సర్‌ ‌కర్యవాహ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రతినిధి సభకు సమర్పించిన నివేదిక

కీలక నిర్ణయాలు తీసుకునే  రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ అఖిల భారతీయ ప్రతినిధి సభ (మార్చి 11-13) మూడు రోజులు గుజరాత్‌లోని కర్ణావతిలో జరిగింది. పరమ పూజనీయ సర్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌జీ భాగవత్‌, ‌సర్‌ ‌కార్యవాహ మాననీయ శ్రీ దత్తాత్రేయ హొసబలే భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి సమావేశాలను ప్రారంభించారు. 1248 మంది హాజరయ్యారు. సర్‌ ‌కార్యవాహ వార్షిక నివేదికను సమర్పించారు. కరోనా కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటికి కొనసాగింపు కార్యక్రమాల గురించి నివేదికలో పొందుపరిచారు. ఇటీవల మరణించిన ప్రముఖులకు సభ నివాళి ఘటించింది.


రెండేళ్లుగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాయి. కొవిడ్‌ 19 ‌మహమ్మారి ప్రపంచంపై సవాలు విసిరిన సమయంలో మానవాళి సంకట పరిస్థితులను భరించింది. కొవిడ్‌ 3‌వ దశ ప్రభావం చూపకపోవడంతో ఊపిరి పీల్చు కొన్నాం. ఇపుడే పరిస్థితులు చక్కబడుతున్నాయన్న ఆశ చిగురిస్తున్నది. జనజీవనం సాధారణ స్థితికి వస్తున్నది. అందుకే గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ప్రతినిధి సభలో అధికసంఖ్యలో కార్యకర్తలు హాజరు కావడం ఆనందం కలిగిస్తున్నది.

గత సంవత్సరం మన సంఘటనాత్మక (శాఖ) కార్యం, ఉత్సవాల యోజన, కార్యకర్తల శిక్షణ వంటి విభాగాలలో కరోనా ముందునాటి ఉత్సాహం కనబడుతున్నది. తత్ఫలితంగా సంఘ కార్యవృద్ధి జరి గింది అని సర్‌కార్యవాహ మాననీయ శ్రీ దత్తాత్రేయ హొసబలె అన్నారు.

సేవా కార్యక్రమాలు

కరోనా కాలంలో ఆపదలో ఉన్నవారిని ఆదు కోవడానికి స్వయంసేవకులు వెళ్లని ప్రదేశం లేదు. పాలనా యంత్రాంగం వెళ్లగలిగిన ప్రదేశాలేగాదు, వారు వెళ్లలేని మారుమూల లేదా కొండ కోనల్లోని నివాస ప్రాంతాలకు సైతం స్వయంసేవకులు వెళ్లారు. వైద్య సహాయంతోపాటు, వారి ఆకలి తీర్చడానికి తాత్కాలికంగా భోజనం సమకూర్చారు. కొన్ని నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల సేవాభారతి వృత్తి శిక్షణ ఇచ్చింది.

ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినది సంచార జాతులకు కరోనా కాలంలో చేసిన సేవ. వారిని సమాజ సహకారంతో స్వయంసేవకులు ఆదు కొన్నారు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గర్‌, ‌సాంగనేరు ప్రాంతాలలో ఇంటింటికెళ్లి ఆదుకున్నారు. భరత్‌పూర్‌ ‌చుట్టుపక్కల వారి అమ్మాయిల పెళ్లిళ్లు జరిపించారు. సంచార వృత్తులలో కంజరి వారికి విగ్రహాలు తయారీ నేర్పించారు. బాడ్‌మేర్‌లో కరోనాతో చనిపోయిన వారి దహన సంస్కారంతో సహా కుటుంబానికి అన్ని విధాల సాయం చేశారు.

