అంతా రామమయం…

జగమంతా రామమయం.

ఈ ద్విపదలోనే ముక్తి నిండి ఉంది.

రామచంద్రుడితడు… రఘువీరుడు.

అని పాడుకున్నారు అయోధ్యవాసులు.

శ్రీరామచంద్రుడి వెంట అడవికి నడిచింది సీత.

అమ్మ పేరును ముందు చేర్చుకున్నాడు రామయ్య.

శ్రీ సీతారామచంద్రుడయ్యాడు… జనులందరికీ.

అది ఖమ్మం జిల్లా. సత్తుపల్లి మండలంలోని రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన లంబాడా తండాలోని ‘శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం’ శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమవుతోంది… అచ్చం అయోధ్య రామాలయం వలెనే. ఇందులో ఆశ్చర్యం ఏముంది అంటారా? ఉంది. ఈ ఆలయానికి ఇది తొలి శ్రీరామనవమి. తొలి శ్రీరామ నవమి అంటే… ఇటీవల నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపన జరుపుకున్న నూతన ఆలయం అనుకుంటున్నారేమో! కాదు కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే, ఇప్పుడు పునర్నిర్మాణం జరుపుకుంది. అయోధ్య రామాలయంలోని రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన నెలరోజులకు రుద్రాక్షపల్లి రాముడి ప్రతిష్ఠ జరిగింది. అయోధ్యరాముడు బాలరాముడైతే రుద్రాక్షపల్లి రాముడు భద్రాచలమూర్తికి ప్రతి రూపం. అవును, సీతామాతను రాముడు తన ఒడిలో కూర్చోబెట్టుకున్న ప్రతిమ భద్రాచలంలో తప్ప మరెక్కడా కనిపించదు. అచ్చంగా అలాంటి రూపమే కావాలని పట్టుపట్టి చేయించుకున్నారు దాసరి జైపాల్‌ రెడ్డి దంపతులు. నాడు భద్రాచలంలో రాముడికి నీడను కల్పించిన ఆదివాసీ వనిత పోకల దమ్మక్క. నేడు రుద్రాక్షపల్లి రాముడి ఆలయ నిర్మాణాన్ని ఒంటిచేత్తో పూర్తి చేసిన మహిళ శ్రీలక్ష్మిరెడ్డి. నిజంగా అదొక అనిర్వచనీయ మైన అనుభవం ఆమెకు.

‘‘మా అమ్మ వేమిరెడ్డి కమలమ్మ మహాభక్తురాలు. మా ఊరు నెల్లూరు జిల్లా ఆత్మకూరు. అమ్మ నిత్యం ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అన్నం వండి పెట్టేది. మానవసేవలో మాధవ సేవను చూసిన మహా తల్లి. పూజలు, కృతువుల మీద ఆసక్తి కూడా మెండు. నేను పెళ్లి చేసుకుని కోడలిగా ఖమ్మం జిల్లా, రుద్రాక్షపల్లిలో అడుగుపెట్టాను. అమ్మ నా దగ్గరకు వచ్చిన ప్రతిసారీ ‘ధ్వజస్థంభం లేని గుడి గుడే కాదు. ఆ ఊరు ఊరే కాదు’ అని చెప్తుండేది. ఊరు ఇలా ఉండకూడదు, ఎవరో ఒకరు పూనుకుని ఆలయం కట్టి ధ్వజస్థంభం ప్రతిష్ఠిస్తే బావుణ్నని గుర్తు చేస్తుండేది. అమ్మ చెప్పినప్పుడు ఏదైనా చేస్తే బావుణ్ననుకునేవాళ్లం. కానీ ముగ్గురు పిల్లల పెంపకం, వాళ్ల చదువుల బాధ్యతలతో హైదరాబాద్‌కి వచ్చిన వెంటనే ఆ సంగతి మర్చిపోయేవాళ్లం. న్యాయవాదిగా మా వారి ప్రాక్టీస్‌ హైకోర్టులో కావడంతో హైదరాబాద్‌లో ఉండేవాళ్లం. ఇలాగే సంవత్సరాలు గడిచిపోయాయి. పెద్దమ్మాయి ఐఏఎస్‌, రెండో అమ్మాయి డర్మటాలజిస్ట్‌, అబ్బాయిని లాయరుని చేయడంతో తల్లిగా నా బాధ్యతలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో సోషల్‌ సర్వీస్‌, ముఖ్యంగా పేదవాళ్ల కోసం వైద్య సేవలందించడంలో మునిగిపోయిన నా చేత ఆ భగవంతుడే ‘ఇక ఈ పని మొదలు పెట్టు’ అని తన మాటను మా వారి నోటి ద్వారా చెప్పించి ఈ పనులన్నీ చేయించు కున్నాడు. మా వారు మాట మాత్రంగా చెప్పడమే తరువాయి, నేను మరోమాట లేకుండా రంగంలోకి దిగేశాను. ఆ అయోధ్యరాముడికి ఎదురైనన్ని అవరోధాలు మా రుద్రాక్షపల్లి రాముడికీ తప్పలేదు.

