నేతాజీ- 32

– ఎం.‌వి.ఆర్‌. ‌శాస్త్రి

కథలో కొంచెం వెనక్కి వెళదాం.

1945 ఫిబ్రవరి చివరివారం. సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌పోపా యుద్ధ రంగం ఇన్స్పెక్షన్‌ ‌నిమిత్తం మెక్టిలాలో ఉన్నాడు. పరిస్థితి పూర్తిగా విషమించింది. మనపక్షం శక్తులన్నీ ఉడిగాయి. శత్రువు సుడిగాలిలా తరుముకొస్తున్నాడు. నిలబడే వీలు లేదు. పారిపోవటం మినహా గత్యంతరం లేదు. డివిజన్‌ ‌కమాండర్‌ ‌షానవాజ్‌ ‌ఖాన్‌ ‌పరిస్థితిని వివరించి ‘నేతాజీ! మీరు ముందుకు వెళ్ళటం ప్రమాదం. దయచేసి వెనక్కి మరలుదాం’ అన్నాడు. నేతాజీ వినలేదు. ఏమైనాకానీ వెనక్కి పోయే ప్రసక్తే లేదు అన్నాడు. షానవాజ్‌కు చిరాకేసింది. ‘నేతాజీ! మీరు స్వార్థంతో మాట్లాడుతున్నారు. ఎంతసేపూ మీ శౌర్యాన్ని చూపించాలనే తప్ప మీ ప్రాణం దేశానికి ఎంత అవసరమో ఆలోచించటం లేదు. ఇలా రిస్కు చేసే హక్కు మీకు లేదు’ అని దెబ్బలాడి, మిగతా వారితో కూడబలుక్కుని ఎలాగో ఒప్పించాడు. మరునాడు టామీ గన్‌ ‌పట్టుకుని జీపులో కూచుని నేతాజీ చేసిన సాహసయాత్రను ఇంతకూ ముందు చెప్పుకున్నాం.

తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 28 ఉదయం నేతాజీ తన కమాండర్లను పిలిచి ఐరిష్‌ ‌స్వాతంత్య్ర పోరాటం గురించి చెప్పాడు. ‘ఆ పోరాటంలోకి దిగినవారందరినీ దారుణంగా చంపేశారు. అయినా వారి స్ఫూర్తి 70,80 ఏళ్ళపాటు కొనసాగి ఐర్లాండ్‌కు స్వాతంత్య్రం సాధించగలిగింది. నేనూ ఆ దారినే వెళ్ళదలిచాను. ఫస్ట్ ‌డివిజన్‌ను స్వయంగా నడిపించి ఆఖరి ఊపిరివరకూ పోరాడదలచాను. మన స్వాతంత్య్ర స్ఫూర్తి ప్రభావం భారతీయులలో కలకాలం ఉంటుందన్న నమ్మకంతో అందరం పోరాడుతూ చచ్చిపోదాం.’ అన్నాడు. అంతకు ముందూ ఆయన ఆ మాట అనేక సందర్భాలలో అన్నాడు. పక్కన ఉన్న సహచరులు ప్రతిసారీ ఆయనను ఒత్తిడిపెట్టి వెనక్కి లాగారు. తమ నాయకుడు ఏదో ఆదర్శ లోకంలో విహరిస్తూ మూర్ఖంగా ప్రాణాలు బలి ఇస్తానంటున్నాడు అనే వారు తలచారు. ఆ మహానుభావుడు ఎంత దార్శనిక దృష్టితో ఆ ఉద్బోధ చేశాడో… మనుషులు పోయినా వారి త్యాగం, శౌర్యం, బలిదానం శాశ్వతంగా నిలిచి జాతిజనులకు గొప్ప స్ఫూర్తినివ్వటం ఎలా సంభవమో తెల్లదొరతనానికి నేతాజీ కలిగించిన దడుపు జ్వరాన్ని చూశాక గానీ మన జనాలకు అర్థమవలేదు.

