‌లతాజీ… ఈ మూడు అక్షరాలే కోట్లాది గుండెల్లో మారుమ్రోగుతున్నాయి. దేశవిదేశాల్లోని అనేక భాషల వారి మనోమందిరాల్లో ఆమె పాటలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు కొనసాగుతున్న ఈ తరుణంలో లతా మంగేష్కర్‌ ‌పేరు అందరూ, ప్రతిఒక్కరూ తలుస్తున్నారు. తన గాన మధురిమ ఏడున్నర దశాబ్దాలు సమస్థాయిన సాగి, వజ్ర సమానరీతిన అఖండతను పరిపూర్ణతను సొంతం చేసుకుంది.

ఆ భారతరత్న, గాయనీరాణి దేశ సమైక్యతా సమగ్రతలకు స్వర ప్రతీక. సంగీత ప్రపంచానికి ఆమె మకుటమున్న సామ్రాజ్ఞి అన్నది నిత్యసత్యం. ఆ రంగంతో పాటు మరెన్నో స్థాయిల్లో జీవన సాఫల్యం అందుకున్నారన్నది జగత్‌ ‌విఖ్యాతం. ఏ విభాగంలో అడుగుపెట్టినా అద్భుత నిబద్ధత కారణంగా అగ్రతను నిలబెట్టుకుంటూ వచ్చారు. వైద్యసేవల మహావ్యవస్థను స్థాపించి, పర్యవేక్షించి, సామాజిక బాధ్యతను నెరవేర్చారు. కేంద్ర చట్టసభ నియమిత ప్రతినిధిగా తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎప్పుడూ ముందే ఉన్నారు. మన భారతీయ సాంస్కృతిక వారసత్వానికి పతాకగా నిలిచినందుకే ఆమె శాశ్వత. వజ్రోత్సవమనేది సర్వసహజంగా సంస్థలకు వర్తించేదైనా, సేవానిరతి రీత్యా ఆమెకీ సంబంధించేదే. ఎందుకూ అంటే – తాను సేవా సహాయశక్తి, సంస్థాగత యుక్తిని పరివ్యాప్తం చేసిన బహుచక్కని వ్యవస్థ. ఎంత చెప్పినా, ఎన్నెన్ని రాసినా… ఇంకా చెప్పాల్సింది, ఇంకెంతో రాయాల్సింది అంతకు రెట్టింపు ఉంటుంది.

సెప్టెంబర్‌ 28, 1929‌న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉదయించి, ఫిబ్రవరి 6, 2022న 92 ఏళ్ల ప్రాయాన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అస్తమించిన హేమ (తొలిపేరు) అక్షరాలా బంగారమే. మొదటినుంచీ చివరివరకూ ఆ ఏకైక గానకోకిల సముపార్జించిన పురస్కృతులు పరంపర జాబితాను రాయాలంటే ఎన్ని కాగితాలైనా సరిపోవు. కేంద్ర ప్రభుత్వ అధినేతలు మొదలు మారుమూల గ్రామీణ శ్రోతల దాకా ఎంతగా కలవరించారో పలవ రించారో తేటతెల్లం చేయాలంటే అక్షరాలూ చాలవు. ఆ బహుముఖ ప్రజ్ఞను విఫులీకరించే వివరాలెన్నిం టినో సమాచార, ప్రచార, ప్రసార మాధ్యమాలన్నీ నేటికీ ప్రజానీకానికి అందించేందుకు పోటీలు పడుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో, పాఠక ప్రేక్షక వీక్షకులంతా మరింతగా తెలుసుకొని తీరాల్సినవి ఏమిటంటే..