కరోనాతో తమ కంటే ఎక్కువగా ఇక్కట్లు పడు తున్నారని తెలిసి కొన్నిచోట్ల తాము అడుక్కొన్న దానిలో నుండి కొంత ధనాన్ని స్వయంసేవకుల ద్వారా అందించిన ఘటనలు ఉన్నాయి. కొన్నిచోట్ల రెండు రొట్టెలు లభిస్తే ఒక్క రొట్టెతో ఆకలి తీర్చుకొని మరొకటి ఇంకొకరికి ఇచ్చిన వైనం హృదయాలను ద్రవింపజేసింది. స్వయంసేవకులు ఆ సేవా మహా యజ్ఞంలో కడుపేదవారినీ భాగస్వాములను చేశారు. 3వ దశ కోసం ముందు జాగ్రత్తలు తీసుకోవడం, గ్రామ గ్రామాన ప్రజలను జాగృతపరచడం, గ్రామ ఆరోగ్య కార్యకర్తల (మహిళ + పురుషుడు)ను నియ మించడంతోబాటు వారికి శిక్షణ ఇచ్చారు. అందుకు అవసరమైన కిట్‌లను అందించారు. చాలాచోట్ల బ్లడ్‌బ్యాంకుల ఏర్పాటు చేసి రక్తం సిద్ధంగా ఉంచారు.

కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు

పట్టణాలలో వృత్తి, ఉద్యోగాలు చేసుకునేవారిని 10,704 శాఖల నుంచి సేవా కార్యకర్తలుగా నియ మించారు. ఈ సంవత్సరం దేశంలో 29 ప్రాంతాల లోని శాఖలు సేవా సప్తాహం నిర్వహించినందువల్ల వివిధ రకాల సేవా కార్యక్రమాలు మొదలైనాయి. ఇంకా 28,866 ఉపక్రమాలు (15 రోజులకు, నెలకు ఒకసారి జరిపే కార్యక్రమాలు) జరిగాయి. సేవాగాథ వెబ్‌సైట్స్ ‌ద్వారా హిందీ, ఇంగ్లిష్‌, ‌తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషల్లో మనకు వివరాలు లభిస్తున్నాయి. దేశమంతటా 61,882 సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

సంపర్క విభాగం

కరోనా భయాన్ని పోగొట్టడం కోసం సంపర్క విభాగం ద్వారా ఆదుకుంటూ దేశ మంతటా సంఘ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని ఉదాహరణలు:

  1. పుణెలో ‘పుణె ప్లాట్‌ఫారం ఫర్‌ ‌కొవిడ్‌ ‌రెస్పాన్స్ (PPCR)’ ‌కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలు చేసి బాధితులను ఆదుకొన్నారు. ఈ వివరాలతో PPCR  అనే టేబుల్‌ ‌కాపీ (పుస్తకం)ని సర్‌సంఘ చాలక్‌ ‌విడుదల చేశారు.
  2. ఢిల్లీ ప్రాంతం, కార్యకర్తలు ‘పాజిటివిటీ అన్‌ ‌లిమిటెడ్‌’ అనే కార్యక్రమం మాధ్యమంగా దేశంలోని వివిధ రంగాలకు చెందిన 13 మంది మహనీయు లతో సందేశాలను ప్రసారం చేసి ప్రజలను కొవిడ్‌ ‌భయాల నుంచి దూరం చేశారు.

కొవిడ్‌ ‌రెస్పాన్స్ ‌టీంలో 71 మంది మాజీ రాయబారులు సహా ఎందరో ప్రసిద్ధులు పాల్గొని సేవా కార్యకలాపాలను విస్తృతపరచారు. కరోనా కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశమంతా చేసిన సేవా కార్యక్రమాల వివరాలను సేకరించి ‘వయం రాష్ట్రాంగ భూతా’ (మేము ఈ దేశానికి అవయవ స్వరూపులం) పేరుతో టేబుల్‌ ‌బుక్‌ ‌తయారుచేశారు. దేశంలోని 4179 మందిపెద్దలకు కార్యకర్తలు దీనిని స్వయంగా అందించారు.