సాధారణంగా మిలిటరీ కోర్టులోనైనా మామూలు కోర్టులోనైనా మరణ శిక్ష పడ్డాక దేశాధ్యక్షుడికి మెర్సీ పిటీషను పెట్టుకుంటే దయచూపాలా వద్దా అని ఏలినవారు ఆలోచిస్తారు. చరిత్రకెక్కిన ఐఎన్‌ఎ ‌విచారణలో జరిగింది వేరు. మిలిటరీ కోర్టు శిక్షను ప్రకటించటానికి వారం రోజులముందే పడబోయే శిక్షను కమ్యూట్‌ ‌చేసేందుకు సైన్యాధిపతికి వైస్రాయ్‌ అధికారం ఇచ్చాడు. ఆ సేనాపతి కూడా శిక్ష ఏమిటో తెలియకముందే దానిని కమ్యూట్‌ ‌చేసేందుకు కాచుకుని ఉన్నాడు. తీర్పు వెలువడిన వెనువెంటనే యావజ్జీవ శిక్షను అర్జెంటుగా రద్దుపరచాడు.

ఎందుకలా? ఎవరిచేతో అడిగించి, దానిమీద ఆలోచించినట్టు కొద్దిరోజులు నటించి తాపీగా శిక్షను మార్చి ఉంటే సర్కారుకు పరువు నిలిచేది కదా? అమలుపరచే ఉద్దేశమే సర్కారుకు లేనప్పుడు అసలు ఆ శిక్షను ఎందుకు వేయించినట్టు ? ఆ వెంటనే దానిని ఎత్తి వేయటానికి ఎందుకు కంగారు పడ్డట్టు?

ఐఎన్‌ఎ ‌విచారణ నడుస్తూండగానే ముఖ్యమైన ప్రావిన్సుల (రాష్ట్రాల) గవర్నర్లు వైస్రాయ్‌కి పంపిన రహస్య నివేదికలలో చేసిన హహాకారాలను, ఆర్తనాదాలను చూస్తే సీమదొరల కంగారుకు కారణం బోధపడుతుంది . మచ్చుకు కొన్ని:

‘‘సెంట్రల్‌ ‌ప్రావిన్సెస్‌, ‌బెరార్‌ ‌గవర్నర్‌ Sir H. Twynam 1945 నవంబర్‌ 26 ‌న వైస్రాయికి పంపిన సీక్రెట్‌ ‌రిపోర్టు:

‘‘ఐఎన్‌ఎ ‌ప్రభావం మూలంగా ఇండియన్‌ ‌ట్రూప్స్ ‌వైఖరిలో మార్పుకు నేను కలవరపడు తున్నాను. రేపు గుంపుల మీద ఫైర్‌ ‌చేయమంటే వీళ్ళు ఏమి చేస్తారన్నది నాకైతే అనుమానమే. మ్యూటినీ (1857) రోజులలో వలె వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. ప్రావిన్సు నుంచి బ్రిటిష్‌ ‌ట్రూప్స్‌ను పూర్తిగా ఖాళీ చేయవలసిన పరిస్థితి వస్తే పర్యవసానాలను తలచుకుంటేనే భయం వేస్తున్నది. ఇప్పుడు నా ప్రావిన్సులో మొత్తం కలిపితే 17 మంది యూరోపియన్‌ ఐసిఎస్‌ ఆఫీసర్లు, 19 మంది యూరోపియన్‌ ‌పోలీసు ఆఫీసర్లు ఉన్నారు. ఈ కొద్ది మంది లక్ష చదరపు మైళ్ళ ఏరియాలో కోటీఎనభై లక్షలు దాటిన జనాభాతో డీల్‌ ‌చేయవలసి ఉంది.’’

