–  ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి  

‌నాయకుడంటే ఎలా ఉండాలి?

సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌లాగా,

నాయకుడన్నవాడు ఎలా ఉండకూడదు?

జవహర్లాల్‌ ‌నెహ్రూ లాగా.

నేతాజీ ప్రకృతి అయితే నెహ్రూజీ వికృతి. ఎంత కష్టమైన కార్యాన్నయినా అత్యద్భుతంగా సాధించటం నేతాజీ ప్రత్యేకత. ఎంత చిన్న పనినైనా అత్యద్భుతంగా చెడగొట్టటం పండిట్జీ స్పెషాలిటీ. అది కాశ్మీర్‌ అయినా, టిబెట్‌ అయినా, చైనాతో వ్యవహారమైనా ఏదైనా కానీ నెహ్రూగారి చేతిలో పడిందంటే కంపు కంపు అయిందన్నమాటే.

ఆ మహానుభావుడి కంగాళీ పనితనానికి నేతాజీ మిస్టరీని డీల్‌ ‌చేసిన విధం చక్కని ఉదాహరణ.

ఆరాధ్య నాయకుడి మరణ విషయంలో అనుమానాలు ముసిరి, వదంతులు ప్రబలి, జాతి మొత్తం కలవరపడుతున్న సమయాన అందరికీ నమ్మకం కలిగేలా నిజ నిర్ధారణ చేసేందుకు రాధా వినోద్‌పాల్‌ ‌కంటే యోగ్యుడు దొరకడు. ఆయన అంతర్జాతీయ గుర్తింపు పొందిన న్యాయ పారంగతుడు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత టోక్యోలో యుద్ధ నేరస్తులను విచారించిన అంతర్జాతీయ మిలిటరీ ట్రిబ్యునల్‌ ‌న్యాయ నిర్ణేతలలో ఒకే ఒక ఆసియన్‌ ‌వినోద్‌ ‌పాల్‌. ‌నిజ నిర్ధారణకు ఆయనే యోగ్యుడు అని నేతాజీ స్మారకసంఘం కూడా కొద్దిరోజుల కింద కోల్‌కతా సభలో తీర్మానం చేసింది. కాబట్టి ఆ పనేదో ఆయన చేతే చేయిస్తే నేతాజీ అభిమానులకు విచారణ సవ్యంగా జరిగిందని నమ్మకం కలుగుతుంది. నేతాజీ మరణానికి సంబంధించి ఆధారాలు కావలసినన్ని ఉన్నందున జస్టిస్‌ ‌పాల్‌ ఎలాగూ వాటిని పరిగణిస్తాడు. పూర్వాపరాలను, సాక్షులను క్షుణ్ణంగా విచారించిన మీదట ఆయన బోస్‌ ‌మరణాన్ని సాధికారికంగా ధృవీకరిస్తే వివాదం శాశ్వతంగా సమసిపోతుంది. నిజమేమిటో తేలిపోతుంది. తన రాజకీయ ప్రత్యర్థి ఖాయంగా మరణించాడని తేలితే నెహ్రూగారికి పైకి చెప్పుకోలేని గాభరా తగ్గి మనసు స్థిమితపడుతుంది.

ఇలా ఏరకంగా చూసినా జస్టిస్‌ ‌రాధా వినోద్‌పాల్‌ ‌చేత విచారణ జరిపించటమే ఉత్తమం. కాని నెహ్రూ ఆ పని చేయలేదు. స్వతంత్రంగా వ్యవహరించే పాల్‌ ‌చేతికి దర్యాప్తు పని అప్పగిస్తే మాట వినకుండా తన దుంప ఎక్కడ తెంచుతాడో అని ఆయన భయం. అందుకే తనకు పాదాక్రాంతమై తాను ఆడించినట్టల్లా ఆడటానికి సిద్ధంగా ఉన్న షానవాజ్‌ ‌ఖాన్‌ను ఏరికోరి విచారణ పీటల మీద కూచోబెట్టాడు.