కరోనా పరిస్థితులు – పునరావాస ఏర్పాట్లు

2020 మార్చిలో ప్రారంభమైన కరోనా 1,2 దశలు అత్యంత వేదనాభరితంగా సాగాయి. మొదటి దశలో జీవనోపాధిపై పెద్ద దెబ్బపడింది. 2వ దశలో ప్రాణనష్టం ఎక్కువ. వైరస్‌తో ఏర్పడిన శారీరక ఇబ్బందులతోపాటు ప్రజల అకాల మరణాలు అసంఖ్యాక కుటుంబాలు అనుకోని కష్టాలలోకి నెట్టాయి. ఆసుపత్రులలో చాలీచాలని సౌకర్యాలు, చికిత్స సామగ్రి, మందుల కొరత, లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారం, వృత్తులు దెబ్బతినడంతో తగిలిన దెబ్బవల్ల జీవనోపాధి కోల్పోవడం వంటివి అన్నీ కలిపి ప్రజలను హతాశులను చేశాయి.

ఇలాంటి సమయంలో ప్రభుత్వంతోబాటు ఆర్‌ఎస్‌ఎస్‌, ‌సమాజం అందరూ కలిసి అద్భుతంగా సామాజిక కర్తవ్యాన్ని నిర్వహించారు. రెండవ దశలో ప్రజలను సకారాత్మక చింతనలో ఉంచడానికి సంఘం ప్రయత్నించింది. 3వ దశ వస్తుందని తెలిసి ముందుగానే దేశమంతటా – తాలూకా వారీగా కరోనాను ఎదుర్కోవడానికి ప్రశిక్షణను ఆర్‌ఎస్‌ఎస్‌ ఇచ్చింది. దేశంలో 150 కోట్ల టీకా డోస్‌లను వేయించడంలో గొప్ప పాత్ర పోషించింది.

కరోనాతో ప్రధానంగా మూడు క్షేత్రాల్లో పున రావాస అవసరాలు ఏర్పడ్డాయి. 1. విద్యాక్షేత్రం, 2. ఉపాధి (వ్యాపారం – పరిశ్రమలు – రవాణా విషయాల్లో ఇబ్బందులు), 3. కుటుంబ స్థాయిలో సమస్యలు(కుటుంబంలో సంపాదన చేసే వ్యక్తి మరణించడం). ఆ సవాళ్లను సంఘం స్వీకరించింది. స్వయంసేవకులు, వివిధ క్షేత్రాలతో కలసి మార్గాలను వెతికి బాధితులకు సహాయం చేసే ప్రయత్నాలు చేశారు. బస్తీ పాఠశాల, ట్యూషన్‌లు ఫీజు లేకుండా చెప్పడం వంటివి చేస్తున్నారు. ఈ దిశలో చేయా ల్సింది చాలా ఉంది. జీవనోపాధి గురించి ప్రభుత్వం వివిధ ఆర్థిక యోజనలు ప్రకటించి అమలు పరుస్తూ పరిస్థితులపై విజయం సాధించే దిశగా కృషి చేస్తున్నది. ఇది ప్రశంసించదగినదే. అయితే ఇంత విశాల దేశంలో ఈ సవాలును ఎదుర్కొనే దిశగా స్వయంసేవకులు గ్రామాల్లో చిన్న చిన్న సరళమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారు. నైపుణ్య శిక్షణ అనేక స్థలాల్లో ఇస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వైపు నుండి గ్రామ వికాస్‌, ‌సేవాభారతితో బాటు కొన్ని ఆర్థిక సంబంధమైన వివిధ క్షేత్రాలు ఒంటరిగాను, సంయుక్తంగాను ప్రయత్నించడంవలన మంచి ఫలితాలు కనబడుతున్నాయి. అయినప్పటికి ఉపాధి సృష్టి అవసరం ఇంకా ఉంది. ఆత్మనిర్భర భారత్‌ ‌సంకల్పించాలంటే ఆ దిశగా జరిగే యోజనల్లో జీవనోపాధి విషయమై ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలి. ప్రభుత్వం, సమాజం, ప్రత్యేకించి పరిశ్రమలు – వృత్తి రంగాలు ముందుకు రావాలి.