[Transfer of Power,Vol.VI, PP.542-543]

వాయవ్య సరిహద్దు రాష్ట్ర గవర్నర్‌ Sir C. Cunningham నుంచి 1945 నవంబర్‌ 27‌న సీక్రెట్‌ ‌రిపోర్టు :

 ‘‘డియర్‌ ‌లార్డ్ ‌వేవెల్‌.. అన్ని వర్గాల అభిప్రాయాలను మదింపు చేసిన మీదట నేను చెప్పేది ఇది. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్న దృష్ట్యా ఐఎన్‌ఎ ‌విచారణలను మొత్తంగా ఎత్తేస్తున్నామని, ఇకపై ఎవరిపైనా ఎలాంటి చర్యలు ఉండవని కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌వెంటనే ప్రకటించాలి. ఇలా చెప్పటం నాకు ఇష్టం లేదు. అది బెదిరింపులకు లొంగిపోవటమే అని నాకు తెలుసు. ఐఎన్‌ఎ ‌లీడర్లను దొరికిన వెంటనే కాల్చేయాల్సింది అని విజ్ఞులందరి మనసులోనూ ఉంది. రంగూన్‌ ‌లోనో సింగపూర్‌ ‌లోనో వారిని కాల్చివేసి ఉంటే అందరూ సంతోషించే వారని ఖాన్‌ ‌సాహెబ్‌ ‌వంటి కాంగ్రెస్‌ ‌నాయకులు నాతో అన్నారు. యువర్‌ ఎక్సలెన్సీ! మీరు, క్లాడ్‌ ఆచిన్‌ ‌లెక్‌ ఎదుర్కొంటున్న సంకటానికి నేను చాలా ఫీల్‌ అవుతున్నాను. ఇండియాలో ఇప్పటిదాకా మనం ఎదుర్కొన్న సమస్యలన్నింటిలోకీ ఇదే గడ్డుది.’’

[అదే గ్రంథం, పే. 546]

మద్రాస్‌ ‌గవర్నర్‌ ‌సర్‌ ఎ. ‌హోప్‌ ‌రహస్య నివేదిక, 10 డిసెంబర్‌ 1945:

‘‘ఐఎన్‌ఎ ‌నిందితులకు మరణ శిక్ష వేసినా, పెద్దకాలం ఖైదు విధించినా జనంలో గగ్గోలు లేస్తుంది. వాళ్ళను క్షమిస్తే మనకు విశ్వాసపాత్రులైన సైనికులను మనం ఒగ్గేసినట్టు అవుతుంది. విధేయతకు విలువ లేదని వారు ఉసూరుమంటారు. నాయకులను అక్కడికక్కడే కోర్ట్ ‌మార్షల్‌ ‌చేస్తే పోయేదని, అనవసరంగా వీళ్ళను ఇండియా పట్టుకు రావటం పెద్ద పొరపాటు అని అందరూ అనుకుంటున్నారు. ఉదకమండలంలాంటి చోట్ల యూరోపియన్లు తమ భద్రత గురించి హడలి పోతున్నారు. ఏడాదికి పైగా ఉందామని అనుకున్నవారు పెద్ద ఎత్తున అల్లర్లు, మ్యూటినీ తప్పవన్న భయంతో వెంటనే వెనక్కి పోవటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇది అతిగా భయపడటం అనిపించవచ్చు.కానీ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.’’

[అదే గ్రంథం, పే.631]

పంజాబ్‌ ‌రాష్ట్ర గవర్నరు సర్‌ ‌గ్లాన్సీ 1945 నవంబరు 17న పంపిన రిపోర్టు :

‘‘ముగ్గురి మీద మొదలుపెట్టిన విచారణను మధ్యలో ఆపకూడదు. అలా ఆపితే మన బలహీనత బయట పడుతుంది. మనకు ధైర్యం లేదని మనమే చెప్పుకున్నట్టు అవుతుంది. ఈ పరిస్థితుల్లో సరైన పరిష్కారం నాకు ఒకటే కనపడుతున్నది. విచారణ లను వాటి దారిన సాగనివ్వాలి. శిక్ష ప్రకటించిన వెంటనే కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌దానిని కమ్యూట్‌ ‌చేస్తున్నట్టు ప్రకటించాలి. హింసాత్మక ఆందోళనకు అవకాశం ఉండకుండా శిక్ష వేసీ వేయగానే ఆ ప్రకటన రావాలి.’’