సైనిక విషయాల మాటేమో గాని- ఒక జాతీయ నాయకుడికి సంబంధించిన అతి ముఖ్య వివాదాన్ని వేరే దేశాల్లో దర్యాప్తు చేయటానికి కావలసిన వృత్తి నైపుణ్యం, వ్యక్తిత్వ స్థాయి షా నవాజ్‌ ‌ఖాన్‌కు లేవు. పైగా అతడి మీద నేతాజీ సహచరులకు, అనుయాయులకు పీకల దాకా కోపం ఉన్నది. 1945 మొదటి పాదంలో ఇంఫాల్‌ ‌యుద్ధ ఘట్టంలో కొహిమా ఫ్రంట్‌ ‌కమాండింగ్‌ ఆఫీసరుగా ఉండగా ఐఎన్‌ఎ, ‌జపాన్‌ ఆర్మీల ప్లాన్లను, మిలిటరీ కోడ్లను అక్కడే బ్రిటిష్‌ ఆర్మీ తరపున పోరాడుతున్న తన సోదరుడికి చేరవేశాడని షా నవాజ్‌ ‌మీద వారికి అనుమానం. తరవాత మౌంట్‌ ‌పోపా ఆపరేషన్ల సమయంలో బ్రిటిష్‌ ‌దళంతో ఘర్షణలో పోయాయని అతడు చెప్పుకున్న డైరీ, కీలక సైనిక సమాచారం ఉన్న పత్రాలు తరవాత ఎర్రకోట విచారణలో ఐఎన్‌ఎకు వ్యతిరేకంగా ఎగ్జిబిట్లుగా ప్రవేశ పెట్టబడ్డాయి. షానవాజ్‌ ‌బుద్ధిపూర్వకంగానే వాటిని ‘పోగొట్టుకున్నాడని’ సహచరుల అభియోగం. ఈ సంగతి నేతాజీ దృష్టికి వెళ్లింది. వెంటనే బర్మాలో రిపోర్టు చెయ్యమని షానవాజ్‌ను.. అతడి పక్కనే ఉండి అతడి కదలికలను కనిపెట్టమని నమ్మకస్తులైన ఆఫీసర్లను నేతాజీ ఆదేశించాడు. షా నవాజ్‌ను కోర్ట్ ‌మార్షల్‌ ‌చెయ్యాలని కూడా అనుకున్నారట. హఠాత్తుగా యుద్ధం ముగిసి పరిస్థితులు విషమించటంతో అది ముందుకు సాగలేదు.

ఆ సంగతి నెహ్రూకు తెలుసు. అందుకే షా నవాజ్‌ ‌మీద ఆ మహానుభావుడికి వల్లమాలిన ప్రేమ. స్వస్థలం రావల్పిండి కాబట్టి విభజన తరవాత పాకిస్తాన్‌లో స్థిరపడాలని అనుకున్న షా నవాజ్‌ను నెహ్రూయే పట్టుబట్టి వారించి అక్కున చేర్చుకున్నాడు. హబిబుర్‌ ‌రహమాన్‌లాంటి వారు ఇండియాలో ఉండిపోతామని అడిగినా వద్దని పాకిస్తాన్‌కు సాగనంపిన ప్రధానమంత్రి.. అటు పోతానన్న షా నవాజ్‌ను మాత్రం కోరి మరీ ఆపి పార్టీలోకి తీసుకుని ఎంపీని కూడా చేశాడు.

నేతాజీ మిస్టరీని అందరి విశ్వాసం పొందేలా విచారణ చేయటానికి అన్ని అర్హతలూ ఉన్న జస్టిస్‌ ‌రాధా వినోద్‌ ‌పాల్‌నేమో నెహ్రూ వద్దనుకున్నాడు. అన్ని అనర్హతలూ ఉన్న షానవాజ్‌ ‌ఖాన్‌నేమో ఏరికోరి ఎంచుకున్నాడు. ఆలస్యం చేస్తే నేతాజీ మనుషులు పాల్‌ ‌చేత నాన్‌ అఫీషియల్‌ ‌విచారణను ఎక్కడ ప్రకటిస్తారో, ఎవరినీ లెక్కచెయ్యని ఆ ముక్కుసూటి మనిషి తమకు ఏమి తంటా తెచ్చిపెడతాడోనన్న కంగారుతో హుటాహుటిన ప్రభుత్వం తరఫున దర్యాప్తు సంఘాన్ని వేసి దానికి చైర్మన్‌గా షా నవాజ్‌ను ప్రకటించారు. తద్వారా ఎదురు పక్షం ఎత్తును తెలివిగా చిత్తు చేశానని నెహ్రూ తలపోశాడు. వ్యక్తిగతంగా తన అంతర్యం మీద, తన ప్రభుత్వ చిత్తశుద్ధి మీద అసలే అనుమానాలు ప్రబలిన సమయంలో విచారణ బాధ్యతను తన కీలుబొమ్మకు అప్పగించటం ఎంత అవివేకమో ఆ మహా పండితుడికి అర్థం కాలేదు.