మరో ఎనిమిదేళ్ల జీవనకాలాన్ని చూసి ఉంటే, శత వసంతాల వారయ్యేవారు లతా మంగేష్కర్‌. ‌మంగేష్‌ అనేది గోవాలోని తన పూర్వికుల ఊరిపేరు. పేరు చివర నకరా పదాన్ని జతచేర్చడం మహారాష్ట్రీ యుల పద్ధతి. ఇదే క్రమంలో లతా హర్దికర్‌ ‌కాస్తా మంగేష్కర్‌ అయ్యారు. కుటుంబ సభ్యులు తండ్రి పేరులోని వ్యవహార దక్షత, తల్లి పరంగా అమృతత్వం, సోదరుడి సహృదయం; సోదరీమణుల ఆశావాదం, ప్రతిభాకిరణం, నిరంతర ఉత్సాహం అన్నీ ఈమెలో చోటుచేసుకున్నాయి. తన మనసు మాదిరే సదా ధరించే వస్త్రాలు తేట తెలుపు. పువ్వు పుట్టిన వెంటనే గుబాళించినట్లు, నాలుగేళ్ల పసి వయసులోనే రాగం తీశారు. తండ్రి నిర్వహించే నాటక ప్రదర్శనలోని ఒక నాయిక ‘లత’ పేరు హేమ స్థానంలోకి వచ్చి చేరింది. పరిణామాల పర్యవసానం పదమూడేళ్లకే ఆమె పనిలో చేరేలా చేసింది. పాడే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. సహృదయుని చొరవతో, తిరిగి అదే తలుపు తట్టింది. తాను మొట్టమొదట పాడినప్పుడు, వయసు పందొమ్మిదేళ్లు. తనది మరాఠీ అయినా; హిందీ పాటల కాలం, అందునా ఉర్దూ ప్రాధాన్యం ఉండటంతో, ఆ భాషనీ అభ్యసించారామె. వస్తున్నా.. అనే అర్థమొచ్చే గీతం ఆలాపించి, అది విస్తృత ప్రాచుర్యం పొందడంతో, ప్రభంజనంలా దూసుకెళ్లారు. అప్పుడు ఆరంభమైన గాత్రవాహిని నిరంతరాయంగా సాగి ఎందరెందరికో అనుభూతుల వరస పంచింది. అవార్డులే అవార్డులు, పాటల పూదోటలో విహారాలే విహారాలు, రికార్డులే రికార్డులు. నాలుగు పదుల ఏళ్లలో 30 వేలకు పైగా గీతాలు, అదీ 37 భాషల్లో మరిక గిన్నిస్‌ ‌పురస్కారం లతకు కాక ఇంకెవరికొస్తుంది? జాతీయస్థాయి పురస్కృతుల స్వీకరణలు, ప్రపంచ దేశాల్లో సంగీత విభావరుల నిర్వహణలు, సేవా కార్యక్రమాల జోరు అన్నింటిలోనూ మిన్న అనిపించుకున్నారు. జీవన సాఫల్య బహూకృతిని దరిదాపు మూడు దశాబ్దాలనాడే అందుకున్నారు. తానుగా చిత్రనిర్మాణ సంస్థను స్థాపించి; మరాఠీ, హిందీల్లోనూ కొన్నింటిని నిర్మించి; మరికొన్ని సినిమాల్లో నట వైదుష్యంతో మెప్పించి అగ్రేసరురాలినని నిరూపించుకున్నారు. ఆల్బమ్‌ల ఆవిష్కరణలు సరేసరి. అన్నీ కలిపి సహస్రాధిక చిత్రాల్లో స్వర సంపద అందించారు. ఒక మలయాళీ గీతికనూ ఆలాపించి అక్కడి శ్రోతలనూ అలరించి మురిపించారు. ఎవరికి పాడినా, ఏ భాషలో గాత్రం వినిపించినా; ఆ పాత్రలో, ఆ వాతావరణంలో ఆసాంతం ఇమిడిపోవటం అసలైన ప్రత్యేకత.