[అదే గ్రంథం, పే.807]

ఇండియా వైస్రాయి ఫీల్డ్ ‌మార్షల్‌ ‌వైకౌంట్‌ ‌వేవెల్‌ ‌దొరవారు లండన్‌ ‌లోని సెక్రెటరీ ఆఫ్‌ ‌స్టేట్‌ అనబడే విదేశాంగ మంత్రి లార్డ్ ‌పెథిక్‌ ‌లారెన్స్ ‌పెద్ద దొరవారికి ఐఎన్‌ఎ ‌విచారణ నడుస్తున్న కాలంలో 1945 నవంబరు 27న రాసిన ‘ప్రైవేట్‌ అం‌డ్‌ ‌సీక్రెట్‌’ ‌లేఖలో ఏమని మొత్తుకున్నాడో చూడండి:

‘‘బెంగాల్‌ ‌గవర్నరు కేసీ మొన్న ఆదివారం మధ్యాహ్నం విమానంలో వచ్చి చాలాసేపు నాతో మాట్లాడి వెళ్ళాడు. కోల్‌కతా అల్లర్ల గురించి అతడు చాలా విషయాలు చెప్పాడు. రెచ్చిపోయిన జనం అన్ని రకాల రవాణా మీదా దాడి చేశారట. లారీలు, ప్రైవేటు కార్లను కూడా ఆపి తగలబెట్టారట. ఎక్కడికక్కడ రోడ్డు బ్లాక్‌ ‌చేశారట. పట్టాల మీద కూచుని రైళ్ళు ఆపేశారట. బ్రిటిషువాళ్ల మీద జనం మండిపడుతున్నారు. పరిస్థితి మహా ప్రమాదకరంగా ఉన్నది.

‘‘మీరు ఒక ఐఎన్‌ఎ ‌వాడిని చంపితే మేము ‘20 ఇంగ్లిషు కుక్కలను’ చంపుతాం అంటూ దిల్లీ వీధుల్లో ఎర్రసిరాతో పోస్టర్లు పెట్టారు. ఐఎన్‌ఎ ‌వాళ్ళమీద దయ చూపని పక్షంలో వారిని కాపాడు కునేందుకు భారతీయులు రక్తం ధారపోసి 1942 కంటే తీవ్ర స్థాయిలో చెలరేగుతారని నాగపూర్లో ఆర్‌ఎస్‌ ‌రూయికర్‌ ‌హెచ్చరిక చేశాడు. ఇంకో ఉద్యమం తప్పదని, అది హింసాత్మకంగా ఉంటుందని, గెరిల్లా రణతంత్రంలో ఆరితేరిన ఐఎన్‌ఎ ‌సైనికులు, విప్లవకారులు దానిని నడిపిస్తారనీ సెంట్రల్‌ ‌ప్రావిన్సులో మహాకోసల్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రైవేటుగా చెప్పినట్టు నాకు ఇంటలిజెన్స్ ‌రిపోర్టు వచ్చింది..’’

[అదే గ్రంథం పే. 552-554]

‘ఇండియాలో అంతర్గత పరిస్థితి తీవ్రత’ గురించి లండన్‌లో చీఫ్స్ ఆఫ్‌ ‌స్టాఫ్‌ ‌కమిటీకి 1945 డిసెంబరు 1న ఇచ్చిన రిపోర్టులో కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌సర్‌ ‌క్లాడ్‌ ఆచిన్‌ ‌లెక్‌ ‌చేసిన మదింపును చిత్తగించండి:

‘‘ఇండియా నిండా లైసెన్సులేని ఆయుధాలు కొల్లలుగా ఉన్నాయి. వాటిని ఉపయోగించటానికి మాజీ ఐఎన్‌ఎ ‌సైనికులు రెడీగా ఉన్నారు. బ్రిటిష్‌ ‌వ్యతిరేక పోరాటం ఎలా చేయాలో నేర్పటానికి ఐఎన్‌ఎ ‌మెంబర్లు కొందరు ట్రైనింగ్‌ ‌క్యాంపులు రహస్యంగా నడుపుతున్నారు. ట్రబుల్‌ అం‌టూ వస్తే 1942 ఆగస్టు నాటి కంటే తీవ్రంగా ఉండేట్టుంది. ఈ సారి ఆయుధాలు, వాటిని వాడేందుకు సైనిక శిక్షణ పొందిన ఐఎన్‌ఎ ‌మనుషులు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండటం మనకు ఆందోళనకరం. గ్రామాల్లో కల్లోలం ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ల విచ్ఛిన్నం ద్వారా విశాల ప్రాంతాలను వేరుచేసి స్వాధీనం చేసుకునే సూచనలు కనపడు తున్నాయి. యునైటెడ్‌ ‌ప్రావిన్సెస్‌, ‌బెంగాల్‌, ‌బిహార్‌లలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. పంజాబ్‌, ‌సెంట్రల్‌ ‌ప్రావిన్సు, బాంబేలలోనూ గొడవలు లేవవచ్చు. బహుశా కొంచెం తక్కువ స్థాయిలో మద్రాసులో కూడా.