సంపర్క విభాగం ద్వారా జరిగిన రామమందిర నిధి సేకరణలో ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు.

పశ్చిమబెంగాల్‌ ‌శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే జరిగిన హింస గురించి దేశ మంతటా తెలియజేయడానికి 44 ప్రాంతాలలో 163 కార్యక్రమాలు జరిగాయి. ఇందులో 18,725 మంది ప్రముఖులు పాల్గొన్నారు. గౌరవనీయ రాష్ట్రపతి మొదలుకొని విభిన్న రాష్ట్రాల గవర్నర్ల వరకు అందరినీ కలిసి విజ్ఞాపన అందించే పనిలో 4,027 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. పరమపూజనీయ సర్‌సంఘచాలక్‌గారి మార్గదర్శనం సంపర్క విభాగం ద్వారా దేశంలో 11 స్థలాల్లో లభించింది.

ధర్మజాగరణ సమన్వయ కార్యం

ఈ సంవత్సరం 7 ప్రాంతాల్లో 45 సంప్రదాయా లకు చెందిన 1,079 మంది సాధుసంతులు ధర్మ జాగరణ విభాగం ద్వారా వర్గలలో పాల్గొన్నారు. గుజరాత్‌లో ఎస్‌.‌సి. బంధువుల మధ్య పని చేయ డానికి 27 రకాల సంప్రదాయాలకు చెందిన 332 మంది సాధువులు మా।। భయ్యాజీ నిర్వహించిన సమావేశంలో సంకల్పం తీసుకొన్నారు.

గోసేవ

ఇందుకోసం దేశమంతటా 30,525 మంది పనిచేస్తున్నారు. 9129 కుటుంబాలు 29,749 ఎకరాలలో గో ఆధారిత సేద్యం చేస్తున్నారు. 9,281 కుటుంబాలకు గోబర్‌ ‌గ్యాస్‌ ‌ప్లాంట్‌లున్నాయి. 68,693, కుటుంబాల వారు 1,98,927 దేశీ గోవులను పోషిస్తున్నారు. ఈ సంవత్సరం 1,88,873 గణేశ్‌ ‌విగ్రహాలను, దీపావళికి 34,69,230 ప్రమిదలను ఆవుపేడతో చేసి ఉపయోగించారు.

గ్రామవికాస కార్యంలో భాగంగా అక్షయ కృషి పరివార్‌ ‌ద్వారా జరుగుతున్న ‘భూమి సుపోషణ’ ఉద్యమంలో కనేరిమఠం, గాయత్రి పరివార్‌, ‌పతంజలి, రాంచంద్రమిషన్‌, ‌రామకృష్ణ మఠం, ఇస్కాన్‌ ‌వంటి సంస్థలు గత సంవత్సరం ఉగాది నుండి దేవోత్థాన ఏకాదశి వరకు దేశమంతటా 18,694 స్థలాల్లో నిర్వహించిన కార్యక్రమంలో 5,41,968 మంది రైతులు పాల్గొన్నారు.

కుటుంబ ప్రబోధన్‌

ఈ ‌కార్యక్రమం ద్వారా కరోనా సమయంలో ఇంటికే పరిమితమైనప్పుడు, ఆ సమయాన్ని కూడా ఆనందంగా సద్వినియోగం చేసుకోవడానికి, వత్తిడి నుండి దూరం కావడానికి అనేక కార్యక్రమాలు జరిగాయి. అందులో కుటుంబం అంతా పాల్గొనే కొత్త కొత్త ఆటలు నేర్పించారు. అలాగే మన ఇల్లు ఒక బడి, పర్యావరణ సంరక్షణ – సంవర్ధన, స్వదేశీ, భారతీయ జీవన విలువల గొప్పతనం, సమరసత, ఆహారం – ఆరోగ్యం వంటి అంశాలపై పెద్దల ద్వారా మార్గదర్శనం లభించింది. ఆజాదీ కా అమృతోత్సవాల సందర్భంగా ఆదర్శపౌరులుగా ఎలా జీవించాలి అనే విషయంపై చర్చ జరిగింది.

