– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత చరిత్రోపన్యాసకులు

దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14, 1921- మే 8,1972) కర్నూలు జిల్లా కల్లూరు మండలం, పెదపాడులో మునియ్య, సుంకులమ్మ దంపతుల ఐదవ సంతానం. వారిది ఎస్సీ కుటుంబం. సంజీవయ్య పుట్టిన మూడవ రోజున తండ్రి మరణించాడు. కుటుంబానికి సొంత భూమి లేకపోవడంతో నేతపనిలో రోజూ కూలి చేస్తూ జీవించేవారు. కొద్దికాలం సుంకులమ్మ అన్నగారి ఊరు పాలకుర్తిలో ఉన్నారు. అక్కడ సంజీవయ్య సోదరులతో కలసి పశువులను కాస్తూ ఉండేవారు.

పెదపాడులో చిన్నన్నయ్య సంజీవయ్యను స్కూలుకి పంపి ఆయన పనికి వెళ్లేవాడు. ఆపై సంజీవయ్య కర్నూలులోనే అమెరికన్‌ ‌బాప్టిస్ట్ ‌మిషన్‌ ‌స్కూల్‌లో, మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో చదివి 1938లో ఎస్‌.ఎస్‌.ఎల్‌.‌సి జిల్లా ప్రథమునిగా ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత అనంతపురం జిల్లా ప్రభుత్వ సీడెడ్‌ ‌జిల్లాల కళాశాల నుండి 1942లో బి.ఎ.పూర్తి చేసి, కర్నూలులోనే రూ.48.30 పైసల జీతానికి ఉద్యోగంలో చేరాడు. బళ్లారి కేంద్ర ప్రజా పనుల శాఖలో తనిఖీ అధికారిగా, ఆపై మద్రాసు పచ్చయ్యప్ప కళాశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. బళ్లారి జిల్లా జడ్జి కె.ఆర్‌. ‌కృష్ణయ్యశెట్టి ప్రోత్సాహంతో మద్రాసు లా కాలేజీలో చేరి రూ. 90 జీతానికి జార్జిటౌన్‌ ‌లోని పోగ్రసివ్‌ ‌యూనియన్‌ ఉన్నత పాఠశాలలో గణిత అధ్యాపకునిగా పనిచేశారు. 1950లో మద్రాస్‌ ‌బార్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. లా అప్రెంటీస్‌ ‌చేస్తున్నప్పుడు సంజీవయ్యకు కలిగిన నాయకుల పరిచయం, సాంగత్యం వలన రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆసక్తి కలిగింది. అందుకోసం మంచి వక్తగా రాణించాలని భాషలపై శ్రద్ధ పెట్టి నేర్చుకున్నాడు.

పుట్టపర్తి నారాయణాచార్యుల శిష్యుడిగా సంజీవయ్యకు సాహిత్యంపై మంచి పట్టు ఉండేది. లా చదివే రోజుల్లో ‘చంద్రగుప్త’ నాటకంలో నాయక పాత్ర పోషించి మంచి నటునిగా గుర్తింపు పొందారు. ‘గయోపాఖ్యానం’ నాటకాన్ని గద్యంలో రాశారు. ‘శివాజీ’ అనే నాటకాన్ని తానే రచించి ప్రదర్శించారు. ‘ది లేబర్‌ ‌ప్రోబ్లమ్స్ అం‌డ్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌’ అనే గ్రంధాన్ని రాసారు. ఇవన్నీ లభ్యం కావడం లేదు.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పిడతల రంగారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణరాజు, కాసు బ్రహ్మానందరెడ్డి, పి. వి. నరసింహారావు, పరకాల శేషావతారం, ఎ.వి. సుబ్బారెడ్డి వంటి నాయకులు పాలకులుగా మంత్రులుగా రాణిస్తున్న రోజులవి.

ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం ఎన్నికైనప్పుడు ఆ మంత్రి వర్గంలో దామోదరం సంజీవయ్య ఆరోగ్య శాఖా మంత్రి. అప్పుడే పాఠశాల ఉపాధ్యాయిని కృష్ణవేణిని మే 7, 1954న పెళ్లి చేసుకున్నారు. వీరు సుజాత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో బస్సు రూట్ల జాతీయకరణ వివాదంతో, సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో తాత్కాలి కంగా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న సంజీవయ్య జనవరి 11, 1960న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రానికి అలా మొదటి దళిత ముఖ్యమంత్రి వచ్చారు. అప్పటికి సంజీవయ్య వయసు 39 ఏళ్లు. ఆ పదవిలో మార్చి 29, 1962 వరకూ కొనసాగారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా రిక్షాలో అసెంబ్లీకి వెళ్లి నిజాయితీని చాటుకున్నారు.

ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య పేరును సాక్షాత్తు జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ ప్రతిపాదించారు. ఇది గిట్టని కొందరు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేశారు. నెహ్రు నమ్మలేదు. అయినా వాళ్లు ఊరుకోలేదు. సంజీవయ్య తన ఊరిలో పెద్ద భవనం కట్టాడని ఫిర్యాదు చేశారు. ఇందులో నిజమేమిటో తెలుసుకోవడానికి నెహ్రూ ఒకరిని ఈ పనికి వినియోగించాడు. అతను ఆంధ్రా వచ్చి ‘చక్రపాణి’ అనే నాయకుని తీసుకుని ఆ ఊరి ఇంటికి వెళ్లారు. చక్రపాణి, ‘అమ్మా! మీ అబ్బాయి చీఫ్‌ ‌మినిస్టర్‌ ‌కాబోతున్నాడు’ అన్నారట. ‘బాబూ! వాడి జీతం పెరుగుతుందా? నాకు బొగ్గుల కుంపటి కొనిస్తానన్నాడు’ అని అడిగిందట ఆ తల్లి.

సంజీవయ్య నెహ్రూ, లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి, ఇందిరాగాంధీ మంత్రివర్గాలలో పని చేశారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ‘బోనస్‌’ ‌చట్టాన్ని ప్రవేశపెట్టి ‘బోనస్‌ ‌సంజీవయ్య’గా మన్ననలను పొందారు. జెనీవా అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించి ఇ.ఎస్‌.ఐ ‌చట్టంలో కుటుంబం అనే పదాన్ని చేర్చడమే గాకుండా, మహిళా కార్మికుల తల్లిదండ్రులను కూడా ఈ చట్టం పరిధిలోకి తెచ్చారు. నిజాం సుగర్స్‌లో వచ్చే మొలాసిస్‌ ‌నుండి లిక్కర్‌ ‌కాకుండా దాన్ని పేపరు తయారీకి వాడాలని ఆదేశించారు.

హైద్రాబాద్‌ ‌సంస్థానం భారత్‌లో విలీనం తరువాత నిజాం భూములలో 6 లక్షల ఎకరాల మిగులు భూమి గుర్తించి ఎస్‌.‌సి, ఎస్‌.‌టి, బి.సి లోని అన్ని వర్గాలకు పంచి కులాల మధ్య సయోధ్యను తీసుకవచ్చారు. హిందీ ప్రాముఖ్యాన్ని గుర్తించి ప్రతి జిల్లాకు ఓ హిందీ కళాశాల ఉండాలని ప్రతి పాదించారు.

అవినీతి నిరోధక శాఖ (ACB), లెదర్‌ ఇం‌డస్ట్రీస్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (LIDCAP), హైదరాబాద్‌-‌సికింద్రాబాద్‌లను కలిపి మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌గా ఏర్పాటు చేసింది దామోదరం సంజీవయ్యనే. మాతృభాషపై మమకారంతో రాష్ట్ర ప్రభుత్వం జరిపే ఉత్తర ప్రత్త్యుత్తరాలు తెలుగులోనే జరగాలని ఆదేశించారు. శ్రీకాకుళంలో వంశధార, రాయలసీమలో గాజులదిన్నె, వరదరాజులు, కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది సంజీవయ్యనే.

ముఖ్యమంత్రి పదవి సంజీవయ్యకు ముళ్లబాటే అయింది.1962లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికలలో సంజీవయ్యను అధిష్టానం పోటీకి నిలపలేదు. సీఎంగా రాజీనామా చేసినా ఆయనలో కించిత్‌ ‌బాధ కన్పించలేదని సన్నిహితులు చెపుతారు.