1955 డిసెంబరు 3న పార్లమెంటులో ప్రధాని నెహ్రూ ప్రకటించింది పూర్తి స్థాయి కమిషన్‌ను కాదు. అది కేవలం ప్రభుత్వం వేసిన ఒక ఎంక్వైరీ కమిటీ. చైర్మన్‌ ‌షా నవాజ్‌ ‌ఖాన్‌ ‌కాక పశ్చిమ బెంగాల్‌ ‌ప్రభుత్వం నుంచి శంకర్‌ ‌మైత్ర, బోస్‌ ‌కుటుంబం నుంచి సుభాస్‌ అన్న సురేష్‌ ‌బోస్‌ ‌త్రిసభ్య సంఘంలో మెంబర్లు. ‘1945 ఆగస్టు 16న బాంగ్‌కాక్‌ ‌నుంచి నేతాజీ పయనం మొదలుకొని విమాన ప్రమాదంలో మరణించాడన్న కథనం, తదనంతర పరిణామాలు’’ దర్యాప్తు చేయటం కమిటీకి నిర్దేశించిన పని. మీడియా కంట పడకుండా విదేశాంగ మంత్రిత్వ శాఖ కనుసన్నల్లో రహస్యంగా పనిచేసి, పై వారు ఎలా చెపితే అలా మసలి నివేదిక దాఖలు చేయటం దాని డ్యూటీ.

నిజంగా విమాన ప్రమాదం జరిగిందా, ఒక వేళ జరిగితే అందులో నేతాజీ ఉన్నాడా, నిజంగా మరణించాడా, మరణించక పొతే ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అన్నవి కావాలనుకుంటే దర్యాప్తు చేసే అవకాశం ప్రకటించిన పరిశీలనాంశాల ప్రకారం ‘నేషనల్‌ ఎం‌క్వైరీ కమిటీకి ఉన్నమాట నిజం. కాని- ‘‘I have no noubt of the fact of Netaji Subhas Chandra Bose’s death … There can be no enquiry about that’’ ( నేతాజీ సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌మృతి విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు. దానిపై ఎలాంటి ఎంక్వైరీ అవసరం లేదు) అని సాక్షాత్తూ ప్రధానమంత్రే (1952 మార్చి 5న) పార్లమెంటులో ఘోషణ చేసిన తరువాత ఆ మృతి నిజమా కాదా అని తరచే సాహసం సర్కారీ కీలుబొమ్మ కమిటీకి సహజంగా ఉండదు.

కమిటీ అంటూ వేశాక కనీసం లోకానికి చూపెట్టుకోవటానికయినా దానిని తన పని తిన్నగా చేసుకొనిచ్చారా? ప్రమాదం గురించి దర్యాప్తు చెయ్యాలంటే ఎవరైనా ప్రమాద స్థలానికి తప్పనిసరిగావెళ్ళాలి కదా? హత్యా స్థలానికి వెళ్లకుండా పోలీసులు హత్యానేరాన్ని దర్యాప్తు చేశామంటే ఆ దర్యాప్తు నివేదికకు ఉండే విలువ ఏమిటి? ఆ మాట హెచ్‌వి కామత్‌ ‌పార్లమెంటులో షా నవాజ్‌ ‌ఖాన్‌ ‌మొగం మీదే అడిగాడు. బాంగ్‌ ‌కాక్‌, ‌టోక్యోల్లో కూచునే కావలసిన ఆధారాలన్నీ తాను సంపాదించానని షానవాజ్‌ ‌బదులిచ్చాడు. విన్నవాళ్లు ఫక్కున నవ్వారు.