సామాజిక సమరసత

విభాగం ద్వారా తెంగాణలో వృత్తి, ఉద్యోగులు పాల్గొనే 30 శాఖల్లో తృతీయ సర్‌సంఘచాలక్‌ ‌బాలాసాహెబ్‌ ‌దేవరస్‌జీ సందేశాలపై (వసంత వ్యాఖ్యానమాల పుస్తకం) చర్చ జరిగింది. తెలంగాణలో 28 జిల్లాల్లో కుటుంబాలతో సమ్మేళనం జరిగింది. ‘మన కుటుంబం సమరసత కుటుంబం కావడం’ అన్న నేపథ్యంలో ఇది జరిగింది. భాగ్యనగర్‌లో శ్రీ రామానుజాచార్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన సామాజిక పెద్దల సమ్మేళనంలో దేశంలోని 19 ప్రాంతాల నుండి 173మంది పాల్గొన్నారు. సమరసతా సందేశాన్ని వినిపించడానికై 11 రోజులు వివిధ సంప్రదాయాలకు చెందిన 200 మంది సాధువులతో ‘మీరాబాయి జన్మస్థలం (రాజ స్థాన్‌) ‌నుండి సంత్‌ ‌రవిదాస్‌ ‌తపస్సు చేసిన స్థలం (పంజాబ్‌)‌వరకు, ‘మీరా చలీ సద్గురు ధామ్‌’ ‌పేరుతో యాత్ర జరిగింది. ఈ యాత్రలో 50 సభలు, 250 స్వాగత కార్యక్రమాలు 35000 మందితో జరిగాయి.

పర్యావరణ సంరక్షణ విభాగం

2022 జనవరిలో పాఠశాల విద్యార్థులకు పర్యావరణ సంరక్షణ విషయంపై పోటీలు జరిగాయి. 55,062 స్కూళ్ల నుండి 1-12 తరగతి వారు 8,46,443 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 1వ తరగతివారు 62 వేల మంది. హిందూ ఆధ్యాత్మిక సేవా ఫౌండేషన్‌తో కలసి చేసిన ‘ప్రకృతి వందన’ కార్యక్రమంలో 4 లక్షల కుటుంబాల నుండి 53 లక్షలపైగా ప్రజలు పాల్గొన్నారు. Eco Mitram యాప్‌ ‌పర్యావరణ విభాగం ద్వారా తయారైంది. ఇప్పటివరకు 7,61,742 మంది డౌన్‌లోడ్‌ ‌చేసుకొన్నారు.

అనుసరించాల్సిన ఉదాహరణలు : ఇకో బ్రిక్స్ ఉద్యమం, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌లలో ఇకోబ్రిక్స్‌తో పార్కు నిర్మించారు. అరుణాచల్‌‌ప్రదేశ్‌లో కూర్చొనే స్టాండును తయారు చేశారు. ఇండోర్‌లో 50 వేల ఇకోబ్రిక్స్‌తో CDS బిపిన్‌ ‌రావత్‌ ‌విగ్రహాన్ని తయారుచేశారు. జల సంరక్షణపై జనజాగరణ ఉద్యమం జరుగుచున్నందు వలన – ఉత్తరాఖండ్‌, ‌మీరట్‌, అవధ్‌ (U.P) ‌జార్ఖండ్‌, ‌మహాకోశల్‌ (‌MP), చత్తీస్‌గర్‌ ‌మొ।। ప్రాంతాల్లో నదులు, చెరువులు, బావుల దగ్గర హారతి కార్యక్రమాలు ప్రారంభమై నాయి. ఢిల్లీలో నీళ్లు అందిస్తున్న 124 జలాశయా లను (‘జలశ్రోత్‌’) ‌శుభ్రం చేశారు. 2021 జూన్‌ 5 ‌ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా 3,25,000 మంది పెద్దలు పర్యావరణ రక్షణ, హరిత గృహం (చెట్టు నాటుట, నీటి, విద్యుత్‌ ‌పొదుపు జంతు సంరక్షణ, పాలిథిన్‌ ‌కవర్లను బహిష్కరించడం) గురించి ప్రతిజ్ఞ చేశారు.