 ‘‘సాయుధ సేనల మీద రాజకీయ పరిస్థితి ప్రభావం ఇప్పుడైతే లేదు. కాని ఏప్రిల్‌ ‌తరవాత ఎలా ఉంటుందో చెప్పలేము. సైనిక శ్రేణులను ఆకట్టుకునేలా ప్రభుత్వం అసందిగ్ధమైన కొత్త పాలిసీని ప్రకటిస్తే ఏమోగాని సాయుధ బలగాల విధేయత ఇలాగే కొనసాగుతుందా అన్నది ఇప్పటికైతే అనుమానమే. వసంత ఋతువు వచ్చేనాటికి పటిష్ఠమైన సన్నాహాలతో విప్లవాన్ని ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. అంతకంటే ముందే తిరుగుబాటు లేచినా లేవవచ్చు. దానికి తోడు మతాలమధ్యా ఘర్షణలు తలెత్తవచ్చు. తమ మతం వారిమీద బలం ప్రయోగించవలసి వస్తే సాయుధ దళాలు ఎంతవరకూ నిలబడతాయో. వాటి విధేయత ఎలా మారుతుందో చెప్పలేము.

 if the Indian Forces as a whole cease to be unreliable, the British Armed Forces now available are not likely to be able to control the internal situation.. To regain control of the situation and to restore essential communications within the country, nothing short of an organised campaign for the re conquest of India is likely to suffice. It is not possible now to compute the air and land forces required for such a campaign, but they would inevitably be very large as, if the Indian Armed Forces are not prepared to support Government, they will almost inevitably actively oppose it. … The situation in India is therefore extremely delicate. If there is a widespread revolt against the Government, everything will depend on the reliability of the Indian Armed Forces.

[అదే గ్రంథం పే. 578-583]

(మన భారతీయ సేనలు మొత్తంగా నమ్మదగినవి కావని రుజువు అయ్యే పక్షంలో, ఇప్పుడు అందుబాటులో ఉన్న బ్రిటిష్‌ ‌సాయుధ బలగాలు అంతర్గత కల్లోలాన్ని కంట్రోల్‌ ‌చేయలేవు. పరిస్థితిని తిరిగి అదుపులోకి తెచ్చి, అత్యవసరమైన కమ్యూనికేషన్లను పునరుద్ధరించాలంటే, ఇండియాను తిరిగి జయించేందుకు పూర్తి స్థాయిలో యుద్ధమే అవసరమవుతుంది. దానికి పదాతి, విమాన బలగాలు ఎన్ని కావలసివస్తాయో ఇప్పుడు లెక్కవేయటం కుదరదు. ఆ అవసరాలు అనివార్యంగా భారీ స్థాయిలోనే ఉంటాయి. ఎందుకంటే, భారతీయ సైనిక దళాలు ప్రభుత్వాన్ని సపోర్టు చేయటానికి ఇష్టపడని పక్షంలో అనివార్యంగా ప్రభుత్వానికి ఎదురు తిరుగుతాయి. ఇండియాలో పరిస్థితి చాలా డెలికేట్‌గా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత స్థాయిలో తిరుగుబాటు వస్తే, ఇండియన్‌ ‌సైనిక బలగాల విశ్వసనీయత మీదే మొత్తం ఆధారపడుతుంది.)

పాపం సైన్యాధిపతి పెద్ద సంకటంలో పడ్డాడు. తెల్లదొరతనం మనుగడ మొత్తం ఇండియన్‌ ఆర్మీ విశ్వసనీయత మీద ఆధారపడి ఉన్నది. భారతీయ సైనికులు తిరగబడితే బ్రిటిష్‌ ‌సర్కారు కుప్ప కూలుతుంది. వారిని నిలువరించటానికి అందు బాటులో ఉన్న యూరోపియన్‌ ‌దళాలు ఎందుకూ కొరగావు. నేటివ్‌ ‌సైన్యం బారి నుంచి సర్కారును కాపాడుకోవాలంటే అర్జెంటుగా యూరోపియన్‌ ‌బలగాల సంఖ్య పెంచుకోవాలి. వాటిని ఓడల మీద, విమానాల మీద హుటాహుటిన తెచ్చుకోవాలి. వాటిని భారీ ఎత్తున తరలిస్తే ఇండియన్‌ ‌బలగాలకు ప్రభుత్వానికి తమమీద నమ్మకం పోయిందని అర్థమవుతుంది. దాంతో ఇప్పటిదాకా విధేయంగా ఉన్నవారిలో కూడా అవిధేయత ప్రబలుతుంది. దానివల్ల పరిస్థితి ఇంకా విషమిస్తుంది. ఏ సంక్షోభాన్ని అయితే నివారిద్దామనుకుంటున్నారో ఆ సంక్షోభాన్ని తామే త్వరితం చేసినట్టు అవుతుంది. దాన్ని తట్టుకోవటానికి ఇంకా భారీగా సీమ సైన్యాన్ని తరలించవలసి వస్తుంది. అదంతా ఎందుకని, ఇండియన్‌ ‌సేనలకు అనుమానం రాకుండా ఏవో మిషలమీద కొంచెం కొంచెంగా సీమ దళాలను పిలిపించుకుందామా అంటే – దఫాలవారీగా ఆ తరలింపు పని తెమిలేలోగానే గత్తర ముంచుకొస్తే కొంపలు మునుగుతాయి. కాచ్‌-22‌ని మించిన కాచ్‌ ఇది!

తాము ఇరుక్కున్న ఈ ఇరకాటాన్ని వివరంగా వెళ్ళబోసుకుని, పైన ఉటంకించిన లేఖలో చివరికి సైన్యాధిపతి ఏమన్నాడంటే – ఇండియన్‌ ‌సైన్యం నమ్మకంగా ఉంటుందనే ప్రస్తుతానికి భావించి అలజడిని అణచటానికి భారతీయ దళాలనే ఉపయోగిస్తాం. వారు ఎంత మాత్రం నమ్మదగరని ధ్రువపడిన వెంటనే ఎన్ని బ్రిటిష్‌ ‌బలగాలను ఎన్ని పంపగలిగితే అన్నిటిని వెంటనే ఇండియా పంపమని హిజ్‌ ‌మెజిస్టీ సర్కారు వారిని కోరుతాను – అని.

ఆ నివేదిక చూశాక సీమదొరలకు బోలెడు డౌట్లు వచ్చాయి. సేనాపతీ సేనాపతీ ! నువ్వేమో మొదట నీ సైన్యాన్ని నమ్ముతాను; వాళ్ళు మంచి వాళ్ళే అని అనుకుని వారితోనే పని జరిపిస్తాను; వాళ్ల అసలు రంగు బయటపడితే లండన్‌ ‌సర్కారుకు చెప్పి మన సేనలను పంపించామంటాను. అప్పుడు మన సేనలతోనే ఇండియన్ల తిరుగుబాటును అణచి ఇండియాను తిరిగి జయిద్దాము అన్నావు కదా ? ఇలా తొలి, మలి దశలను, వాటి నడిమి కాలాన్ని నువ్వు ఎలా డీల్‌ ‌చెయ్యాలనుకుంటున్నావు? ఒక్కొక్క దశలో నీకు ఏ రకమైన సీమ బలగాలు ఎన్ని కావలసి వస్తాయి? బ్రిటిష్‌ ‌ట్రూప్స్‌ను ఎలా వాడాలను కుంటున్నావు? వాటికోసం మాకు ఎంత ముందుగా నోటీసు ఇవ్వగలవు? వాటిని ఇండియాలోకి తీసుకురావటాన్ని సమర్థించుకోవటానికి ఎలాంటి ప్లాను వేయదలిచావు? అంటూ తెగ కొర్రీలు వేశారు. వాటికి 1945 డిసెంబర్‌ 22‌న భారత సైన్యాధిపతి ఇలా జవాబు ఇచ్చాడు:

‘‘భారతీయ సేనలను నమ్మటానికీ, నమ్మక పోవటానికీ నడుమ మధ్యంతర దశ ఒకటి ఉంటుందని మీరు భావిస్తున్నట్టుంది. అలాంటిదేమీ ఉండదండి. పెద్ద ఎత్తున లేస్తున్న అంతర్గత కల్లోలం అణచటానికి ఇండియన్‌ ‌సాయుధ బలగాలను నమ్మవచ్చు అనుకుని నేను ముందుకు వెళుతున్నాను.

“If however Indian Armed Forces generally become unreliable British troops at my disposal are totally inadequate to restore situation or even to protect communications which would be essential for their reinforcement….Indian Officers who are mostly Nationalist are spread throughout the Indian Armed Forces…. If morale were to deteriorate gravely owing to continued propaganda and some units mutinied news would spread rapidly and mutiny might become general.Even if in these circumstances some units remain prepared to fight for Government against their own people it is impossible to foretell which these units might be and therefore where they would be located … we might get no or only very short warning…’’

[అదే గ్రంథం పే. 673-675]

(ఒకవేళ భారతీయ సాయుధ సేనలను మొత్తంగా నమ్మలేని పరిస్థితి వస్తే నా చేతిలోని బ్రిటిష్‌ ‌బలగాలు మామూలుస్థితిని పునరిద్ధరించ టానికే కాదు కమ్యూనికేషన్ల వ్యవస్థను రక్షించటానికి కూడా బొత్తిగా సరిపోవు. బ్రిటిష్‌ ‌ట్రూప్స్‌ను మొహరించటానికయినా కమ్యూనికేషన్లు సవ్యంగా ఉండాలి కదా. ఇండియన్‌ ఆఫీసర్లలో అత్యధికులు నేషనలిస్టులు. వారు సాయుధ బలగాలలో అంతటా వ్యాపించి ఉన్నారు. మనకు వ్యతిరేకంగా నిరంతరం సాగుతున్న ప్రాపగాండా ఫలితంగా నైతిక ధృతి సడలి కొన్ని యూనిట్లు తిరగబడితే ఆ వార్త ఆన్నిచోట్లకూ త్వరగా వ్యాపిస్తుంది. దాని ప్రభావం వల్ల మొత్తం సైన్యమే తిరుగుబాటు చేయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా గవర్నమెంటు తరఫున తమ సొంత జనాలపై పోరాడటానికి కొన్ని యూనిట్లు సిద్ధపడినా అవి ఏవి అన్నది ముందుగానే కనిపెట్టి, తదనుగుణంగా వాటిని కావలసిన చోట్ల మొహరించటం సాధ్యం కాదు. తిరుగుబాటు జరగబోతున్నదని మనకు ముందుగా వార్నింగు రాదు. ఒకవేళ వచ్చినా కొంచెం ముందు మాత్రమే.)

సింహ స్వప్నమైన సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌భూతం ఎక్కడ మీదపడుతుందో, ఐఎన్‌ఎ ‌ప్రభావంవల్ల భారత సైన్యం ఎప్పుడు తిరగబడుతుందో, బ్రిటిషు సర్కారు పుట్టి ఎక్కడ మునుగుతుందోనని బెంబేలుపడుతూ, సైన్యాధిపతే తన సైన్యాన్ని నమ్మలేక మేకపోతు గాంభీర్యం చూపుతున్న సమయాన తెల్ల దొరతనం భయపడినంతా జరిగింది. సైన్యంలో తిరుగుబాటు రానే వచ్చింది.

 మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
Instagram