విలక్షణ నాయకుడు సంజీవయ్య. ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించిన తొలి అణగారిన నేత. ఇంకా చెప్పాలంటే పేద కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగిన నాయకుడు. కుటిలనీతితో రెండేళ్లకే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవలసి వచ్చింది. ఆ కొద్ది కాలంలోనే అయన సాధించిన విజయాలు చిరస్మరణీయం.1967లో ఎన్నికల ప్రచారం కోసం విజయవాడ నుండి హైదరాబాద్‌ ‌వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన సంజీవయ్య తిరిగి కోలుకోలేదు. 1972 మే 7వ తేదీన గుండెపోటుతో ఆయన మరణించారు. సికింద్రాబాద్‌ ‌పాటిగడ్డలో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారం జరిగింది. అయన స్మారకార్థం పాటిగడ్డ సమీపాన ఒక ఉద్యానవనం అభివృద్ధి చేశారు. దామోదరం సంజీవయ్య నేషనల్‌ ‌లా కాలేజీ పేరుతో విశాఖలోను ఆయనను గుర్తుంచుకుంటారు.


ఆ సజీవ జ్ఞాపకాలు

1964లో చివరిసారిగా సంజీవయ్య పలుకు వినే భాగ్యం లభించింది నాకు. కానీ ఆయన స్మృతులు నన్ను ఎప్పటికీ వీడిపోవు. సంజీవయ్య రాజకీయ జీవితం ఒక ఎత్తయితే, సాహిత్యాభిలాషిగా, మానవ తావాదిగా ఆయన వ్యక్త్తిత్వం సమున్నతమైనది. గ్రామీణ మేధాశక్తికి సంజీవయ్య గొప్ప ఉదాహరణ. అనర్గళంగా సాగే తన ప్రసంగాలను భారత, భాగవత పద్యాలతో, సూక్తులతో, సామెతలతో అద్దే వారు. సులభశైలితో, చిన్న చిన్న పదాలు, సంక్షిప్త వాక్యాలతో అందరికీ అర్థమయ్యేలా వివరించేవారు. క్లుప్తత, సూటిదనం ఆయన వక్తృత్వశైలి. గాంధీజీని చూడని, స్వతంత్ర పోరాటంలో పాల్గొనని శుద్ధ గాంధేయవాది ఆయన. సంజీవయ్య గురించి నాకు మిగిలిన కొన్ని జ్ఞాపకాలక• వారి శతజయంతి సందర్భంగా వ్యాస రూపం కల్పించే అవకాశం రావడం నా అదృష్టం. స్వతంత్ర భారత వజ్రోత్స వాలు, జాతిపిత 150వ జన్మదిన స్మరణోత్సవాలు అన్నీ కలిసి రావటం మరీ ఆనందదాయకం.

 *     *    *    *     *

1962లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక సంజీవయ్య అఖిల భారత కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షులయ్యారు. అప్పుడు కర్నూలు వచ్చిన సంజీవయ్యకి మున్సిపాలిటీ పౌరసన్మానం చేసింది. వేదిక- ఆయన చదువుకొన్న మున్సిపల్‌ ఉన్నత పాఠశాల. ఆ సభకు నేను హాజరయ్యాను. విద్యాధికుడు, వినయం మూర్తీభవించిన సంజీవయ్య నమ్రతతో సమాధానం చెప్పారు, ఇలా- ‘నా పదవులన్నింటికి మూలకారణం ఈ నా పాఠశాల గురువులు పెట్టిన భిక్ష. ప్రధానోపాధ్యాయులు పశుపతి అయ్యర్‌ ‌నాయకత్వంలోని ఉపాధ్యాయుల బిక్షం తప్ప, నా గొప్పతనం కాదు.’ ఎంతటి వినయం! ఒక్కొక్క గురువు గురించిన ఒక మెచ్చికోలు వాక్యం పలికాడు. ప్రధానోపాధ్యాయులు పశుపతి అయ్యర్‌ ‌ముందు చేతులు కట్టుకొని నిలిచేవాడు సంజీవయ్య. ‘కూర్చో సంజీవా!’ అని బలవంతం చేస్తేనే కూర్చొనే వాడు. కర్నూలు మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌వారు సంజీవయ్య చదివిన ఈ స్మారక పాఠశాలక• పూర్వ వైభవం తెచ్చేలా తీర్చిదిద్దుతారన్న నమ్మకం నాకుంది. ఆ పాఠశాల కర్నూలు నేలలో జన్మించి కర్నూలుకు జాతీయ అంతర్జాతీయ కీర్తి తెచ్చిన దేశభక్తుడైన సంజీవయ్యకి ఉత్తమ స్మారకంగా నిలిచిపోతుందని ఆశిస్తాను.

