నేతాజీ- 37

– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

అనుమానం లేని చోట అనుమానాలు పెట్టటంలో మన నేతాశ్రీలు అఖండ ప్రజ్ఞావంతులు. విమాన ప్రమాదంలో నేతాజీ సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌మరణించి ముప్పావు శతాబ్దం గడిచాక కూడా ఆయన ఏమయ్యాడన్నది ప్రపంచం దృష్టిలో అంతు చిక్కని మిస్టరీ. కాలం గడిచే కొద్దీ చిక్కుముడులు విడివడకపోగా ఇంకా ఇంకా జటిలమవటం ఆశ్చర్యం. వాస్తవానికి అసలు విషయం వడ్లగింజలో బియ్యపు గింజ. తీరికూర్చుని దానిని జవాబు దొరకని బేతాళప్రశ్నగా మార్చిన ఘనులు మన జాతీయ నాయకమ్మన్యులు. మాటల్లో, చేతల్లో లేనిపోని అపోహలకు, అపార్థాలకు తీరికూర్చుని తావు ఇవ్వటం వారి ప్రత్యేకత.

నమ్ముతారో లేదో! అర్థంపర్థం లేని ‘బోస్‌ ‌మిస్టరీ’కి ఆద్యుడు వేరెవరో కాదు. సాక్షాత్తూ మహాత్మా గాంధీ ! బోస్‌ ‌మరణ వార్త వినగానే ‘అతడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు’ అన్న మహాత్ముడు అంతలో మనసు మార్చుకుని అతడికి శ్రాద్ధకర్మలు తొందరపడి చేయవద్దని సుభాస్‌ ‌కుటుంబాన్ని వారించాడు. ‘చితాభస్మాన్ని చూపించినా సరే సుభాస్‌ ‌మరిలేడంటే నేను నమ్మను’ అని 1945 డిసెంబరు 30న ఆయన ప్రకటించాడు. ‘సుభాస్‌ ‌బతికే ఉన్నాడు. తగిన సమయం కోసం ఎక్కడో వేచి ఉన్నాడు’ అని గాంధి అన్నట్టు 1946 జనవరి 6న ‘న్యూయార్క్ ‌టైమ్స్’ ‌పత్రిక ప్రచురించింది. ‘సుభాస్‌ ‌మరణించ లేదు. అతడు ఆ విధంగా పోయేవాడు కాదు’ అని 1946 ఫిబ్రవరి 3న ‘హరిజన్‌’ ‌పత్రికలో రాశాడు.

ఆ తరవాత మరణ సమయంలో నేతాజీ పక్కనే ఉన్న హబీబుర్‌ ‌రహమాన్‌ ‌గాంధీజీని కలిసి మాట్లాడాక మహాత్ముడు ‘హరిజన్‌’ ‌పత్రిక (7-4-1946)లో తూనాబొడ్డు అన్నాడిలా:

I had nothing but my instinct to tell me that Netaji was alive. No reliance can be placed on such unsupported feeling.On the other hand there is strong evidence to counteract the feeling. Capt. HabiburRahaman has said he was present at the time of Netaji’s death and has brought back his charred wrist watch. In the face of these proofs, I appeal to everyone to forget what I have said and, believing in the evidence before them, reconcile themselves to the fact that Netaji has left us.
[Collected Works of Mahatma Gandhi, vol. 90, p.163]

(నేతాజీ బతికే ఉన్నాడు అని చెప్పేందుకు నా అంతర్వాణి మినహా నా దగ్గర ఏమీలేదు. రుజువు లేని అటువంటి ఫీలింగు మీద ఆధారపడటానికి వీలులేదు. పైగా ఆ ఫీలింగు సరికాదు అనటానికి బలమైన సాక్ష్యం ఉన్నది. నేతాజీ మరణ సమయంలో తాను పక్కనే ఉన్నానని కెప్టెన్‌ ‌హబిబుర్‌ ‌రహమాన్‌ ‌చెప్పాడు. కాలిపోయిన అతడి రిస్టు వాచిని కూడా రహమాన్‌ ‌పట్టుకొచ్చాడు. ఈ రుజువులు కనపడుతు న్నందున నేను అన్నదానిని మరచిపోవాలనీ, ఎదుట ఉన్న ఈ రుజువులను విశ్వసించి, నేతాజీ మనలను వదిలి వెళ్లాడన్న వాస్తవంతో రాజీపడాలని అందరికీ మనవి చేస్తున్నాను.)

