– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ జర్నలిస్ట్‌

ఎప్పుడో 116 వసంతాల నాటి మాట. ఆ రోజు ఏప్రిల్‌ 13. అది విశాఖ.

అక్కడే కమలాదేవి జననం. ఎవరీమె అంటే సమాధానం ఎంతైనా ఉంది. మనం తెలుసు కోవాల్సిందీ, తలచుకుని గర్వపడాల్సిందీ ఇంకెంతో. ఎందుకో అంటే` ఆమె విధి రాతను ఎదిరించారు. చేతిరాతతో అధిగమించారు. ఒక క్లిష్ట సందర్భంలో, అదృశ్యశక్తికి ఓ పద్మ అస్త్రాన్ని సంధించారు.

‘హింస జేయ దోష, మీశుండు శిక్షించు /ననుచు బెద్దలెల్ల రాడుచుందు/రిట్టి జీవహింస యొనయించు నీకెట్టి / శిక్ష తగునొ నీవె చెప్పు మ దేవా!’ అని.

తప్పు/దోషం / నేరం చేసిన వ్యక్తిని దైవం శిక్షిస్తాడంటారు కదా. మరికొంత మందికి ఎటువంటి శిక్ష ఎంత అన్యాయంగా పడుతుందో తెలుసా? ఉన్నట్లుండి విధి విసిరిన కరవాలం అయినవాళ్ల నిండు ప్రాణాల్ని కబళిస్తే, ఆ భావతీవ్రతను ఓ అమాయక హృదయం ఆసాంతం మోయాల్సి వస్తే? అది మాత్రం ఒక జీవాన్ని హింసించినట్లు కాదా దైవమా! మరైతే నీకే ‘ది తగిన శిక్ష’ అనేది నువ్వే చెప్పాలి’ అని అంతరంగ విషాదం. ఆ ప్రశ్నలో లోపలా వెలుపలా మనమంతా చూడాల్సింది ఆ బాధిత ప్రాణి హృదయ వ్యథనే! సూటిగా నిలదీయడం కాదది. తన గుండెఘోషను, ఆక్రోశ సమస్తాన్నీ దైవం ముందు ఉంచి సాగిలపడటం!

భర్త, తనయ, తనయుడు… ముగ్గురూ దూరతీరాలకు శాశ్వతంగా తరలివెళ్లడంతో ఆమె మది క్షోభాగ్నితో తల్లడిల్లింది. అంతటి శోకానికి అక్షరరూపమే ఆ పద్యరచన.

ఆమే  రచయిత్రి కమలాదేవి!


తనది పండిత కుటుంబం. పూర్వులంతా విద్వాంసులు. ప్రత్యేకించి కవన రంగాన పేరెన్నిక ఉన్నవారు. కమలాదేవి మాతామహులు బ్రహ్మ సూత్రాలను పద్యరూపాన తెనిగించిన కవియోధులు, అవన్నీ దైవం గురించిన చర్చ పరిణామ రూపాలు.

సూత్రం అంటే స్థూలంగా లక్ష్యం, దారం అని కూడా మరో అర్థం. జీవిత లక్ష్యం, దూరాలను కలిపే బంధం అని మనం నిర్వచనంగా భావించవచ్చు. అటువంటి సంప్రదాయాలకు ప్రమాణ స్వరూపమే బ్రహ్మసూత్రం. జీవన వేదాంతం అనే చెట్టు నుంచి రాలే కుసుమాలను సూత్రబద్ధం చేసి ఉంచే ఏర్పాటు అన్న మాట. ఆ విధమైన మేలిమి రచనలను పద్యాలుగా రూపుదిద్దిన కుటుంబం నుంచి వచ్చినవారు కమలాదేవి.

బాల్యం నుంచీ తాను సృజనశీలి. ఏది చదివినా ఎప్పటికీ గుర్తుండేది. మరపు అనే మాటే ఉండేది కాదు. తెలుగు చదువుకున్నారు. ప్రాచీన తెలుగు. అదే సమయాన ఆంగ్లాన్నీ మొత్తంగా అభ్యసించారు.

పుట్టినింటి పేరు బుద్ధవరపు. మెట్టినింటి నామధేయం బుర్రా. వీటిల్లో బుద్ధి సంబంధ అనుబంధముంది. అందుకేనేమో ఆమెలో అంతంత ప్రవీణత.

సంస్కృతం తనకు కొట్టిన పిండి. ఇతర భాషల్లో సైతం నిపుణత సంతరించుకున్నారు. కమలాదేవి రాసిన పుస్తకాల పేర్లను చూస్తే చాలు ` అవి ఎంతటి స్థాయిగలవో, ప్రామాణికమైనవో అవగతమవుతుంది.