ఇంతకీ దర్యాప్తు సంఘం వారు విమాన ప్రమాడం జరిగిన తైపేకు ఎందుకు వెళ్ళలేదు? అవసరం లేదని నిజంగా అనుకునా? కాదు. ‘‘మేము ఫార్మోసాకు వెళ్ళదలచుకుంటే కావలసిన అన్ని ఏర్పాట్లూ చేయగలమని జపాన్‌వారు ముందుకొచ్చారు. అక్కడికి వెళ్లటం వల్ల ప్రయోజనం ఉండదని కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చినందువల్ల మేమే వద్దన్నాం’’ అని పార్లమెంటుకూ , ఆ తరవాత ఖోస్లా కమిషను ముందూ షానవాజ్‌ ‌చెప్పింది అబద్ధం. కమిటీ అక్కడికి వెళ్ళాలనే అనుకున్నది. కాని నెహ్రూ ప్రభుత్వం వెళ్లనివ్వలేదు.

 తైవాన్‌ (‌ఫార్మోసా)కు వెళ్లి ప్రమాద స్థలాన్ని చూడదలచుకున్నట్టు టోక్యోలోని ఇండియన్‌ ఎం‌బసీకి షానవాజ్‌ 1956 ‌మేలో తెలియపరచాడు.. ఆ సంగతి భారత రాయబారి బీఆర్‌ ‌సేన్‌ ‌న్యూదిల్లీకి నివేదించాడు. దానికి భారత విదేశాంగ శాఖనుంచి వచ్చిన జవాబు ఇది:

Your telegram No.44 May 19. Matter has been placed before Prime Minister. We had to make it clear to Committee in Delhi that it would not be practicable or advisable for them to visit Formosa. The only possible advantage of going there might have been to see entries in hospital registers. … At the Committee’s request we had approached UK High Commissioner here to get this information for us…We have considered the matter again and are not in favour of the Committee visiting Formosa…It is unlikely that the Formosan Government will give any facilities. In fact they may put obstacles and suggest degrading conditions. Apart from this, politically this will be very embarrassing for us and might lead to complicating situation.”

[Back from Dead , Anuj Dhar ,pp. 91-92]

(మీ మే19 టెలిగ్రాం. ఆ విషయం ప్రధాన మంత్రి ముందు ఉంచారు. ఫార్మోసాను దర్శించటం ఆచరణీయం కాదు. అభిలషణీయం కాదు. ఆ సంగతి దిల్లీలో కమిటీకి మేము స్పష్టం చేసి ఉన్నాం. అక్కడికి వెళ్లటం వల్ల కలిగే ఒకే ప్రయోజనం ఏమిటంటే హాస్పిటల్‌ ‌రిజిస్టర్లలో ఎంట్రీలను చూడటం ..ఆ సమాచారాన్ని మాకు తెప్పించి పెట్టమని ఇక్కడి బ్రిటిష్‌ ‌హై కమిషనరును కమిటీ కోరిక మేరకు మేము అడిగాం… ఈ విషయాన్ని మళ్లీ పరిశీలించాం. కమిటీ ఫార్మోసాను దర్శించటం మాకు ఇష్టం లేదు… ఫార్మోసా ప్రభుత్వం కావలసిన సదుపాయాలను ఇస్తుందని అనుకోలేం. వాస్తవానికి వారు అడ్డంకులు పెట్టవచ్చు. అవమానకరమైన షరతులు సూచించవచ్చు. ఇదిగాక, మనకు రాజకీయంగా చిక్కులు వచ్చి పడతాయి. అది సంక్లిష్టమైన పరిస్థితికి దారి తీయవచ్చు.)

