అయోధ్యలో జనవరి 22న జరిగిన బాలక్‌రామ్‌ ప్రాణప్రతిష్ఠ, ఏప్రిల్‌ 17న రాములవారి నుదుట మీద జాజ్జ్వల్యమానంగా వెలిగిన సూర్యతిలకం ఒక అస్త్రానికి మరింత పదును పెట్టాయి. ఆ అస్త్రం భారతదేశంలోని సెక్యులరిస్టులు, కాంగ్రెస్‌ పార్టీ, ఉదారవాదులు, ముస్లిం మతోన్మాదులు, ఒకవర్గం విదేశీ`స్వదేశీ మీడియా కలసి భారతీయ జనతా పార్టీకి అందించినదే. పేరు రామబాణం. 2024 ఎన్నికలలో అదే బీజేపీ ప్రచారాస్త్రమైందంటే సత్యదూరం కాదు. ఆ పార్టీ ఆ అస్త్రాన్ని సవినయంగా స్వీకరించిందన్నా తప్పుకాదు. మీరంతా రాముడి పక్షం అంటూ ప్రతిపక్షాలు పదే పదే గొంతు చించుకుంటూ ఉంటే బీజేపీ ఎందుకు కాదంటుంది? ఐదువందల ఏళ్ల హిందువుల ఆత్మగౌరవ పోరాటానికి మద్దతుగా నిలిచి, మందిర నిర్మాణానికి ఉడుతా భక్తిగా సాయపడినందుకు అది రాముడే ప్రతిపక్షాల ద్వారా అందించిన దివ్యాస్త్రమని బీజేపీ భావించక తప్పడం లేదు. మీరే కాదు, మేం కూడా రాముడి పక్షమే అని ఈ దేశంలో 140 కోట్ల మంది ముక్త కంఠంతో చెబుతుంటే ఇంకా ఎందుకు ముసుగులో గుద్దులాట! ఔను, 2024 ఎన్నికలను శ్రీరాముడు శాసిస్తున్నాడు.

రామచంద్రుడిపై విశ్వాసంతో బీజేపీ చేసిన సానుకూల ప్రచారం కంటే, ఆయన పేరుతో విషప్రచారం చేసిన విపక్షం గొంతే ఎక్కువగా దేశంలో వినిపించింది. రాముడికీ, భరతభూమికీ ఉన్న బంధం; దాశరథికీ, ఈ దేశ నాగరికతా దర్శనానికీ ఉన్న బంధం అర్ధం కాలేదు కాబట్టే విపక్షం ఆ పని చేసింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం, ప్రాణప్రతిష్ఠ హిందూమత తంతు అనుకున్నారు వీళ్లు. తంతును సమర్ధిస్తే బుజ్జగింపు వ్రతానికి భంగమని భ్రమపడ్డారు. కానీ అది భారతీయ నాగరికత పునరుజ్జీవనం. అందుకే సాధారణ భారతీయుడి గుండెను కూడా తాకింది.

ఫెళ్లున ఎండ కాస్తున్నా అస్సోంలోని నలాబరిలో ఏర్పాటైన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభకు జనం విశేషంగా హాజరయ్యారు. సరిగ్గా మిట్టమధ్యాహ్నం పన్నెండు గంటలకు తన ఉపన్యాసం ఆపేసి మీరంతా మీ సెల్‌ఫోన్లు ఆన్‌ చేసి చూడమని జనాన్ని కోరారాయన. తెరల మీద అయోధ్యలో బాలక్‌రామ్‌ నుదుటి మీద సూర్య తిలకం పడుతున్న దృశ్యం చూడమని కోరారు. 2024 సాధారణ ఎన్నికల ఏడు దశల పోలింగ్‌ మొదలు కావడానికి రెండు రోజులే ఉందనగా శ్రీరామనవమి నాడు ప్రధాని మోదీ నలాబరి సభలో ప్రసంగించారు. ఆ విధంగా ఈ ఎన్నికలలో తమ ప్రచారాస్త్రం రాముడేనని ఆయన స్పష్టం చేశారు. దీని మీద విపక్షాలు గోల చేస్తాయని తెలుసు. అయినా జైశ్రీరామ్‌ నినాదాల మధ్య జనాన్ని సూర్య తిలకం దృశ్యాన్ని వీక్షించమని కోరారు. అనుకున్నట్టుగానే సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ఎన్నికల సంఘానికి ఈ అంశం మీద ఫిర్యాదు చేశారు.

భారతీయ నాగరికతకు సంబంధించిన సైద్ధాంతిక యుద్ధం ఈ ఎన్నికలలో తొలి అంశమైంది. ఆ నాగరికతకు ప్రతీకగా విపక్షం నరేంద్ర మోదీని చూస్తున్నది. ‘హిందూ ధర్మంలో ‘శక్తి’ అనే పదం ఉంది. దానితో మనం పోరాడతాం’ అని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అనాలోచితం గానే అయినా మనసులోని విషయం బయటపెట్టారు. మోదీని మూడోసారి అధికారంలోకి రాకుండా చూడడం అంటే, భారతీయ నాగరికత పునరుజ్జీవ నానికి అడ్డుకట్ట వేయడమేనని వారి భావన. అడ్డుకట్ట వేయాలన్నది ఎలాగూ వారి ఆశయమే. విపక్షానికి సంబంధించి ఈ ఎన్నికలలో అదే రహస్య అజెండా. హిందూ శక్తికి ప్రతీకగా వారు భావిస్తున్న మోదీని నిలువరించడానికి ఆఖరి అవకాశం ఈ ఎన్నికలు మాత్రమేనని నమ్ముతున్నారు.

అయోధ్యలో రామమందిరం ధ్వంసమైన క్రీస్తుశకం1528, దాని స్థానంలో వచ్చిన మసీదు కూలిన 1992, కొత్త ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జరిగిన 2024 సంవత్సరాలకు ఒకే రకమైన ప్రాధాన్యం ఉంది. ఆ మూడు సంవత్సరాలు భారత చరిత్రను మలుపు తిప్పాయి. చెరగని ముద్ర వేశాయి. 2024 భారతదేశానికి కొత్త సూర్యోదయాన్ని చూపబోతోంది. అది అయోధ్య ప్రాణప్రతిష్టతో ఆరంభమైంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని చాలామంది అనుకోవడం అందుకే. సెక్యులరిజం పేరుతో ఈ దేశ ప్రజలకు జరుగుతున్న దగా ఇకపై చెల్లకపోవచ్చు. కుహనా సెక్యులరిజం ఈ దేశ మూలాలను చివికిపోయేటట్టు చేసింది. నిజానికి భారతదేశంలో సెక్యులరిజం అన్న పదంలోనే కుహనా ‘సైలెంట్‌’గానే ఉంది. హత్యలు చేసి అధికారంలో కొనసాగుతున్న వాడికైనా, కుటుంబ పాలనతో దశాబ్దాల పాటు కుర్చీని వీడని వాళ్లకైనా, కోట్లాది రూపాయల ఆర్థిక నేరాలకు పాల్పడిన వాడికైనా, ఎన్నో నేరాలతో జైలుకు వెళ్లి వచ్చిన వాడికైనా ఈ దేశంలో రక్షణ కవచంగా ఉపయోగ పడుతున్నదే సెక్యులరిజం. దేశం మీద విద్వేషాన్ని రగిల్చే కొన్ని మదర్సాల మీద దాడి చేసినా అది సెక్యులరిజం మీద దాడిగానే భావిస్తున్నారు. విద్యా వ్యవస్థ సర్వం భ్రష్టు పట్టిపోవడానికి కారణం సెక్యులరిజం. ఇక్కడ సెక్యులరిజం అంటే హిందువు లకు పరిమితమైన ఆదర్శం సూత్రం. ముస్లింలకు, క్రైస్తవులకు దీనిని పాతరేసే హక్కు ప్రతి అడుగులోను ఉంటుందని చాలా రాజకీయ పార్టీల నమ్మకం. సెక్యులరిజం అనే ఆదర్శం ఈ దేశంలో ఎంత దగాయో ప్రాణప్రతిష్ఠ తరువాత మరింత స్పష్టంగా అర్ధమయ్యేటట్టు చెప్పేవారు వచ్చారు. అదొక కొత్త స్రవంతి.

ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు. వారు చట్టాన్ని తమ చేతులలోకి తీసుకోలేదు. అయినా కోర్టు ఎదుట నిలబడి న్యాయాన్ని కోరే హక్కు వారికి నిరాకరించింది మన సెక్యులరిజం. 1990లో కశ్మీరీ పండిట్ల ఊచకోత మొదలైంది. ఇది ప్రపంచం లోనే దారుణ ఘట్టం. 7 లక్షల మంది పండిట్లు ఇప్పటికీ సొంత నేలకు వెళ్లగలిగే వాతావరణం ఏర్పడలేదు. 33 సంవత్సరాలనాటి ఈ మహా జన హననం మీద న్యాయం కోరుతూ కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లారు. కానీ అది జరిగి చాలా కాలం అయిపోయింది కాబట్టి విచారణకు స్వీకరించలేమని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ కేసును స్వీకరించలేదు. కానీ కశ్మీరీ పండిత్‌ల ఊచకోతకు ఆరేళ్ల ముందు జరిగిన సిక్కుల ఊచకోత మీద పునర్‌ విచారణ జరపడానికి సుప్రీం కోర్టు అంగీకరించి, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటుకు ఆదేశించింది. ఇదొక ఘోర అన్యాయమని విమర్శలు వచ్చాయి. కాబట్టి హిందువులకు న్యాయం అందడం లేదనడం కంటే, న్యాయం ఎదుట వారు విచక్షణకు గురి అవుతున్నారని, హిందువుల వరకు చట్టం ఎదుట అంతా సమానులేనని చెప్పడం ప్రశ్నార్థకమని అనక తప్పదు. హిందువులకు సామాజికమైన దురవస్థ కూడా పట్టింది. పండిత్‌లకు అలాంటి శిక్ష సరైనదేనని వాదించిన మేధావులు తయారయ్యారు. ఎందుకంటే పండిత్‌లు మేధావులు. కాబట్టి సదరు శిక్ష వారికి సరైనదేనని ఊచకోతను సమర్ధించిన ఉదారవాదుల సమాధానం. ఈ దేశంలో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలలో ఒక దృశ్యం కనిపిస్తుంది. పాలస్తీనియన్లు వారి స్వస్థలానికి వెళ్లాలని ప్లకార్డులతో ఊరేగుతూ, గొంతులు చించుకుంటారు. ఏనాడైనా కశ్మీరీ పండిత్‌లు వారి స్వస్థలానికి వెళ్లాలని ఒక్క ప్లకార్డు విశ్వవిద్యాలయ విద్యార్థి భుజం మీదనైనా కనపడిరదా?

అయోధ్యలో రామ్‌లల్లా తలుపులు తీయ వచ్చునని, భక్తులను లోపలికి అనుమతించవచ్చునని 1986లో ఆదేశం ఇచ్చిన న్యాయమూర్తి (కేఎం పాండే) ఆపై పదోన్నతకి నోచుకోలేదు. ఆ న్యాయా ధీశుడు నిజాయితీపరుడే. సమర్ధుడే. అయినా అలాంటి తీర్పు ఇచ్చినందుకు ఆయన పదోన్నతికి సిఫారసు చేయబోనన్నారు, నాటి ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌. సెక్యులరిజం రక్షణ పేరుతో న్యాయ వ్యవస్థకు, అదే సమయంలో ప్రజాస్వామ్యానికి ఏకకాలంలో జరిగిన ఈ చేటును ఎవరు ప్రశ్నించారు? ఇంత కీలకమైన ప్రశ్న సెక్యులరిజం పరిరక్షణ గాలిలో కొట్టుకు పోయింది. కరసేవకుల మీద కాల్పులు జరిపిన ములాయం భారత సెక్యులరిజానికి ఆశాజ్యోతిగా పేరపడ్డారు. ఇంతకీ అయోధ్యలో కరసేవ సందర్భంలో జరిగిన కాల్పులలో ఎంతమంది కరసేవకులు చనిపోయారు? ప్రభుత్వం ఇచ్చిన లెక్క 30. కానీ కాదు, 342 మంది కరసేవకులను చంపారని అంటున్నారు విష్ణుజైన్‌ (జ్ఞాన్‌వాపి కేసులో హిందువుల తరఫు న్యాయవాది). దీని మీద కూడా ఆయన న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. జలియన్‌ వాలాబాగ్‌ కాల్పులకు, ప్రభుత్వం ఇచ్చిన లెక్కకు, ఇటీవల కూడా ఆ సంఖ్య నిజంకాని చెప్పే రుజువు బయటపడిరది. అయోధ్య కాల్పులకీ, జలియన్‌వాలా బాగ్‌ కాల్పులకీ, ప్రభుత్వాల మాటలకీ తేడా ఏముంది?

భారత్‌ను హిందూరాజ్యం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని, వారి పరిభాషలో కుట్ర పన్నుతున్నాయని విపక్షాలు పదే పదే చెబుతున్నాయి. నిజంగానే ఇక్కడ హిందువులకు అంత శక్తి ఉన్నదా? మోదీ కచ్చితంగా హిందూ వ్యతిరేకి కాదు. కానీ హిందూ అనుకూలుడేనని చెప్పడానికి అవకాశాలు పరిమితమేనని చెప్పేవారు ఉన్నారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థను

ధ్వంసం చేయడానికి, లొంగ దీసుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అనే వారికి కూడా చాలామంది ఇతరులు గట్టి సమాధానమే ఇస్తున్నారు. తాము కోరుతున్న అయోధ్య, మధుర, కాశీలలో అయోధ్య మాత్రమే వచ్చింది. అందుకు ఐదు వందల ఏళ్లు పట్టింది. ఇదేకదా హిందూరాజ్యంలో హిందువుల హక్కుకు ఉన్న శక్తి! ఇస్లాం నిబంధనల ప్రకారం మసీదుగా పరిగణించడం సాధ్యం కాని కట్టడం కూలితే వామపక్షాలు, ముస్లిం మేధావులు పెట్టిన గోల మూడు దశాబ్దాల పాటు వినిపించింది. భారతీయ వ్యవస్థను ముప్పయ్‌ ఏళ్లు వెనక్కి నెట్టింది. కానీ కమ్యూనిస్టులు, ఇస్లామిక్‌ దురాక్రమణ దారులు ప్రపంచంలో ఎన్ని దేశాలలో ఎన్ని కట్టడాలూ, విగ్రహాలూ కూల్చారు? ఈ ప్రశ్న కూడా సెక్యుల రిస్టుల జాతరలో అసలు వినిపించనే లేదు. స్పెయిన్‌ క్రైస్తవ దేశం.ఒక సమయంలో మొత్తం ఇస్లాం అయిపోయింది. చర్చ్‌లన్నీ మసీదులైపో యాయి. తరువాత పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. క్రైస్తవం తిరిగి వచ్చింది. మసీదులన్నీ చర్చ్‌లుగా మారాయి. వారు దాన్ని ఆత్మ గౌరవ పోరాటంగా చూశారు.

ఈ దేశంలో సెక్యులరిజం ఒక భ్రమ. కేవలం రాజకీయ అస్త్రం. ఈ దేశ సంపదలో సింహ భాగం ముస్లింలదే అన్నారు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, 2007లో. ఔనా! టిప్పు జయంతి ఏటా నిర్వహిస్తా మని కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. ఇస్లామేతరులను (అవిశ్వాసులను) చంపడం తన విధి అని చెప్పుకున్నవాడు టిప్పు. కూర్గ్‌లో అతడు హిందువులు, క్రైస్తవులను దారుణమైన పద్ధతిలో మతం మార్చాడు. మేల్కోటే అనే చోట ఒకే రోజున కొన్ని వందల మంది వైష్ణవులను చంపాడు. సెక్యులరిజం గురించి మరీ ఎక్కువ గోల చేసే కాంగ్రెస్‌ నిబద్ధత ఎంత? అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానిస్తే నిస్సంకోచంగా నిరాకరించిన పార్టీ అది. ఈ దేశంలో ఒక అనంతమైన మత సంఘర్షణను రగిల్చిన మొగల్‌ పాలనకు ఆద్యుడు బాబర్‌. అఫ్ఘానిస్తాన్‌లో ఉన్న బాబర్‌ సమాధిని గాంధీ`నెహ్రూ కుటుంబంలోని ప్రతివారు భక్తిప్రపత్తులతో దర్శించి వచ్చారు. ప్రథóమ ప్రధాని నెహ్రూ (1956), ఇందిరాగాంధీ (1976), రాజీవ్‌ గాంధీ (1986), రాహుల్‌ గాంధీ (2005) ఆ సమాధిని దర్శించుకుని వచ్చారు. బాబర్‌ సమాధి మీద ఉన్న గౌరవం, అతడు కూల్చగా తిరిగి నిర్మించిన హిందూ దేవాలయం మీద వారికి కలగలేదు. ఐదువందల ఏళ్ల క్రితం చనిపోయిన దురాక్రమణదారుడి మీద ఉన్న గౌరవం, 140 కోట్ల నేటి భారతీయుల విశ్వాసం మీద, నాగరికత మూలాల మీద ఆ కుటుంబం చూపలేకపోయింది. అసలు 1986లో అయోధ్యను హిందువులకు అప్పగిస్తే ఆధునిక భారతచరిత్ర ఇంత పెద్ద మలుపు తీసుకునేదా? అది లక్ష రూకల ప్రశ్న.

 ఇక్కడ 140 లేదా 144 కోట్ల మంది భారతీయులు అనడం ఏమిటి? హిందువులు 80 కోట్లే కదా అంటారేమో! ఇక్కడ అందరిని భారతీయులు, లేదా హిందువులు అనడమే వాస్తవం. ఇప్పుడు ముస్లింలుగా చెలామణి అవుతున్న చాలామంది పూర్వికులు అయోధ్య ఉద్యమకాలంలో హిందువులే అయి ఉండవచ్చు. లేదా అంతకు ముందు, తరువాతి కాలంలో మతం మారి ఉండవచ్చు. వారంతా మొదట భారతీయులు. లేదా హిందువులు. మొత్తంగా వారంతా ఈ నేల పుత్రులే. మొత్తంగా అర్ధం చేసుకోవలసిన అంశం` 1950 దశకంలో హిందూ పునరుజ్జీవనోద్యమాన్ని నిరోధించడానికి సోమనాథ్‌ ప్రతిష్ఠను అడ్డుకోవాలని ప్రథమ ప్రధాని నెహ్రూ శక్తివంచన లేకుండా కృషి చేసి విఫలమయ్యారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ ద్వారా మొదలైన హిందూ పునరుజ్జీవనోద్యమాన్ని ఈ ఎన్నికలలో బీజేపీనీ, మోదీని ఓడిరచడం ద్వారా అడ్డుకోవాలని కాంగ్రెస్‌, మిగిలిన తైనాతీలు కంకణం కట్టుకున్నారు. ఈ హిందూ ద్వేషం, ధర్మ వ్యతిరేక ప్రచారం, దూషణ అందులో భాగమే. సనాతన ధర్మాన్ని కూకటివేళ్లతో పెకలించాలని వీరంగం వేసినా, హిందూ ధర్మంలోని శక్తిని విమర్శించినా ఆశయం ఒక్కటే. సోమనాథుడి దగ్గర అపజయం ఎదురైనా, రామనాథుడి దగ్గర విఫలం కాకూడదనే. నిన్న మొన్నటిదాకా అయోధ్య రామాలయ నిర్మాణాన్ని నిలువరించాలన్న రాహుల్‌ ప్రయత్నం నాటి నెహ్రూ ప్రయత్నానికి కొనసాగింపు. కానీ అప్పుడు నెహ్రూ, ఇప్పుడు రాహుల్‌ కూడా ఓడిపోయారు.


అణ్వాయుధాలను అవతల పారేస్తాం: సీపీఎం

ఉగ్రవాద కేసుల నుంచి బయటపడిన ముస్లింలకు ఆసరా

సామూహిక జనహననానికి ఉపకరించే అణ్వాయుధాలనీ, ఇతర ఆయుధాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తామని సీపీఎం తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఏప్రిల్‌ 4వ తేదీన విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో దేశంలో మైనారిటీల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ, మతాంతరీకరణ నిరోధక బిల్లును రద్దు చేస్తామని పార్టీ ప్రకటించింది. పలు కీలక పదవులలో బీజేపీ నియమించిన ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తులను వాటి నుంచి తొలగిస్తామని కూడా ప్రకటించింది. పౌరసత్వ సవరణ చట్టం, యూఏపీఏ, పీఎంఎల్‌ఏ వంటి చట్టాలను రద్దు చేయడం కూడా మేనిఫెస్టోలో ఉంది. ఇక ఉమ్మడి పౌరస్మృతిని రద్దు చేస్తామని కూడా ప్రకటించారు.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలన్నదే సీపీఎం విధానంగా ప్రకటించింది. మైనారిటీలను హింసించి చంపకుండా నిరోధించేదుకు ఒక చట్టాన్ని కూడా తీసుకువస్తారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాల నుంచి భారతదేశాన్ని తప్పిస్తామని కూడా సీపీఎం చెప్పింది. భద్రత, సైనిక అవసరాలకు సంబంధించి ఇజ్రాయెల్‌తో చేసుకున్న అన్ని ఒప్పందాలను కూడా సీపీఎం అధికారంలోకి వస్తే రద్దు చేస్తుంది. పాలస్తీనా దేశం ఏర్పాటును సమర్ధిస్తూ, ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్‌ మీద ఆంక్షలు విధించాలని కోరనున్నట్టు సీపీఎం చెప్పింది. చైనాతో ఉన్న  సరిహద్దు సమస్యను చర్చల పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తామని సీపీఎం చెప్పింది. తీవ్రవాదం, సరిహద్దు సమస్యలన్నింటి గురించి చర్చించడానికి పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియను పున:ప్రారంభిస్తామని కూడా ప్రకటించింది.ఉగ్రవాదం కేసుల నుంచి బయటపడిన ముస్లింలకు నష్ట పరిహారం ఇచ్చి, పునరావాసం కల్పిస్తారు. ముస్లింల మీద తప్పుడు కేసులు పెట్టిన అధికారుల మీద చర్యలు కూడా తీసుకుంటారు. స్వలింగ సంపర్కులైన జంటలకు చట్టబద్ధతను, రక్షణను కల్పిస్తారు. మైనారిటీలపై దాడుల నిరోధక చట్టం తీసుకువస్తారు. పాఠశాలల్లో ఉర్దూ బోధనను ప్రోత్సహిస్తారు. ఉన్నత ప్రమాణాలతో ఉర్దూ పాఠ్య పుస్తకాలు ముద్రించడం, ఖాళీగా ఉన్న ఉర్దూ బోధకుల ఉద్యోగాలను తక్షణం భర్తీ చేస్తామని సీపీఎం ప్రకటించింది. సచార్‌ కమిటీ సిఫారసులు అమలుకు పాటుపడుతుంది సీపీఎం. అంటే మైనారిటీ ఏరియా డెవలప్‌మెంట్‌ పథకం అమలు చేస్తుంది. కుల గణనను చేపడుతుంది. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్‌లు ఇస్తుంది.

ఇది ముస్లిం మైనారిటీలకు ఉద్దేశించిన మేనిఫెస్టో మాత్రమే. ఇందులో హిందువుల ప్రసక్తి ఉంటుందని ఎవరూ అనుకోరు. కానీ క్రైస్తవులు, బౌద్ధులు, జైనుల సంగతి కూడా ఇందులో లేదు. అయితే, అణ్వాయుధాల నిర్మూలన హామీ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో సీపీఎం, దాని ఇండీ కూటమి భాగస్వామి కాంగ్రెస్‌ దేశానికి తెలియ చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కేరళ ఎన్నికల ప్రచారంలో కోరారు.


ఒక ఎన్నికలలో గెలవడానికి మొత్తం నాగరికత ఘనతనీ, చరిత్రనీ వక్రీకరించడానికి వెనుకాడని అంగుష్ఠమాత్రులు ఇప్పుడే మేధావులు. వీరు రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తారు. విశ్వవిద్యాల యాలలో శాఖాధిపత్యం కోసం అన్ని విలువలు వదిలేసి భారతీయత మౌలికతను మలినం చేయడానికి వెనుకాడరు. ఈ దేశానికి సంస్కృతం ఆయువుపట్టు. అల్‌ బెరూనీ అనే విదేశీ యాత్రికుడు అదే రాశాడు. ఇంకా ఎందరో అదే చెప్పారు. కానీ సంస్కృతాన్ని మృతభాషను చేయాలన్న దురద ఇక్కడ చాలామందికి ఇప్పటికీ ఉంది. కారణం, అది భారతీయ నాగరికతకు ప్రతిబింబం. ఆర్ష వాఙ్మయానికి ఆయువుపట్టు. అసలు మత ఘర్షణలను చరిత్రలో చెప్పకుండా ఉంటే, భవిష్యత్తు తరాలకు వాటి గురించే తెలియదన్న వెర్రి నమ్మకం ఒకటి వీళ్లకి! అలాంటి చరిత్ర హిందువుల పిల్లలకి మాత్రమే పరిమితమవుతుంది. భారత్‌కు మాత్రమే పరిమిత మవుతుంది. మరి పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, చైనా వంటి దేశాల విద్యార్థుల సంగతి! వారికి ఇలాంటి నకిలీ జ్ఞానం అందివ్వరు. అంతిమంగా నష్టం భారత్‌కే. చారిత్రక వాస్తవాలకు సంబంధించి ఒక అజ్ఞానమే ఇక్కడ కొనసాగుతుంది. కళింగయుద్ధం తరువాత, మనసు వికలమైన అశోకుడు బౌద్ధం స్వీకరించాడని మన పుస్తకాలు చెబుతాయి. కానీ అది వట్టిదేనని తేలింది. కళింగయుద్ధం జరగడానికి ఏడెనిమిది ఏళ్ల క్రితమే అశోకుడు మతం మారాడు. చరిత్రను తిరగరాయడం కాదు, సరిదిద్దుకోవాలని అనడం అందుకే.

పూర్వకాలంలో మన పాలకులు అందరికీ ఆశ్రయం ఇచ్చారని చరిత్రలో ఘనంగా చెబుతారు. వారికి మసీదులు కట్టుకోవడానికి, చర్చ్‌లు నిర్మించుకోవడానికి మనవారే అవకాశం ఇచ్చారని నమోదు చేస్తారు. కానీ పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ఎక్కడో అణచివేతకు గురి అవుతున్న హిందువులు ఇప్పుడు ఈ దేశానికి రావడం అంటే అందులో మత కోణం చూస్తున్నారు. ఆర్యులు దండయాత్ర చేసి స్థానికులను తుదముట్టించారట. కానీ ముస్లింలు దురాక్రమణ దారులు మనకి ఏదో నేర్పారట. కశ్మీర్‌కు ఏడు లక్షల మంది పండిత్‌ల రాక గురించి చెప్పరు. ముప్పయ్‌ వేల మంది రొహింగ్యాలకు అక్కడ ఆశ్రయం ఇవ్వాలని నిస్సిగ్గుగా చెబుతారు.

దేశంలో నిరుద్యోగం ఉంది. ద్రవ్యోల్బణం ఉంది. వెనుకబాటుతనం ఉంది. నిజమే. వాటిని పరిష్కరించుకోవలసిందే. కానీ ఆ సమస్యలను అడ్డం పెట్టుకుని ఆత్మ గౌరవ పోరాటాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే సాగదు. గరీబీ హఠావో అన్న నినాదం దేశాన్నీ పేదలనీ మోసం చేసింది. ఒక కుటుంబానికి అధికారం ఇచ్చింది. అంతే తప్ప సమస్యను పరిష్కరించలేదు. ఐదు దశాబ్దాలు పాలించినా దేశ సమస్యల జోలికి పోనివాళ్లు పదేళ్లలో బీజేపీ దేశ సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతోందని వాదించడం వింతే మరి!

ఇవన్నీ హిందువును ఆలోచింప చేశాయి. కానీ వారు మత కోణం నుంచే కాకుండా, మానవత్వం కోణం నుంచి కూడా విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఆ క్రమంలోనే వారిలో ఒక మార్పు వచ్చింది. ఇస్లాం, క్రైస్తవం విస్తారించాలన్నది ఆ వర్గాల పట్టుదల అయితే, హిందూ జీవన విధానాన్ని రక్షించుకో వాలన్నది హిందువుల ఏకైక ఆకాంక్ష. అది ఈ నేల మీద మాత్రమే సాధ్యం. అది అయోధ్య రామాల యంతో ఆరంభమైంది. రామబాణమే ప్రచారాస్త్ర మైంది. హిందువులు కోర్టుల మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోగొట్టుకోలేదు. ఇప్పుడు జరుగు తున్నది వాటి ప్రాతిపదికగా ఆధునిక పునరుజ్జీవ నోద్యమమే. అందుకు రాముడు కేంద్రబిందువైనాడు. అయోధ్య రాముడు రంగం మీదకు వచ్చిన తరువాత దేశ రాజకీయాల దశే కాదు, వాటి స్థాయి కూడా మారింది. అందుకే రామబాణం ప్రచారాస్త్రంగా ఇంత పదునెక్కింది. ఇప్పుడు దేశంలో ధర్మపోరాటం జరుగుతున్నది. ఒక్క మాట గుర్తు చేసుకుందాం. కురుక్షేత్రంలో సంగ్రామం మొదలయింది. దుర్యోధనుడు తల్లి గాంధారి దగ్గరకు వచ్చి అడిగాడు. అమ్మా! యుద్ధం చేస్తున్నాం, నీవు ఆశీర్విదించాలి అని. గాంధారి అన్న మాట ఇదే ` ‘యతో ధర్మః స్తతో జయః’ అంటే గెలిచేది ధర్మం మాత్రమే.

ఈ ఎన్నికలలో జరిగేది అదే.

——

విశ్వాసానికి విజ్ఞానం దిద్దిన ‘సూర్యతిలకం’

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా శాస్త్రవిజ్ఞానానికి పెద్ద పీటవేసి, దాని ఆధారంగా ఏర్పడినదే సనాతన ధర్మం. కాలం చక్రీయమనే కాక, ఈ విశ్వం తీవ్రమైన, అంతర్గతమైన  పరివర్తనలకు లోనవుతుందన్న  విషయాన్ని గ్రహించి, విశ్వసించడమే కాదు, దానికి అనుగుణమైన జీవనశైలిని ఎంచుకున్నది కనుకనే హిందూధర్మం సనాతనమైంది. పరిమితమైన దృష్టితో ఒకటే జన్మను నమ్మే మతాలన్నింటికీ శాస్త్ర విజ్ఞానానికి, మతానికి పొత్తు కుదరదని విశ్వాసం.  కానీ, అక్కడ తమ అన్వేషణలో సమాధానాలు లభించక  హేతుబద్ధత, శాస్త్రదృక్పధాన్ని కలిగి ఉన్న ఈ ధర్మం సనాతనం పట్ల ప్రపంచం ఆసక్తిని ప్రదర్శిస్తున్నది. మన గ్రంథాలలో ఉన్న విజ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు యత్నిస్తున్నది. మొన్నటికి మొన్న అయోధ్యలో రామ్‌లల్లాకు అద్దిన సూర్య తిలకానికి కూడా ఆధారం శాస్త్ర సాంకేతికతే కావడం విశేషం!

అయోధ్యలో దాదాపు ఐదు శతాబ్దాల తర్వాత నూతనంగా నిర్మించిన రామమందిరంలో తొలిసారి శ్రీరామనవమి ఉత్సవాలు ఏప్రిల్‌ 17న అట్టహాసంగా సాగాయి. శ్రీరాముడు జన్మించిన చైత్ర శుక్లపక్ష నవమి, సరిగ్గా అభిజిత్‌ లగ్నంలో ఆయనకు అద్దిన ‘సూర్యతిలకం’, చేసిన సూర్యాభిషేకం వీక్షించిన భారత ప్రజలు పులకించిపోయారు. ‘సూర్యవంశ’ క్షత్రియుడైన రామ్‌లల్లా జన్మించిన రోజున సూర్యుడు తన కిరణంతో ఆయన లలాటాన్ని ముద్దాడడం వెనుక ఉన్నది వినోదం కాదు, శాస్త్ర విజ్ఞానం. శ్రీరాముడు కేవలం సూర్యవంశానికి చెందినవాడే కాదు, ప్రపంచానికి శక్తిమంతమైన గాయత్రీ మంత్రాన్ని అందించిన విశ్వామిత్రుడి శిష్యుడు కూడా. ‘సవితుర్‌’ అంటే సూర్య భగవానుడికి అంకితం చేసినది ఈ మంత్రం. అలా చూసుకున్నా, శ్రీరాముని జీవితంలో సూర్యుడి ప్రాధాన్యంఎంతటిదో  తెలుస్తుంది. అందుకే రామ్‌లల్లా సూర్య తిలకం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. మానవాళికి ఆరోగ్యాన్ని, ఆహారాన్ని ఇచ్చి వారి ఉనికిని కాపాడేది సూర్యుడే!

రామ్‌లల్లా నుదుటిపై పొదిగిన కెంపు మీద పడ్డాయి సూర్యకిరణాలు. మానవ  శరీరంలోని ఆ భాగం ఎంత ముఖ్యమైనదో దీనితో అర్ధం చేసుకోవాలి.  కనుబొమలు లేదా భ్రుకుటి ప్రాంతంలో ‘ఆజ్ఞా చక్రం’ ఉంటుంది. దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యం విశేషమైంది. శివుడి మూడవ కన్ను ఉండేదీ ఇక్కడే. అందుకే, మన ప్రాచీనులు ఈ భాగానికి ఉన్న ప్రాముఖ్యం, పవిత్రతలను గుర్తించే అక్కడ తిలకధారణను నిర్దేశించారు.

నిజానికి, విగ్రహాలపై నిర్దిష్టమైన రోజున సూర్య కిరణాలు పడటం భారతదేశంలో కొత్తకాదు. అనేక ఆలయాలలో ఇలా జరగడం మనం చూసైనా ఉంటాం, చదివైనా ఉంటాం. మన పూర్వికుల వాస్తు శిల్పకళా నైపుణ్యం అత్యద్భుతమైందని ఒప్పుకోక తప్పదు. మన రుషులు, మేధావులు రచించిన అనేక సిద్ధాంత గ్రంథాలను విదేశీ దండయాత్రలతో పోగొట్టుకున్నా, అందుకు సంబంధించిన జ్ఞానం మన జన్యువులలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉండవచ్చు. ఆ పరిజ్ఞానాన్నే మరొక రూపంలో నేటి శాస్త్రవేత్తలు ప్రదర్శించారు.

సూర్యతిలక్‌ ప్రాజెక్టు

ప్రతి శ్రీరామనవమికి రాముని నుదుటిపై సూర్య తిలకం అద్దే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఏటా చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నం, అంటే అభిజిత్‌ లగ్నం ఉండే పన్నెండు గంటల వేళ సూర్య కిరణాలను నేరుగా ఆయన లలాటంపై పడేలా చేశారు. రూర్కీలోని సిఎస్‌ఐఆర్‌` సిబిఆర్‌ఐ శాస్త్రవేత్త డా॥ కెఎస్‌ పాణిగ్రాహి ఈ ప్రాజెక్టులో ప్రధాన శాస్రత్తవేత్తకాగా, మరొక తెలుగు శాస్త్రవేత్త కూడా ఇందులో పాలుపంచుకోవడం విశేషం. నిజానికి, ప్రతి ఏడాదీ శ్రీరామనవమి నాడు సూర్యుడి స్థానం మారుతుంటుందనే విషయాన్ని తమ లెక్కింపుల్లో గమనించామని, అత్యంత సునిశిత అంచనాల ద్వారానే శ్రీరామ నవమి తేదీ ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి పునరావృతమవుతుందని తేలిందని చెప్పారు. నిజానికి మన పంచాంగాలు కూడా చాలావరకూ కాలం, సూర్యుడి ప్రయాణం ఆధారంగా రూపొందేవే.

దాదాపు 3 నిమిషాల పాటు 58 సెంమీల పొడవైన తిలకం

శ్రీరాముడి నుదుటిపై ఈ సూర్య తిలకం మూడు నుంచి మూడున్నర నిమిషాలు ఉంటుందని, అందులో పూర్తిగా రెండు నిమిషాలపాటు ప్రకాశిస్తుందని వారు చెప్పారు. దానిని మనం మన టీవీలలో వీక్షించాం కూడా. ఈ ప్రయోగం జరుగుతున్న సమయంలో భక్తులు యథావిధిగా దర్శనం చేసుకోగలగడం విశేషం. అయోధ్యలో, ఆలయ పరిసరాల్లో దాదాపు 100 ఎల్‌ఇడిలను ఆలయ ట్రస్టు ఏర్పాటు చేయగా, ప్రభుత్వం మరో 50 ఏర్పాటు చేసింది. తాము ఎక్కడ ఉంటే అక్కడి నుంచే భక్తులు వీక్షించేందుకే ఈ ఏర్పాటు.

అత్యంత కచ్చితత్వం

అత్యంత కచ్చితమైన ఫలితాలను పొందేందుకు ఎంతో సునిశితమైన ప్రణాళికతో, నమూనాను రూపొందించి, దీనిని అమలు చేసినట్టు సిఎస్‌ఐఆర్‌` సిబిఆర్‌ఐ ప్రధాన శాస్రత్తవేత్త డా॥ డిపి కనుంగో చెప్పారు. మన దేశీయ సాంకేతిక విజ్ఞాన అభివృద్ధి ఎంతగా పురోగమించిందో దేశ ప్రజలకు తెలియ చేసిన క్షణాలవి.

సూర్యతిలకం వెనుక ఉన్న విజ్ఞానం

రామ మందిరంలోకి ప్రవేశించే సూర్యకిరణాలు తొలుత ఆలయ పై అంతస్తులో ఏర్పాటు చేసిన కటకం/ అద్దంపై పడతాయి. వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన మూడు కటకాలను ఉపయోగించి ఈ కిరణాలను ఆలయ రెండవ అంతస్తులో ఉన్న మరొక అద్దానికి మళ్లిస్తారు.

అక్కడి నుంచి మరొక అద్దాన్ని ఉపయోగించి రెండవ అంతస్తు ద్వారా రామ మందిర గర్భాలయంలోని రామ్‌లల్లా విగ్రహం లలాటంపై పడేలా సూర్యకిరణాన్ని మళ్లిస్తారు. ఈ ఘటాన్ని చూసి మైమరచిన భక్తులు లోపల రామనామంతో మందిరాన్ని ప్రతిధ్వనింపచేయగా, బయిట తన్మయత్వంతో నృత్యం చేశారు.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE