– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

దుష్టసంహారానికి ఉగ్రరూపధారియైన నృసింహుడు భక్తుల అభీష్టం నెరవేర్చేందుకు అనేక చోట్ల స్వయంభువుగా వెలిశాడు. అలాంటి ప్రసిద్ధ క్షేత్రాలలో సింహగిరి ఒకటి. తూర్పు కనుమలలో ప్రకృతి సౌందర్యం నడుమ సింహాద్రిపై పశ్చిమాభిముఖుడైన శ్రీలక్ష్మీవరహా నృసింహుడు అశేష భక్తకోటికి ఇష్టదైవం. చైత్ర శుద్ధ ఏకాదశి నాడు కల్యాణం జరిపించుకునే నారసింహుడు వైశాఖ శుద్ధ తదియ నాడు భక్తజనకోటికి నిజరూప దర్శనం అనుగ్రహిస్తాడు. చందనయాత్ర నాడు నిజరూపం దర్శనం వైకుంఠంలో లక్ష్మీనారాయణులను దర్శించినంత ఫలితమని క్షేత్ర మహాత్మ్యం పేర్కొంటోంది.

‘గంగధార సమం తీర్థం క్షేత్రం సింహాద్రి నాసమం

నారసింహ నమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయః’

(సింహాద్రీశుడి సేవకోసం ఉద్భవించిన గంగధార లాంటి తీర్థం లేదు. నృసింహునికి సాటిదైవం త్రిలోకాలలోనూ లేడు. సింహాచలం లాంటి క్షేత్రం లేదని క్షేత్ర మహాత్య్మం.)


క్షేత్రపురాణం ప్రకారం, కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిప సోదరుల సంహరణ అనంతరం ఈ రెండు అవతరాలు (వరహా, నృసింహ) ఒకటిగా శాంతమూర్తిగా దర్శనభాగ్యం కలిగించాలన్న ప్రహ్లాదుడి కోరికను మన్నించిన స్వామి ఈ రూపంలో ప్రభవించారు. తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధ నృసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ రెండు అవతారాలు ఒకే మూర్తిగా అవతరించి అర్చనలు అందుకుంటోంది మాత్రం సింహాచలాధీశుడే. వరహాముఖంతో, మానవ దేహంతో, సింహ వాలంతో ‘శ్రీలక్ష్మీవరహా నృసింహమూర్తి’గా దర్శన మిస్తున్నారు. ఆయన కొలువుదీరిన కొండ కూర్చున్న సింహాకృతిలో ఉండడం వల్ల ‘సింహగిరి, సింహాద్రి’ అని, నృసింహస్వామి వేంచేసిన పర్వతం కనుక ‘సింహాచలం’ అని ప్రఖ్యాతి పొందిందని చెబుతారు.

ప్రహ్లాదుడి అనంతరం స్వామికి అర్చనాదులు లేక స్వామిపై పుట్టవెలిసింది. షట్చక్రవర్తులలో ఒకరైన పురూరవుడు అప్సరస ఊర్వశితో సాగిస్తున్న విమాన యానానికి స్వామి ఉన్న ప్రదేశంలో అంతరాయం కలిగింది. విమానం ముందుకు కదలకపోవడంతో, అక్కడ వరహాస్వామి నెలవై ఉన్నాడని దివ్యదృష్టితో గ్రహించిన ఆమె ఆ సంగతిని చక్రవర్తికి నివేదిం చింది. ఆ రాత్రి పురూరవుడికి స్వప్న సాక్షాత్కారం చేసిన స్వామి, తనను పుట్టనుంచి వెలికితీసి గంధం సమర్పించాలని, వల్మీకం నుంచి వెలికితీసిన రోజునే (వైశాఖ శుద్ధ తదియ) భక్తులకు తన నిజరూప దర్శనం కలుగచేయాలని కూడా ఆదేశించారట. ఆ ప్రకారం, చక్రవర్తి సహస్ర కలశ గంగధారతో, పంచామృతాభిషేకంతో స్వామిని వెలికిదీయించాడట. ఏడాది పొడవునా చందనలేపనంతో నిండి ఉండే ద్వైయరూపుడు ఆ రోజు (‘తదియ’) పన్నెండు గంటల పాటు భక్తులకు నిజరూపంతో కనువిందుచేస్తారు.