 *     *    *    *     *

ఆ పాఠశాల స్మృతులను సాక్షాత్తు సంజీవయ్య నోటి నుంచి వినే అవకాశం కూడా నాకు దక్కింది. సందర్భం- వెరైటీ థియేటర్‌ ‌ప్రారంభోత్సవం. ఆ థియేటర్‌ ‌సంజీవయ్య సహపాఠి, జీవితకాల నేస్తుడైన అనంత సుబ్రహ్మణ్యంది. ఆ సందర్భంగా సంజీవయ్య మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో తాము చేసిన అల్లరిపనులను గుర్తు చేసుకొన్నారు. తల్లి పుట్టిల్లు పాలకుర్తి కరణం, తన సహపాఠి,• విజయరామారావు చేసిన ఉపకారాలను కూడా మననం చేసికొన్నారు. తనకు మేలు చేసినవారికి కృతజ్ఞతలు చెప్పడం సంజీవయ్యలో కనిపించే సజీవ లక్షణం.

 *     *    *    *     *

అనంతపురంలో పువ్పూరి రామాచార్యులవారి సహాయ సహకారాలతో ఆర్టస్ ‌కళాశాలలో సంజీవయ్య డిగ్రీ పూర్తి చేయగలిగారు. తర్వాత మద్రాసులో ‘లా’ చదివి మద్రాసు హైకోర్టులో వకీలుగా నమోదు చేసికొన్నారు. బహుశా చాలామందికి తెలియక పోవచ్చు. తర్వాత ఆంధప్రదేశ్‌ ‌డి.జి.పి. లైన ఎం.వి. నారాయణరావు, రామచంద్రారెడ్డిలతో పాటు సంజీవయ్య కూడా ఐ.పి.ఎస్‌. ఉత్తీర్ణులే. కాని ఆయన భవిష్యత్తు అంతకంటే గొప్పది. ఆ ఉద్యోగంలో చేరలేదు.

 *     *    *    *     *

ఆంధప్రదేశ్‌ ‌లోకాయుక్త జస్టిస్‌ ‌జగన్నాథరాజ, సంజీవయ్య మామ సర్దార్‌ ‌నాగప్ప చెప్పిన ఒక సంఘటన గురించి వివరిస్తాను.

జనవరి 26, 1950న రాజ్యాంగం అమలులోనికి రావడంతో అప్పటి దాకా రాజ్యాంగ రచన నిర్వహించిన భారత రాజ్యాంగ సభ ప్రోవిషనల్‌ ‌పార్లమెంటుగా అవతరించింది. ప్రోవిషనల్‌ ‌పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభలలో రెంటిలోనూ సభ్యులైన వారు ఏదో ఒకటి ఎంచుకోవలసి వచ్చింది. షెడ్యూలు కులానికి చెందిన సర్దార్‌ ‌నాగప్ప (సంజీవయ్య మామగారు) శాసనసభ్యత్వం అట్టి పెట్టుకొని ప్రోవిషనల్‌ ‌పార్లమెంటుకు రాజీనామా చేసాడు. ఆ స్థానం పూరించడానికి బెజవాడ గోపాల రెడ్డి సంజీవయ్యను ఎంపిక చేశారు. ఆ క్రమం ఇలా ఉంది. 1951లో సర్దార్‌ ‌నాగప్పకు రిజర్వుడ్‌ ‌కర్నూలు అసెంబ్లీ టికెట్‌ ఇస్తామన్నారు. కాని సర్దార్‌ ‌నాగప్ప అప్పటికీ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ప్రకాశం పార్టీలో చేరారు. కనుక కాంగ్రెస్‌ ‌టికెట్‌ను మద్రాసులో యువ న్యాయవాదిగా ఉన్న తన అల్లుడు సంజీవయ్యకు ఇవ్వవలసినదిగా సలహా ఇచ్చాడు. మద్రాసు బీచ్‌లో వేయించిన వేరుశనక కాయలు తింటున్న సంజీవ య్యను రాజాజీ, కామరాజ్‌లు వెతకి పట్టుకొన్నారు. ఆ రకంగా అదృష్టం వెతుక్కుంటూ వెళ్లింది. సంజీవయ్య కర్నూలు రిజర్వుడ్‌ ‌నియోజకవర్గం నుండి గెలిచాడు. రాజాజీ మంత్రివర్గంలో సభ్యుడయ్యాడు. ఆంధ్రరాష్ట్ర మంత్రివర్గంలోనూ, ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వంలోను మంత్రిగా కొనసాగాడు. పదవులు వరించటానికి అదృష్టం, ప్రతిభ కూడా కారణాలే.