జాతీయ స్థాయిలో

జీవనోపాధి మార్గాల కొరకై కొత్త కొత్త విభా గాలు, అవకాశాలు గురించి ప్రయోగాలు చేసే చొరవ కావాలి. గ్రామీణ ప్రదేశాలు, వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, చిన్న పరిశ్రమలు వంటి క్షేత్రాల్లో విశేషంగా ప్రయత్నం జరగాలి. వికేంద్రీ కరణ, పర్యావరణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని యోజన చేయాలి. కుటుంబంలో సంపాద నాపరుడు మరణిస్తే ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడకుండా సమాజం తోడ్పాటుతో స్వయంసేవకులు సహాయం అందిస్తూనే వారి స్వావలంబనకు ప్రణాళిక సిద్ధం చేయడంలో ముందుండాలి. ఇలాంటి ప్రేరణా దాయక ఉదాహరణలు చాలా ఉన్నాయి. పిల్లల చదువులు, యువతుల వివాహాలు, వృద్ధ్దుల బాగోగులు, జీవనోపాధి గురించి కొంత వ్యవస్థ వంటి విషయాల్లో అందుబాటులోని ప్రభుత్వ యోజనలను గుర్తించడం, సమాజం సహకారంతో వారికి తోడ్పాటునందించడం వంటివి అవసరమైనచోట్ల రాబోయే రోజుల్లో కూడా అందిస్తూ ఉండాలి.

కరోనా కాలంలో సంయమనంతో కూడిన సంతులిత జీవనం గడిపే అనుభవం కలిగింది. నదులు కలుషితం కావడం తగ్గింది. శుద్ధమైన నీరు, గాలి లభించడం శాశ్వతంగా జరగాలంటే ఆశించిన విధంగా మన జీవన శైలిని నిలిపి ఉంచుకోవాలి. కరోనా కలిగించిన ఈ సవాళ్లకు పరిష్కారం చూపుతూనే దేశం ఎదుర్కొంటున్న ఇతర విషయాల పట్ల కూడా దృష్టి నిలపాలి.

హింస, అవిశ్వాసం- ప్రజాస్వామ్యానికి ప్రమాదం

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత పెద్ద ఎత్తున హింస చోటు చేసుకొంది. సమాజంలో హింస, భయం, ద్వేషం, చట్టాన్ని ఉల్లంఘించడం జరిగితే కేవలం అశాంతి, అస్థిరత మాత్రమే కాదు ప్రజాస్వామ్యం, పరస్పర విశ్వాసం ప్రమాదంలో పడతాయి. 2021 మేలో జరిగిన ఈ హింస విద్వే షంతో కూడిన మత ఛాందసుల చర్యల ఫలితమే. ఎన్నికలనేవి స్పర్థకు సంబంధించినవి. కనుక ఒకరు గెలుస్తారు మరొకరు ఓడిపోతారు. ఇది సహజం. ప్రజల తీర్పును గౌరవించి పరస్పర విశ్వాసం – సహకారంతో జీవనం సాగించడం మన ప్రజా స్వామ్యానికి గుర్తింపు. అయితే పాలనా యంత్రాం గాన్ని దుర్వినియోగం చేస్తూ, వారికి స్వేచ్చనిచ్చి రాజకీయ విరోధులకు నష్టం కలిగించే ప్రయత్నాల వల్ల భవిష్యత్తులో చాలా మూల్యం చెల్లించుకోవాలి. ఒక రాష్ట్రం వారు మరో రాష్ట్రంలో తలదాచుకోవడం ద్వారా పరిపాలన అస్తవ్యస్తం అయిందనడం కంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అపఖ్యాతిపాలైనాయని చెప్పవచ్చు. పశ్చిమబెంగాల్‌లో జరిగిన సంఘటన లపై విచారణకు ఎస్‌.‌సి. కమిషన్‌, ‌మానవహక్కుల కమిషన్‌, ‌మహిళా కమిషన్‌ ‌వంటి సంస్థలు తమ ప్రయత్నాలు చేశాయి. అక్కడి ప్రజలకు శీఘ్రంగా న్యాయం జరగాలని ఆశిద్దాం.