గొంతంతా అమృతమే

సంప్రదాయానికి తోడుగా జానపదాలు, గజల్స్ ‌మరెన్నింటినో ఆ కంఠం మధుర మనోహరంగా వెలువరించింది. తెలుగులో మొట్టమొదటగా పాడిన ‘నిదురపోరా’ పాట ఆరున్నర దశాబ్దాలు దాటినా ఇవాళ్టికీ మనందరికీ వీనులవిందు చేయడం లేదూ? ‘తెల్లచీరకు’ పాటతో యువ హృదయాల్ని మూడున్నర దశాబ్దాలుగా గిలిగింతలు పెట్టడం లేదూ? జాతీయ పురస్కారం స్వీకరించేందుకు దశాబ్దం కిందట తాను భాగ్యనగరానికి వచ్చి వెళ్లలేదూ? తరాలుగా ఎంతోమందిని తన్మయపరచిన గాత్రం. భౌగోళిక హద్దుల్ని అలవోకగా చెరిపేసిన, ప్రాంతీయ భాషా అంతరాలన్నింటినీ ఒక్కుమ్మడిగా తొలగించిన బహు గొప్పగానం. భావ ప్రపూర్ణత లతాజీ సర్వస్వమని తొలి ప్రధాని నుంచీ కితాబు అందుకున్న విలక్షణత్వం. ‘నా దేశవాసులారా! త్యాగ చరితలను మరింత తలచుకోండి’ అంటూ (యే మేరే వతన్‌కే లోగో, జర ఆంభమే భర్‌లో పానీ, జో షహీద్‌ ‌హుయేహై ఉన్‌కీ, జర అంఖోమే ఖుర్బానీ) పాడి ఆయన ఆనందబాష్పాలకు కారణమైన గొంతు. ఇదే చిరస్మరణీయ దేశభక్తి గీతికా స్రవంతి – 70 ఏళ్లుగా ఈనాటికీ ఆర్ద్రతను నింపుతూనే వస్తోంది. చైనా యుద్ధ అనంతరం అమరవీరుల కుటుంబాలకు దోహదపడేందుకు, విరాళాలు కోరి చలనచిత్ర పరిశ్రమ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇది సుమారు 60 ఏళ్లనాటి మాట. ఆరున్నర నిమిషాల ఆ పాటను ఢిల్లీ మైదానంలో ఆలపించి సంగీత సంచలనాన్ని సృజించారు లతాజీ! అటు తర్వాత, అదే గీత స్వాతంత్య్ర స్వర్ణోత్సవ సంరంభం ముంబయిలో ఏర్పాటైనప్పుడు, ఆ ప్రస్థానం మొత్తాన్ని ఆమే విశదీకరించారు. తాను పరమపదించిన, ఆ గేయకవి ఆవిర్భవించిన రోజు ఒకటే కావడమంటే కాకతాళీయమైనా విశేషమే కదా! రోజూ నిద్ర లేవగానే ఆమె వదనాన్నే చూసి సంభావించుకున్న సంగీత సారథులున్నారు. తొలి పది స్థానాల్లో ఒకటిగా వెలిగిన వందేమాతరం గీతాలాపన లత దేశానురక్తిని చాటిచెప్పింది. ఏకబిగిన కొన్ని గంటలపాటు నిలిచి ఉండి మరీ అభ్యాసం కొనసాగించినప్పుడు తనకు 75 ఏళ్లు. ఆ మహోన్నతి అనంతమని ప్రస్తుతించిన సారస్వత దిగ్గజా లున్నారు. ప్రతీ మాటలోనూ నాణ్యత, రంజింపజేసే మహిమ ఆమెది. అపార నైపుణ్యమంటే ఆ స్వరకోకిలదే. అందుకే ‘ఒకే ఒకరు ఆమె లతా మంగేష్కర్‌’ అన్ని వేనోళ్ల కొనియాడిన సినీ దర్శకులూ ఎందరో ఉన్నారు. తనది చిరకాల గీతయాత్ర. నేపథ్య సంగీతరంగానికి తను దిద్దిందే ఒరవడి.