 *     *    *    *     *

1960 సంవత్సరం మధ్యకాలంలో ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా సంజీవయ్య నంద్యాలలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ‌కళాశాలను ప్రారంభించారు. ఈపూరి శేషఫణి శెట్టి అనే పదాన్యుడైన వ్యాపారస్థుడు కళాశాలకు విరాళమిచ్చాడు. స్థానికంగా ప్రజలు ఆర్టస్ & ‌సైన్స్ ‌కళాశాల కోసం ఆందోళన చేశారు. సంజీవయ్య తాను పాలిటెక్నిక్‌ ‌కళాశాలను ప్రారంభిం చటాన్ని సమర్థించుకుంటూ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల అవసరాన్ని గుర్తు చేశాడు. నెహ్రూ ప్రాజెక్టు లను ఆధునిక దేవాలయాలన్న సంగతి గుర్తుచేసి, పంచవర్ష ప్రణాళికల అమలుకు సాంకేతిక నిపుణుల ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. అదృష్టవశాత్తు నంద్యాల పాలిటెక్నిక్‌ ‌కళాశాలలో చదివిన విద్యార్థులలో చాలామంది ప్రసిద్ధ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులై సేవచేశారు. సంజీవయ్య మాట నిలిపారు.

 *     *    *    *     *

1961లో సంజీవయ్య నంద్యాల మున్సిపాలిటీ రక్షిత నీటి సరఫరా ప్రణాళికను ప్రారంభించారు. ఆ సందర్భంలో మాజీ మున్సిపల్‌ అధ్యక్షులు దేశాయి కుప్పూరావుని వేదిక మీదకు పిలిచి, ఆలింగనం చేసుకుని శాలువతో సత్కరించడం సంజీవయ్య సౌజన్యానికి ప్రతీక. ‘ముందుతరం ప్రజాసేవకుల కృషిని మనం ఎన్నడూ మరువరాదు సుమా’ అని సంజీవయ్య విశాల హృదయం చాటుకున్నారు.

 *     *    *    *     *

కళ్లు చమర్చే ఈ ఘటన1961 నాటిది. సంజీవయ్య ముఖ్యమంత్రి అయినా ఆయన తల్లి పెద్దపాడులోనే తమ పాత గుడిసెలోనే నివాసం ఉండేవారు.కూలి చేసుకునేవారని ఆయన మాటలను బట్టి తెలుస్తుంది. ఒకసారి ఇంటికి వెళ్లినప్పుడు గుడిసెలో ఉండిపోయిన తల్లికి కొంత పైకం ఇస్తూ, ‘ ఇక కూలీకి పోవద్దమ్మా! నేను ముఖ్యమంత్రినైనాను’ అన్నాడట. ఆ అమాయకపు తల్లి, ‘బిడ్డా! అది కరణం పని కంటే, రెడ్డి పని కంటే పెద్దదా?’’ అని అడిగింది. ఔనన్నాడు సంజీవయ్య. ‘ఐతే నీవంటి మంచి కొడుకులు ఎంతమందికుంటారు! చేతనైతే నావంటి ముసలి తల్లులకేదైనా సాయం చేయరా?’ అని అడిగింది. సంజీవయ్య నెలకు రూ.50/- వంతున వృద్ధాప్య పెన్షన్‌కు చట్టం చేశారు. ఇలాంటి పింఛన్ల• అప్పుడే మొదలయ్యాయి.

