ఫిబ్రవరి 13 – స్వామి వివేకానంద హైదరాబాద్‌లో ప్రసంగించిన రోజు

స్వామి వివేకానంద ఆధునిక యుగ ప్రవక్త. 1893లో ఆ మహనీయుడు హైదరాబాద్‌ను సందర్శించిన సంగతి పెద్దగా ప్రచారంలో లేకపోయినా, ఆ యాత్రాచరిత్ర చిరస్మరణీయమే. కారణం, సెప్టెంబర్‌ 11, 1893‌న జరిగిన షికాగో సర్వమత మహాసభలో ప్రసంగించి వివేకానందులు భారత ఖ్యాతిని ఇనుమడింప చేశారు. రానున్న కాలంలో ఆయన సాధించనున్న ఈ ఘనతర ఆధ్యాత్మిక విజయానికి నాంది పలికింది ఈ పర్యటనే.

అవి భారతదేశాన్ని పాశ్చాత్యులు పరిపాలి స్తున్న రోజులు. వారి ఏలుబడిలో ఎగువ తరగతి కన్నా పామరులే ఎక్కువ నష్టపోయారు. ఈ సమయంలో స్వామీజీ పరివ్రాజకుడిగా దేశమంతటా పర్యటిస్తూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. స్వామీజీ మహారాజుల ప్రాసాదాలలోనూ, నిరుపేదల గుడిసెలలోనూ ఒకే రీతిన మెలిగారు. అన్నింటినీ ప్రత్యక్షంగా చూస్తూ అర్థం చేసుకున్నారు.

అప్పుడే, షికాగో సర్వమత మహాసభల గురించి మద్రాసులో ఉన్న స్వామిజీ శిష్యులకు తెలిసింది. స్వామీజీ హిందూమత ప్రతినిధిగా షికాగో వెళ్లాలని వారు అభ్యర్థించారు. ఆ అభ్యర్థనను విన్నప్పటికీ స్వామీజీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. పైగా ఆనాటి రాజులు కొందరు స్వామీజీ చికాగో వెళ్లడానికి ధన సహాయం చేస్తామని చెప్పి, వెనుకంజ వేశారు. అందువల్ల స్వామీజీ సామాన్య భారతీయుల సాయంతోనే, వారు ఇచ్చినదాన్నే విరాళంగా తీసుకోవాలని భావించారు, అది వేరే విషయం.

అమెరికా యాత్ర గురించి డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడే మరొక ఘటన జరిగింది. అదే, స్వామీజీకి హైదరాబాద్‌ ‌నుండి ఆహ్వానం. చెన్నైవాసుల ద్వారా స్వామీజీ పేరు ప్రతిష్ఠలు హైదరాబాదుకూ వ్యాపిం చాయి. బ్రిటిష్‌ ఇం‌డియా మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీలో తెలుగు, తమిళ ప్రజలు కలసి ఉండేవారు. తెలుగువారికి స్వామీజీ గురించీ, స్వామీజీ చేపట్టిన కార్యం గురించీ అప్పటికే తెలుసు.

అలాగే నిజాం సంస్థానంలో ఎందరో విద్యా వంతులైన బెంగాలీలు ఉండేవారు. వారిలో స్వామిజీ ఆప్తులు నగరానికి రావలసిందిగా పదేపదే ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని హృదయపూర్వకంగా స్వీకరించారు స్వామీజీ. ఈ ఆహ్వానంలో ఏదో దైవసంకల్పం ఉండవచ్చునని స్వామీజీ భావించారని కూడా అనుకోవచ్చు. అలా వచ్చారీ చరిత్రాత్మక నగరికి. నిజాం టంకసాల అధికారి బాబు మధుసూదన్‌ ‌ఛటర్జీ ఇంట్లో స్వామీజీ అతిథిగా ఉన్నారు.

స్వామీజీ యాత్రా విశేషాలు నిజాం వంశీయు లైన నవాబ్‌జాదా షాజీ నవాబ్‌ ‌ద్వారా మరికొన్ని తెలిశాయి. వివేకానంద చెన్నై శిష్యుడు అలసింగ పెరుమాళ్‌ ‌హైదరాబాద్‌లో ఉన్న తన మిత్రునికి స్వామీజీ హైదరాబాద్‌ ‌రాక గురించి తెలియజేశాడు. రైల్వేస్టేషన్లో స్వామీజీని కలుసుకోమని వర్తమానం కూడా పంపించాడు.