ఇదీ నిబద్ధత

అలా అన్నీ పురస్కృతులే లేవు. కొన్ని తిరస్కారాలూ ఉన్నాయి. అన్నింటినీ సరిసమానంగా పరిగణించారు లత. ఆ తొలిపాటకు ప్రతిఫలం ఎన్నటికీ అందనే లేదు! కొన్ని రికార్డుల్లో ఆమె పేరు కనిపించనూ లేదు!! ఎవరైనా సరికాని రీతిలో వ్యవహరించినా క్షమ చూపడం తన స్వభావం. అదే ఆసరాగా కొంతమంది అనుచిత రీతిని ప్రదర్శించినా; తాను ఆగ్రహించలేదు. సరికదా, వాళ్లు ఎన్నటికైనా మారాలనే కోరుకున్నారు. అంతటి సహనశక్తి పొందేందుకు ఎంతగానో పరిశ్ర మించారు, పరితపించారు. చివరికి సాధించగలి గారు. తను పాడిన వాటిల్లో ఏవైనా స్వర దోషాలుంటే, సరిచేసుకోవడానికి ఎంత మాత్రమూ వెనకాడేవారు కాదు. సాధన మటుకు ఎప్పటికీ ఆపలేదు. నిత్యమూ సాగిస్తూనే వచ్చారు తప్ప, ఇంతటితో చాలని ఏనాడూ అనుకోలేదు. ‘నా పని నేను చేస్తూ వస్తున్నా. శక్తికి మించి ఏదీ ఆశించను. ఏవో రావాలనీ పెద్దగా ఆరాటపడను. నాకు నేనే విమర్శకురాలిని. ఎప్పటికప్పుడే సరిదిద్దుకుంటూ ఉంటాను’ అనేవారు. అన్నమయ్య కీర్తనలను ఎంత బాగా ఆలపించారో విన్న ప్రతి ఒక్కరికీ అవగత మవుతుంది. తన సంపాదనలో చాలాభాగం సేవకే కేటాయించారు. ఏనాడూ ప్రచారాన్ని కోరుకోలేదు. అభిమానం, ఆత్మవిశ్వాసమే తొణికిసలాడుతుండేవి. తెరిచిన పుస్తకం అంటుంటాం. ఆ మాటలు ఈమె జీవనానికి అన్ని విధాలుగానూ వర్తించేవే. ఆమె రామభజన మనదేశంలో చారిత్రాత్మక రథయాత్రకు కీలకంగా మారింది. తన వినిర్మల మనస్తత్వం, నిర్మొహమాట వైనం అభిమానధనాన్ని విస్తరిం చాయి. ఎంత ఎదిగినా ఎంతో ఒదిగారనేందుకు ఆ వేషభాషలే తార్కాణాలు. రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నప్పుడు, ఒక్క రూపాయి అయినా తీసుకోని ఏకైక నేత ఆమె. తనకు నచ్చని అంశం ఏదైనా ఉందనుకున్నప్పుడు అసలేమీ తటపటాయించకుండా అప్పటికప్పుడే తేల్చి చెప్పిన వ్యక్తిత్వమూ తనకుంది.

స్వర సామ్రాజ్ఞి

లతా మంగేష్కర్‌లా పాడేవారు ఇంతకుముందు లేరు. ఇక ముందు ఉంటారనీ మనం అనుకోలేం. ఎందుకంటే, దశాబ్దాల స్వరానుభావం ఇదే చెప్తోంది. ఆమె పాటలు, వాటి భాషల అర్థాలు తెలియని వారినీ ఆ గాత్ర సౌరభం ఆకట్టుకుంటుంది. సంగీతానికి భాష లేనట్లే, లతాజీ ప్రతిభకీ ఎల్లలంటూ కానరావు. ఆమెని మనమెవ్వరం కళ్లతో చూడలేకున్నా, మనసుతో వింటాం. హృద యానుభూతిని పొందుతాం. ఇదంతా నిరంతర సత్యమే. రాగమయి లత. సాటిలేనిది ఆ ఘనత.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ 

About Author

By editor

Twitter
Instagram