అప్పటిదాకా నేతాజీ బతికే ఉన్నాడనటానికి తన వద్ద సాక్ష్యం ఉన్నదని చెపుతూ వచ్చిన మహాత్ముడు ‘అంతర్వాణి మినహా ఏ సాక్ష్యమూ లేదు’ అని ఆలస్యంగానైనా స్పష్టం చేయటం మంచిదే. ప్రత్యక్ష సాక్షి వచ్చి చెప్పాక తన వెనుకటి అభిప్రాయాన్ని సవరించుకుని నేతాజీ ఇక లేడన్న యథార్థాన్ని గాంధీగారు అంగీకరించటం, తాను వెనుక అన్నదానిని పట్టించుకోవద్దని ప్రజలకు చెప్పటం వరకూ బావుంది. అంతటితో ఆయన ఊరుకొని, సవరించుకున్న అభిప్రాయానికి కట్టుబడి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. కాని హబీబుర్‌ ‌రహమాన్‌ ‌మాటలను నమ్మవచ్చని చెప్పిన వాడే మళ్ళీ నాలుక మడత వేశాడిలా:

“Rahaman just gave me a soldier’s statement. I know the Guru was not telling the truth and the Chela was also not telling the truth.”

(‘‘రహమాన్‌ ‌నాకు ఇచ్చింది ఒక సైనికుడి ప్రకటన. నిజాన్ని గురువూ చెప్పటం లేదు. శిష్యుడూ నిజం చెప్పటం లేదని నాకు తెలుసు’’)

అంటే- నేనన్న మాటను నమ్మకండి. రహమాన్‌ ‌నిజం చెప్పటంలేదని తెలిసే అతడిని నమ్మండని ఉత్తుత్తిగా అన్నానంతే అని భలే మహాత్ముడు చెప్పకనే చెప్పాడు.

మరికొన్ని వారాల తరవాత భారతదేశం మతకల్లోలపు ఘోరకలిలో అతలాకుతలమయింది. మతహింసను అదుపుచేయటంలో విఫలమయ్యారని నెహ్రూ, పటేల్‌ల మీద చిరాకు పడుతూ, ‘‘ఈ సమయంలో నా కొడుకు నా దగ్గర ఇక్కడ ఉంటే బావుండేది’’ అన్నాడు గాంధీజీ.

‘‘ఎవరు? మీ అబ్బాయి హరిలాలా?’’ అని అడిగాడు పక్కనే ఉన్న కాంగ్రెసువాది.

‘‘వాడు కాదు. సుభాస్‌’’

 ‘‘‌కాని అతడు చనిపోయాడు కదా?’’

 ‘‘లేదు. రష్యాలో ఉన్నాడు’’ అని బదులిచ్చాడు గాంధీ.

[Quoted in What Happened To Netaji?, Anuj Dhar, P.12 ]

‘నా దగ్గర ఏ సాక్ష్యమూ లేదు. నేతాజీ బతికే ఉన్నాడని నా మనసు అలా చెప్పిందంతే’ అని గాంధీ మొదట అన్నప్పుడే – నమ్మకమైన సమాచారం లేకుండా అంతటివాడు అలా చెపుతాడా? సుభాస్‌ ‌బోస్‌ ‌దగ్గరి నుంచి రహస్య సందేశం ఏదో మహాత్మాజీకి అందే ఉంటుంది అని జనం అనుకు న్నారు. బ్రిటిష్‌ ‌మహా సామ్రాజ్యపు ఇంటలిజెన్స్ ‌వర్గాలు కూడా అలాగే ఊహించి కంగారు పడ్డాయి. నిబతీ “Our pressing anxiety is to get the truth whether Bose is actually and permanently dead. Government wants to know where they stand over the matter in view of the claims by Gandhi and others in India that he is still alive” (బోస్‌ ‌నిజంగా, పర్మనెంటుగా మరణించాడా లేదా అనేది తేల్చుకోవాలని మన ఆరాటం. అతడు ఇంకా బతికే ఉన్నాడని గాంధీలాంటివారు చెపుతున్నందున ఈ విషయంలో నిజమేమిటో తెలుసుకోవాలని ప్రభుత్వం కోరుతున్నది) అని 1946 ఫిబ్రవరి19 తేదీతో ఉన్న ఇండియన్‌ ఇం‌టలిజెన్స్ ‌బ్యూరో అధికారిక పత్రం ఇందుకు దృష్టాంతం.