రాముడికంటే ముందు వేంకటేశ్వరుడు

మేము మొదట నిర్మాణం చేపట్టింది వేంకటేశ్వరుడి ఆలయాన్ని. ఆ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ధ్వజస్థంభం, విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తయిన తర్వాత ‘రామాలయాన్ని కూడా మీ చేతుల మీదుగానే చేయించండి’ అని ఆదివాసీ తండా వాళ్లు అడిగారు. ఆ మేరకు ‘శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం’ నిర్మాణం చేపట్టాం. నాలుగు గోడలు, పై కప్పుతో చిన్న నిర్మాణంలో తలదాచుకున్న రాముడు నాతో చక్కటి మందిరాన్ని కట్టించుకున్నాడు. ఆ రామయ్య ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విగ్రహ రూపకల్పనలో నా ముచ్చట కూడా తీర్చుకున్నాను. రామాలయాలన్నింటిలో విగ్రహాలు ఒకే రీతిలో ఉంటాయి. మధ్యలో రాముడు, ఒక వైపు సీతాదేవి, మరొక వైపు లక్ష్మణుడు నిలబడి ఉంటారు. ఆంజనేయస్వామి వారి ఎదురుగా మోకరిల్లి ఉంటాడు. రామాలయాల్లోని కోదండరాముడి రూపం అది. రాముడు కోదండాన్ని ధరించి ఉంటాడన్నమాట. మనం సీతారాములను అన్యోన్యతకు ప్రతీకలుగా, చక్కటి దాంపత్యానికి ఆదర్శవంతంగా భావిస్తాం. అందుకే పెళ్లిళ్లలో వధూవరుల చేత సీతారాముల పటానికి పూజ చేయిస్తారు.అంత గొప్ప దంపతులైన సీతారాములకు వారి జీవితంలో ఎక్కువకాలం ఎడబాటే మిగిలింది. భద్రాచలంలో మాత్రం భద్రుడి కోరిక మేరకు రాముడు సీతమ్మను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. నాకు ఆ రూపమే ఇష్టం. అమ్మను ఒడిలో కూర్చోబెట్టుకున్ని రామయ్య మా ఊరిలో కూడా ఉండాలని, భద్రాచలం వెళ్లలేని వాళ్లకు మా ఊరే మరో భద్రాచలం కావాలని నా కోరిక. తిరుపతిలోని ప్రముఖ శిల్పకారులు కృష్ణమాచారి నాలుగు నెలలు శ్రమించి నా ఆకాంక్ష మేరకు విగ్రహాలను భద్రాచలం నమూనాలోనే చెక్కి ఇచ్చారు. తమిళనాడుకు చెందిన స్థపతి ఎన్‌ వల్లీనయగం గుడి నిర్మాణ నమూనా ఇచ్చారు. మహాబలిపురం నుంచి వచ్చిన ఇరవై మంది శిల్పులు నెల రోజులు పని చేసి ఆలయ గోపుర నిర్మాణం పూర్తి చేశారు. ధ్వజస్థంభం కోసం నారవేపచెట్టును మా ఊరికి పక్కనే ఉన్న రేజర్ల గ్రామవాసి కాసర్ల శ్రీనివాసరావు ఇచ్చారు. ఉత్సవ విగ్రహాలను పంచలోహ విగ్రహాలను టీటీడీ సబ్సిడీపై ఇచ్చింది.


అంతా దైవనిర్ణయం!