  1. ‘ఛందో హంపి’ అనేది రెండు భాగాల కావ్యం (ఇది అప్పట్లోనే విశ్వవిద్యాలయ స్థాయి పాఠ్యపుస్తకం.
  2. మందాక్రాంత కవితా స్రవంతి. మరొక రచనాకృతి పేరు, లోపల ఉన్నవన్నీ గంభీర భావవాహినులు.
  3. అనుష్టుప్ప. ఇది వేరొక పుస్తకం. ఛందో సూచనగా ప్రశస్తం. అది వృత్త ఛందస్సు కంటే ముందటిది. ఇంకొక గ్రంథం పేరు విస్తారతను ప్రస్ఫుటం చేస్తుంది.

‘శ్రీ వైశాఖ వేంకట ప్రభుదయం.’ వైశాఖం అనేది ప్రశస్త మాసం. తెలుగు సంవత్సరాలలోనిది. ఆ ప్రాతిపదికన ప్రభూదయం పేరున అక్షరీకరించారు. ఆ మేటి కవయిత్రి.

కవితోపమలు అన్నదీ తన రచనే. నిగమాంతర సంబంధిత కావ్య విశేషం అదంతా. ఇప్పుడు మనం తెలుసుకుంటోంది ఆరు దశాబ్దాల కిందటి ప్రచురణ గురించి. సామగాన ప్రియోదాహరణం.

‘సామగాన’ పదం వినగానే సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్థన్యులు` అనేది తలపు లోనికి రాకమానదు(మహానుభావుల ప్రస్తావన రూపకంగా). ‘భాగవత రామాయణ గీతాది శృతిశాస్త్ర పురాణము మర్మము లన్‌/ శివాది సన్మతముల గూఢములన్‌/ ముప్పటి ముక్కోటి సురాంతరంగముల భావమ్ముల…’ ఇవన్నీ ఇందులో నిక్షిప్తం.

ప్రత్యేకించి తలచుకోవాల్సిన వేరొక గ్రంథం ` సుమలత. పేరులో ఉన్నట్లే రచన తీరులోనూ అత్యంత సరళత్వం.

ఇలా ఎన్నో కావ్యాలు వెలయించారు కమలాదేవి. సుమలత పేరును తలపించే ‘సుమమాల’ అన్నది మరొక ఖండకావ్యం. భావలహరి శీర్షికన వెలయించిన పుస్తకంతోనూ సుప్రసిద్ధులు అయ్యారామె.

పద్య / గద్య కవితల్లో సాటిలేని మేటి. వాటికి పేర్లు పెట్టడంలోనూ నవ్యత, విలక్షణత కనబరచేవారు. ఇవిగో కొన్ని ఉదాహరణలు.

  1. తొలకరి (రుతుపవనాల రాకతో కురిసే తొలివాన) జల్లు అన్నా ఇదే. తొలకరి జల్లు.
  2. పురిటి పాప (ఎంత సహజత్వమో కదా ఈ నామకరణ సరళిలో)
  3. అడవిమల్లె (అడవి మల్లె జీవితం అనేది మనం విన్నదే)

మునుపు ఒక చలన చిత్ర గీతంలో….

సిరిమల్లెలు విచ్చినా, కరిమబ్బులు పట్టినా

తొలకరి వలపే నాలో తొందర చేస్తున్నది

అడవి మల్లె విచ్చినా, అది సిగలో గుచ్చినా

పోతుతీగ కావాలని జాతర చేస్తున్నది

దోపిడి చూపుల దాగుడు మూతలు

అల్లరి అల్లరి పెడుతుంటే… అంటూ కొనసాగుతుంది ఆ పాట. సందర్భం, సారాంశం ఏదైనా ` పదప్రయోగ మూలకం అన్నపుడు కమలాదేవి విరచితమైన ‘అడవిమల్లె’ ఎవరికైనా గుర్తుకు రావాల్సిందే ఏనాటికైనా….

ప్రాంజలి అని వేరొక కవితా శీర్షిక.ప్రాంజలి ప్రభ పేరు విన్నారు కదా మీరు.జ్ఞాన, దైవ సంబంధంగా చూస్తే `

మనిషికి కాంతిని ప్రసాదించేది జ్ఞానం

అదే అతడికి / ఆమెకి శోభస్కరం.

జ్ఞానమన్నది తనలోనే ఉంటుంది, తనను ఉద్ధరిస్తుంది, జన్మను చరితార్థం చేస్తుంది.

ప్రసాదకర్త దైవం కనుక మానవుడు అందించేదే ప్రాంజలి. దివ్యకర్మ, యజ్ఞ, తదితర ప్రకరణాలు దీనిలోనే.

కృశాబ్దాము అనే మాటను ప్రయోగించారు ఆ విదుషీమణి. ఆలోచన లోయలకు వెళ్లి తరచి చూడాలేకానీ ` ఎంతో భావం, అనంత అర్థం నిండి ఉంది ఇందులో. మేధను పదునుపెట్టే శబ్ద చాతురి.

ఘన జీవితం అని గంభీర పదవిన్యాసాన్నీ ప్రదర్శించారీమె. ఘన అంటే… వేదపాఠ విశేషం, పుస్తక అనువర్తితంగా ప్రసిద్ధి, దట్టమైన, దిటవుగల అనే అర్థాలూ ఉన్నాయి. ఇదే విధమైన దృఢతత్వం కమలాదేవి మాటల్లో, రాతల్లో విస్తృతంగా కనిపిస్తుండేది.