రాజకీయ క్షేత్రంలో పరస్పర పోటీ అనివార్యం. అది ఆరోగ్యకరంగా, ప్రజాస్వామ్య మర్యాద హద్దులు దాటకుండా, సమాజ హితానికి దోహదపడేలా ఉండాలి. అయితే ఇటీవలి సంఘటనలు, ఎన్నికల్లో ఆరోపణ, ప్రత్యారోపణలు, అపుడు వాడే భాష బాధిం చేవిగా ఉన్నాయి. ముందే ఖరారైన కార్యక్రమానికి  ప్రధాని వెళుతుంటే రహదారిలో రైతుల ఆందోళన అనే పేరుతో నిరోధించడం సిగ్గుచేటైనది. భద్రతా సిబ్బందికి సవాలు విసిరారు. రాజకీయాల్లో మర్యాద, కేంద్ర- రాష్ట్ర సంబంధాలు, రాజ్యాంగ పదవుల పట్ల భావన వంటివాటి పట్ల ప్రశ్నను లేవనెత్తుతుంది.

విభజన కుట్ర – సరైన చర్చతో సమాధానం

ఈ రోజు ఒకవైపు భారత్‌లో యుగయుగాల నుండి వస్తున్న సాంస్కృతిక విలువల పరంపర, అస్తిత్వం, ఏకాత్మత, అఖండత అనే భావాలు జాగృత మవుతున్నాయి. హిందూశక్తి స్వాభిమానంతో తల ఎత్తుకోగలుగుచున్నది. మరోవైపు దీనిని సహించని విరోధులు సమాజంలో వైషమ్యాలు పెంచడానికి కుట్రలు చేస్తున్నారు. జనాభా లెక్కల సేకరణ సమయం దగ్గరపడుతున్నకొలది ‘మనం హిందు వులం కాదు’ అనే దుష్ప్రచారాన్ని సాగిస్తూ వారిని రెచ్చగొడుతున్న ఉదాహరణలు అనేకం. హిందూత్వా నికి సంబంధించి వివిధ రకాల అసత్య ప్రచారాలను సాగించే కుట్ర దేశ, విదేశాల్లో సాగుతున్నది.

ఈ నేపథ్యంలో జాతీయత, హిందూత్వం, మన చరిత్ర, సమాజ దర్శనం, సంస్కృతి విలువల పరంపర మొదలైన విషయాల గురించి సత్యాన్ని ప్రమాణాలతో ప్రబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అవసరం. దీనితో బాటు వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవనంలో భారతీయ జీవన విలువల ఆధారంగా ఆచరణను వ్యవహారంలోకి తేవడానికి కృషిచేయాలి. ఇది ముఖ్యంగా యువతలో వేగంగా జరగాలి. ఈ విషయంలో అంగీకరించేవారిని, అలాంటి శక్తులను కలుపుకొని ముందుకు సాగాలి.