అది ఫిబ్రవరి 10. కాషాయాంబరాలు ధరించి, చేత కమండలంతో మొదటి తరగతి రైలు పెట్టె నుండి దిగిన స్వామీజీకి స్వాగతం పలుకడానికి హిందువులు, మహమ్మదీయులు కలిపి దాదాపు 500 మంది వేచివున్నారు. వారిలో అత్యున్నత పదవులలో ఉన్న వారూ, సంఘంలో పెద్దమనుషులూ ఉన్నారు. నవాబ్‌ ‌సికందర్‌ ‌జంగ్‌ ‌సహా పలువురు స్వామీజీని పూలమాలలతో సాదరంగా ఆహ్వానించారు. ‘హైదరాబాద్‌లో ఒక సన్న్యాసికి ఇంత బ్రహ్మాండమైన స్వాగతం లభించడం ఇంతకుముందు ఎన్నడూ లేదని’ ఒక ప్రత్యక్ష సాక్షి తన స్మృతులలో రాసుకున్నారు.

మరునాడు, ఫిబ్రవరి 11న పాలు, పండ్లు, మిఠాయిలు మొదలైన ఎన్నో కానుకలతో సికింద్రా బాద్‌ ‌నుండి వందమంది స్వామీజీ దర్శనార్థం వచ్చారు. పట్టణంలోని మహబూబ్‌ ‌కళాశాలలో ఉపన్యసించవలసిందిగా ఆహ్వానించారు. స్వామీజీ అప్పటివరకు బహిరంగ సభలలో ప్రసంగించలేదు. ఏం సంకల్పమో, సభకు అంగీకరించారు. మహబూబ్‌ ‌కళాశాల నిజాం పాలనలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థ. ప్రారంభంలో ఆంగ్లో వెర్నాక్యులర్‌ ‌పాఠశాలగా పిలిచేవారు. ఈ విద్యాసంస్థను 1862లో సోమసుందరం ముదలియార్‌ ‌స్థాపించారు. తరువాత ఆరవ నిజాం మహబూబ్‌ ఆలీఖాన్‌ ఇచ్చిన భారీ విరాళంతో మహబూబ్‌ ‌కళాశాలగా మారింది.

ఆ తరువాత స్వామీజీ కాళీచరణ్‌ ‌బాబుతో కలసి గోల్కొండ సందర్శనార్థం వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి హైదరాబాద్‌లో అత్యంత ప్రముఖుడూ, నిజాం బావమరిది నవాబ్‌ ‌బహదూర్‌ ‌సర్‌ ‌ఖుర్షీద్‌ ‌ఝా ఆంతరంగిక కార్యదర్శి స్వామీజీ కోసం వేచివున్నాడు. మర్నాడు ఉదయం నవాబును కలుసుకోవలసిందిగా ఆహ్వానం అందజేశాడు. మర్నాడు (ఫిబ్రవరి 12) కాళీచరణ్‌తో పాటు స్వామీజీ నవాబు రాజప్రాసాదానికి వెళ్లారు. ఖుర్షీద్‌ ‌ఝా విశాల మనోభావాలు గల వ్యక్తి. మహమ్మ దీయుడే అయినప్పటికీ హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు హైందవ పుణ్యతీర్థాలన్నీ సందర్శించాడు. ఆయనతో సమావేశమైనందుకు స్వామీజీ కూడా సంతోషించారు. ఇద్దరూ దాదాపు రెండు గంటలకు పైగా హిందూ, క్రైస్తవ, మహమ్మ దీయ మతాలలోని అంశాలపై చర్చించుకొన్నారు. ఖుర్షీద్‌ ‌ఝా విగ్రహారాధనను ఆమోదించరు. అతడికి భగవదారాధన పరిణామక్రమాన్ని గురించి స్వామీజీ విశదపరిచారు, అత్యున్నత వేదాంత తత్త్వాల గురించి చెప్పారు. స్వామీజీ వివరిస్తున్నప్పుడు ఆయన కళ్లలో భాసిల్లిన ప్రకాశమూ, ముఖారవిందాన ద్యోతకమయిన తేజస్సూ, భావాలలోని స్పష్టత చూసి నవాబు ఆశ్చర్యచకితుడై మరింత ఉత్సుకతతో విన్నాడు. స్వామీజీ పాశ్చాత్య దేశాలక• వెళ్లనున్న విషయం ప్రస్తావించినప్పుడు నవాబు ఆ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి, తన వంతుగా వేయి రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు. చెన్నైలో లాగానే ఇక్కడ కూడా డబ్బు నిరాకరించారు స్వామీజీ; ‘‘నవాబ్‌జీ! ఇంకా సమయం ఆసన్నం కాలేదు. భగవదాదేశం వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను’’ అంటూ సెలవు పుచ్చుకొన్నారు. తరువాత మక్కా మసీదు, చార్మినార్‌, ‌ఫలక్‌నామా, నిజాం రాజప్రాసాదాలు, బషీర్‌బాగ్‌, ‌హిందూ దేవాలయాలు- హైదరాబాద్‌లోని ముఖ్యమైన ప్రదేశాలను స్వామీజీ సందర్శించారు.