 దిల్లీ విదేశాంగ శాఖ చేసిన చిత్రణ తప్పని మరునాడే తేలిపోయింది. ఇండియాతో లాంచనపరంగా దౌత్య సంబంధాలు లేకపోయినా ఇండియన్లకు సహాయపడటానికి తైవాన్‌ అధికారులు ముందుకొచ్చారు. ఆ సంగతి చెప్పినా దిల్లీ ధోరణి మారలేదు. టోక్యోలోని భారత రాయబార కార్యాలయం 1956 మే 28 తేదీన షా నవాజ్‌ఖాన్‌కు శుభవార్తను ఆధికారికంగా తెలియపరచింది ఇలా:

“The Ministry of External Affairs feel after re-consideration of the matter that they would not be in favour of the Commission visiting Formosa…. It is not likely that the Formosan Government would extend any facilities….” (అదే గ్రంథం, పే. 92-93)

 (‘‘భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వారు ఈ విషయాన్ని పునఃపరిశీలించిన మీదట కమిషన్‌ ‌ఫార్మోసా సందర్శనకు అంగీకరించరాదని భావిస్తు న్నారు… ఫార్మోసా ప్రభుత్వం ఏ సదుపాయాలనైనా సమకూర్చటం కుదిరే పని కాదు.’’)

ఏమి కావాలో చెప్పండి బాబూ తప్పక చేస్తామని ఫార్మోసా ప్రభుత్వం ఒక చెంప చెబుతూంటే లేదు లేదు వాళ్లు ఏ సదుపాయాలను ఇవ్వరు. కాబట్టి మీరు అక్కడికి వెళ్లటానికి వీల్లేదు అని దర్యాప్తు సంఘాన్ని నెహ్రూ సర్కారు అడ్డుకోవటం హాస్యాస్పదం కాదా? ప్రమాదం జరిగినదని చెప్పబడే స్థలాన్ని వెళ్లి చూడకుండానే దర్యాప్తును లాగించమని చెప్పటాన్ని బట్టి ఇందులో ఏదో పెద్ద మోసం ఉంది. నెహ్రూ ప్రభుత్వం ఏదో కప్పిపుచ్చాలని చూస్తున్నదని ఎవరికైనా అనుమానం కలగదా?

వీర విధేయ షా నవాజ్‌ ‌ఖాన్‌ ‌తనకు వేసిన డ్యూటీకి పూర్తి న్యాయం చేశాడు. 1956 ఏప్రిల్‌లో పని మొదలెట్టి టోక్యోలో కూచుని 60కి పైగా సాక్షులను చకచక విచారించి, నాలుగు నెలల్లో పని ముగించాడు. తైహోకులో విమాన ప్రమాదం నిజం, అందులో నేతాజీ మరణం అంతకంటే నిజం, టోక్యోలోని రెంకోజీ బౌద్ధమందిరంలో భద్రపరచినది నేతాజీ చితాభస్మమే అన్నది డబుల్‌ ‌కరెక్టు అని టోక్యో నుంచి దివ్యదృష్టితో చూసి నిర్ధారించుకున్నాడు. విదేశాంగ శాఖ డిక్టేట్‌ ‌చేసిన ప్రకారం ఆరు అధ్యాయాలతో 78 పేజీల రెడీమేడ్‌ ‌రిపోర్టును ఒక ఘోస్టు రైటరు రాయగా దాని మీద సంతకం ఒక్కటి తాను పెట్టాడు. ధర్మ ప్రభువు నెహ్రూ సెప్టెంబరు 11న ఆ లోకోత్తర నివేదికను పార్లమెంటుకు గంభీరంగా సమర్పించాడు. ‘కమిటీ వారు చూపించిన ఆధారాలు బోలెడు బలంగా ఉన్నందువల్ల నేతాజీ మృతి చెందినట్టు కమిటీ చేసిన నిర్ధారణను అందరూ అంగీకరించవలె’’నని ఆయన విజ్ఞాపన చేశాడు.