చక్రవర్తి స్వామివారికి వజ్రహారాలు సమర్పించి ఉత్సవాలను నిర్దేశించి, నిర్వహించాడు. ఆలయ గోపురాలు నిర్మించి, వేదమూర్తులను రప్పించి వారికి అగ్రహారాలు ఇచ్చి ఆలయనిర్వహణ బాధ్యతను అప్పగించారు. చందన సమర్పణకు స్వామివారి ఆనతి కారణమని స్థలపురాణం చెబుతుండగా, హిరణ్య కశిపుడి వధానంతరం ఉగ్రమూర్తియైన స్వామిని చల్లబరిచేందుకు చందనం సమర్పించారని, అది ఆనవాయితీగా వస్తోందని భక్తజనుల విశ్వాసం.

చందనయాత్ర..

స్వామి నిజరూప దర్శనం రోజు ‘చందనయాత్ర, చందనోత్సవం’గా ప్రసిద్ధి. అక్షయ తృతీయ ముందు నాడు బంగారు గొడ్డలి సహాయంతో స్వామి వారిపై గల చందనాన్ని తొలగిస్తారు. మరునాడు వేకువజామున సుప్రభాత సేవ అనంతరం ఆలయ సమీపంలోని ‘గంగధార’తో సహస్ర కలశాభిషేకం నిర్వహించి నిజరూప దర్శనానికి అవకాశం కల్పిస్తారు. దర్శనానంతరం మళ్లీ అభిషేకం నిర్వహించి 120కిలోల పచ్చి చందనంతో అరవై రకాల వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు కలిపి స్వామికి లేపనం సమర్పిస్తారు. ఇలా మరో మూడు విడతలు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి నాడు మొత్తం 480 కిలోల చందనాన్ని సమర్పిస్తారు. శ్రావణ పూర్ణిమ నాడు మేలిముసుగు కరాళ చందన సమర్పణతో ఈ పక్రియ ముగుస్తుంది.

చందనోత్సవం నాడు సింహగిరి శోభాయమానంగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రంలో వివిధ ఉత్సవాలు జరుగుతున్నా, చందనయాత్రను విశేషంగా పరిగణిస్తారు. ఆ రోజు స్వామి నిజరూప దర్శనానికి ఉవ్విళ్లూరుతారు. ఇక్కడ ఐదుగురు దేవతా మూర్తులు గోవిందరాజస్వామి (ఉత్సవమూర్తి), మదనగోపాల స్వామి (శయనమూర్తి), వేణుగోపాలస్వామి (స్వప్నమూర్తి), యోగ నృసింహ (బలిమూర్తి), సుదర్శనుడు (చక్రపెరుమాళ్‌)‌లకు జరిగే నిత్యర్చనను ‘పంచభేరి’ అంటారు. ప్రహ్లాదుడు అహోబిలంలో అర్చించి సింహగిరి చేరి ముక్తి చెందినట్లే, అక్కడి స్వామిని సేవించిన ఫలితమే ఇక్కడా సిద్ధిస్తుందని జైమిని మహర్షి తెలిపారు.

విజయనగరం పూసపాటి వంశీయులు అనువంశిక ధర్మకర్తలుగా ఉన్న ఈ క్షేత్రాన్ని రామానుజాచార్యులు, చైతన్య ప్రభువు లాంటి ఆధ్యాత్మికవేత్తలతో పాటు శ్రీకృష్ణదేవరాయలు, రెడ్డిరాజులు, చాళుక్య, చోళ రాజులు, వీరకూట పల్లవులు, వేంగీ చాళుక్యులు, కోరుకొండ నాయకులు, కొప్పుల నాయకులు, నందాపుర రాజులు, గాంగులు, వడ్డాది మాత్యులు, జంతరనాటి సురభి, వంశజులు, ఒడిసా గజపతులు తదితరులు దర్శించు కున్నారు. కటకం నుంచి కంచి వరకు పాలించిన అనేక మంది రాజులు, రాణులు స్వామి వారికి భూరి విరాళాలు సమర్పించు కున్నట్లు ఆలయ స్తంభాలపై, ప్రాకార గోడలపై రాతలు తెలియచెబుతాయి.

సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే

సింహచల నివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్‌!!

By editor

Twitter
Instagram