మతఛాందసవాదం – పెను సవాల్‌

‌దేశంలో మతఛాందసవాదం భయంకర రూపం దాలుస్తూ అనేక స్థలాల్లో తిరిగి తలెత్తుతున్నది. కేరళ, కర్ణాటకలలో హిందూ సంస్థల కార్యకర్తలను దారుణంగా హత్య చేయడం ఇందుకు ఉదాహరణ. మతఛాందసాన్ని చాటి చెప్పే రీతిలో సాగుతున్న ర్యాలీలు, కార్యక్రమాలు, ప్రదర్శనలు రాజ్యాంగం కల్పించిన హక్కు లేదా ధార్మిక స్వాతంత్య్రం చాటున జరుగుతూ, చిన్న చిన్న కారణాలకే రెచ్చగొట్టి హింసను ప్రేరేపించడం, సామాజిక అనుశాసనాన్ని ఉల్లంఘించడం వంటి దుర్మార్గపు పనులు నిరంత రంగా కొనసాగుతున్నాయి. ఆ శక్తులు ప్రభుత్వ కార్య కలాపాల్లో ప్రవేశించే ప్రయత్నం జరుగుచున్నది. వీట న్నిటి వెనక దీర్ఘకాలిక లక్ష్యం అనే కుట్ర దాగి ఉంది. సంఖ్యాబలం చేత అనుకొన్నది సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమాజ ఐక్యత, మనందరం ఒకటే అనే భావనతో జాగృతమై ఈ ప్రమాదాన్ని విజయ వంతంగా ఓడించే ప్రయత్నం చేద్దాం.

పంజాబ్‌, ‌కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర వంటి విభిన్న ప్రాంతాలలో యోజనాబద్ధంగా హిందువులను మతం మారుస్తున్నారు. అయితే హిందూ సమాజం లోని పెద్దలు, ధార్మిక సంస్థలు కొంతమేరకు మతాంత రీకరణలను నిరోధించడంలో సక్రియంగా ఉన్నాయి. ఈ దిశలో ఇంకా ఎంతో యోజనా బద్ధంగా అందరం కలసి సంయుక్తంగాను, సమన్వయంతోను ప్రయత్నం చేయాలి.

సంఘటిత, జాగృత భారత్‌ – ‌వైభవశాలి భారత్‌

‌పైన పేర్కొన్న పరిస్థితులు ఉన్నప్పటికీ భారత దేశం జాగృతమై అభివృద్ధి పథంలో సాగుతుండడం ముదావహం. సమాజంలోని ఒక పెద్ద వర్గమైన యువత, విద్యావంతులు, అనేక రంగాలలోని సాను కూలశక్తి కలసి భారతదేశ సువర్ణ అధ్యాయాన్ని లిఖించే పనిలో ఉన్నారు. ఆజాదీకా అమృతోత్సవాల ప్రేరణతో జరుగుతున్న అనేక కార్యక్రమాలతో ఈ ఉత్సాహం ద్విగుణీకృతమవుతోంది. పూజనీయ సర్‌సంఘచాలక్‌జీ పర్యటనలోను, సంఘం నిర్వహిస్తున్న ఇతర కార్యక్రమాల్లోను పాల్గొంటున్న విజ్ఞులు ఈ విషయం గురించి సకారాత్మకంగా తమ సమ్మతిని తెలపడమే కాదు, అందుకు సమయాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక రాబోయే రోజుల్లో సంఘంలోని జాగరణ శ్రేణి, వివిధ గతివిధులు తమ కార్యకలాపాలను పెంచాలి. అలాగే సంఘటన (శాఖ) కార్యాన్ని విస్తృతపరుస్తూ, గుణాత్మకంగా మలచుకోవడం కోసం విశేష ప్రయత్నం అవసరం. పరిస్థితులు అనుకూలంగాను లేదా సవాళ్లతో కూడు కొన్నవై ఉండవచ్చు. సంఘ (ఆర్‌ఎస్‌ఎస్‌) ‌శతాబ్ది ఉత్సవాల శుభపర్వం మన ఉత్సాహాన్ని, సాహసం, సంకల్ప శక్తిని అనేక రెట్లు వృద్ధి చేసేదిగా ఉన్నది. సంఘ కార్యాన్ని విజయ వంతం చేసి మన రాష్ట్ర ధర్మాన్ని అనుసరించే సువర్ణ అవకాశం మనం పొందుతున్నాం.

About Author

By editor

Twitter
Instagram