సుభాస్‌ ‌రష్యాలో ఉన్నాడని గాంధీ నేరుగా అనటంతో పుకార్లు ఇంకా పురివిప్పాయి. పోనుపోను ‘‘రష్యాలో నేతాజీ’’ కథ చిలవలు పలవలుగా బహుళ ప్రచారమయింది. అది ఎంతలా సంచలనమయిం దంటే 1950 నవంబరులో న్యూదిల్లీలోని సీఐఏ ఏజెంటు ‘‘సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌సజీవంగా ఇప్పుడు సైబీరియాలో ఉన్నాడు. వెనక్కి రావటానికి అదను కోసం ఎదురు చూస్తున్నాడు’’ అని దిల్లీలో వదంతి బలంగా ఉంది అని వాషింగ్టన్‌కు రహస్య నివేదిక పంపాడు. ఆ రహస్య సమాచారాన్ని బ్రిటిష్‌ ఇం‌టెలిజెన్సుతో సీఐఏ పంచుకుంది. అమెరికన్‌ ‌సీఐఏ కూడా ద్రువీకరించేసరికి తాము వింటున్న వదంతి నిజమే అయి ఉంటుందని బ్రిటిషు వారికి కంగారు ఎక్కువయింది. 1964లో కూడా సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌రష్యన్‌ ‌సైబీరియాలో ఉన్నట్టు సీఐఏ అనుమానిస్తూనే ఉంది. సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌రష్యా భూభాగంలోకి ప్రవేశించాడని ఇంటలిజెన్స్ ‌రిపోర్టులు బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి వరసపెట్టి అందసాగాయి.

అదీ సత్యప్రవక్త మహాత్మా గాంధీగారి అలవోక పలుకుకున్న పవరు!

అవసరం లేని చోట సందేహానికి, తద్వారా పెను వివాదానికి ఆస్కారమివ్వటం వరకూ ఆక్షేపణీయమే అయినా అందులో గాంధీజీకి దురుద్దేశాలను ఆపాదించటం సరికాదు. అంతకుముందు సుభాస్‌ ‌మీద ఉన్న కోపం పోయి, గాంధీ గారు చివరి దశలో అతడిని విశేషంగా అభిమానించాడన్నది వాస్తవం. ఆ అభిమానంతోటే సుభాస్‌ ‌మరణవార్తను జీర్ణించుకోలేక మహాత్ముడు అలా విష్‌ ‌ఫుల్‌ ‌థింకింగ్‌ ‌చేసి ఉంటే అది అర్థం చేసుకోదగ్గదే.

కాని-నెహ్రూ సంగతి వేరు. ఆ మహానుభావుడికి సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌పేరు చెపితే భయం. ఆతడు బతికి ఉన్నాడన్న మాట వింటేనే పండిట్‌జీకి వణుకు జ్వరం. నెహ్రూను పట్టిన బోస్‌ ‌ఫోబియాకు ఒక ఉదాహరణ.