 *     *    *    *     *

సంజీవయ్య ఆంధప్రదేశ్‌కు చేసిన గొప్ప పనుల్లో ఒకటి- కేంద్ర ప్రభుత్వం , ప్లానింగ్‌ ‌కమిషన్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు అనుమతి తీసుకురావడం. 1963 జూలై నెలలో ప్రధానమంత్రి పండిట్‌ ‌జవహర్‌లాల్‌ ‌నెహ్రూ శ్రీశైలం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సంజీవయ్యకి పబ్లిక్‌ ‌వర్కస్ ‌శా• మంత్రి అల్లూరి సత్యనారాయణరాజు తోడ్పాటు బాగా ఉండేది.

 *     *    *    *     *

సంజీవయ్య కార్యనిర్వహణ కౌశలం, పట్టుదల, పాలనాసామర్థ్యం ఎలాంటివో తెలియజెప్పే ఒక ఉదంతం- అది న్యాయశాఖ, పరిపాలనా శాఖలు రెండూ ఆదర్శంగా తీసుకోదగిన అనుసరించదగిన విషయంగా కనిపిస్తుంది.

 నవంబర్‌ 4,1961‌వ తేదీన నాటి హోమ్‌ ‌మంత్రి లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రికి జాతీయ దస్తావేజుల శాఖ నుండి ఒక లేఖ లభించింది. అందులో నాటి ఆంధప్రదేశ్‌ ‌హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌పి.చంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆరోపణలు ఉన్నాయి. సంజీవయ్య లాల్‌బహదూర్‌ ‌శాస్త్రికి ఇలా రాశారు. ‘మీరు తీసుకోవలసిన కనీస చర్య గౌ.చంద్రారెడ్డిని తక్షణం బదలీ చేయటం. ఇది స్టేట్స్ ‌రీ ఆర్గనైజేషన్‌ ‌కమిటీ సిఫార్సులకనుకూలం కూడా. ముఖ్యంగా ఉన్నత న్యాయవ్యవస్థకు హాని కలగకుండా చూడటానికి హోంమంత్రిగా మిమ్ములను, గౌ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, గౌ. ప్రధానమంత్రిని మా ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రానికి, ప్రజలకు ఉపశమనం కలిగించమని ప్రార్థిస్తున్నాను’.

నాటి సుప్రీంకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌పి.బి. గజేంద్ర గడ్కర్‌ ‌స్వీయచరిత్రలో చంద్రారెడ్డి పేరెత్తకుండా ఈ విషయాన్ని గురించి ఇలా రాశారు. ‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దురదృష్టవశాత్తు చాలా సున్నితమైన, బాధాకరమైన సన్నివేశాలెదుర్కొన్నాను. హైదరాబాద్‌ ‌హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌కు విరుద్ధంగా గౌరవప్రదమైన హోదాలవారి నుండి, విశ్వసనీయమైన పెద్దల నుండి ఫిర్యాదులు విన్నాను. హైదరాబాద్‌ ‌చీఫ్‌ ‌జస్టిస్‌ ‌బాధ్యతల నిర్వహణలో, పాలనా ఉత్తర్వులలో తీసుకొనవలసిన స్వతంత్రం తీసుకో లేదన్నదే ఆరోపణ’’. గజేంద్ర గడ్కర్‌ అం‌తకు ముందు హైదరాబాద్‌లో సి.జె.గా పనిచేసిన, అప్పుడు తనతో పనిచేస్తున్న జస్టిస్‌ ‌కోకా సుబ్బారావుని సంప్రదించారు. తానే స్వయంగా హైదరాబాద్‌ ‌వచ్చి వ్యక్తిగతంగా విచారణ సాగించాడు.

 *     *    *    *     *

కళాశాల చదువు కాగానే ఆంధ్రుల సంప్రదాయ దుస్తుల్లో, గాంధీ టోపీతో, మాటల్లో, చేతల్లో గాంధీవాదిగా ప్రవేశించి చివరి వరకూ అలానే ఉన్నారు. దేశంలోనే పిన్న వయస్కుడైన మంత్రిగా నాలుగు కేబినెట్లలో రాజాజీ (మద్రాసు), ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డిల (కర్నూలు), నీలం సంజీవరెడ్డి (ఆం.ప్ర.) పనిచేయటమే కాకుండా అతి చిన్న వయసులో ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి అయ్యారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండగా రెండోతరం నాయకుడు సంజీవయ్య అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులయ్యారు. లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి, ఇందిరా గాంధీల క్యాబినేట్లలో మంత్రి అయ్యారు.