నివేదికలో ఉటంకించిన సాక్ష్యాల వరకూ వంక పెట్టవలసింది ఏమీ లేదు. నేతాజీకి చికిత్స చేసిన జపనీస్‌ ‌డాక్టర్లు, సేవచేసిన నర్సులు, మరణించేవరకు ఆయన పక్కనే ఉన్న హబిబుర్‌ ‌రహమాన్‌ ఇచ్చిన వాంగ్మూలాలు బనాయింపు బాపతు కాదు. విమాన ప్రమాదంలో నేతాజీతో పాటు గాయపడి ఆ అస్పత్రిలోనే చికిత్స పొందినవారు, కూలిన విమానం చోదక సిబ్బంది ఇచ్చిన ప్రత్యక్ష సాక్ష్యాల దృష్ట్యా విమాన ప్రమాదం యథార్థతనూ శంకించనవసరం లేదు. ప్రమాద స్థలానికి పోనివ్వకుండా నెహ్రూ ప్రభుత్వమే కమిటీ కాళ్లు కట్టివేసిన సంగతి అప్పటికి బయటి ప్రపంచానికి తెలియదు. ఫార్మోసాతో మన దేశానికి నేరుగా దౌత్య సంబంధాలు లేకపోవటంవల్లే అక్కడికి వెళ్లలేక పోయామని షా నవాజ్‌ ‌చెప్పినది సామాన్య జనానికి సమంజసంగానే తోచింది. యుద్ధం చివరి దశలో అతడి అనుమానాస్పద నిర్వాకం, దానిపై కోర్ట్ ‌మార్షల్‌కు నేతాజీ ఉత్తర్వు చేసిన విషయం లోకానికి ఇంకా వెల్లడి కాలేదు. ఎర్రకోటలో మిలిటరీ కోర్టు విచారణ జరిపిన ముగ్గురిలో ఒకడు కాబట్టి షా నవాజ్‌ను కూడా ఐఎన్‌ఎ ‌హీరోగానే యావద్భారతం గౌరవించింది. నేషనల్‌ ఎం‌క్వైరీ కమిటీలో ఒక సభ్యుడైన ఎస్‌ఎన్‌ ‌మైత్ర పశ్చిమ బెంగాల్‌ ‌ప్రభుత్వ ప్రతినిధి కాబట్టి అతడి మీద ఎవరికీ ఆక్షేపణ లేదు.

త్రిసభ్య దర్యాప్తుసంఘంలో అసలైన మూడో సభ్యుడు సురేష్‌ ‌బోస్‌. ఆయన స్వయానా సుభాస్‌ ‌చంద్రబోస్‌ అన్నగారు. ఆయన కూడా కమిటీ నివేదికతో ఏకీభవించి ఉంటే ఏ గొడవా ఉండేది కాదు. ప్రమాదం నిజం.. అందులో మా తమ్ముడి మరణం నిజం అని ఆయన ధ్రువీకరిస్తే కమిటీ రిపోర్టుకు విశ్వసనీ యత ఉండేది. బోస్‌ ‌కుటుంబం, నేతాజీ అనుచరగణం, దేశ దేశాల్లోని కోట్లాది అభిమానులు తమ నేతాజీ ఇకలేడన్న కఠోర వాస్తవాన్ని అంగీకరించి ఉండే వారు. అనవసరపు వివాదం అంతటితో సమసిపోయేది.

కాబట్టి ఎంక్వైరీ పక్రియ మొత్తానికీ కీలకం సురేష్‌ ‌బోస్‌ ఐచ్ఛిక ఆమోదం పొందటం. నేతాజీకి సంబంధించి తన నడవడి మీద జనంలో ముసిరిన అనుమానాలను తొలగించుకోవటానికి రాజకీయ స్వార్థ దృష్టితో చూసినా సురేష్‌ ‌బోస్‌ ‌సహకారం నెహ్రూకు అత్యవసరం. కాని తాను కావాలని పిలిచి కమిటీలో చేర్చిన బోస్‌ ‌సోదరుడికి కూడా తన పెద్దమనిషి తరహా మీద నెహ్రూ నమ్మకం కలిగించలేకపోయాడు.

జాతీయ దర్యాప్తు సంఘంలో తనను చేర్చటానికి ఆమోదం తెలిపిన వెనువెంటనే సురేష్‌ ‌బోస్‌ ‌ప్రధాని నెహ్రూకు ఒక సూచన చేశాడు. ఒక ప్రశ్న వేశాడు. సూచన ఏమిటంటే – ప్రధానంగా న్యాయ విచారణకు సంబంధించిన కమిటీ బాధ్యత వహించటానికి ఏ రకమైన ప్రావీణ్యం లేని షా నవాజ్‌ ‌స్థానంలో జస్టిస్‌ ‌రాధా వినోద్‌ ‌పాల్‌ను అధ్యక్షుడుగా నియమించమని.