అది 1945 డిసెంబరు చివరివారం. ఐఎన్‌ఎ ‌డిఫెన్సు కమిటీలో స్టెనోగ్రాఫరుగా పనిచేస్తున్న శ్యామ్‌లాల్‌ ‌జైన్‌కు ఓ సాయంత్రం జవాహర్లాల్‌ ‌నెహ్రూ ఫోన్‌ ‌చేశాడు. టైపింగ్‌ ‌పని చాలా ఉంది. టైప్‌ ‌రైటరు తీసుకుని ఐఎన్‌ఎ ‌డిఫెన్సు కమిటీ సెక్రెటరీ అసఫాలీ ఇంటికి రమ్మని పిలుపు. శ్యామ్‌ ‌లాల్‌ ‌వెళ్ళాడు. కొన్ని కాగితాలు టైపు చేయించాక నెహ్రూ తన జేబులోంచి ఒక కాగితం తీసి దాన్ని నాలుగు కాపీలలో టైపు చేయమన్నాడు. అది చేతి రాతలో ఉంది. దానిలోని విషయం ఏమిటంటే-

సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌సైగాన్‌ ‌నుంచి విమానంలో 1945 ఆగస్టు 23న మధ్యాహ్నం 1-30కి మంచూరియాలోని డైరేన్‌ ‌చేరాడు. అది జపనీస్‌ ‌బాంబర్‌ ‌ప్లేన్‌. ‌దాని నిండా బంగారం కడ్డీలు, నగలు, ఆభరణాలు ఉన్నాయి. నేతాజీ రెండు చేతుల్లో అటాచి కేసులు పట్టుకుని విమానం నుంచి దిగాడు. అరటిపళ్లు, టీ తీసుకున్నాక ఇంకో నలుగురు వెంటరాగా దగ్గరే వేచి ఉన్న జీపు ఎక్కాడు. అతడి వెంట వెళ్ళిన వారిలో జపాన్‌ ‌జనరల్‌ ‌షిదేయి ఉన్నాడు. జీపు రష్యన్‌ ‌టెరిటరీ వైపు వెళ్ళింది. 3 గంటల తరవాత ఖాళీగా తిరిగి వచ్చింది. తరలింపు అయిపోయిందని పైలట్‌కు చెప్పగానే విమానం వెళ్లిపోయింది.

ఈ సమాచారం ఉన్న పత్రాన్ని టైపు చేశాక నెహ్రూ తన లెటర్‌పాడ్‌ ‌నుంచి నాలుగు షీట్లు శ్యామ్‌లాల్‌ ‌జైన్‌ ‌చేతికి ఇచ్చి, ఒక లెటర్‌ ‌డిక్టేట్‌ ‌చేశాడు. దానికి 4 కాపీలు తీయమన్నాడు. అప్పుడు డిక్టేట్‌ ‌చేసిన ఉత్తరంలో ఇలా ఉన్నట్టు టైపు చేసిన వాడికి జ్ఞాపకం.

Mr. Clement Attlee
Prime Minister
…………..
Dear Mr. Attlee
I understand from a reliable source that Subhas Chandra Bose, your war criminal, has been allowed to enter Russian territory by Stalin. This is a clear treachery and betrayal of faith by the Russians. As Soviet Russia has been an ally of the British-Americans, it should not have been done. Please take note of it and do what you consider proper and fit.
[ Quoted in Netaji Subhas Chandra Bose, The Great Revolutionary, V.R.Adiraju, pp.469-470]

(మిస్టర్‌ ‌క్లెమెంట్‌ అట్లీ,

ప్రధానమంత్రి.

 డియర్‌ ‌మిస్టర్‌ అట్లీ

 మీ వార్‌ ‌క్రిమినల్‌ ‌సుభాస్‌ ‌చంద్రబోస్‌ను రష్యన్‌ ‌భూభాగంలోకి స్టాలిన్‌ అనుమతించినట్టు నాకు విశ్వసనీయంగా తెలిసింది. ఇది రష్యన్ల విశ్వాస ఘాతుక చర్య. బ్రిటిష్‌ – అమెరికన్లకు సోవియట్‌ ‌రష్యా మిత్రరాజ్యం కాబట్టి ఇలా చేసి ఉండకూడదు. ఈ విషయం గమనించి, దీనిపై మీరు ఉచిత మనుకునే చర్య చేపట్టగలరు.)