ఇంకా తరచి చూసి, అనుశీలన చేసి చూస్తే… శారదాగమనము అని మరొక కవన శీర్షిక.

ఈ అంశాన్ని ‘ఆంధ్ర కవయిత్రులు’ గ్రంథం మరింతగా విపులీకరించింది. పూర్వాపదాలన్నింటినీ నిగ్గుతేల్చింది.

‘శ్రీ వాత్సల్య రసానురంజితము, ఆశీర్వాద విన్యాసలీ

లావిస్మేరము, లస్మదీయ జయవానైభ్యోదయోత్సు రా

జీవమ్ముల్‌, నను గన్నవారి పరమ స్నేహామృతాపాంగముల్‌

సేవింతున్‌ మదభీప్సితార్పితకృతి స్వీకార సంసిద్ధిరకిన్‌

అని ప్రస్ఫుటీకరించారు. ‘సాహితీ రుద్రమ’ అయిన ఆ గ్రంథ రచయిత్రి లక్ష్మీకాంతమ్మ, విశేషించి కమలాదేవి కళాదక్షతను అన్ని విధాలుగానూ ప్రస్తుతించారు.

1908లో జన్మించి, 1976లో అస్తమించిన ఆమె ఎంతో పరిణతికి ప్రతీకగా నిలిచారని సాక్షాత్తు గిడుగు వెంకట సీతాపతి కితాబునిచ్చారు. ఆ ఛందో రూపాలన్నీ మన దేశ జాతీయోద్యమ సంబంధిత రచనలు కావడం విశిష్టం. ఏ గీతమైనా, ఏ గేయమైనా, పద్యమైనా, గద్యమైనా జనహితమే మూలాధారంగా కలం కదిలించారు కమలాదేవి.

తన జీవిత అనుభవాలు, సంఘటనల ప్రభావం వల్లనేమో పలు రచనల్లో విషాదం వ్యక్తమయ్యేది. తన కుటుంబీకుల శాశ్వత నిష్క్రమణతో అంతులేని వ్యధకు గురై, ఆ భావనలనే ప్రక్రియలతో వెల్లడిరచారు.

ఏ పుస్తకం రాసినా, ఎటువంటి శీర్షిక పెట్టినా భావస్ఫురణకే ఆమె ప్రాధాన్యమిచ్చారు. హృదయానుగత పరివేదనను పాఠకలోకం ముందు పరిచారు.

ఇంకా విశేషం, విశిష్టం, ఉదాత్తం, ఉన్మతం, ఆదర్శం ఏమిటంటే… వేద భాగాలను తెలుగులోకి అనువదించే బృహత్తర ప్రక్రియను కమలాదేవి చేపట్టారు.

తెలుగు సాహిత్య చరిత్రను సుసంపన్నం చేశారు. చరిత్రాత్మకతకు అందులో సమధిక ప్రాధాన్యమిచ్చారు. అదే మాదిరిగా కవితాత్మకు కూడా.

కవయిత్రిగా కమలాదేవి పద సమ్మేళనం ఎంతగానో శ్రవణ సుందరం, మధుర సమన్వితం. ఆ రచనల గమనం లయాత్మకతను తలపిస్తుంది. కథన చాతురిని మనముందు నిలుపుతుంది.ప్రసన్న గంభీరం, లలిత మనోహరం, శ్రుతి సుభగ పూరితం. ఆమె సాహితీ యాత్రలో మరెన్నో మజిలీలు.

  1. వృత్తాలు, 2. దండకాలు, 3. తరువోజలు ఎన్నో ఆవిష్కరించారు.

మాన వదన అనడంలో, అళిమిభునం అని రాయడంతో అపార చాతురి దర్శించారు. ప్రతీ రచనకీ సామాజిక ప్రయోజనం, హితం ఆధారప్రాయాలని ప్రకటించారు.

కాంక్ష కొలువు అనే పేర్లలో సరళీకృత భావన మధురిమ తొంగిచూస్తుంది. నిద్రాదేవి అని రచన చేయడంలో అంతర్లీనంగా నిర్వేదం ధ్వనిస్తుంది.ఎన్ని రూపచిత్రణలు చేసినా, తనదైన మార్గాన్ని స్పష్ట పరిచారు కమలాదేవి. వైవిధ్యం, నవ రసావిష్క రణలకు ఉదాహరణలుగా నిలిచేవే తన కావ్యాలన్నీ!

పతి మాటే తన బాట కాగ, బంగారు సంతతి, సాహిత్య కళా వినోది యగుచున్‌, సంగీత సరస్వతిjైు, సర్వజనాభినందితగుణ….

ఈ అన్నీ రచనా రమణి కమలాదేవికి ఆసాంతం వర్తిస్తాయి.

సాహితీ జగతి రాజిలు రత్నదీపమై…అని మనమూ అభినందన శతాలను సమర్పిద్దాం.

About Author

By editor

Twitter
Instagram