ఆ మరునాడు వివేకానంద జీవితంలో మరపురాని రోజు. ఆరోజు (ఫిబ్రవరి 13) ఉదయం స్వామీజీ నిజాం కొలువులో మత విధానాల గురించి ముచ్చటించారు. సాయంత్రం మహబూబ్‌ ‌కళాశాలలో ‘పశ్చిమ దేశాలకు వెళ్లడం వెనుక నా ఉద్దేశం’ అనే అంశం మీద ప్రసంగించారు. ఐరోపా వారితో కలిపి ఆ సమావేశంలో 1000 మందికి పైగా పాల్గొన్నారు. స్వామీజీ ఆంగ్లభాషా వక్తృత్వమూ, పాటవమూ వారిని ఆశ్చర్యచకితులను చేసింది. హిందూమత ప్రాశస్త్యమూ, సనాతన హైందవ సమాజమూ, సంస్కృతి, వేదవేదాంత భావనలూ, పురాణాలు బోధించే నైతిక ఆదర్శాలూ ఇలా అనేక అంశాల గురించి వారి ముఖతః వెలువడిన భావనా తరంగాలు శ్రోతలను కొత్తలోకానికి తీసుకువెళ్లాయి. భారతదేశ ఔన్నత్యాన్ని బహుముఖంగా చాటిచెప్పిన తర్వాత చివరగా స్వామీజీ తాము పాశ్చాత్యదేశాలకు వెళ్లడంలోని ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు: ‘‘మన మాతృదేశాన్ని నూతన జవసత్వాలతో పునరుజ్జీవింప చెయ్యాలి. అందు నిమిత్తమే ఈ పాశ్చాత్య దేశాల ప్రయాణం’’ అని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు. సభకు పండిత్‌ ‌రతన్‌లాల్‌ అధ్యక్షత వహించారు. స్వామీజీ ఇంత ఎక్కువ జనసమూహం ముందు ఎన్నడూ ఉపన్యసించలేదు. అయితే భవిష్యత్తులో సర్వమత మహాసభలో ప్రసంగించ డానికి ముందు ఈ సభలో మాట్లాడటం స్వామీజీకి మంచిదయింది. అంతేగాక, ఇంతమంది ముందు ప్రసంగించడంతో స్వామీజీ ఆత్మవిశ్వాసం ఇనుమడించింది.

స్వామీజీ నగరంలోని అనేకమంది ప్రముఖులతో వివిధ అంశాలను గురించి మాట్లాడారు. వారిలో ముఖ్యులు రాజా శ్రీనివాసరావు బహదూర్‌, ‌మహారాజా రంభారావు బహదూర్‌, ‌పండిత్‌ ‌రతన్‌లాల్‌, ‌శమ్స్- ఉల్‌-ఉలేమా సయ్యద్‌ ఆలీ బిల్‌‌గ్రమీ.

మర్నాడు (ఫిబ్రవరి 14) ఉదయం బేగం బజారులోని బ్యాంకర్ల• కొందరు సేట్‌ ‌మోతీలాల్‌ ‌నేతృత్వంలో స్వామీజీని కలుసుకొన్నారు. వారు కూడా ఆయన ప్రయాణానికి సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. ఫిబ్రవరి 15న పూణే నుండి కూడా స్వామీజీకి ఆహ్వానం వచ్చింది. కాని ఆ ఆహ్వానాన్ని ఆయన వెంటనే ఆమోదించలేక పోయారు. ఆ మరుసటి రోజు కొన్ని హైందవ శిథిలాలయాలు, బాబా షరాఫుద్దీన్‌ ‌సమాధి, సర్‌ ‌సాలార్‌జంగ్‌ ‌రాజభవనాన్ని స్వామీజీ తిలకించారు.

అతీంద్రియ శక్తులు సంతరించుకొన్న ఒక యోగిని స్వామీజీ హైదరాబాద్‌లో కలుసుకొన్నారు. ఏ వస్తువును కోరుకొన్నా రప్పించగల శక్తిమంతుడని ప్రతీతి. అప్పుడా యోగి జ్వరంతో ఉన్నాడు. స్వామీజీ వెళ్లి శక్తులను ప్రదర్శించమని అడిగారు. అందుకు ఆ యోగి, ‘‘తప్పకుండా చూపుతాను. కాని ముందు మీరు నా తల మీద చేయి ఉంచి ఆశీర్వదించాలి. నా జ్వరం నయమవుతుంది’’ అన్నాడు. స్వామీజీ అట్లే చేశారు. పిదప ఆ యోగి వారితో, ‘‘మీకు కావలసినవి ఒక కాగితం మీద రాసి ఇవ్వండి’’ అన్నాడు. ఆ ప్రాంతంలో లభించని ద్రాక్ష, కమలాల వంటి పండ్ల పేర్ల• రాసి ఇచ్చారు. ఆ యోగి గుత్తులుగుత్తులుగా ద్రాక్ష, కమలాలు మొదలైన వాటిని సృష్టించాడు. చివరగా అద్భుతమైన గులాబీలను తెప్పించాడు. అవి కొంచెం కూడా వాడక, మంచుబిందువులతో తాజాగా ఉన్నాయి. ‘‘ఇది ఎలా?’’ అని స్వామీజీ అడిగినప్పుడు, ‘‘అంతా హస్తలాఘవం’’ అని అంగీకరించాడా యోగి!

తిరిగి వచ్చాక కూడా స్వామీజీ ఆ యోగి గురించే ఆలోచిస్తూ ఉండిపోయారు. దీర్ఘంగా ఆలోచించిన తరువాత స్వామీజీకి లభించిన యుక్తియుక్తమైన జవాబు ‘మనస్సు’ అన్నదే. మనస్సును వశపరచు కొంటే శక్తి ఉద్భవిస్తుంది; ఇతరుల మనస్సులను కూడా తన ఇచ్ఛ మేరకు వ్యవహరింపజేసే సమర్థత లభిస్తుంది. ఎందుకంటే ఆధారంలో మనస్సులన్నీ పరస్పరం సమైక్యమైనవే కనుక. వ్యక్తిగత మనస్సు అంటూ ప్రత్యేకంగా లేదు. మానసిక శక్తిని చూపించి, ‘‘అక్కడ ఏనుగు ఉంది’’ అని చెబితే ఆ మరో వ్యక్తికి ఏనుగు కనిపిస్తుంది. అది మానసికశక్తి సృష్టించే అద్భుతం!

మానసిక శక్తికి ఒక నిదర్శనాన్ని ప్రత్యక్షంగా చూసిన స్వామీజీకి హైదరాబాద్‌ ఉపన్యాసం గొప్ప స్ఫూర్తిని, చొరవను ఇచ్చింది. ‘మానసిక శక్తులు’ అన్న అంశం మీద 1900వ సంవత్సరంలో లాస్‌ఏం‌జలస్‌లో ప్రసంగిస్తూ, వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఇటువంటి యోగులు ఉండేవారనీ, కాలంతో పాటుగా వారి సంఖ్య తగ్గిపోయిందనీ తెలియజేశారు. ప్రతీ ఒక్కరిలోనూ దివ్యత్వం గర్భితంగా ఉందనీ, అందరి మనస్సులను సమైక్యపరచగలిగినప్పుడు ఒకరి ఆలోచనలు మరొకరికి తంతి వలె పంపవచ్చనీ తెలియజేశారు. అయితే ఆధ్యాత్మిక సాధకుడు ఇటువంటి సిద్ధుల గందరగోళంలో పడరాదని స్వామీజీ హెచ్చరించడం విశేషం.

ఫిబ్రవరి 17వ తేదీన స్వామీజీ హైదరాబాద్‌ ‌నుండి చెన్నైకి బయలుదేరారు. వేయిమందికి పైగా ప్రజలు వీడ్కోలు పలికేందుకు స్టేషన్‌కు వచ్చారు. స్వామీజీని హైదరాబాద్‌కు ఆహ్వానించిన బాబు మధుసూదన్‌ ‌కుమారుడు కాళీచరణ్‌ ‌బాబు తన డైరీలో స్వామీజీ రాక హైదరాబాద్‌ ‌వాస్తవ్యులలో ఒక చెరగని ముద్ర వేసిందని రాసుకున్నారు. హైదరాబాద్‌ ‌పర్యటన కూడా కొంతవరకు స్వామీజీని ప్రభావితం చేసింది. అంతవరకూ పాశ్చాత్య దేశాలకు వెళ్లాలా, వద్దా అన్న సందిగ్ధం తొలగి ఆయన చెన్నై చేరుకునేసరికి ఒక స్థిర నిర్ణయానికి రాగలిగారు. హైదరాబాద్‌లో జరిగిన మొట్టమొదటి అతి పెద్ద బహిరంగ ఉపన్యాసం స్వామీజీలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపి తదుపరి కార్యసాఫల్యానికి ఊతంగా నిలబడిందని చెప్పవచ్చు. జనసందోహం ఎక్కువైనప్పుడు వక్తలోని ప్రతిభ వెలికి వస్తుంది. మహబూబ్‌ ‌కళాశాల ఉపన్యాసంలోనూ ఇదే జరిగింది.

అప్పటివరకు పెద్దగా ఎవరికీ తెలియని స్వామీజీ తన హైదరాబాద్‌ ‌పర్యటన ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించారు.

వివేకానంద భారతదేశానికి ఒక వరప్రసాదంగా ఈ భువిపై ఏతెంచిన యుగపురుషుడు. అలాంటి మహోన్నత వ్యక్తి మానవ మాత్రులమైన మన మధ్య సంచరిస్తున్నప్పుడు పులకించిపోతాం. ఏ వ్యక్తి అయినా స్వామీజీని దర్శించి ఉంటే, అది ఐదు నిమిషాలు కావచ్చు, ఆ వ్యక్తి గురించి తెలుసుకో వాలనిపిస్తుంది! ఆయన దర్శించిన లేదా ప్రయాణించిన ప్రాంతాలను తీర్థక్షేత్రాలుగా ఆరాధిస్తాం. స్వామీజీ హైదరాబాద్‌ ‌మహానగరంలో ఒక వారం చేసిన సందర్శన, ఆధ్యాత్మిక చర్చ గురించి విన్నప్పుడు ఆనందోత్సాహాలలో మునిగి తేలుతాం. వారు దర్శించిన ప్రాంతాలు, కళాశాల ఇప్పటికీ చరిత్రాత్మక స్థలాలుగా చరిత్ర పుటలలో నిలిచి ఉన్నాయి.

స్వామి వివేకానంద హైదరాబాద్‌ ‌నగర సందర్శనం చరిత్ర పుటలలో సనాతన ధర్మానికీ, దక్షిణ భారతంలో రామకృష్ణ సంఘం అభివృద్ధికి దోహదకారి అయింది. చారిత్రకత సంతరించుకున్న హైదరాబాద్‌ ‌మహానగరం ఆ యుగపురుషుని సందర్శనంతో పులకించింది, ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థానాన్ని పొందింది. స్వామి వివేకానంద వారం పాటు బస చేసిన హైదరాబాద్‌, ‌నాటి ప్రజలు ఎంతటి భాగ్యవంతులో కదా! స్వామీజీ సందేశాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడం, వ్యాప్తి చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి.

‘హైదరాబాద్‌లో స్వామి వివేకానంద’ – రామకృష్ణ మఠ్‌, ‌హైదరాబాద్‌ ‌పుస్తకం ఆధారంగా.

About Author

By editor

Twitter
Instagram