అనంతరకాలంలో నేతాజీ మిస్టరీపై విచారణ జరిపిన ఖోస్లా కమిషన్‌ ‌ముందు ఎస్‌ఎల్‌ ‌జైన్‌ ‌ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన వాజ్ఞ్మూలమిది. పావు శతాబ్దం వెనుకటి ఘటనను గుర్తు చేసుకోవటం కాబట్టి పై లేఖలోని పదాలు, వాక్యాలు సరిగ్గా పై విధంగానే ఉండి ఉండక పోవచ్చు. సారాంశం అదే. జైన్‌ ఇచ్చిన పై సాక్ష్యానికి విచారణ కమిషన్‌ ‌కాని, ఆ సమయాన అక్కడే ఉన్నప్రభుత్వ న్యాయవాది గాని అభ్యంతరం తెలపలేదు.

తన ప్రధాన ప్రత్యర్థి సుభాస్‌ ‌చంద్ర బోస్‌ ‌రష్యా చేరాడని ఎక్కడి నుంచో ఎవరో ఉప్పందించగానే గంగవెర్రులెత్తి అతడు మీ వార్‌ ‌క్రిమినల్‌ ‌కాబట్టి అతడిని మీరే ఏదో ఒకటి చేయండంటూ బ్రిటిష్‌ ‌ప్రధానమంత్రికి హడావుడిగా ఉత్తరం రాయటాన్ని బట్టే నెహ్రూకు బోస్‌ అం‌టే ఎంత ద్వేషమో అర్థమవుతుంది. ఆ సమయాన నెహ్రూ ఇంకా ప్రభుత్వాధినేత కాలేదు. కాబట్టి ఇంటలిజెన్స్ ‌వేగుల ద్వారా నిజానిజాలు నిర్ధారించుకునే ఆస్కారం అతడికి లేకపోయింది కాబోలు అనుకుందామా? స్వతంత్ర భారతానికి ప్రధానమంత్రి అయ్యాక కూడా నెహ్రూకు బోస్‌ ‌దడ తగ్గలేదు. రెండు దశాబ్దాలపాటు దేశాన్ని ఏలినంతకాలమూ సుభాస్‌ ‌చంద్రబోస్‌ ఆచూకీ తెలుసుకోవటం కోసం అతడి సన్నిహిత బంధువుల మీద నెహ్రూ గట్టి నిఘా పెట్టే ఉంచాడు. వారి ఫోన్ల మీద, వారికి వచ్చే, వారు రాసే ఉత్తరాల మీద నిరంతరం నిఘా పెట్టాడు. సుభాస్‌ అన్న కొడుకులు అమియా, శిశిర్‌ ‌లాంటి వారు విదేశాలకు వెళ్ళినా వారి కదలికలను సర్కారీ వేగులు అనుక్షణం కనిపెట్టేవారు. ఇంకా సిగ్గుచేటు విషయమేమిటంటే స్వాతంత్య్రం వచ్చాక కూడా సుభాస్‌ ‌చంద్రబోస్‌కు సంబంధించి ఎక్కడ ఏ అలికిడి అయినా దానిని నెహ్రూ ప్రభుత్వం బ్రిటిషు ఇంటెలిజెన్సు వారికి చేరవేస్తూనే ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో క్లాసిఫైడ్‌ ‌ఫైళ్ళను బహిర్గతం చేసినప్పుడు నెహ్రూ నిర్వాకం బయటపడి దేశమంతటా మీడియాలో పెద్ద రచ్చ అయింది.

నెహ్రూ బోలుతనం, అవకాశవాదం, పలాయన మనస్తత్వం బాగా ఎరిగినా సుభాస్‌కు నెహ్రూ మీద ద్వేషం లేదు. ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌లో ఒక బ్రిగేడ్‌కు నెహ్రూ పేరు పెట్టటమే దానికి రుజువు. కానీ నెహ్రూకు మాత్రం సుభాస్‌ ‌సింహస్వప్నం. అతడు ఎప్పుడు ఏ వైపు నుంచి దేశంలోకి ఊడిపడతాడో, తనను గెంటేసి తన కుర్చీలో ఎక్కడ కూచుంటాడో నన్న వెర్రి భయం నెహ్రూను బతికినంతకాలం అకారణంగా వెంటాడుతూనే ఉంది. సుభాస్‌ ‌కూడగట్టిన, అతడికి విధేయమైన సైన్యం అన్న కారణం తోటే ఐఎన్‌ఎ ‌మీద, దాని కమాండర్ల మీద నెహ్రూ తగని వైముఖ్యం చూపేవాడు.

  నేతాజీ ఒద్దికలో దేశభక్తిని, స్వాతంత్య్ర స్ఫూర్తిని అణువణువునా నింపుకున్న ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌యోధులు ప్రాణాల కంటే ఆశయం, ఆదర్శం మిన్నగా తలిచే ధీరులు. కల్నల్‌ ‌గురుబఁ్‌ ‌సింగ్‌ ‌ధిల్లాన్‌ ‌తన “From My Bones” జ్ఞాపకాలలో పేర్కొన్న ఇద్దరు ఐఎన్‌ఎ ‌సీక్రెట్‌ ‌సర్వీస్‌ ‌మేజర్లు మఘర్‌ ‌సింగ్‌, అజ్మీర్‌ ‌సింగ్‌లు ఎర్రకోటలోని సలీంగడ్‌ ‌చెరలో తమను ప్రతిరోజూ చిత్రహింసలు పెట్టినా ఐఎన్‌ఎ ‌రహస్యాలను బ్రిటిషు సర్కారుకు చెప్పలేదు. భయానక బాధలను భరించలేక చివరికి తామే రహస్యాలు వెళ్ళగక్కుతామేమోనన్న భయంతో వారు గార్డు చేతిలో రైఫిల్‌ ‌లాక్కుని ఆత్మహత్య చేసుకున్నారట. ఐఎన్‌ఎ ‌తెగువ, నిబద్ధత అలాంటివని తెలుసు కాబట్టే ఐఎన్‌ఎ ‌నీడ కూడా తన జమానాలో ఎక్కడా పడకుండా, కర్మం చాలక బోస్‌ ఎప్పుడైనా ఊడిపడితే అతడికి ఐఎన్‌ఎ ‌వారు అందుబాటులో ఉండే ప్రమాదం రాకుండా నెహ్రూ పండితుడు కడు జాగ్రత్త పడ్డాడు.

రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక అంతర్జాతీయంగా ‘వార్‌ ‌క్రిమినల్స్’ ‌మీద విచారణలు ముమ్మరంగా సాగుతున్నాయి. నేతాజీ పేరును కూడా వార్‌ ‌క్రిమినల్స్ ‌జాబితాలో చేర్చినట్టు అప్పట్లో అందరూ చెప్పుకునేవారు. కాబట్టి ఒక వేళ ప్రాణాలతో ఉన్నా, ఆయన దొరికిపోతే వార్‌ ‌క్రిమినల్‌గా విచారించి ఎక్కడ శిక్షిస్తారోనన్న భయం నేతాజీ అభిమానులకు ఉండేది. నేతాజీ దొరికితే వార్‌ ‌క్రిమినల్‌ ‌కింద విచారణకు అతడిని అప్పగించటానికి నెహ్రూ, ఆజాద్‌, ‌జిన్నాలు బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి అంగీకారం తెలిపారని నేతాజీకి బాడీ గార్డుగా పని చేసిన ఉస్మాన్‌ ‌పటేల్‌ అనంతరకాలంలో ఖోస్లా కమిషన్‌ ‌ముందు సాక్ష్యమిచ్చాడు. (అందులో గాంధీ పేరు కూడా అతడు చేర్చాడు. కానీ అది నమ్మశక్యం కాదు.) మౌలానా ఆజాద్‌ ఆ ‌సంగతి తనకు ధృవీకరించినట్టు పటేల్‌ ‌పేర్కొన్నాడు. ఇందులో నిజం ఏమైనప్పటికీ నెహ్రూ ప్రభుత్వానికీ, లండన్‌ ‌కూ నడుమ అలాంటి ఒప్పందం ఏదో ఉన్నట్టు స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశంలో విస్తృతంగా వినవచ్చేది.

అయినప్పటికీ- తమ ప్రియతమ నాయకుడు సజీవంగా ఉన్నట్టు వదంతులు ప్రబలిన దృష్ట్యా సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలని 1946 నుంచీ నేతాజీ అనుచరులు డిమాండు చేయసాగారు. కానీ ఎంక్వైరీ అన్న పదం వినపడితే చాలు నెహ్రూ అంతెత్తున ఎగిరిపడేవాడు. 1946 అక్టోబరులో ఒకసారి అలాగే బహిరంగంగా మండిపడి ‘సుభాస్‌ ‌చంద్ర బోస్‌ ‌సజీవంగా ఉన్నాడన్న అనుమానానికి ఎంతమాత్రం ఆస్కారం లేదు. ఎంక్వైరీ అసలు అవసరమే లేదు – అని ఆయన బల్లగుద్ది చెప్పాడు. దానిమీద పార్లమెంటులో రచ్చ అయింది. బోస్‌ ‌మరణించాడనటానికిగాని, బతికే ఉన్నాడనటానికి గాని మీ ప్రభుత్వం వద్ద ఏమైనా రుజువు ఉన్నదా అని కౌన్సిల్‌ ఆఫ్‌ ‌స్టేట్స్ (అప్పటి ఎగువ సభ)లో అహ్మద్‌ ‌జాఫర్‌ అడిగాడు. ‘లేదు’ అని అప్పటి హోమ్‌ ‌మంత్రి సర్దార్‌ ‌పటేల్‌ ‌సమాధాన మిచ్చాడు. బోస్‌ ‌మరణించాడా, బతికి ఉన్నాడా అనే దానిమీద మీదగ్గర కచ్చితమైన సాక్ష్యం ఉన్నదా – అని సర్దార్‌ ‌మంగళ సింగ్‌ ‌రెట్టించి ప్రశ్నించాడు. “Government are not in a position to make an authoritative statement on the question” (ఈ విషయమై ఆధికారిక ప్రకటన చేయగలిగిన స్థితిలో ప్రభుత్వం లేదు) అని నవంబర్‌ 7‌న హోమ్‌ ‌మంత్రి జవాబు ఇచ్చాడు. అయినా మంగళ్‌ ‌సింగ్‌ ‌వదలలేదు. ‘బోస్‌ ‌మరణించాడు అని కొద్ది రోజుల కింద సభా నాయకుడు జవాహర్లాల్‌ ‌నెహ్రూ ప్రకటన చేశారు. అది ప్రభుత్వ అభిప్రాయమా? ఆయన వ్యక్తిగత అభిప్రాయమా?’ అని ఆయన అడిగాడు.

“Government of India have no view,either way” (భారత ప్రభుత్వానికి దీనిపై ఏ అభిప్రాయమూ లేదు’’ అని హోమ్‌ ‌మంత్రి పటేల్‌ ‌సూటి జవాబు.

ప్రభుత్వం దగ్గర ఏ రుజువూ లేదని హోమ్‌ ‌మంత్రి చెపుతున్నప్పుడు – అసలు దర్యాప్తే అవసరం లేదు. బోస్‌ ‌ముమ్మాటికీ మరణించాడు అని ప్రధానమంత్రి అంత గట్టిగా ఎలా వాదిస్తున్నాడు? అందులోని మతలబు ఏమిటి? అన్న శంక సహజంగానే ఉత్పన్నమయింది. యావద్దేశానికీ ఆరాధ్యుడు, స్ఫూర్తిదాత, స్వాతంత్య్ర ప్రదాత అయిన మహానాయకుడు నిజంగా విమాన ప్రమాదంలో మరణించాడా లేదా అన్న విషయంలో అలముకున్న సందేహాలను నివృత్తి చేయటానికి విచారణ ఎందుకు జరిపించరు? జాతి మొత్తానికీ తీవ్ర వ్యాకులత కలిగిస్తున్న అంశం మీద దర్యాప్తునకు నెహ్రూ ఎందుకు వెనకాడు తున్నాడు ? ఎంక్వైరీ జరిపిస్తే అతడికి వచ్చే నష్టమేమిటి-అన్న అనుమానం అంతకంతకూ పెరిగింది. కానీ ఎవరేమన్నా, ఎన్ని తీర్ల అడిగినా నెహ్రూ ధోరణి మారలేదు. 1955 సెప్టెంబరు 29న పార్లమెంటులో హెచ్‌వీ కామత్‌ ‌ప్రశ్నించినప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ ‘‘ఇలాంటి విషయంలో సంతృప్తికరమైన విచారణను ఒక్క జపాన్‌ ‌ప్రభుత్వం మాత్రమే జరిపించగలదు. విషయం మొత్తం జపాన్లో ఉన్నది. జపాన్‌ ‌ప్రభుత్వం మీద విచారణ కమిటీని మనం రుద్దలేము. ఒకవేళ వారు విచారణ జరపదలుచుకుంటే మేము సంతోషంగా సహకరించి, చేయగలిగిన సహాయమంతా చేస్తాం. చొరవ ఏదైనా జపాన్‌ ‌ప్రభుత్వం నుంచే రావాలి’ అని తన తలనెప్పిని అతి తెలివిగా టోక్యో మీదికి బదలాయించి చేతులు దులిపేసుకున్నాడు.

పార్లమెంటు లోపలా, వెలుపలా ఎప్పుడు ఈ ప్రస్తావన వచ్చినా ఇదే స్టీరియో టైప్‌ ‌సమాధానాన్ని నెహ్రూ వినిపించటంతో ఇక అతడిని నమ్ముకుని లాభం లేదని ఐఎన్‌ఎ ‌ముఖ్యులు, నేతాజీ సహచరులు వేరే దారి ఆలోచించారు. భారత ప్రభుత్వం ప్రమేయం లేకుండా, ప్రభుత్వ వనరుల మీద, అధికార యంత్రాంగం మీద ఆధారపడకుండా స్వతంత్రంగా విచారణ చేయించాలని వారు నిశ్చయించారు. ఆ పనికి విఖ్యాత న్యాయమూర్తి జస్టిస్‌ ‌రాధా వినోద్‌ ‌పాల్‌ ‌సరైన వ్యక్తి అని స్థూలంగా ఏకీభావం కుదిరింది. దరిమిలా 1955 సెప్టెంబరు 6న కోల్‌కతాలో నేతాజీ మెమోరియల్‌ ‌కమిటీ ముఖ్యులు సమావేశయ్యారు. షానవాజ్‌ఖాన్‌ అధ్యక్షత వహించాడు. అప్పటికి అతడు కాంగ్రెస్‌ ఎం‌పి.

ఎర్రకోట విచారణల పుణ్యమా అని మిగతా ఇద్దరితో పాటు షానవాజ్‌ ‌పేరు కూడా దేశంలో మారుమోగింది. అతడు కూడా బోస్‌ ‌మరణ వార్తల మీద అపనమ్మకం వ్యక్తపరచినట్టు అప్పటికే ఇంటలిజెన్స్ ‌వేగుల భోగట్టా. నేతాజీ మిస్టరీపై అధికారిక విచారణకు నెహ్రూ ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాబట్టి మనమే ఏదో ఒకటి చెయ్యాలని కోలకతా మీటింగులో షానవాజ్‌ ఉత్సాహంగా మాట్లాడాడు. పబ్లిక్‌ ‌ఫండింగ్‌తో నాన్‌ అఫీషియల్‌ ‌విచారణ కమిటీని వేయాలని, దానికి నాయకత్వం వహించవలసిందిగా జస్టిస్‌ ‌రాధా వినోద్‌ ‌పాల్‌ను కోరాలని సమావేశం తీర్మానించింది. ఆ ఎంక్వైరీ కమిటీకి ప్రభుత్వం నుంచి ప్రతికూలత లేకుండా, కావలసిన సహకారం అందేట్టు చేయటానికి తాను ప్రధానమంత్రితో మాట్లాడతానని షానవాజ్‌ అడగకుండానే మాట ఇచ్చాడు.

అంతలో అనుకోనిది జరిగింది. విచారణ కథ ఎవరూ ఊహించని మలుపు తిరిగింది.

About Author

By editor

Twitter
Instagram