 *     *    *    *     *

ప్రజాస్వామ్యానికి సంజీవయ్య కొత్త భాష్యం చెప్పారు- ‘నాకు ఓటు వేసినవారికి, వేయనివారికి, అసలు పోలింగ్‌ ‌బూతుకు వెళ్లని వారికి కూడా నేను ప్రతినిధినే’’ అంటూ ఒక సందర్భంలో వ్యాఖ్యానించా రాయన. ఇన్ని పదవులు అలంకరించినా సంజీవ య్యక• ఇల్లు, కారు లేవంటే నమ్మాలి. నిరాడం బరతకు, వినయవిధేయతలకు ప్రతిరూపం ఆయన! రాజనీతిజ్ఞుడు. ఒక శాతం భగవంతుని ఆశీస్సు లుంటే, తొంబది శాతం ఆయన స్వయంకృషి.

–  కురాడి చంద్రశేఖర కల్కూర, గాడిచెర్ల ఫౌండేషన్‌, ఏపీ లైబ్రరీ అసోసియేషన్‌ అధ్యక్షులు, కర్నూలు.


కళాహృదయుడు

శ్రావ్యతకు మారుపేరుగా ఉన్న సంజీవయ్య పద్య పఠనం మిగిలి ఉన్న ఆ తరం వారి చెవులలో ఈనాటికీ మధురంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అది 1963వ సంవత్సరం. కర్నూలు ఉస్మానియా కళాశాల తెలుగు భాషా సమితి భాషోత్సవం జరుపుకుంది. అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షులు సంజీవయ్య సభాధ్యక్షులు. కవిసమ్రాట్‌ ‌విశ్వనాథ సత్యనారాయణ ముఖ్యవక్త. ‘సంజీవయ్య గారి వంటి మేధావి, సాహితీవేత్త అధ్యక్షత వహించిన సభలో మాట్లాడటం నా అదృష్టం. అంతేకాదు, షేక్‌ ‌దావూద్‌ ‌వంటి కవి పండితులు సభలో ఉండటం సంతోషం కలిగించింది’ అన్నారు విశ్వనాథ. సంజీవయ్య తన అధ్యక్షోపన్యాసంలో, ‘కవిసమ్రాట్టులను విని చాలాకాలమైంది. విశ్వనాథ వారిని వినటానికే వచ్చాను’ అన్నారు. అదేరోజు పెద్దమార్కెట్‌ ‌వద్దనున్న తమ ఇంటిలో సంజీవయ్య గౌరవార్థం కె.బి.నరసప్ప విందు ఇచ్చారు. ఆ ఏర్పాట్లు అజంతా హోటల్‌ ‌శేషన్నవి.నేనూ వెళ్లాను. ఇంతలో ఎవరో సంజీవయ్య చెవిలో ‘పినాకపాణి గారు వచ్చారు’ అని చెప్పారు. అంటే, ప్రఖ్యాత వైణికుడు శ్రీపాద పినాకపాణి. ఆనాటికి డా।। పినాకపాణి సంగీత కళానిధి బిరుదు పొందలేదు. కర్నూలు వైద్య కళాశాలలో  ప్రొఫెసర్‌. ‌కాని కర్ణాటక సంగీతంలో జాతీయ ఖ్యాతి ఉంది. వినయశీలియైన సంజీవయ్య విస్తరి ముందు నుంచి లేచి వెళ్లి కారు దిగుతున్న డా।।పినాకపాణిని స్వాగతించారు. అంతటి సంస్కారి. పర్యటనలకు వచ్చినప్పుడు తన వ్యక్తిగత సిబ్బంది భోజన వసతి గురించి జాగ్రత్త తీసుకొనేవారు. వారి భోజనాలు అయిందాకా సంగీత కాలక్షేపం చేసేవారు. జానపద కళాకారులను సన్మానించేవారు.

About Author

By editor

Twitter
YOUTUBE