దానికి నెహ్రూ సొంపైన జవాబు ఇచ్చాడు. వార్‌ ‌క్రిమినల్స్ ‌విచారణల సందర్భంలో జపాన్‌ ‌పట్ల అనుకూలత చూపిన రాధా వినోద్‌ ‌పాల్‌ను అధ్యక్షుడుగా నియమించటం అమెరికా వంటి దేశాలకు ఇష్టం ఉండకపోవచ్చు. కాబట్టి కుదరదు అని. స్వతంత్ర భారత ప్రభుత్వం నియమించే జాతీయ కమిటీకి అధ్యక్షుడి ఎంపికకు అమెరికా ఇష్టానిష్టాలతో పని ఏమిటో ఆయనకే తెలియాలి.

 ఇక బోస్‌ ‌వేసిన ప్రశ్న ఏమిటంటే – అమెరికా, దాని మిత్రరాజ్యాలు రూపొందించిన వార్‌ ‌క్రిమినల్స్ ‌జాబితాలో సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌పేరు ఉన్నదా? ఉన్న పక్షంలో- ఒకవేళ ఆయన భారత గడ్డపై కనపడి, ఆయనను విచారణ నిమిత్తం తమకు అప్పగించమని మిత్ర రాజ్యాలు అడిగితే అప్పగించబోమని చెప్పే వీలు భారత ప్రభుత్వానికి ఉన్నదా- అని.

 యుద్ధ నేరస్తుల జాబితాలో నేతాజీ పేరు గురించి అమెరికానుగానీ, మరే దేశాన్నిగానీ మేము అడగం. ఎందుకంటే – నేతాజీ బహుశా మరణించాడు కదా అని వారు అనవచ్చు. ఏమైనా ఈ విషయంలో మేమైతే ఏమీ చేయబోం – అని దానికి నెహ్రూజీ విచిత్ర సమాధానం.

 కమిటీ విచారణ పని మీడియాకు తెలియకుండా రహస్యంగా జరగాలని ప్రభుత్వం చెప్పగా – దర్యాప్తు వైనాలను షా నవాజ్‌ ‌తనకు ఇష్టులైన పత్రికల వారికి లీక్‌ ‌చేయసాగాడు. అది సురేష్‌ ‌బోస్‌కు నచ్చలేదు. దానిపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశాడు. అప్పటినుంచీ షా నవాజ్‌ అతడి మీద కసి పెంచుకున్నాడు. నేతాజీ సోదరుడనే కారణంవల్ల టోక్యోలో మీడియా సురేష్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం షా నవాజ్‌ ‌సహించలేక పోయాడు. ‘చైర్మన్‌ను నేను. నాతో మాట్లాడండి.’’అని జపాన్‌ ‌జర్నలిస్టులను కసురుకున్నాడు.

 ప్రధానమంత్రి ఆజ్ఞ ప్రకారం జపాన్‌లోనే కొద్దిమంది సాక్షులను విచారించి రిపోర్టు రాద్దామంటే సురేష్‌ ఒప్పుకోలేదు. తనకు కావలసిన రీతిలో సాక్ష్యం ఇవ్వరనుకున్నవారికి అధ్యక్షుడు అవకాశం నిరాకరించటం, కొంతమంది సాక్ష్యులను గందరగోళానికి గురిచేసి ఇచ్చిన సాక్ష్యాలను తనకు కావలసిన రీతిలో సవరింపజేయటం, కొందరు సాక్షులు చెప్పినది కాకుండా- వారిచేత తాను చెప్పించాలనుకున్నది చెప్పినట్టుగా రికార్డు చేయటం సురేష్‌ ‌బోస్‌కు నచ్చలేదు.

 సాక్షుల విచారణ పని అయ్యాక ఇంతకీ మీరేమంటారు అని బోస్‌ను షా నవాజ్‌ అడిగాడు. రికార్డు చేసిన సాక్ష్యాలను, ఎగ్జిబిట్లను సాకల్యంగా చూడనిదే అభిప్రాయం తెలపటం కుదరదని సురేష్‌ ‌చెప్పాడు. అరకొర సాక్ష్యాలు ఆధారంగా విమాన ప్రమాదాన్ని, నేతాజీ మృతిని, పార్థివకాయ దహనాన్ని ధృవీకరించటానికి తాను ఒప్పుకోనని అతడు నిష్కర్షగా చెప్పాడు. అయితే మీరు విడిగా రిపోర్టు ఇచ్చుకోండి అన్నాడు అధ్యక్ష మహోదయుడు. ‘అలాగే ఇస్తాను. మొత్తం సాక్ష్యాలు, ఇతర రికార్డుల కాపీలు నాకు అందజేయండి ‘అని అడిగాడు సురేష్‌ ‌బోస్‌. అది సమంజస మైన డిమాండు. కాని షా నవాజ్‌ ‌కచ్చకొద్దీ అతడికి ఏ రికార్డూ అందజేయలేదు. పైగా రెండు రోజుల్లో రిపోర్టు కావాలని తొందర పెట్టాడు. ఆ గడువు కాస్తా కాగానే సురేష్‌ ‌బోస్‌ను వదిలేసి మిగతా ఇద్దరి అభిప్రాయంగా కమిటీ రిపోర్టును ప్రభుత్వానికి అందజేశాడు.

 షా నవాజ్‌కు బుద్ధి లేకపోతే అన్నీ తెలిసిన నెహ్రూ బుద్ధి ఏమైంది? సురేష్‌ ‌బోస్‌ అసమ్మతి రిపోర్టును విడిగా తెప్పించి అది అందాకే తదుపరి చర్య తీసుకోవాలన్న వివేకం ప్రధానమంత్రి కనపరచాడా? అతడితో మాట్లాడి సముదాయించి బహిరంగ వివాదాన్ని నివారించేందుకు కనీసం ప్రయత్నమైనా చేశాడా? లేదు. ‘‘మూడో మెంబరు సురేష్‌ ‌బోస్‌ ‌రిపోర్టు మీద సంతకం చెయ్యలేదు. పక్షం రోజులు గడువు ఇచ్చినా డిసెంటు రిపోర్టును దాఖలు చెయ్యలేదు. కమిటీ రిపోర్టుతో అతడు ఎంతవరకు ఏకీభవిస్తాడో తెలియదు. అతడి ప్రవర్తన చూస్తే మొత్తం మీద కమిటీ రిపోర్టు తనకు ఇష్టం లేదని మాత్రం చెప్పగలను. సేకరించిన సవిస్తర సాక్ష్యాలన్నీ చూశాక కూడా బుద్ధి లేనివాడెవడైనా కమిటీ అభిప్రాయాన్ని అంగీకరించను పొమ్మంటే ఏమి చేస్తాం?’’ అని పార్లమెంటులో ప్రధాని నెహ్రూ ఉవాచ.

 దాంతో సహజంగానే సురేష్‌ ‌బోస్‌కు చిర్రెత్తింది. షా నవాజ్‌ ‌తప్పుడు చేతలనూ, చేష్టలనూ, అతడికి వత్తాసుగా ఉన్న ప్రధానమంత్రి కుత్సితాన్ని ఏకిపారేస్తూ అసమ్మతి రిపోర్టును ప్రకటించాడు. అప్పటి ఆవేశంలో ‘అసలు ప్రమాదం జరగనే లేదు. నేతాజీ మరణించనే లేదు. ఆ చితాభస్మం నేతాజీది కాదు’ అనేది తన అభిప్రాయంగా ణఱవఅ•ఱవఅ• =వజూశీతీ• లో ప్రకటించాడు.

స్వయానా నేతాజీ తోడబుట్టినవాడే అలా అన్నాక ప్రజలు సహజంగా ఆయన మాటే నమ్మారు. నెహ్రూ నగుబాటు పాలయ్యాడు.

 మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
Instagram