ఆనాటి భద్రాచల రామదాసు భక్తిపారవశ్యంలో ఎంతగా మునిగిపోయాడో మనకు తెలుసు. రామయ్యకు, సీతమ్మకు ఆభరణాలు చేయించడానికి గ్రామస్థుల శిస్తు డబ్బు ఖర్చు చేసి చివరికి చెరసాలపాలయ్యాడు. నేను మా రుద్రాక్షపల్లి రామాలయం కోసం నా చెవుల వజ్రాల కమ్మలు అమ్మేశాను. నాలో వచ్చిన మార్పు నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆలయాల నిర్మాణ బాధ్యతల్లో మునిగిపోయిన తర్వాత నాకు తెలియకుండానే ఆభరణాల మీద వ్యామోహం కూడా తగ్గిపోయింది. రాముడి కోసం ఖర్చు చేస్తుంటే కలిగిన సంతృప్తి… వజ్రాల కమ్మలను చెవులకు ధరించినప్పటి కంటే ఎక్కువ. గుడి స్థల దాతలు కూడా మా కుటుంబీకులే. వేంకటేశ్వరస్వామి గుడి నిర్మాణం కోసం మా స్థలాన్ని ఇచ్చి ఇరవై ఐదేళ్లయింది. గ్రామస్థులు ముందుకు వచ్చి నిర్మాణం బాధ్యతలందుకుంటారని భావించాం. ఇన్నేళ్లయినా నిర్మాణం మాత్రం మొదలు కాలేదు. ఆ మహత్కార్యాన్ని నా చేతుల మీదుగా చేయించుకోవాలనేది ఆ భగవంతుడి నిర్ణయం కాబోలు. వేంకటేశ్వరుడితోపాటు రాముడు కూడా గుడి కట్టించుకున్నాడు. దేవుడికి చేసిన ఖర్చును లెక్క చెప్పడం లేదు, కానీ కోటి రూపాయల విలువైన పనిని నా చేతి మీద చేయగలిగానంటే… అంతా దైవేచ్ఛ తప్ప మరొకటి కాదు.


శాస్త్రోక్తంగా ప్రతి ఘట్టం

రామాలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపనకు 40 రోజుల ముందు నుంచి శాస్త్రోక్తమైన పూజాదికాలు మొదలయ్యాయి. విగ్రహాల ధాన్యావాసం, క్షీరావాసం, నీటివాసం వంటి ప్రతి ఘట్టం మా ఇంట్లోనే జరిగింది. స్వామివార్ల కళ్లకు మైనం పూసి ధాన్యంలో ఉంచారు. క్షీరావాసం కోసం కొత్త ఈతకొలను, యాగశాల వంటి నిర్మాణాలు కూడా చేశాం. మూడు రోజుల ముందుగానే ఆంజనేయుడికి ఆహ్వానం పలికే ఘట్టంతో ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. రెండు వందల మంది భక్తులు జెండాలు పట్టుకుని బైక్‌ ర్యాలీ చేయడంతో ఊరందరిలో ఉత్సాహం మొదలైంది. పిల్లలు, పెద్దవాళ్లు, మహిళలు హనుమాన్‌ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. గోపూజ, తులసిపూజ, నిద్రావాసం వంటి ప్రతి కార్యక్రమాన్ని అత్యంత నియమనిష్ఠలతో చేయగలిగాం. టీటీడీ నుంచి పూజారులు వచ్చి నాలుగు రోజులపాటు హోమాలు, ప్రతిష్ఠాపన నుంచి సీతారామ కల్యాణం వరకు వారి చేతుల మీదుగా నిర్వహించారు. సీతారాముల కల్యాణంలో మా దంపతులతోపాటు తండాలో ప్రతి ఇంటి నుంచి భార్యాభర్తలు పాల్గొన్నారు. ఆడవాళ్లు గులాబీరంగు చీరలు, మగవాళ్లు ధవళ వస్త్రాలు ధరించి కల్యాణ మహాఘట్టంలో పాల్గొని తరించాం. అలాగే పదహారు రోజుల పండుగను కూడా నిర్వహించాం. రాబోయే శ్రీరామనవమికి మళ్లీ కల్యాణానికి సిద్ధమవుతున్నారు ఆదర్శదంపతులు సీతమ్మ, రామయ్య. మేమంతా మరోసారి శ్రీసీతారామచంద్రుల కల్యాణ మహోత్సవంలో పాలుపంచుకునే అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాం’’.

అమ్మను ఒడిలో కూర్చుండబెట్టుకున్న అయ్యకు వందనం!

– దాసరి శ్రీలక్ష్మీరెడ్డి, ధార్మిక, సామాజిక కార్యకర్త

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram