర (ధర్మ రక్షకుడు, ఆధ్యాత్మిక గురువు) మోక్షం, మహావీరుడు జ్ఞానో దయం పొందడాన్ని గుర్తుచేసుకొంటూ దీపావళి జరుపుకుంటారు. అశోకుడు కళింగ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత శాంతి, జ్ఞానోదయం సాధించేందుకు బౌద్ధమతం స్వీకరించాలన్న నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ పండుగను జరుపు కుంటారు. దేశంలో దీపావళిని జరుపుకోవడంలో ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేక సంప్రదాయం, విధానం ఉన్నప్పటికీ, చెడుపై మంచి విజయం సాధించడం అనేది సాధారణ విశ్వాసంగా మిగిలి పోయింది. వారాణిసిలో దీనిని దేవ దీపావళి, దేవతల పండుగ అని వ్యవహరిస్తారు. దేవ దీపావళి రాక్షసుడు త్రిపురాసురుడిపై శివుడు సాధించిన విజయాన్ని కూడా సూచిస్తుంది. ఆ రోజున, దేవీ దేవతలు, పితృ దేవతలు గంగాస్నానానికి దిగి వస్తారని విశ్వాసం.
దేశంలోని చాలా ప్రాంతాల్లో దీపావళి రోజున లక్ష్మీదేవిని; పశ్చిమ బెంగాల్, అస్సోంలో కాళీమాతను పూజిస్తారు. పూలు, మధుర పదార్థాలు, చేపలు, మాంసాన్ని నైవేద్యంగా పెడతారు. గోవాలో గడ్డి, ఎండుగడ్డితో తయారు చేసిన నరకాసురుడి భారీ దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఒడిషాలో దీపావళిని పితృతృప్తి దినంగా పాటిస్తారు. ఆరోజు పూర్వికులు స్వర్గం నుంచి దిగివస్తారనే విశ్వాసంతో జనపనార కర్రలు కాల్చుతూ వారికి ఆహ్వానం పలుకు తారు. కుటుంబాలను ఆశీర్వదించాలని వేడుకుం టారు. ఫిజి, గయానా, మలేషియా, మారిషస్, మయ న్మార్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, సురినామ్ ట్రిని డాడ్, టొబాగోలలో కూడా దీపావళి జరుపుకుం టారు. ఇన్ని విశిష్టతల నేపథ్యంలో యునెస్కో దీపాల పండుగను వారసత్వ పర్వదినంగా గుర్తించింది.
ప్రధాని ప్రశంస
‘దీపావళి మన సంస్కృతి, విలువలతో పెనవే సుకు పోయింది. ఈ పర్వదినానికి లభించిన గుర్తింపుతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీ యులు పులకాంకితులవుతున్నారు. ఈ గుర్తింపుతో ఈ పండుగ ప్రాశస్థ్యం ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుంది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా సామాజిక మాధ్యమంలో స్పందిం చారు. ‘ఇది భారత్‌కు చారిత్రాత్మక రోజు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత సాంస్కృతిక వారసత్వం అంతర్జా తీయస్థాయిలో అపూర్వంగా గుర్తింపు పొందుతోంది’ అని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా పేర్కొన్నారు. దీపావళి వారసత్వ సంపద జాబితాలో చేరడం పట్ల పాకిస్తాన్ దౌత్యవేత్త షోయబ్ సర్వార్ మన దేశానికి అభినందనలు తెలిపారు.
– జాగృతి డెస్క్